•••┉┅━❀🕉️❀┉┅━•••
🙏 *ఓం నమో వేంకటేశాయ*🙏
*శ్రీవారి ఆలయవైశిష్ట్యం - 3*
✍️ శ్రీమతి&శ్రీ పల్లపోతు వాణిశ్రీ-కృష్ణబాలాజీ
•••┉┅━❀🕉️❀┉┅━•••
*"వేంకటాద్రి సమస్థానం బ్రహ్మాండే నాస్తి కించన*
*వేంకటేశ నమో దేవో న భూతో న భవిష్యతి"*
♾┉┅━❀🕉️❀┉┅━♾
🌈 *రాజా తోడరమల్లు* 🌈
👉🏻 తిరుమలరాయమంటపంలో, ధ్వజస్థంభానికి సుమారు పది అడుగుల దూరంలో స్వామి వారికి అభిముఖంగా ముగ్గురు భక్తుల నిలువెత్తు రాగి ప్రతిమలు దర్శనమిస్తాయి. ఈ విగ్రహాల భుజాలపై ఉన్న పేర్లననుసరించి, తలపాగా ధరించి ఉన్న పురుషుడు *"లాలా ఖేమరాము".* మిగిలినవి ఆయన భార్య *"పితాబీబీ",* తల్లి *"మాతా మోహనదేవి"* ల విగ్రహాలు.
👉🏻 లాలా ఖేమరామునే *"రాజా తోడరమల్లు"* అని పిలుస్తారు. 17వ శతాబ్దంలో, శ్రీవారి ఆలయానికి వచ్చే భక్తజనసందోహాన్ని చూసి, అప్పట్లో భారతదేశంలోని చాలా ప్రాంతాల్లో అధికారంలో ఉన్న మహమ్మదీయుల మరియు బ్రిటీషు వారి కళ్ళు ఆలయంపై పడ్డాయి. హైందవమతానికి ఆలవాలమైన ఈ దేవాలయాన్ని ధ్వంసం చేయాలనే ఉద్దేశ్యంతో మహమ్మదీయులూ, అత్యధిక ఆదాయం వచ్చే ఈ ఆలయం పై ఆధిపత్యం సాధించటానికి బ్రిటీషువారూ, ఒకే సారి ఆలయంపైకి దండెత్తారు. శ్రీవారికి పరమభక్తుడూ, వారికోసం ప్రాణాలైనా అర్పించే తోడరమల్లుకు ఈ విషయం తెలిసి, మిత్రుల సహాయంతో వారిద్దరి (మహమ్మదీయులు, బ్రిటీషువారు) మధ్య చిచ్చుపెట్టి, ఒకరితో ఒకరు కలహించుకొనేట్లు చేసి ఆలయాన్ని రక్షించాడు. అప్పుడు ఆయన ఆర్కాటు నవాబు సాదతుల్లాఖాన్ తరఫున కర్ణాటక ప్రాంతాన్ని పర్యవేక్షించేవాడు.
🙏 *ఓ మహమ్మదీయుని కొలువులో ఉంటూ, హిందూ దేవాలయాన్ని రక్షించి భావితరాలవారికి పదిలంగా అప్పగించిన, ఆ భక్తశిఖామణికి జోహార్లు. స్వామివారంటే తనకున్న అపరిమిత భక్తికి చిహ్నంగా, నమస్కార భంగిమలో ఉన్న ఈ విగ్రహాలను ఆయనే ప్రతిష్ఠించుకున్నారు.* 🙏
👉🏻 సంపంగి మార్గంలో ఉన్న మంటపాలనూ, మూర్తులనూ దర్శించుకుని ఇప్పుడు మనం ధ్వజస్తంభమంటపం లోకి అడుగు పెట్టాం. ఈ మంటపం ద్వారానే వెండివాకిలి దాటి మనం విమానప్రదక్షిణ మార్గంలోకి ప్రవేశించాలి. ఇక్కడ తెలుసుకోవలసిన విషయాలు చాలానే ఉన్నాయి:
♾┉┅━❀🕉️❀┉┅━♾
🌈 *ధ్వజస్తంభ మంటపం* 🌈
👉🏻 ఇప్పుడు మనం – ప్రతిమామంటపం (తూర్పు) వెండివాకిలి (పడమర), అద్దాలమంటపం (ఉత్తరం) తిరుమలరాయ మంటపాల (దక్షిణం) - మధ్య ఉన్న చతురస్రాకార మంటపంలో ఉన్నాం. ఈ మంటపంలో ఆలయ ధ్వజస్తంభం ఉన్నది కావున దీన్ని ధ్వజస్తంభ మంటపం అంటారు. ఇక్కడనుంచి చూస్తే, మేలిమి బంగారు కాంతులతో మెరుస్తున్న ధ్వజస్తంభం వెండివాకిలికి తూర్పుదిక్కులో కనిపిస్తుంది. పైకి చూస్తే, ధ్వజస్తంభానికి ఎదురుగా ఏడు బంగారు కలశాలతో కూడిన మూడంతస్తుల వెండివాకిలి గోపురం కూడా చూడవచ్చు.
👉🏻 15వ శతాబ్దంలో నిర్మింపబడిన ఈ మంటప శిలా స్థంభాలపై, యోగనరశింహస్వామి, ఆంజనేయుని మూర్తులు; బకాసురవధ, శ్రీనివాసకళ్యాణం వంటి పౌరాణిక ఘట్టాలు; ఎన్నెన్నో మనోహరంగా మలచబడ్డాయి. ఈ మంటపంలో బంగారు తొడుగుతో ఉన్న ధ్వజస్తంభం; దాన్ని ఆనుకుని తూర్పువైపున పెద్ద బలిపీఠం; దానికి ఈశాన్యదిక్కున చిన్న బలిపీఠంలా కనుపించే *"క్షేత్రపాలకశిల"* స్థితమై ఉన్నాయి. వీటన్నింటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
♾┉┅━❀🕉️❀┉┅━♾
🌈 *ధ్వజస్తంభం* 🌈
👉🏻 వెండివాకిలికి ఎదురుగా, నగిషీలు చెక్కిన శిలాపీఠం మీద ఉన్నటువంటి ఎత్తైన కొయ్యస్తంభమే ధ్వజస్తంభం. శిలాపీఠం మరియు స్తంభం మొత్తానికి బంగారుపూత పూయబడిన రాగిరేకు తాపడం చేయబడి ఉంటుంది. ఈ స్తంభంమీద కూడా గరుత్మంతుడు, హనుమంతుడు, శంఖుచక్రాలు, కాళీయమర్ధనఘట్టం – వంటి శిల్పాలు అత్యద్భుతంగా చెక్కబడి ఉన్నాయి.
👉🏻 ధ్వజం అంటే *"జండా".* తమిళంలో ధ్వజస్తంభాన్ని *"కొడిక్కంబం"* అంటారు. "కొడి" అంటే "కేతనము" లేదా "జండా" అని అర్థం.
👉🏻 ధ్వజారోహణం అంటే - స్వామివారి బ్రహ్మోత్సవాల ప్రారంభాన్ని సూచిస్తూ, ధ్వజస్తభంపై స్వామివారి పరమభక్తుడు మరియు వాహనమైన గరుడుని చిత్రపటం ఉన్న జండా ఎగురవెయ్యటం. అందుకే ధ్వజస్తంభాన్ని *'గరుడగంభం'* గా కూడా పిలుస్తారు.
👉🏻 "ధ్వజారోహణం" ద్వారా, ఆకాశమార్గాన అత్యంత వేగంగా పయనించగల గరుడినితో సమస్తలోకాల వారికీ బ్రహ్మోత్సవ సంబరాల నిమిత్తం లాంఛనప్రాయంగా ఆహ్వానం పలకబడుతుంది. ఈ ధ్వజస్తంభానికి మరో ప్రాముఖ్యత కూడా ఉంది. ఏ వ్యక్తులైనా, వస్తువులైనా, పూజాద్రవ్యాలైనా ఆఖరుకు స్వామివారైనా, మదిరంలోంచి బయటకు వెళ్ళాలన్నా, బయటనుంచి లోనికి రావాలన్నా, ధ్వజస్తంభానికి ప్రదక్షిణ చేస్తూ వెళ్ళాల్సిందే. సహస్రాబ్దాలుగా శ్రీవారి ముందు స్థిరచిత్తంతో నిలుచుని ఉండే ధ్వజస్తంభానికి ఆమాత్రం గౌరవ మర్యాదలు దక్కాల్సిందే మరి. చిత్తచాంచల్యంతో చరించే మనబోటి మానవులకో చక్కటి సందేశమిస్తుందీ అచంచలమైన ధ్వజస్తంభం!
👉🏻 పూర్వం విమానప్రదక్షిణ మార్గంలో నుండే ధ్వజస్తంభం, అక్కడ స్థలాభావం కారణం చేత ఐదారు శతాబ్దలక్రితం ప్రస్తుతమున్న ప్రాంతానికి మార్చబడింది.
👉🏻 ఈ ధ్వజస్తంభం కర్రదైనందువల్ల దాన్ని మార్చుతూ ఉండాలి. ప్రస్తుతం ఉన్న ధ్వజస్తంభం 1982వ సం. లో, కర్ణాటకలోని *"దండేలి"* అడవుల్లో లభించే టేకుచెట్టు మానుతో తయారైంది. ధ్వజస్తంభానికి ఉపయోగించే మాను ఎలాంటి తొర్రలు, పగుళ్ళు, కొమ్మలు, వంకరలు లేకుండా, 75 అడుగుల పొడవుతో, దృఢంగా, దీర్ఘకాలం మన్నేట్లు ఉండాలి. ఇన్ని సులక్షణాలు కలిగిన టేకుమానును వెదకటం, కొండమీదకు రవాణా చేయటం, కనీసం వందేళ్ళవరకూ చెక్కుచెదరకుండా వుంచే రసాయనిక ప్రక్రియ చేపట్టటం, అన్నింటినీ మించి అంత పొడవైన ఏక స్తంభాన్ని దానికంటే ఎంతో తక్కువ ఎత్తుతో నుండే పైకప్పు గల ఈ నిర్ణీత ప్రదేశంలో ప్రతిష్ఠించడం కోసం అప్పటి తి.తి.దే. యాజమాన్యం అత్యంత వ్యయప్రయాసల కోర్చింది. గత రెండువందల సంవత్సరాల తి.తి.దే. రికార్డుల్లో ధ్వజస్తంభం మార్చిన సాంకేతికాంశాల ప్రస్తావనేమీ లేకపోవడం వల్ల, ఈ కార్యక్రమం మరింత జటిలం అయ్యింది. అయితే, ఆ శ్రీనివాసుని కృప, భక్తులసహకారం, తి.తి.దే. యాజమాన్యం సిబ్బంది యొక్క అంకితభావంతో, అత్యంత క్లిష్టతరమైన ఈ ప్రక్రియ అవిఘ్నంగా జరిగి ఎట్టకేలకు విజయవంత మయ్యింది.
👉🏻 తమిళశాసనాలు ఎక్కువగా ఉండే తిరుమల ఆలయంలో ధ్వజస్తంభాన్ని మార్చేటప్పుడు, పాత ధ్వజస్తంభం యొక్క పద్మపీఠంపై ఓ తెలుగుశాసనం బయట పడింది. దాని ప్రకారం, సుమారు మూడు వందల సంవత్సరాల క్రితం; పాతధ్వజస్తంభాన్ని *"సిద్లూరి రామాజీమాదర్సు పంతులు"* అనే ఒక తెలుగు భక్తుడు సమర్పించాడు. ఆలయంలో తమిళుల ఆధిపత్యం ఎక్కువ ఉండే ఆ రోజుల్లో, దేవాలయానికి ఆయువుపట్టైన ధ్వజస్తంభాన్ని ఓ తెలుగు భక్తుడు సమర్పించినట్టు తెలుసుకోవడం మన తెలుగు వారందరికీ కొద్దిగా ఉపశమనం కలిగిస్తుంది.
👉🏻 మయూరధ్వజుడనే మహారాజు త్యాగనిరతికీ, దానశీలతకు మెచ్చి శ్రీకృష్ణభగవానుడిచ్చిన వరాన్ననుసరించి, అతనికి ధ్వజస్తంభరూపంలో వైష్ణవాలయాల యందుండే భాగ్యం కలిగింది. శ్రీకృష్ణుని ఆనతి ప్రకారం ధ్వజస్తంభదర్శనం, ప్రదక్షిణం పూర్తయిన తరువాతనే దైవదర్శనం చేసుకోవాలి. ఈనాటికీ అదే సాంప్రదాయం కొనసాగుతోంది.
♾┉┅━❀🕉️❀┉┅━♾
🌈 *క్షేత్రపాలకశిల (లేదా గుండు)* 🌈
👉🏻 ధ్వజస్తంభమంటపంలో ఈశాన్యదిక్కున ఉన్న ఒకటిన్నర అడుగుల ఎత్తైన, చిన్నపాటి శిలాపీఠాన్ని *"క్షేత్రపాలకశిల"* లేదా *"క్షేత్రపాలకగుండు"* అంటారు. తిరుమల ఆలయానికి క్షేత్రపాలకుడు *"శివుడు"* అని "సన్నిధిగొల్ల" , ప్రకరణంలో తెలుసుకున్నాం.
👉🏻 ఆ క్షేత్రపాలకునికి గుర్తుగా, మాడవీధుల్లోని ఈశాన్యదిక్కున జీవం ఉన్న ఓ పెద్ద శిల ఉండేదట. అర్చకులు ఆలయద్వారాలు మూసేసి ఇళ్ళకెళుతూ తాళాలగుత్తిని ఆ శిలకు మూడుసార్లు తాకించేవారు. దాంతో, ఆలయద్వారాలు మూసుకున్నట్టు సంకేతం అందుకున్న ఆ శిల గుడి చుట్టూ మాడవీధుల్లో తిరుగుతూ, అలయానికి కాపు కాస్తూ, అన్యులెవ్వరినీ మాడవీధుల్లోకి ప్రవేశించనిచ్చేది కాదు. సుప్రభాత సమయంలో వాకిళ్ళు తెరిచేముందు మరలా ఆ తాళాలగుత్తిని శిలకు తాకిస్తే, ఆ శిల తన గమనాన్ని ఆపి, తిరిగి ఈశాన్యమూలలో స్థిరంగా ఉండేది.
👉🏻 ఒకనాటి రాత్రి వేగంగా సంచరిస్తున్న ఆ శిల క్రింద పడి ఓ బాలుడు మరణించడంతో, అటువంటి దుర్ఘటన పునరావృతం కాకుండా ఆ శిలను ఆలయానికి కొద్ది దూరంలో ఉన్న గోగర్భంతీర్థం వద్దకు తరలించారు. అయితే, ఆ శిలలోని చిన్నభాగాన్ని మాత్రం, తరలించ బడిన క్షేత్రపాలకశిలకు గుర్తుగా, ధ్వజస్తంభమంటపం లోని ఈశాన్యదిక్కున ఉంచారు.
👉🏻 ఆలయం బీగాలగుత్తిని రెండు పూటలా ఈ శిలకు తాకించి, నమస్కరించే సంప్రదాయం నేటికీ కొనసాగుతోంది.
👉🏻 ప్రతి మహాశివరాత్రి పర్వదినాన అర్చకులూ, ఆలయాధికారులూ, భక్తులూ ఛత్రచామర మంగళవాద్యాలతో గోగర్భతీర్థానికి వెళ్ళి; నమకం చమకంతో రుద్రాభిషేకంచేసి; ఆ గుండుకు వెండినామాలూ (ఊర్ధ్వపుండ్రాలు), కళ్ళూ అతికించి; పుష్పాలంకరణానంతరం ధూప-దీప-అర్చన-నివేదనాదులు కావించి; భక్తులకు తీర్థప్రసాదాలు అందజేస్తారు. విష్ణుమూర్తికి సాక్షాత్తు శివుడు క్షేత్రపాలకుడిగా నుండటం; ప్రపంచ ప్రసిద్ధ వైష్ణవాలయంలో శివరాత్రి ఉత్సవం ఘనంగా నిర్వహించటం; శివుణ్ణి ఊర్ధ్వపుండ్రంతో అలంకరించటం చూస్తుంటే, *"శివాయ విష్ణురూపాయ - విష్ణురూపాయ శివే"* అన్న తత్వం సంపూర్ణంగా అవగత మవుతుంది.
♾┉┅━❀🕉️❀┉┅━♾
🌈 *బలిపీఠం* 🌈
👉🏻 ధ్వజస్తంభాన్నాఇ ఆనుకుని, తూర్పుదిక్కున ఉన్న ఓ ఎత్తైన పీఠమే "బలిపీఠం". ఇది కూడా బంగారుపూత పూసిన రాగిరేకు తాపడంతో తళతళా మెరుస్తూ ఉంటుంది. శ్రీవారికీ, ఇతర ప్రధాన పరివార దేవతలకూ, ద్వారపాలకులకూ ప్రసాదాలను నివేదించిన తరువాత, విమానప్రదక్షిణ మార్గంలోని అష్టదిక్కుల్లో ఉన్న బలిపీఠాలపై ఆయా దిగ్దేవతలకు మంత్రపూర్వకంగా బలిని వేస్తారు. ఇలా సమర్పిస్తూ చివరగా వెండివాకిలి వద్దకు వచ్చి, మిగిలిన అన్నాన్ని, అంటే బలిని ధ్వజస్తంభం ముందున్న ఈ ఎత్తైన బలిపీఠంపై ఉంచుతారు. ఈ బల్యన్నాన్ని రాత్రింబవళ్ళూ సంచరించే భూత -ప్రేత-యక్ష-పిశాచాది గణాలూ, క్రిమికీటకాదులూ ఆహారంగా భుజిస్తాయని ప్రతీతి.
👉🏻 శ్రీకృష్ణుని ఆనతి ప్రకారం మనం ధ్వజస్తంభానికి భక్తి పూర్వక నమస్కారాలు సమర్పించుకున్నాం కాబట్టి ఇక శీఘ్రంగా వెండివాకిలి దాటి, బంగారువాకిళ్ళలో ఉన్న శ్రీవారిని దర్శించుకో వచ్చు. దీనితో వెండివాకిలి లోనికి ప్రవేశించే ముందు, సంపంగి ప్రదక్షిణంలో చూడవలసిన ముఖ్య విశేషాలన్నీ పూర్తయ్యాయి.
శ్రీవారి దర్శనానంతరం ప్రసాదం స్వీకరించిన తరువాత, ఓ ఊచల పంజరంలో ఉన్న నల్లటి బావిని మనందరం చూసే ఉంటాం. దాని విశేషాలూ, శ్రీవారి దర్శనానంతరం, సంపంగి ప్రదక్షిణమార్గం లో చూడవలసిన మరికొన్ని విశేషాలను ఈపై చెప్పుకుందాం.
సంపంగి ప్రదక్షిణ మార్గంలో శ్రీవారి దర్శనానికి ముందు చూడగలిగే విశేషాలన్నింటినీ దాదాపుగా చెప్పుకున్నాం.
ఇదే ప్రదక్షిణ మార్గంలో, దర్శనానంతరం చూడగలిగేవి, ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే చూడగలిగేవీ, అసలు దర్శించలేనివీ ఎన్నో విశేషాలున్నాయి. వాటన్నింటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
[ రేపటి భాగంలో... *శ్రీవారి ఆలయవైశిష్ట్యం* గురించి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం]
•••┉┅━❀🕉️❀┉┅━•••
🙏 *శ్రీనివాసుని శ్రీచరణాలను సేవిద్దాం, సకల శుభాలనూ పొందుదాం* 🙏
*...తిరుమల సర్వస్వం..... సశేషం...*
•••┉┅━❀🕉️❀┉┅━•••
No comments :