•••┉┅━❀🕉️❀┉┅━•••
*శ్రీవారి ఆలయవైశిష్ట్యం - 2*
✍️ శ్రీమతి&శ్రీ పల్లపోతు వాణిశ్రీ-కృష్ణబాలాజీ
•••┉┅━❀🕉️❀┉┅━•••
🙏 *శ్రీవారి ఆలయవైశిష్ట్యం -2* 🙏
*"వేంకటాద్రి సమస్థానం బ్రహ్మాండే నాస్తి కించన*
*వేంకటేశ నమో దేవో న భూతో న భవిష్యతి"*
♾┉┅━❀🕉️❀┉┅━♾
👉🏻 నిన్నటి భాగంలో మనం, మనకి తెలియకుండానే, ఆలయంలోనికి, అంటే రెండవ ప్రదక్షిణ మార్గమైన *సంపంగి ప్రదక్షిణ* మార్గం లోనికి ప్రవేశించి, దేవదేవుని దర్శనం కోసం ఆతృతతో ఎదురు చూస్తున్నాం!
👉🏻 సంపంగి ప్రదక్షిణమార్గంలో ఎందరో రాజులు, చక్రవర్తులు శ్రీవారి మీద ఎనలేని భక్తితో కట్టించిన అనేక మండపాలు, వారివారి కాంశ్యప్రతిమలు మరెన్నో దర్శించదగ్గ ప్రదేశాలున్నాయి. ప్రతిమండపం, ప్రతి ప్రతిమ మనను చరిత్రలోతుల్లోకి తీసుకొని పోతుంది. ఆ విశేషాలన్నింటినీ ఈరోజు తెలుసుకుందాం!
♾┉┅━❀🕉️❀┉┅━♾
🙏 *సంపంగి ప్రదక్షిణం* 🙏
👉🏻 మహాద్వారం ముందు పాదప్రక్షాళణ చేసుకొని, శంఖనిధి-పద్మనిధిల మూర్తులకు నమస్కరించుకొని, అనంతాళ్వార్ గడ్డపారను దర్శించుకొని, మహాద్వారం గుమ్మాన్ని దాటగానే, మనం సంపంగి ప్రాకారంలోకి, అంటే మందిరంలోనికి ప్రవేశిస్తాము.
👉🏻 దేవాలయం యొక్క మహాప్రాకారం మరియు సంపంగి ప్రాకరం మధ్యన (అంటే మొదటి రెండవ ప్రాకారాల మధ్యన) గల సుమారు 30 అడుగుల వెడల్పైన ప్రదక్షిణ మార్గాన్ని సంపంగి ప్రదక్షిణం అంటారు. ఆలయంలోనికి ప్రవేశించిన వెంటనే ఉండే మొట్టమొదటి ప్రదక్షిణమార్గం ఇదే. లెక్క ప్రకారం ఇది రెండవ ప్రదక్షిణమార్గం అయినప్పటికీ, ఆలయం వెలుపలి మహా ప్రదక్షిణమార్గాన్ని ఆగమశాస్త్రం పరిగణించదు కాబట్టి, శాస్త్రరీత్యా, ఆలయానికి ఇదే మొదటి ప్రదక్షిణమార్గం. పూర్వం ఈ ప్రదక్షిణమార్గంలో స్వామివారి పుష్పకైంకర్యానికి ఉపయోగపడే సంపంగి లేదా చంపక వృక్షాలు విరివిగా ఉండటం చేత, ఈ మార్గానికి సంపంగి ప్రదక్షిణ మార్గం లేదా చంపక ప్రదక్షిణమార్గం అనే పేర్లు ఏర్పడ్డాయి. పేరుకు ప్రదక్షిణమార్గమే అయినా, ప్రస్తుతం ఉన్న క్యూ ప్రతిబంధకాల కారణంగా ఈ మార్గం ద్వారా పూర్తి ప్రదక్షిణం చేయలేము. కేవలం తూర్పుమార్గం, దక్షిణ-ఉత్తర మార్గాల్లోని కొంతభాగం మాత్రమే మనం దర్శించుకోగలం.
♾┉┅━❀🕉️❀┉┅━♾
🌈 *కృష్ణరాయమండపం లేదా ప్రతిమామండపం* 🌈
👉🏻 మహాద్వారాన్ని దాటగానే, మనం సంపంగి ప్రదక్షిణమార్గం లోని *ప్రతిమామండపం* లోనికి ప్రవేశిస్తాము. శ్రీకృష్ణదేవరాయల విగ్రహం ఉండటం వల్ల దీన్ని కృష్ణరాయమంటపమనీ, ఇంకా ఇతరుల ప్రతిమలు కూడా ఉండటం వల్ల ప్రతిమామండపం అనీ వ్యవహరిస్తారు. పదహారు స్తంభాలతో ఉన్న ఈ ఎత్తైన మంటపం విజయనగర వాస్తుశైలిలో నిర్మించబడింది. ఆలయంలోకి వెళుతూంటే, మహాద్వారానికి కుడిపక్క, ఉభయ దేవేరులైన తిరుమలదేవి- చిన్నాదేవి సమేతంగా శ్రీకృష్ణదేవరాయలు స్వామివారికి ఎదురుగా ప్రాంజలి ఘటిస్తూ , పడమరదిశలో నిలబడి దర్శనమిస్తాడు. రాయలవారే తమ విగ్రహాలను జనవరి 2, 1517వ తేదీన స్వయంగా ప్రతిష్ఠించుకున్నారు.
👉🏻 యావద్దక్షిణ భారతదేశాన్ని కంటిసైగతో శాసించిన ఆ చక్రవర్తిని అలా, అత్యంత నిరాడంబరంగా, నమస్కరిస్తూ చూస్తుంటే ఏమనిపిస్తుంది?
*"కోటికీ పడగెత్తినా ధనవంతుడూ, నీకృపకెన్నడూ సమపాత్రులూ... "*
అన్న ఘంటసాల గీతం గుర్తుకు రావట్లేదూ?
👉🏻 ఆలయ అధికారులు తెలియక చేసిన తప్పులవల్ల భక్తులకేదన్నా అసౌకర్యం కలిగితే, వారి తరఫున రాయలవారు క్షమాభిక్ష అడుగుతున్నట్లుగా కూడా మనకు గోచరిస్తుంది. దర్శనానంతరం ఆలయం నుండి బయటకు వెళ్ళేటప్పుడు, మనకు ఎడం ప్రక్కగా, ఈ విగ్రహాల్ని దగ్గరగా చూడగలుగుతాం!
👉🏻 అలాగే, మహాద్వారానికి ఎడమ ప్రక్క నమస్కార భంగిమలో ఉన్న, చంద్రగిరి రాజైన వేంకటపతిరాయలవారి నిలువెత్తు కాంశ్యవిగ్రహం కూడా చూడచ్చు. ఈ విగ్రహానికి దక్షిణం వైపున అచ్యుతరాయలు, ఆయన రాణి వరదాజి అమ్మాణీ ల నిలువెత్తు నల్లరాతి విగ్రహాలు నమస్కార భంగిమలో ప్రతిష్ఠించబడ్డాయి. ఈ రాజులందరూ శ్రీవారికి పరమభక్తులే కాక, దేవాలయపోషణకు అనేక మడులూ, మాన్యాలూ సమర్పించి చిరస్మరణీయులయ్యారు. రాయలవారి ప్రతిమలు తప్ప, మిగతా విగ్రహాలన్నింటనీ మనం క్యూలో శ్రీవారి దర్శనార్థం వెళుతున్నప్పుడు, మనకు ఎడమ ప్రక్కగా చూడవచ్చు.
👉🏻 ఈ మండపం చూస్తూంటే, *'రాజులకైనా, రారాజులకైనా, సమస్త భోగభాగ్యాలూ ఆ శ్రీవారి చలవే. వారికి అందరూ వినమ్రంగా కృతజ్ఞతలు తెలుపాల్సిందే"*
అన్న అలౌకికభావం కలుగుతుంది.
♾┉┅━❀🕉️❀┉┅━♾
🌈 *తులాభారం* 🌈
👉🏻 ప్రతిమామంటపానికి సమీపంలో, ఎడంప్రక్కగా ఓ త్రాసు కనబడుతుంది. సంస్కృతంలో త్రాసును తుల అంటారు. భక్తుల శరీరబరువును త్రాసులో కొలుస్తారు కాబట్టి దీనిని తులాభారం గా పేర్కొంటారు. కోరిన కోర్కెలు సిద్ధించినవారు, తమ బరువుకు లేదా తమ కుటుంబసభ్యుల బరువుకు సరితూగేట్లుగా, తాము మ్రొక్కుకున్న ధనాన్ని లేదా ద్రవ్యాన్ని స్వామివారికి సమర్పిస్తారు. ఈ ద్రవ్యాల్లో ముఖ్యంగా కలకండ, బెల్లం, కర్పూరం మొదలైనవి ఉంటాయి. అదే, మ్రొక్కుకుంది ధనమైతే, తగినంత రొఖం చెల్లిస్తే కావలసిన నాణాలను దేవస్థానం వారే సమకూరుస్తారు.
నేటికీ, దక్షిణ భారతదేశం లోని అనేక కుటుంబాల్లో, పసిపిల్లలకు శ్రీవారి ఆలయంలో తులాభారం జరిపించి సరిపడా ద్రవ్యాన్ని లేదా ధనాన్ని స్వామివారికి సమర్పించటం పరిపాటి.
👉🏻 ఇది కేవలం నాణాల సమర్పణ కాదు, శ్రీవారికి కృతజ్ఞతా పూర్వకంగా చేసుకునే *"ఆత్మసమర్పణ"* కూడా !
♾┉┅━❀🕉️❀┉┅━♾
🌈 *అద్దాల మంటపం* 🌈
👉🏻 ఆలయంలోకి ప్రవేశిస్తుంటే కుడివైపున, రాయలవారి కాంశ్యప్రతిమకు ఎదురుగా ఉన్న విశాలమైన మండపమే అద్దాలమంటపం. దాన్నే ఉత్తరభారతీయులు *"ఆయినామహల్"* అనీ, తమిళులు *"కన్నాడి అరై"* అని పిలుస్తారు. అన్ని వైష్ణవాలయాల్లో విధిగా ఉండే ఈ అద్దాల మంటపం, శ్రీవారి ఆలయంలో ఓ ఎత్తైన రాతి అధిష్ఠానం మీద నిర్మింప బడివుంది. ఈ మంటపంలో *"ముఖమంటపం",* *"అంతరాళం"* అని రెండు భాగాలున్నాయి.
👉🏻 ముఖమండపంలో ఇదివరకు *"ప్రసాద అరలు"* ఉండేవి. ఈ అరల్లో అర్చకులు తమవంతుకు వచ్చే ప్రసాదాన్ని ఉంచి భక్తులకు విక్రయించేవారు. ఈ అరలు ఉండే ప్రాంతాన్ని *"ప్రసాదం పట్టెడ"* గా పిలుస్తారు. ప్రస్తుతం అర్చకుల వంతుకు వచ్చే ప్రసాదాలను కూడా దేవస్థానం వారే స్వీకరించి భక్తులకు ఉచితంగా, విక్రయాల ద్వారా వేర్వేరు ప్రాంతాల్లో అందజేస్తున్నారు కాబట్టి "ప్రసాద అరలు" తీసివేయబడ్డాయి.
👉🏻 అతరాళం మధ్యలో, నాలుగు స్థంభాల నడుమ ఉన్న చతురస్రాకార వేదిక గోడలకూ, పై కప్పుకూ, అన్నివైపులా పెద పెద్ద అద్దాలు అమర్చబడ్డాయి. అలాగే, డోలోత్సవానికి అనువుగా గొలుసులు వ్రేలాడదీయబడి ఉన్నాయి. ఈ మంటపంలో ఉభయనాంచారుల సమేత మలయప్పస్వామికి డోలోత్సవం (ఊయలసేవ లేదా ఊంజల్ సేవ) జరుగుతున్నప్పుడు, స్వామివారి ప్రతిరూపం అద్దాల్లో అన్ని ప్రక్కలా కనువిందు చేస్తూ, స్వామివారి సర్వవ్యాపకత్వానికి ప్రతినిథిత్వంగా గోచరిస్తుంది. ఈ అద్దాల మంటపంలో ప్రతి మధ్యాహ్నం రెండు గంటలకు జరిగే ఈ డోలోత్సవం అర్జిత సేవ. ఈ సేవలో పాల్గొనే భక్తులు మాత్రమే అంతరాళం దర్శించగలరు. సాధారణంగా, ముఖమండపం లోనికి భక్తులను అనుమతించరు. అయితే, శ్రీవారి దర్శనానంతరం, ప్రసాదాలు స్వీకరించిన తరువాత చేతులు శుభ్రపరుచు కోవటానికి వెళ్ళేటప్పుడు, మనకు కడిప్రక్క నుంచి ఈ "ముఖమంటపాన్ని" దగ్గరగా చూడవచ్చు. ఉత్తరభారతదేశం నుండి వచ్చిన ఈ డోలోత్సవసేవా విధానం, మహంతుల ద్వారా శ్రీవారి ఆలయంలో ప్రవేశపెట్టబడి ఉండవచ్చు. 1831వ సం. నుండి ఈ ఉత్సవం జరుగుతున్నట్లు ఆధారాలున్నాయి.
💫 అన్నమాచార్యుని బాణిలో ఈ డోలోత్సవ శోభను వర్ణించుకుందాం:
*"డోలాయాంచల డోలయాంహరే డోలాయాం*
*మీనకూర్మ వరాహ మృగపతి అవతారా*
*దానవారే గురశౌరే ధరణిధర మరుజనక...*
*శీరపాణే గోసమాణే శ్రీవేంకటగిరి కూటనిలయ"*
♾┉┅━❀🕉️❀┉┅━♾
🌈 *రంగనాయకమండపం* 🌈
👉🏻 అద్దాల మంటపానికి ఎదురుగా, ప్రతిమామండపం లోని వేంకటపతిరాయల విగ్రహానికి దగ్గర్లో, దర్శనానికి వెళ్ళేటప్పుడు మన ఎడమ ప్రక్కగా, ఎత్తైన శిలావేదికపై నుండే విశాలమైన మండపమే రంగనాయక మండపం లేదా, రంగమండపం. 108 అడుగుల పొడవు, 60 అడుగుల వెడల్పు గల ఈ మంటపంలో శ్రీరంగనాథుడు కొన్నాళ్ళు కొలువై ఉన్నాడు కావున, ఆయన పేరు మీద ఇది "రంగమంటప" మైంది. 1320-1360 సం. ల మధ్య మహమ్మదీయ దండయాత్రల కారణంగా, శ్రీరంగ క్షేత్రంలోని రంగనాయకుల ఉత్సవమూర్తులను, సురక్షితమైనదిగా భావింపబడే తిరుమల క్షేత్రానికి తెచ్చి, ఈ మండపంలో ఉంచి నిత్యపూజా నివేదనలు చేశారు. తరువాత విగ్రహాలను యథావిధిగా శ్రీరంగం తరలించారు. కేవలం శ్రీరంగనాథుని ఉత్సవ విగ్రహాలను ఉంచి పూజాదికాలు నిర్వహించటానికే ఈ మంటపాన్ని "రంగనాథయాదవరాయలు" అనే ఓ స్థానిక పాలకుడు నిర్మించాడు.
*"రంగ రంగ రంగపతి రంగనాథా - నీ*
*సింగారాలె తరచాయ శ్రీ రంగనాథా...*
*వేంకటాద్రి మీద చేరి నన్ను కూడితివి*
*ఏవల చూచిన నీవే ఇటు రంగనాథా "*
👉🏻 ఈ మండపంలో, *"పెద్దశేషవాహనం"* గా పిలువబడే ఏడు పడగల బంగారు శేషవాహనాన్ని కొద్ది దూరంగా, క్యూలోనుంచే దర్శించుకోవచ్చు. బ్రహ్మాత్సవాల మొదటి రోజున ఈ వాహనం మీదే స్వామివారు ఊరేగుతారు.
👉🏻 మలయప్పస్వామి వారు ఉభయదేవేరుల సమేతంగా, సంవత్సరానికి రెండు మార్లు దసరా బ్రహ్మోత్సవాల్లో ఒకసారి, వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఒకసారి ఈ మండపంలో కొలువై ఉంటారు.
👉🏻 ఒకప్పుడు ఈ మంటపంలోనే స్వామివారికి నిత్య కళ్యాణోత్సవాలు, వసంతోత్సవం, బ్రహ్మోత్సవం జరిగేవి. రాను రానూ భక్తులసంఖ్య పెరగడంతో, ప్రస్తుతం సంపంగి ప్రదక్షిణ మార్గంలో దక్షిణంవైపున ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కళ్యాణమంటపంలో కళ్యాణోత్సవం జరుగుతూ ఉంది.
👉🏻 ప్రస్తుతం ఈ మంటపంలో శ్రీవారి తిరుమంజన కార్యక్రమాలు, దేశాధిపతులు, రాష్ట్రాధిపతులకు వేదపండితుల ఆశీస్సులూ వారికి ప్రసాదవితరణలు, జరుగుతున్నాయి.
♾┉┅━❀🕉️❀┉┅━♾
🌈 *తిరుమలరాయమంటపం* 🌈
👉🏻 రంగనాయక మంటపాన్ని ఆనుకుని, దానికి పడమర దిక్కున, ధ్వజస్థంభ మంటపానికి దక్షిణదిశగా పది అడుగుల దూరంలో, రెండంచెలుగా ఈ మంటపం నిర్మింపబడింది. మొదటి అంచె ఎత్తైన వేదికగా, వేరొక అంచె నేలమట్టానికి సమంగా ఉండి, వేదికపై జరిగే ఉత్సవాలను భక్తులు ధక్షిణదిశగా కూర్చొని తిలకించటానికి వీలుగా నిర్మింపబడింది.
👉🏻 "విజయనగర ప్రభువైన సాళువ నరశింహరాయలు శ్రీవారికి మ్రొక్కు చెల్లింపుగా *"అన్నా ఊయల తిరునాళ్ళ"* అనే ఉత్సవాన్ని నిర్వహించే నిమిత్తం, 1473వ సం. లో "ఎత్తైన వేదిక" నిర్మించాడు. "అన్నా" అనే తమిళపదానికి "హంస" అని అర్థం. తమిళ "ఆణిమాసం" (జూన్-జూలైల మధ్య) లో జరుపబడే ఈ ఉత్సవం కాలాంతరంలో నిలిచిపోయింది.
👉🏻 అరవీటి వంశ చక్రవర్తి అయిన తిరుమలరాయలు 16వ శతాబ్దంలో ఈ మంటపాన్ని విస్తరింపజేసి, వార్షికవసంతోత్సవం నిర్వహించేవాడు. అందువల్ల ఈ మంటపానికా పేరు వచ్చింది. కానీ ఆయన ఏర్పాటు చేసిన ఉత్సవం కూడా అర్థంతరంగానే నిలిచిపోయింది.
👉🏻 ప్రస్తుతం ఈ మంటపంలో, *"కొలువుమేళం"* గా పిలువబడే ఓ సేవలో భాగంగా మేళం, డోలు, నగారాలు మ్రోగింపబడతాయి. సూర్యోదయవేళ 6:00-6:30 గం. ల మధ్య జరిగే కొలువును *"హరికొలువు"* గా, సూర్యాస్తమయ సమయంలో 5:30-6:00 గం. ల మధ్య జరిగే కొలువును *"సందెకొలువు"* గా పిలుస్తారు.
💫 ప్రస్తుతం బ్రహ్మోత్సవాల సమయంలో ధ్వజారోహణవేళ మాత్రమే స్వామివారు ఈ మంటపంలోకి వేంచేసి పూజా నివేదనలు అందుకుంటారు.
[ రేపటి భాగంలో... *శ్రీవారి ఆలయవైశిష్ట్యం* గురించి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం]
•••┉┅━❀🕉️❀┉┅━•••
🙏 *శ్రీనివాసుని శ్రీచరణాలను సేవిద్దాం, సకల శుభాలనూ పొందుదాం* 🙏
*...తిరుమల సర్వస్వం..... సశేషం...*
•••┉┅━❀🕉️❀┉┅━•••
No comments :