ఈ సేవను డోలోత్సవం అని కూడా పిలుస్తారు. ఈ ఆర్జిత సేవ టిక్కెట్ ధర 500/- ఒక్కరికి. 12 సంవత్సరాల లోపు పిల్లలకు టిక్కెట్ అవసరం లేదు.
పురుషులు తప్పనిసరిగా పంచె కట్టుకోవాలి.ఉదయం 10.30 గంటలకు సహస్ర దీపాలంకార సేవ మండపం ప్రక్కనే ఉన్న సుపధం ఎంట్రన్స్ ద్వారా ప్రవేశించిన తర్వాత అక్కడ మీ టిక్కెట్, ఐడీ ప్రూఫ్ తనిఖీ చేసి పంపుతారు.. మీరు మహాద్వారం నుండి ముందుగా దర్శనం చేసుకుని మీకు ఉచితం ప్రసాదం తీసుకుని కొంచెం ముందుకు రాగానే కుడి చేతి వైపు అద్దాల మండపం ఉంటుంది. ఆ మండపంలో కూర్చోండి.
స్వామి వారు కళ్యాణోత్సవం అయిన తరువాత షుమారుగా మద్యాహ్నం 2 గంటలకు ఈ అద్దాల మండపం వద్దకు వేంచేస్తారు. ఈ మండపం ముఖ మండపం, అంతరాళం అని రెండు భాగాలుగా నిర్మింపబడింది. అంతరాళమే డోలోత్సవం జరిగే 'అయినా మహల్.' ఈ అంతరాళం మధ్యలో నాలుగు స్తంభాల చతురస్ర మండపం వుంది. అందులో డోలోత్సవానికి అనువుగా గొలుసులు వేలాడదీయబడి ఉంటాయి. ఈ చతురస్ర మండపం చుట్టూ ప్రదక్షిణ మార్గం ఏర్పాటు చేయబడి ఉంటుంది. ఈ చతురస్ర మండపం చుట్టూ వున్న గోడలకు, పై కప్పునకు ఇలా అన్ని మూలల్లో అన్ని వైపులా పెద్ద పెద్దలు అద్దాలు బిగింప బడ్డాయి. ఈ మండపంలో గొలుసుల ద్వారా వేలాడదీసిన డోల (ఊయల)లో వేంచేసి ఊగుతున్న శ్రీస్వామివారి రూపం అద్దాల్లో అన్ని వైపులా ప్రతిబింబం కనపడుతూ, భక్తులు శ్రీవారి విశ్వరూపాన్ని చూస్తూ ఓ దివ్యానుభూతికి లోనవుతారు. ఆ అద్భుత దృశ్యం చూడవలసిందే కాని వర్ణించడానికి సాధ్యం కాదు.
ముందుగా అర్చక స్వాములు ఈ సేవలో పాల్గొన్న భక్తులచేత సంకల్పం చేయిస్తారు. పిదప మంగళ వాయిద్యాలు మోగుతుండగా వేదపారాయణలు సాగుతుండగా దేవేరులతో కూడిన స్వామివారు ఊయలలో సొబగుగా ఊగుతారు. ఇలా కొద్ది సేపు ఊగిన తర్వాత స్వామి వారికి పంచకజ్జాయం అనబడే ప్రసాదాన్ని నివేదిస్తారు. (గసగసాలు, జీడిపప్పు, బాదంపప్పు, ఎండుకొబ్బరికోరు, కలకండ, చక్కెర మిశ్రమాన్నే పంచకజ్జాయం అంటారు). నివేదన అయిన వెంటనే నక్షత్ర హారతిని ఇస్తారు. తర్వాత కర్పూర హారతిని కూడ ఇస్తారు. భక్తులు హారతిని కళ్లకద్దుకున్న తర్వాత డోలోత్సవం మీదవున్న శ్రీస్వామివారి చూట్టూ ప్రదక్షిణం చేస్తూ భక్తులు దేవాలయం నుండి బయటకు వస్తారు.
తర్వాత శ్రీస్వామివారు శ్రీ రంగనాయక మండపానికి వేంచేస్తాడు.
మీకు అర్థం కాక ఎటువంటి సందేహాలున్నా మెసేజ్ చేయగలరు.
No comments :