TirumalaHills
TirumalaHills

Social Icons

Pages

  • Free Rs.300 Tickets
  • Photo Competition
  • TTD Calendar
  • TTD Panchangam
  • Privacy Policy
  • Contact Us
ॐ Welcome to TirumalaHills - Dharmo Rakshati Rakshita - Govinda Govinda Govinda ॐ

Ads

Main Menu

  • Home
  • Tirumala History
    • Tirumala History
    • Darshan
    • Seva
    • Brahmotsavam
    • Accommodation at Tirumala
    • Accommodation at Tirupati
    • Transportation
    • Free Meals / Anna Prasadam
    • Walking up the Hills
    • Kalyana Katta / Tonsuring
    • Medical Services
    • Tulabharam
    • Niluvudopidi
    • Anga Pradakshinam
  • Booking Services
    • Special Entry Darshan (Rs.300)
    • Free Sarva Darshanam
    • Seva at Tirumala
    • Seva at Tiruchanoor
    • Virtual Seva at Tirumala
    • Virtual Seva at Tiruchanoor
    • Accommodation at Tirumala
    • Accommodation at Tirupati
    • Hundi @ Tirumala
    • Hundi @ Tiruchanoor
    • Srivani Trust Donations
    • Other Trust Donations
    • Cottage Donations
  • Festivals
    • Srivari Jyeshtabhishekam
    • Srivari Annual Salakatla Brahmotsavam
    • Srivari Annual Brahmotsavam
    • Srivari Navaratri Brahmotsavam
    • Srivari Annual Pavithrotsavam
  • Visiting Places
    • Srivari Pushkarini
    • Sri Bhu Varaha Swamy Temple
    • Kapila Theertham
    • Deer Park Reserve
    • Srivaari Paadamulu
    • Tirumala Museum
    • Silathoranam
    • Papavinasam Theertham
    • Srivari Mettu
    • Alipiri
    • Srinivasa Mangapuram
    • Tiruchanur – Alamelu Mangapuram
    • Matrusri Tarigonda Vengamamba
    • Kanipakam
    • Devuni Kadapa - Kadapa
  • Must Read
    • Most Popular Places
      • Ujjain Mahakaleshwar Jyotirlinga
      • Mahalakshmi Temple, Kolhapur
      • Sri Kanchi Kamakshi Amman Temple
      • Temple in Bhadrachalam
      • Maha Shivaratri
      • Srikalahasti Temple
      • VARANASI – Benares, Banaras or Kāśī
    • Popular Stotrams
      • SECRET HANUMAN RAKSHA MANTRA
      • SHIVA SAHASRA NAMA STOTRAM
      • SRI RUDRAM CHAMAKAM
      • SRI RUDRAM NAMAKAM
      • BILVAASHTAKAM
      • LINGASHTAKAM
      • SHIVASHTAKAM
      • SRI RUDRAM LAGHUNYASAM
      • SRI VENKATESWARA GOVINDA NAMALU
    • Route Map
    • Today Telugu Panchangam
    • Indian Festivals
    • Top Secret Facts of Lord Venkateswara
    • 300 Year Old Tirumala Laddu
    • Sri Venkateswara Suprabhatam
    • Sri Venkateswara Stotram
    • Sri Venkateswara Prapatti
    • Sri Venkatesha Mangalaasaasanam
    • Venkateswara Ashtottara Sata Namavali
    • Govinda Namaavali
    • Sri Srinivasa Gadyam
    • Sri Venkateswara Vajra Kavacha Stotram
  • Keerthanalu
    • Sri Tallapaka Annamacharya
    • Annamayya Keerthanas Part-1
      • Kattedura Vaikuntham
      • Musina Mutyalakele
      • Tiruveedhula Merasi
      • Vinaro Bhagyamu
      • Narayanathe Namo Namo
      • Anni Mantramulu
      • Chandamama Raavo
      • Indariki Abhayambu
      • Adivo Alladivo
      • Tandanana Ahi
      • Manujudai Putti
      • Ekkuva Kulajudaina
      • Kondalalo Nelakonna
      • Shodasa Kalanidhiki
      • Jo Achyutananda
      • Jagadapu Chanuvula
      • Enta Matramuna
      • Brahma Kadigina Padamu
      • Nanati Bathuku
      • Bhavayami Gopalabalam
    • Annamayya Keerthanas Part-2
      • Alara Chanchalamaina
      • Alarulu Kuriyaga
      • Ammamma Emamma
      • Andariki Aadhaaramaina
      • Antaryami Alasiti
      • Ati Dushtuda Ne Nalusudanu
      • Bhaavamu Lona
      • Chaaladaa Brahmamidi
      • Chaaladaa Hari Naama
      • Chaduvulone Harina
      • Chakkani Talliki
      • Cheri Yasodaku
      • Choodaramma Satulaaraa
      • Daachuko Nee Paadaalaku
      • Dasaratha Raamaa
      • Deva Devam Bhaje
      • Deva Ee Tagavu Teerchavayyaa
      • Dolaayaanchala
      • E Puraanamula Nenta Vedikinaa
      • Ee Suralu Ee Munulu
      • Ele Ele Maradalaa

Tallapaka Annamacharya | తాళ్ళపాక అన్నమాచార్య 💕🙏

Post a Comment Wednesday, June 22, 2022


🙏 *తాళ్ళపాక అన్నమాచార్యుడు* 🙏

*"వేంకటాద్రి సమస్థానం బ్రహ్మాండే నాస్తి కించన* 
*వేంకటేశ నమో దేవో న భూతో న భవిష్యతి"*

🙏 *తాళ్ళపాక అన్నమాచార్యుడు* 🙏

💫 శ్రీవారి భక్తుల్లో అగ్రగణ్యుడైన తాళ్ళపాక అన్నమాచార్యులు దాదాపుగా ముప్ఫెరెండు వేల సంకీర్తనలు రచించి శ్రీవారి ప్రాభావం తెలుగు, తమిళ, కన్నడ దేశాల్లో వ్రేళ్ళూను కోవటానికి ఎంతగానో పాటుపడ్డాడు. ఆ పదకవితాపితామహుని గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.

🌈 *అన్నమయ్య పూర్వీకులు* 🌈

💫 వందలకొద్ది మైళ్ళ పొడవునా వ్యాపించి ఉన్న శేషాచల శ్రేణుల పరిసరాల్లో, నేటి కడపజిల్లా, రాజంపేట పట్టణ పరిసర ప్రాంతంలో *"తాళ్ళపాక"* అనబడే సస్యశ్యామలమైన గ్రామం ఉంది. ఆ ఊరి ఆరాధ్యదైవమైన, జనమేజయమహారాజుచే ప్రతిష్ఠింప బడ్డ, *"తాళ్ళపాక చెన్నకేశవుని"* ఆరాధిస్తూ, విద్యాపారంగతుడైన *"విఠలయ్య"* అనే నందవరీక శాఖకు చెందిన సద్రాహ్మణుడు ఆ గ్రామంలో నివసించేవాడు. వారు ఋగ్వేద శాఖకు చెందిన భరద్వాజస గోత్రీకులు. అతని ఏకైక పుత్రుడు నారాయణయ్యను విద్యాబుద్ధుల కోసం ఊటుకూరు అనే గ్రామంలో ఒక గురువు గారి వద్ద చేర్పించాడు. పుట్టుకతో మందబుద్ధి అయిన నారాయణయ్య, గురువుగారు విధించే శిక్షల వల్ల చదువుసంధ్యల మీద విరక్తి కలిగి, ఆత్మహత్య చేసుకోవాలనే ఉద్దేశంతో ఊరి పొలిమేరలో ఉన్న పాముపుట్టలో చెయ్యి పెట్టాడు. ఇంతలో, ఆ గ్రామదేవత అయిన *"చింతాలమ్మ తల్లి"* ప్రత్యక్షమై చిన్నతనంలోనే జీవితం మీద విరక్తి తగదని, చెన్నకేశవస్వామిని ఆరాధిస్తే సర్వవిద్యలు సమకూరుతాయని, ఉత్తరోత్తరకాలంలో, శ్రీవేంకటేశ్వరుని అనుగ్రహం వల్ల ఒక పరమభక్తుడు మనుమనిగా జన్మించి వారి వంశాన్ని ఉద్ధరిస్తాడని భవిష్యవాణి పలికింది.  కాలాంతరాన, నారాయణయ్యకు "నారాయణసూరి" అనే కుమారుడు కలిగాడు. యుక్తవయస్కు డయ్యాక అతనికి "లక్కమాంబ" అనే యువతితో వివాహమైంది.

🙏 *అన్నమయ్య జననం* 🙏

💫 చాలా కాలం వరకూ సంతానం లేకపోవడం చేత, పసుపుబట్టలతో, సంతానార్థులై, నారాయణసూరి-లక్కమాంబ దంపతులు తిరుమలను చేరుకుని, ఆలయ సాంప్రదాయాన్ని అనుసరించి స్వామి పుష్కరిణిలో స్నానమాడి, ఆదివరాహుణ్ణి దర్శించుకుని, ఆలయంలో ప్రవేశించి శ్రీనివాసుని సేవించుకున్నారు. వారి మనోరథాన్ని తెలుసుకున్న సర్వాంతర్యామి ఆ దంపతులకు స్వప్నంలో దర్శనమిచ్చి, తన ఆయుధమైన *"నందకఖడ్గాన్ని"* వారికి ప్రసాదించాడు. సఫల మనోరథులైన దంపతు లిరువురూ ఆశ్చర్యానందాలతో తాళ్ళపాక తిరిగి చేరుకున్నారు. నవమాసాలు నిండిన తర్వాత వైశాఖ శుద్ధ పౌర్ణమి, విశాఖానక్షత్రంలో, 1408వ సం. సంవత్సరం, మే 9వ తేదీ నాడు, నవగ్రహాలు ఉచ్చస్థితిలో నుండగా, స్వామివారి నందకఖడ్గ అంశతో, లక్కమాంబ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. తల్లిదండ్రులు ఆ పిల్లవానికి *"అన్నమయ్య"* అని నామకరణం చేసి అల్లారుముద్దుగా పెంచసాగారు.

🌈‌ *అన్నమయ్య బాల్యం* 🌈

💫 శ్రీవేంకటేశ్వరుని వరప్రసాదంతో జన్మించిన అన్నమయ్యను చూసి తల్లిదండ్రులు మురిసిపోయారు. బాల్యం నుంచి అన్నమయ్యకు వేంకటేశ్వరుని కథలు వినడం, పాటలు పాడటం నిత్యకృత్యా లైపోయాయి. పువ్వు పుట్టగానే పరిమళించినట్టు, ముక్కుపచ్చలారక ముందునుంచే అతని కోతికొమ్మచ్చులు, ఆటపాటలు, గుజ్జనగూళ్ళూ అన్ని స్వామివారి చుట్టూ పరిభ్రమించేవి. ఆ విధంగా బాల్యాన్ని గడుపుతూ ఐదేళ్ల ప్రాయంలోకి వచ్చిన అన్నమయ్యకు తల్లి లక్కమాంబ రామాయణ, మహాభారతాలను, శ్రీవేంకటేశ్వరుని లీలలను వినిపిస్తూ గోరుముద్దలు తినిపించేది. జానపదులు పాడుకునే శ్రీవారి గీతాలను ఆలపిస్తూ ఆ బాలుడు అందరిని అలరించే వాడు. ఎక్కువ సమయం గుళ్ళూ గోపురాలలోనే గడిపేవాడు.


🌈 *ఆన్నమయ్య తిరుపతి ప్రయాణం* 🌈

💫 చదువు-సంధ్యా లేకుండా పాటలు పాడుకుంటూ, సోమరిగా కనిపించే ఎనిమిదేళ్ల అన్నమయ్యను చూసి తండ్రి కోపగించుకునే వాడు. దాయాదులు విసుక్కునేవారు. వదినగార్లు ఆడిపోసుకునే వారు. ఆ బుడతడి నోటినుండి వెలువడే ప్రతి పదం భవిష్యత్తులో ఓ ఆణిముత్యంగా వెలుగొందుతుందని ఏమాత్రం ఊహించని ఆ కుటుంబ సభ్యులందరూ కలసి, ముక్కుపచ్చలారని ఆ చిన్నారి చేతులకు కొడవలి నిచ్చి, గడ్డి కోసే నిమిత్తం పొలానికి పంపారు. అయినవారి అనాదరణకు గురైన ఆ పసిమనసు గాయపడింది. తన ప్రారబ్దానికి చింతిస్తూ, అప్రయత్నంగా నోటి నుండి రాగాలు వెలువడడంలో తన తప్పేంటో తెలియని అన్నమయ్య ఆ వేంకటేశ్వరుణ్ణి స్మరించుకుంటూ పరధ్యానంగా గడ్డి కోస్తున్నాడు. అలవాటు లేని కారణంగా, పదునైన కొడవలి తగలడంతో ఆ చిన్నారి చేతి వ్రేలు తెగి రక్తం కారింది. బాధతో విలవిల్లాడుతున్న ఆ పసివానికి......

*"అడుగడుగు దండాల వాడు గోవిందా!* 
*ఏడుకొండల వాడా! గోవిందా! గోవిందా!"*

💫 అంటూ శ్రీవారిని కీర్తిస్తూ తిరుమల క్షేత్రానికి వెళుతూన్న ఓ భక్తబృందం కనబడింది. ఇష్టదైవమైన వేంకటేశ్వరుని కీర్తనలు వినబడడంతో తన బాధను మరచిపోయి, తన్మయత్వంతో ఆ భక్తుల్ని చూస్తూ ఉండిపోయిన అన్నమయ్యకు ఒక్కసారిగా జ్ఞానోదయం అయినట్టు అనిపించి, *'బంధుత్వాలన్ని మిథ్య'* అన్నట్లు తోచింది. భక్తులందరూ తనను కూడా తిరుమల యాత్రకు ఆహ్వానిస్తున్నట్టు, ఆ క్షేత్రాన్ని చేరుకుని స్వామివారి సమక్షంలో కీర్తనలు ఆలపిస్తున్నట్లు, అలమేలుమంగా సమేతుడైన శ్రీవారు ఆ కీర్తనలను ఆదమరచి ఆలకిస్తున్నట్లు కలలుగన్నాడు. నొప్పి మటుమాయం అయింది.. మనసు తేలికపడి తన ప్రేరణ లేకుండానే అడుగు ముందుకు పడింది. వడివడిగా తిరుమల క్షేత్రం వైపు ప్రయాణం సాగించాడు. భక్తి పారవశ్యంలో మునిగి పోతూ, స్వామివారిని తలచుకుంటూ; అలుపు సొలుపులు, ఆకలిదప్పులు లక్ష్యపెట్టకుండా మైళ్ళకొద్దీ ప్రయాణం చేసి, ముందుగా, ఆ రోజుల్లో *"శ్రీపదపూరి"* గా పిలువబడే నేటి *"దిగువ తిరుపతి"* కి చేరుకున్నాడు. తిరుపతి గ్రామదేవత అయిన *గంగమ్మ* దర్శనం తరువాత, గోవిందరాజస్వామి ఆలయం చేరుకుని వారిని -

*తిరమై శ్రీ వేంకటాద్రి తిరుపతి లోపలనుఁ గొరబాయ నీ బ్రతుకు గోవిందరాజా!*

💫 అని కీర్తిస్తూ, గోవిందరాజు - శ్రీనివాసుడు అభిన్నులని చాటిచెప్పాడు. తదుపరి, దూరంగా కనబడుతున్న శేషాచల శిఖరాలను చూస్తూ, అలౌకికమైన ఆధ్యాత్మిక అనుభూతికి లోనయ్యాడు.

🌈 *అలిపిరి మార్గంలో తిరుమలకు...* 🌈

💫 స్వామివారి కీర్తనలు పాడుకుంటూ, భజనలు చేసుకుంటూ తిరుమల కొండ ఎక్కడానికి ఉద్యుక్తుడైన అన్నమయ్య, మొట్టమొదటగా అలిపిరిలో ఉన్న *"శ్రీవారి పాదమండపాన్ని"*, ఆ ప్రక్కనే కొలువై ఉన్న *"లక్ష్మీనారశింహుణ్ణి"* దర్శించుకున్నాడు. ఆయా దేవతలను సందర్శించినపుడు అన్నమయ్య ఆశువుగా గానం చేసిన:

🌹 *బ్రహ్మ కడిగిన పాదము బ్రహ్మము దానీ పాదము*

🌹 *కదిరి నృసింహుడు కంభమున వెడల*

🌹 *విదితముగా సేవించరా మునులు*

అనే పాటలు తరువాతి కాలంలో లోకప్రసిద్ధ మయ్యాయి.

💫 ఇలా గానామృతంలో మునిగిపోతూ, స్వామివారి పైనే మనసును లగ్నం చేసి, అలిపిరి మార్గంలోని - *తలయేరు గుండు,* *చిన్న ఎక్కుడు,* *పెద్ద ఎక్కుడు,* *గాలి గోపురం,* *ముగ్గుబావి* దాటుకుంటూ; కొండలు, కోనలు, సెలయేళ్ళతో నిండిన పచ్చని ప్రకృతికి పరవశించి పోతూ; వన్యమృగాలు, భక్తబృందాలతో సందడిగా ఉన్న మెట్లమార్గాన్ని అధిగమిస్తూ, అల్లంత దూరంలో శేషాద్రి శిఖరాన్ని తొలిసారి చూడగానే -

*కట్టెదుర వైకుంఠము కాణాచయిన కొండ*
*తెట్టలాయ మహిమలే తిరుమల కొండ...*

💫 అన్న గానం అప్రయత్నంగానే అన్నమయ్య నోటినుండి వెలువడింది. లోయలన్నీ తన గానాన్ని ప్రతిధ్వనిస్తున్నాయి. పక్షులు కిలకిల లాడుతూ ఆతని పాటకు వంత పాడుతున్నట్టున్నాయి. ఇలా మరో లోకంలో పరవశించి పోతున్న అన్నమయ్యను గమనించకుండానే, భక్తబృందం ముందుకు సాగిపోయింది. వారికోసం వెదకుతూ, *అవ్వాచారికోన* దాటి మోకాళ్ళపర్వతం చేరుకున్నాడు అన్నమయ్య. ఒక ప్రక్క ఆకలి, దాహం, మరోప్రక్క అలసట. దానికి తోడు ఎర్రటి ఎండ. ఎదురుగా చూస్తే నిట్టనిలువుగా, గుండెలవిసేలా లెక్కలేనన్ని మెట్లు! దరిదాపుల్లో తెలిసిన వారెవ్వరూ లేరు. నీరసం ఆవహించింది. మరో రెండు-మూడు మెట్లు ఎక్కగానే స్పృహతప్పి కిందపడి పోయాడు..


*("అలిపిరి" మెట్ల మార్గం ద్వారా తిరుమలకు చేరుకునే టప్పుడు, మార్గమధ్యంలో ఈ ప్రదేశాలన్నింటిని నేడు కూడా చూసి ఆహ్లాదించవచ్చు. కొండమీద తిరుమలేశుని దర్శసం ఒక ఎత్తైతే, అలిపిరి మార్గంలోని శ్రీవారితో ముడిపడిన అనేక చారిత్రాత్మక విశేషాలను, రమణీయ ప్రకృతి దృశ్యాలను దర్శించుకోవడం మరో ఎత్తు. 3550 మెట్లను, ఇద్దరిముగ్గురి సాహచర్యంతో, ఏ వయసువారైనా నాలుగైదు గంటల సమయంలో, శ్రీవారి ముచ్చట్లు చెప్పుకుంటూ అధిరోహించవచ్చు. తప్పనిసరిగా చూసి తీరవలసిన ఈ నడకదారి విశేషాల గురించి మరోసారి వివరంగా తెలుసుకుందాం.)*

🙏 *అలమేలు మంగమ్మ దర్శనం* 🙏

💫 ఇంతలోనే, *"అన్నమయ్యా! లే నాయనా!"* అంటూ ఓ స్త్రీమూర్తి ఆప్యాయమైన పిలుపు స్పహతప్పి పడిఉన్న అన్నమయ్యకు వినబడింది. పుత్రవాత్సల్యం తొణికిసలాడుతున్నట్లున్న ఆ మధురస్వరం, తన తల్లి లక్కమాంబ తనను లాలనతో పిలుస్తున్నట్లుగా అనిపించి, కొద్దిగా ఊరట చెందాడు. నడిమార్గంలో దిక్కుతోచని స్థితిలో ఉన్న తనను కాపాడమని ఆ స్త్రీమూర్తిని వేడుకున్నాడు. దయార్ద్ర హృదయురాలైన ఆ తల్లి, *"నాయనా! అందరికీ అమ్మనైన నేను అలమేలుమంగను. శ్రీవేంకటేశ్వరుని హృదయంలో కొలువై ఉంటాను. ఇప్పుడు నీవు సాక్షాత్తు పరమ పవిత్రమైన తిరుమలక్షేత్రం పై ఉన్నావు. ఈ క్షేత్రం అంతా సాలగ్రామమయం. కొండపైనున్న శ్రీనివాసుడు కూడా సాలగ్రామ శిలారూపమే! అందువల్ల పాదరక్షలతో ఈ కొండను ఎక్కడం మహాపాపం. నీ కాలికి ఉన్న పాదరక్షలను విడిచి శిఖరాన్ని అధిరోహించు. నీ మనోరథం సిద్ధిస్తుంది."* అంటూ దారీ-తెన్నూ తెలియని అన్నమయ్యను ఓదార్చింది. 

💫 అప్పటికే శ్రీనివాసుని గురించి, అలమేలుమంగను గురించి చాలా విషయాలు తెలుసుకొని ఉన్న అన్నమయ్యకు, తన తప్పు తెలిసింది. వెంటనే కాలిజోళ్లను దూరంగా విసిరి వేశాడు. అలమేలుమంగ దర్శనంతో తన జన్మ చరితార్థం అయినట్లుగా భావించి, నిండు మనసుతో తన తప్పు క్షమించమని ఆ లోకపావనిని వేడుకున్నాడు. ఆ తల్లి తనతో తెచ్చిన శ్రీవారి అన్నప్రసాదాలను-గోరుముద్దలుగా చేసి బాలుడైన అన్నమయ్యకు తినిపించి, తనను *"ముల్లోకాలకు తల్లి"* గా చాటుకుంది.

💫 శ్రీవారి ప్రసాదం!! అందునా సాక్షాత్తు అమ్మవారి చేతితో తినిపించబడింది.. ఇంకేముంది! అన్నమయ్యలో సరిక్రొత్త ఉత్సాహం ఉరకలు వేసి, ఒక మహత్తరమైన ఆధ్యాత్మికశక్తి ఆవహించింది

*జొచ్చితి తల్లీ! నీ మరగు* 
*సొంపుగ నీ కరుణా కటాక్షమె* *ట్లిచ్చెదొ నాకు నేడు పర* 
*మేశ్వరి! యో యలమేలుమంగ! నీ..*

💫 అంటూ ప్రారంభించి, అలమేలుమంగను ఓ నూరు పద్యాల శతకంతో ఆశువుగా స్తుతించాడు.

💫 దాంతో పరమానందం చెందిన అలమేలుమంగ, అన్నమయ్యను మనసారా ఆశీర్వదించి, వేంకటాచలాన్ని స్వయంగా సేవించి, తరించి, ఇతరులను కూడా తరింపజేయమని ఆదేశించి అదృశ్యమయ్యింది. అమ్మవారి అనుజ్ఞను శిరసావహించిన అన్నమయ్య, తరువాతి కాలంలో పలుమార్లు శ్రీవారి దర్శనం చేసుకోవడం ద్వారా తాను తరించి, శ్రీవారి యెడ భక్తిభావం ఉట్టిపడే తన రసరమ్య గీతాలాపనతో కోటానుకోట్ల భక్తులను తరింపజేశాడు.

💫 కారణజన్ముడు అన్నమయ్య తిరుమలశిఖరాన్ని చేరుకోవడం, శ్రీవేంకటేశ్వరుని దివ్యమంగళమూర్తిని దర్శించుకోవడం, ఆయాసందర్భాల్లో అన్నమయ్య నోటినుండి ఆశువుగా అనేక గీతాలు వెలువడడం వివరంగా తెలుసుకుందాం.

💫 కరుణామయు రాలైన అలమేలుమంగమ్మ చేతి ప్రసాదసేవనంతో, ఆమె ప్రోత్సాహంతో, అన్నమయ్య నిరాశానిస్పృహలు పటాపంచలయ్యాయి. ఉత్సాహం రెట్టింపైంది. ప్రతి రాయిలోను, ప్రతి చెట్టులోనూ, ప్రతి మెట్టులోనూ, అన్నింటిలోనూ శ్రీవారే గోచరిస్తున్నారు. శ్రీవేంకటేశ్వరునిపై రాగరంజితమైన కీర్తనలను అలవోకగా ఆలపిస్తుండగా, భక్తులు ఒక్కొరొక్కరుగా అన్నమయ్యను అనుసరిస్తూ, పదంలో పదం కలుపుతున్నారు. ఇంతలోనే అల్లంత దూరంలో వేంకటాద్రి పర్వత శిఖరం గోచరించింది. ఇనుమడించిన ఉత్సాహంతో శేషాచల శిఖరాలను ఆర్తిగా అభివర్ణించాడు:

*అదివో అల్లదివో శ్రీహరి వాసము* 
*పదివేల శేషుల పడగల మయము ||*
*అది వేంకటాచల మఖిలోన్నతము* 
*అదివో బ్రహ్మాదుల కపురూపము* 
*అదివో నిత్యనివాస మఖిల మునులకు* 
*అదె చూడుడదె మ్రొక్కు డానందమయము ||*


*"వేంకటాద్రి సమస్థానం బ్రహ్మాండే నాస్తి కించన* 
*వేంకటేశ నమో దేవో న భూతో న భవిష్యతి"*



🌈 *తిరుమల కొండపై అన్నమయ్య* 

💫‌ మోకాళ్ళపర్వతాన్ని వడివడిగా ఎక్కుతూ, మధ్యదారిలో ఉన్న *"త్రోవభాష్యకార్ల సన్నిధి"* లో భగవద్రామానుజుల వారిని సేవించుకుని, తనను అనుసరిస్తున్న భక్తబృందంతో పాటుగా శేషాచల శిఖరాన్ని చేరుకున్నాడు. ముందుగా స్వామిపుష్కరిణిలో పవిత్ర స్నానమాచరిస్తూ -

*సకల గంగాది తీర్థస్నాన ఫలములివి* 
*స్వామి పుష్కరిణి జలమె నాకు...*

💫 అంటూ పుష్కరిణి మహాత్మ్యాన్ని ప్రస్తుతించాడు. క్షేత్ర నియమానుసారం ఆదివరాహస్వామిని దర్శించుకుని, వెనువెంటనే స్వామివారి ఆలయం చేరుకున్నాడు. ముందుగా మహాద్వార గోపురానికి చేయెత్తి నమస్కరించి, *"నీడ తిరగని చింతచెట్టు"* ను సందర్శించుకుని, *గరుడగంభాన్ని* ఈ విధంగా సేవించుకున్నాడు:

*గరుడగంభము కాడ కడు బ్రాణాచారులకు* 
*వరము లొసగేని శ్రీ వల్లభుడు*

🙏 *తిరుమలేశుని దర్శనం* 🙏

💫 గరుడగంభాన్ని సేవించుకుని, బంగారువాకిలి చెంత నిలచి, ఆనందనిలయంలో కొలువై ఉన్న శ్రీవారి దివ్యమంగళ విగ్రహాన్ని తొలిసారిగా దర్శించుకుంటూ, ఆనంద పారవశ్యంతో శేషాచల శిఖరాన్ని, శ్రీవారి మూర్తిని ఈ విధంగా కీర్తించాడు:

*ఇప్పుడిటు కలగంటి - నెల్లలోకములకు -*
*అప్పడగు తిరువేంక - టాద్రీశు గంటి ||* 
*అతిశయంబైన శే- షాద్రి శిఖరము గంటి* 
*ప్రతిలేని గోపుర - ప్రభలు గంటి* 
*శతకోటి సూర్య తే - జములు వెలుగగ గంటి* 
*చతురాస్యు బొడగంటి – చయ్యన మేల్కొంటి ||*

💫 ఈ కీర్తనలో మహోన్నతమైన శేషాచల శిఖరాన్ని, ఆనందనిలయ గోపుర కాంతులను, రత్నఖచితమైన బంగారువాకిళ్ళను, దేదీప్యమానంగా వెలుగుతున్న దీపసమూహాన్ని, కనకాంబరధారియైన స్వామివారిని, శంఖుచక్రాలను, కటి, వరద హస్తాలను కళ్లకు కట్టినట్లు వర్ణించాడు.

💫‌తరువాత ఆలయంలోని ఇతర దేవతలను, మంటపాలను, తిరుమలక్షేత్రం లోని సమస్త తీర్థాలను, గోపురాలను, వైభవోపేతంగా జరిగే ఉత్సవాలను దర్శించుకుని వాటి విశేషాలను ఈ విధంగా పదబంధం చేశాడు -

*కంటి నఖిలాండతతి కర్తనధిపుని గంటి* 
*కంటి నఘములు వీడికొంటి నిజమూర్తి గంటి ||* 
*మహనీయ ఘన ఫణామణుల శైలము గంటి* 
*బహు విభవముల మంటపములను గంటి.... ||*

🙏 *కటాక్షించిన స్వామివారు* 🙏

💫 ఇలా నిత్యం స్వామివారిని సేవిస్తున్న అన్నమయ్య ఒకనాడు ఆలయ సమీపానికి చేరుకోగానే, కాస్త సమయాతీతం కావటంవల్ల బంగారువాకిళ్ళు మూసి వేయబడ్డాయి. ఆరోజు శ్రీవారి దర్శనం కలుగక పోవడంతో విచారించిన అన్నమయ్య -  స్వామి వారిని కీర్తిస్తూ, తనకు దర్శనభాగ్యం ప్రసాదించమని రాగయుక్తంగా వేడుకొన్నాడు. అంతే! పరమాశ్చర్యంగా, తాళాలు ఊడిపడి బంగారువాకిళ్ళు తెరుచుకున్నాయి. ఈ సంఘటనతో అన్నమయ్య భక్తిప్రపత్తులను గుర్తెరిగిన అర్చకస్వాములు ఆయనను సాదరంగా తోడ్కొనివెళ్లి శ్రీవారి దర్శనం చేయించి, తీర్థ ప్రసాదాలు ఇచ్చారు. హద్దులెరుగని ఆనందంతో శ్రీవారిని స్తుతిస్తూ ఒక పద్యశతకాన్ని ఆశువుగా చెప్పాడు అన్నమయ్య! పులకించి పోయిన స్వామివారు తన ఆనందాన్ని వ్యక్తపరచినట్లుగా, మూలమూర్తి మెడలోని ఓ ముత్యాలహారం జారి స్వామి పాదాలపై పడింది. అర్చకస్వాములు దాన్ని అన్నమయ్యకు ప్రసాదంగా బహూకరించారు.

🌈 *"అన్నమాచార్యుని" గా మారిన అన్నమయ్య* 🌈

💫 తిరుమలలో *"ఘనవిష్ణుయతి'* అనే ఒక వైష్ణవగురువుకు స్వామివారు స్వప్నంలో కనిపించి, వేంకటాచల వీధుల్లో పాటలు పాడుకుంటూ పరిభ్రమిస్తున్న అన్నమయ్య రూపురేఖలను వర్ణించి చెప్పి, అతనికి వైష్ణవమతాన్ని ప్రసాదించమని ఆదేశించి, తన శంఖు-చక్ర ముద్రలను ప్రసాదించారు. ఆ గురువుగారు, శ్రీవారి ఆదేశానుసారం, తిరుమలవీధుల్లో తిరుగాడుతున్న అన్నమయ్యను గుర్తించి అతనికి వైష్ణవమతాన్ని ముద్రాంకితంగా ప్రసాదించారు. ఆ క్షణం నుంచి అన్నమయ్య, *"అన్నమాచార్యుని"* గా వినుతికెక్కారు

💐 *అన్నమయ్య వివాహం* 💐

💫 అటు, తాళ్లపాకలో అన్నమయ్య హఠాత్తుగా అదృశ్యం కావటంతో ఊరూ వాడ వెదకి విసిగి వేసారిన అన్నమయ్య తల్లిదండ్రులు చిక్కిశల్యమై మంచాన పడ్డారు. అతని ఆచూకీ కోసం వారి కులదైవమైన చెన్నకేశవుణ్ణి వేడుకున్నారు. చుట్టుప్రక్కల ఉన్న పుణ్యక్షేత్రాలన్నీ గాలించి, చివరి ప్రయత్నంగా తమ పుత్రుణ్ణి తమకు తిరిగి ప్రసాదించమని ఆ శ్రీనివాసుణ్ణి వేడుకోవడం కోసం తిరుమల క్షేత్రం చేరుకున్నారు. 

💫 శ్రీవేంకటేశ్వరుని సన్నిధిలో పాటలు పాడుకుంటూ తిరుగుతున్న అన్నమయ్యను చూసి, ఆ దంపతులకు పుత్రోత్సాహం పెల్లుబికింది. స్వగృహానికి తిరిగి రావలసిందిగా అన్నమయ్యను బ్రతిమాలుకున్నారు. స్వామివారి చరణాలను వీడి రానంటూ భీష్మించిన అన్నమయ్యకు శ్రీవారు స్వప్నంలో సాక్షాత్కరించి తల్లిదండ్రుల మనస్సు కష్టపెట్టరాదని, వారు కోరినట్లు ఇంటికి తిరిగి వెళ్లి గృహస్థాశ్రమం స్వీకరించమని, దానివల్ల తన కటాక్షం మరింతగా సిద్ధిస్తుందని నచ్చజెప్పారు. దాన్ని సుగ్రీవాజ్ఞగా భావించిన అన్నమయ్య, తల్లిదండ్రులతో కలిసి స్వగ్రామానికి చేరుకున్నాడు. 

💫 గేయాలు, కీర్తనలు, శతకాలతో స్వామి వారిని నిత్యం కీర్తిస్తూ కొంతకాలం గడిపిన తర్వాత, అన్నమయ్యకు *అక్కలమ్మ-తిరుమలమ్మ* అనే ఇరువురు కన్యలతో వివాహం జరిగింది.

🌈 *తిరుమలకు తిరిగి వచ్చిన అన్నమయ్య* 🌈

💫 అన్నమయ్యకు వివాహమయ్యింది కానీ దాంపత్య జీవితం ఎంతో కాలం సాగలేదు. మనస్సంతా స్వామివారి పైనే లగ్నమై ఉంది. తిరుమలలో ఘనవిష్ణుయతి వైష్ణవమతాన్ని ప్రసాదించి నప్పటినుండి ఆ మతంపై అన్నమయ్యకు మక్కువ ఎక్కువయ్యింది. స్వామివారిని సాక్షాత్కరింపజేసుకోవడానికి వైష్ణవమే సులభమార్గమని భావించిన అన్నమయ్య, అప్పట్లో ప్రముఖ వైష్ణవ క్షేత్రమైన అహోబిలానికి వెళ్లి శఠగోపముని అనే గురువు వద్ద వైష్ణవసాంప్రదాయం లోతుగా అధ్యయనం చేశాడు. 

💫 ‌ఆ గురువుగారు అన్నమయ్యకు నృశింహమంత్రాన్ని ఉపదేశించారు. తర్వాత శ్రీనివాసుని సన్నిధిలో స్థిరంగా ఉండే ఉద్దేశ్యంతో అన్నమయ్య తిరిగి తిరుమలకు చేరుకున్నాడు. స్వామివారిని నిత్యం అనేక కీర్తనలతో, శతకాలతో కీర్తిస్తూ, తిరుమలలో ఉన్న తీర్థాలన్నింటినీ సందర్శించి వాటి మహిమలను గానం చేస్తూ ఎంతో కాలం గడిపాడు.

🙏 *వివిధ వైష్ణవ క్షేత్రాల సందర్శన* 🙏

💫 ఆ విధంగా చాలా కాలం తిరుమలలో గడిపిన తరువాత ఒకసారి స్వామివారు అన్నమయ్యను ఆప్యాయంగా సంబోధిస్తూ...  *"నేను కేవలం తిరుమల క్షేత్రానికి పరిమితమైన శ్రీవేంకటేశ్వరుణ్ణి మాత్రమే కాదు. సర్వాంతర్యామిని! జనపదాలను సంచరిస్తూ, నా తత్వాన్ని దేశమంతటా ప్రచారం చెయ్యి. అందరూ నన్ను సేవించుకుని, నా అనుగ్రహానికి పాత్రులయ్యేందుకు ప్రయత్నించు"* అంటూ ఆదేశించారు. స్వామివారి ఆదేశంతో కొండ దిగిన అన్నమయ్య ఆంధ్ర-తమిళదేశాలను విస్తృతంగా పర్యటించి తిరుమలేశుని మహిమలను ఉధృతంగా ప్రచారం గావించాడు. ఆ పర్యటనలో భాగంగా కడప పట్టణంలో ఉన్న శ్రీవేంకటేశ్వరుని ఆలయం (దేవుని కడప), శ్రీరంగంలోని రంగనాథస్వామి ఆలయం, మార్కాపురపు చెన్నకేశవుని ఆలయం, కదిరి లోని నృశింహస్వామి ఆలయం, ఒంటిమిట్టలోనున్న కోదండరామాలయం, వాల్మీకిపురం (వాయల్పాడు) లోని రామచంద్రాలయం, బహుదానదీ తీరంలోని సౌమ్యనాథాలయం వంటి ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలతో పాటు మారుమూల పల్లెల్లోని గ్రామదేవతలను సైతం దర్శించి, పూజించి, కీర్తించాడు. ఆ కీర్తనలలో కొన్నింటిని ఆస్వాదిద్దాం: 



🙏 *రంగనాథుని పై -*

*"తొల్లియును మర్రాకు తొట్టెలనె యూగె గన* 
*చెల్లుబడి నూగీని శ్రీరంగ శిశువు ||"*

🙏 *గండికోట చెన్నకేశవుని మీద -*

*"చెల్లునా నీకీపనులు చెన్నకేశవా* 
*కొల్లవాడ పౌర గండికోట చెన్నకేశవా ||"*

🙏 *కదిరి నృశింహుని కీర్తిస్తూ -*

*"కదిరి నృసింహుడు కంభమున వెడలె* 
*విదితముగా సేవింపరో మునులు ||"*

🙏 *నందలూరు చొక్కనాథునిపై..*

*"బరి శ్రీ వెంకటగిరి నుండి వచ్చి కూడితివి* 
*మేరలో నెలదవారి మేటి చొక్కనాథా !!"*

🙏 *తిరుపతి లోని ఆంజనేయుని పై..*

*"మిగటి మిగుల హనుమంతరామ* 
*దిగువ పట్టణంలో దేవ హనుమంత ||"*

💫 అన్నమయ్య ఏ తీర్థాన్ని సేవించినా, ఏ దేవుణ్ణి దర్శించినా అందులో ఆయనకు తిరుమలేశుడే గోచరించేవాడు. అందుచేత ఆయా దేవుళ్ళను శ్రీవేంకటేశ్వరుని ప్రతిరూపాలుగానే కీర్తించాడు. ఒక విధంగా, అన్నమయ్య దృష్టిలో తిరుమలలో కొలువై ఉన్న శ్రీవేంకటేశ్వరుడు మూలవిరాట్టు కాగా, ఇతర క్షేత్రాల్లోని దేవతలందరూ ఉత్సవ మూర్తులు. అందుచేత ప్రజలందరూ వివిధ క్షేత్రాల్లో ఆయా దేవతలకు చేసే పూజలన్నీ శ్రీవెంకటేశ్వరునికే చెందుతాయని చాటి చెప్పాడు.

💫 ఆ విధంగా అన్నమాచార్యుడు తన సంకీర్తనా యజ్ఞాన్ని నిరాఘాటంగా కొనసాగించి, ఆబాలగోపాలంలో శ్రీవెంకటేశ్వరుని భక్తితత్వం వ్రేళ్ళూనుకునేలా పాటుపడ్డాడు.

💫 ఆంధ్ర, తమిళ దేశాల్లోని మారుమూల గ్రామాల్లో సైతం ఉన్న వివిధ పుణ్యక్షేత్రాలను దర్శించుకుని, శ్రీవేంకటేశ్వరుని తత్వాన్ని నలుదిశలా వ్యాప్తి చేసి, తిరిగి తిరుమలకు చేరుకున్న అన్నమయ్య, శ్రీవెంకటేశ్వరుని మహాత్మ్యాన్ని, ఆ క్షేత్రవైభవాన్ని, శేషాచల సానువుల్లోని జంతుజాలాన్ని, వృక్షజాతులను, సెలయేళ్లను, ప్రకృతిసోయగాన్ని వర్ణిస్తూ వందలు, వేలకొద్ది కీర్తనలను గానం చేస్తూ భక్తులను అలరించేవాడు.




🙏 *ఓం నమో వేంకటేశాయ*🙏

*"వేంకటాద్రి సమస్థానం బ్రహ్మాండే నాస్తి కించన* 
*వేంకటేశ నమో దేవో న భూతో న భవిష్యతి"*


💐 ‌ *శ్రీవేంకటేశ్వరుని నిత్యకళ్యాణోత్సవం* 💐


💫 అన్నమయ్య, ఉత్సవాల్లో శ్రీవారి శోభను కర్ణపేయంగా వర్ణించడమే కాకుండా అత్యంత భక్తి ప్రపత్తులతో ఎన్నో ఉత్సవాల్లో స్వయంగా పాల్గొనేవాడు. తిరుమల క్షేత్రంలో శ్రీనివాసునికి నిత్యకళ్యాణోత్సవం ప్రవేశపెట్టింది అన్నమాచార్యుడే! శ్రీవేంకటేశ్వరుడు, అన్నమాచార్యుడు స్వగోత్రీకులు. ఇద్దరిదీ భారద్వాజస గోత్రమే! అయినా కట్టుబాట్లను త్రోసిరాజని, శ్రీనివాసునికి కన్యాదానం చేసి, సాక్షాత్తు ఆ శ్రీవారిని అల్లునిగా చేసుకున్నారు అన్నమాచార్యుల వారు!

💫 ఆ పరంపరను కొనసాగిస్తూ నేటికీ నిత్యకళ్యాణోత్సవంలో అన్నమయ్య వంశీయులే కన్యాదాతగా వ్యవహరిస్తున్నారు. అంతే గాకుండా, ఉగాది, శ్రీరామనవమి, ఆణివార ఆస్థానాల యందు, వసంతోత్సవం, బ్రహ్మోత్సవం, పుష్పయాగం వంటి సేవలలోనూ ఈ వంశీయులు పాల్గొని ఘనంగా సత్కరించబడుతున్నారు. శ్రీనివాసునికి అన్నమయ్య మనసావాచా కర్మణః సమర్పించుకున్న సేవల ఫలితంగా, గత ఆరు శతాబ్దాలుగా వారి వంశస్థులందరూ శ్రీవారిసేవలో తడిసి ముద్దవుతున్నారు. ఈ నాటికీ వారి వారసులే సుప్రభాత సమయంలో మేలుకొలుపు మొదలుకొని ఏకాంతసేవలో జోలపాట వరకు పాడుతారు. ఆశ్రిత పక్షపాతి అయిన శ్రీవేంకటేశ్వరుని కటాక్షంతో అన్నమాచార్యుని వంశీయులందరికీ ఆచంద్రతారార్కం ఈ భాగ్యం లభిస్తూనే ఉంటుంది.


🌈 *స్త్రీదేవతలపై కీర్తనలు* 🌈

💫 శ్రీమహావిష్ణువు యొక్క వివిధ అవతారాలనే కాకుండా, స్త్రీ దేవతా మూర్తులను కూడా అన్నమయ్య స్తుతించాడు. 

ఉదాహరణకు:

🔯‌ శుక్రవార అభిషేకం సందర్భంగా అలమేలుమంగను..

 *కంటి శుక్రవారం గడియ లేడింట* 
*అంటి అలమేల్మంగ అండనుండే స్వామి* 

🔯 రంగనాథుని సేవలో తరిస్తున్న గోదాదేవిని -

*చూడరమ్మ సతులారా సోబాన పాడరమ్మ* 
*కూడున్నది పతి చూడి కుడుత నాంచారి;* 

🔯 పెండ్లికూతురి ముస్తాబులోనున్న సీతమ్మవారిని - 

*సిగ్గరి పెండ్లికూతుర సీతమ్మ* 
*అల్లనాడే రాఘవుడు హరివిల్లు విరిచెను*
*యెల్లి నేడే పెండ్లాడి నిదవో నిన్ను;*

అంటూ అమ్మవార్లందరినీ రాయలసీమ గ్రామీణ నుడివడి ఉట్టిపడేలా వర్ణించాడు.



🌈 *పెనుగొండ ఆస్థానంలో అన్నమయ్య* 🌈

💫 ఇలా తన సంకీర్తనా యజ్ఞాన్ని నిరాటంకంగా కొనసాగిస్తున్న అన్నమయ్య యశస్సు నలుదిక్కులా వ్యాపించడంతో, అప్పటి పెనుగొండ ప్రభువైన నరసింహరాయలు అన్నమయ్యను సత్కరించి, రాజగురువుగా తన ఆస్థానంలో నియమించుకున్నాడు. ఆ సమయంలో అలమేలుమంగా శ్రీనివాసుల శృంగారలీలలు వర్ణిస్తూ అన్నమయ్య ఓ కీర్తనను ఆలపించాడు -

*ఏమెకొ! చిగురు టధరమున యెడనెడ కస్తూరి నిండెను* 
*భామిని విభునకు వ్రాసిన పత్రిక కాదు గదా!*

💫 ఈ కీర్తనను విన్న నరసింహరాయలు యుక్తాయుక్త విచక్షణను మరచి, కీర్తికండూతితో, అత్యాశతో, తనపై కూడా అలాంటి కీర్తన చెప్పమని కోరాడు. పూర్తిగా శ్రీవారి సేవకే అంకితమైన అన్నమయ్య, నారాయణుని కీర్తించిన తన నోటితో ఒక నరుని స్తుతించలేనని చెబుతూ, నరసింహరాయలు కోర్కెను నిర్ద్వంద్వంగా తిరస్కరించాడు. దానికి కోపోద్రిక్తుడైన సాళువరాజు *"మూరురాయరగండ"* అనే బంగారు సంకెళ్ళతో అన్నమయ్యను బంధించి ఖైదు చేయించాడు. అన్నమయ్య ఆర్తితో వేడుకొనగా, ఆనందనిలయుని కటాక్షంతో సంకెళ్ళు కకావికలం అయ్యాయి. భటులు చెప్పిన విషయం నమ్మని రాజుగారు తానే స్వయంగా దగ్గరుండి మరోసారి సంకెళ్లు వేయించాడు. అన్నమయ్య సంకీర్తనాలాపనతో సంకెళ్లు రెండవసారి కూడా విడిపోయాయి. ఆ వింతను స్వయంగా చూసిన నరసింహరాయల అహంకారం తగ్గి అన్నమయ్యను క్షమాభిక్ష వేడుకున్నాడు. ఆ రాజు అజ్ఞానాన్ని మన్నించి, ఇకమీదట భాగవతులను అవమానించవద్దని హెచ్చరించి, రాజాస్థానం తన గమ్యం కాదని గుర్తెరిగిన అన్నమయ్య, సకుటుంబంగా తిరిగి వేంకటాచలం చేరుకున్నాడు.

🌈 *ఇతర వాగ్గేయకారులతో అన్నమయ్య* 🌈

💫 తన వృద్ధాప్యాన్ని తిరుమల క్షేత్రంలో, స్వామివారిని కీర్తిస్తూ గడుపుతున్న సమయంలో, అన్నమయ్యకు నాలుగు లక్షల యాభదివేల కీర్తనలు వ్రాసినట్లుగా చెప్పబడుతున్న పురందరదాసుతో పరిచయమేర్పడింది. ఆ భాగవతోత్తముడు అన్నమయ్యను తన గురువుగానూ, హరి అవతారంగానూ భావించి, ఇలా కీర్తించాడు -

*హరియవతార మీతడు అన్నమయ్య* 
*అరయ మా గురుడీతడు అన్నమయ్య* 
*వైకుంఠనాథుని వద్ద వడిపాడుచున్నవాడు ఆకరమై తాళ్ళపాక అన్నమయ్య*

💫 పురందరదాసే కాకుండా, గొప్ప గొప్ప వాగ్గేయకారులైన త్యాగయ్య, రామదాసు, క్షేత్రయ్యలు కూడా ఇతని భక్తిప్రభావానికి లోనై, అన్నమయ్య కవితాఝరికి జేజేలు పలికారు. 

🔯 కవితాదృష్టితో పరికిస్తే... 

💫‌ క్షేత్రయ్య పదాలు నృత్యానికి అనువుగా, లయబద్ధంగా గోచరిస్తాయి; 

💫 త్యాగరాజ కీర్తనలు సంగీత భరితంగా సవ్వడి చేస్తాయి; 

💫 రామదాసు పాటలు భక్తిభావాన్ని పుణికిపుచ్చు కుంటాయి; 

💫 జయదేవుని అష్టపదులు శృంగారభావాన్ని తొణికిస లాడిస్తాయి; 

💫‌కానీ,  అన్నమయ్య కీర్తనలు మాత్రం – *నృత్యం, సంగీత సాహిత్యాలు, భక్తితత్వం, శృంగార భావనల – మేళవింపై శ్రోతలను ఆనందడోలికల్లో విహరింపజేస్తాయి.*




🌈 *రచనాశైలి* 🌈

💫 అన్నమయ్య లెక్కకు మిక్కిలిగా రచించి, గానం చేసిన సంకీర్తనల లోని పదాలను పరిశీలిస్తే - స్వచ్ఛమైన, సంస్కృతంతో మిళితం కాని, రాయలసీమ యాసలోని తెలుగుభాష కానవస్తుంది. ఆ ప్రాంత ప్రజల్లో ఆనాడు వాడుకలో ఉన్న సామెతలు, జాతీయాలు, పలుకుబడులు, ఊతపదాలు, నుడికారాలు - వీటన్నింటిని గమనించి వాటిని తన రచనల్లో ఒద్దికగా పొందుపరిచాడు. 

💫 అన్నమయ్య తన కృతుల్లో తరచూ వాడిన కొన్ని పదాలను వర్గీకరించి విశ్లేషించుదాం :

👉 తిండి పదార్థాలు - కంచం, కూడు, అంబలి, గంజి, చింతకాయ పచ్చడి, ఆవకాయ, కారం, పెరుగు, చద్ది, నూనెలు, వెన్న, ఉప్పు, అన్నం, చద్దన్నం వంటి పదాలను ఉపయోగించి ఆనాటి రాయలసీమ లోని గ్రామీణ జీవితానికి అద్దం పట్టాడు.

👉 ఆర్థిక, సామాజిక స్థితిగతులను – ఇల్లు, కొట్టం, చావిడి, మేడ, గుడిసె, వంటగది, చెంబు, గొడుగు, రోలు, రోకలీ, గడ్డపార - వంటి పదాలను ఉపయోగించడం ద్వారా తేటతెల్లం చేశాడు.

👉 వివాహవ్యవస్థ - బొమ్మలపెళ్లిళ్లు, పెండ్లికొడుకు, పెండ్లికూతురు, విడిదిఇల్లు, బాసికం, తాళిబొట్టు, పెళ్లిపీటలు, మంగళసూత్రం, తలంబ్రాలు, అక్షింతలు, హారతులు, కొంగుముడి; - నిశితంగా గమనిస్తే, నాడు అన్నమయ్య గ్రంథస్థం చేసిన వివాహ ఆచార వ్యవహారాలు; ఆరువందల సంవత్సరాల తరువాత ఈనాడు కూడా, అతికొద్ది మార్పులతో సజీవంగా ఉన్నాయి.

👉 కుటుంబవ్యవస్థ - మగువ-మగడు, భార్య-భర్త, అత్తా-కోడలు, బావ-మరదలు, తల్లిదండ్రులు, కొడుకు - కూతురు; ఇలా, - ఈనాడు ఎన్నెతే బంధుత్వాలను మనం కలిగివుంటామో, ఆనాడు కూడా అవే చుట్టరికాలు అంతకుమించి ఆప్యాయతాభిమానాలు వ్యక్తం చేయబడ్డాయి.

👉 మూగజీవాలు - గుర్రం, ఆవు, చిలుక, నెమలి, హంస, చీమ, తేలు, జింక, ఎద్దు - వంటి వన్యప్రాణులను తరచూ ఉటంకిస్తూ తన జంతు ప్రేమను తేటతెల్లం చేశాడు అన్నమయ్య.

👉 జానపదాలు - ఉయ్యాల, నలుగు, జోల, కోలాటం, గుజ్జనగూళ్ళు, తందనాలు, లాలిపాటలు, చందమామ, వెన్నెల, అలా అన్నమయ్య తన రచనల్లో ఆనాటి రాయలసీమ పల్లెటూరి సొగసులను ఒద్దికగా పొందుపరిచాడు.

💫 అన్నమయ్య - పామరులకు సైతం సరళంగా ఆకళింపు అయ్యే సాధారణ భాషతో కూడుకున్న రచనలనే కాకుండా, విద్వాంసుల కోసం ఛందోబద్ధ, వ్యాకరణ సహిత, క్లిష్టతరమైన పెక్కు గ్రంథాలను సైతం అలవోకగా రచించి తన పాండిత్య ప్రకర్షను చాటుకున్నాడు. వారి సంకీర్తనలతో పాటుగా ద్విపదలు, శతకాలు, దండకాలు, రగడలు, భజనలు, గీతాలు, వ్యాఖ్యానాలు; ఎన్నో, మరెన్నో కూడా ఉన్నాయి. అయితే భాష ఎటువంటిదైనా, ఏ పదం ఉపయోగించినా, స్థూలంగా దాని అర్థం ఏమైనా అంతర్లీనంగా ఉన్న ఇతివృత్తం మాత్రం శ్రీవేంకటేశ్వరుడే!

💫 ఇలా తన సాహిత్యసంపద నంతా ఆ శ్రీనివాసుణ్ణి వేనోళ్ళ కీర్తించడానికే వినియోగించాడు.

💫 1424వ సంవత్సరంలో ప్రారంభించి, 1503వ సంవత్సరం వరకు 80 సంవత్సరాల కాలం కొనసాగిన సాహితీప్రస్థానం ముగిసేనాటికి అన్నమయ్య 96 సంవత్సరాల వయోవృద్ధుడు. ఆ సుదీర్ఘకాలంలో సగటున ప్రతిరోజు - రెండు లేదా మూడు సంకీర్తనలను గానం చేశాడు. ఆయన చేసిన సాహితీసేవలను గుర్తించి ఆనాటి రాజాస్థానాలు, పౌరసంఘాలు ఆయనను – *సంకీర్తనాచార్య, ద్రావిడ ఆగమ సార్వభౌమ, పంచాగమచక్రవర్తి* - వంటి బిరుదులతో సత్కరించాయి. 

*నా నాలికపై నుండి నానా సంకీర్తనలు* 
*పూని నాచే నిన్ను పొగడించితివి* 
*వేనామాల విన్నుడా వినుతెంచ నెంతవాడ* 
*కానిమ్మని నీకే పుణ్యము గట్టితి వింతేయయ్యా!*

💫 అంటూ, తన పాండిత్యమంతా శ్రీనివాసుని కృపయే తప్ప తన స్వంతం కాదని వినమ్రంగా, కవితాధోరణిలో చాటిచెప్పాడు.


*"వేంకటాద్రి సమస్థానం బ్రహ్మాండే నాస్తి కించన* 
*వేంకటేశ నమో దేవో న భూతో న భవిష్యతి"*




🌈 *అన్నమాచార్యుని లోని సంఘ సంస్కర్త* 🌈

💫 అన్నమాచార్యుని పేరు లేదా వారి కీర్తన వినగానే మనకు మొట్టమొదటగా స్ఫురణకు వచ్చేది శ్రీవేంకటేశ్వరుని పట్ల ఆయనకు ఉన్న అపారమైన భక్తి తత్పరతలు! అయితే అన్నమయ్య తన అసంఖ్యాకమైన కృతులలో స్వామివారిని అచంచలమైన భక్తితో కీర్తించడము సామాజిక స్థితిగతులను కళ్ళకు కట్టినట్లు వర్ణించడమే గాకుండా; ఆనాడు సమాజంలో ప్రబలి ఉన్న సాంఘిక దురాచారాలను, అంధవిశ్వాసాలను, కులమత బేధాలను, జంతుబలులను, అంటరానితనాన్ని, స్త్రీ-పురుష వ్యత్యాసాలను, మూఢనమ్మకాలను నిర్ద్వందంగా తిరస్కరించాడు. శ్రీవేంకటేశ్వరుడు తన ఖడ్గంతో అసురులను దునుమాడి నట్లుగానే; వారి నందకఖడ్గ అంశతో జన్మించిన అన్నమాచార్యుడు, నాడు జనబాహుళ్యంలో వ్రేళ్ళూనుకుని ఉన్న సామాజిక రుగ్మతలను తన సమకాలీన స్పృహతో కూడిన సాహితీ ప్రకర్ష అనే పదునైన ఖడ్గంతో నిష్కర్షగా ఖండించాడు.

💫 అన్నమయ్య రచనలలో అటువంటి కీర్తనలు అసంఖ్యాకంగా ఉన్నాయి. వాటిలో కొన్నింటిని నేటి ప్రకరణంలో అవలోకిద్దాం -

*హరిభక్తి గలిగితే అన్నియూ ముఖ్యముగాక* 
*విరహా చారము లెల్ల వృథా వృథా ||*
*పులులు గుహల నుంటె పోలింప ఋషులా* 
*యెలుగు గడ్డము నెంచు నింతలోనె యోగుడా* 
*పక్షులాకాశాన కేగితే దేవతలా* 
*వొలసి కోతి యడవి నుంటే వనవాసమా ||* 
*మాకులు మాటలాడవు మౌనవ్రతములా* 
*కోక గట్టరు బాలులు కోరి దిగంబరులా ||* 

💫 ఈ కీర్తనలో అన్నమయ్య పదలాలిత్యం, మూఢాచారాల పట్ల ఆయనకు ఉన్న ఏహ్యభావాన్ని వ్యంగ్యంగా సామాన్యులకు హత్తుకునేలా వ్యక్తం చేయగలిగే నేర్పు, ఉపమానాలను సమయస్ఫూర్తిగా ఉపయోగించటంలో వారి చాతుర్యం కొట్టవచ్చినట్లు కానవస్తాయి.

💫 భావార్థానికి వస్తే హరిభక్తి కలిగి ఉండటమే ముఖ్యం కానీ; శరీరాన్ని శుష్కింప జేసుకునే ఉపవాసాలు, మూఢభక్తితో కూడుకుని ఉన్న ఆచారవ్యవహారాలు అక్కరకు రావు. గుహలలో సంచరించిన మాత్రాన పులులు ఋషిపుంగవులు కాలేవు. ఆకాశంలో విహరించి నంతమాత్రాన పక్షులు దేవతలు కాజాలవు. అడవిలో నివసించడం చేత వానరములు వనవాస దీక్షలోనున్నట్లు గాదు. వృక్షజాలాలు నిశ్శబ్దంగా ఉన్నంత మాత్రాన అవి మౌనవ్రతాన్ని పాటిస్తున్నట్లు కాదు. వస్త్రాలు ధరించనందువల్ల పసిపిల్లలు దిగంబర యోగులు కానేకాదు. 

💫 ఈ విధంగా ప్రజలకు సులభంగా అర్థమయ్యే ఉపమానాలను ఉదహరించి తత్కాలీన సమాజంలో ఆలోచనా శక్తిని మేల్కొలిపాడు.

*మొక్కరో మీరు మోసపోక*
*యిక్కు దిక్కు దెసైన ఆదిదేవునికి* 
*మారు జేతు లీయవద్దు మారు గాళ్ళీ యవద్దు* 
*బీరాన గుండెలు కోసి పెట్టవద్దు* 
*గోలవడి చిచ్చులోన గుండాలు చొరవద్దు* 
*వూరకే మీ వారమని వున్న చాలు ||*

💫 ఆకాలంలో గ్రామదేవతల ప్రీత్యర్ధం జంతుబలులిచ్చే మూఢాచారం ప్రబలంగా ఉండేది. అగ్నిగుండాలలో దూకి ప్రజలు తమ మూఢభక్తిని ప్రదర్శించేవారు. అటువంటి అనాగరిక చర్యలను వ్యతిరేకించిన అన్నమయ్య, భక్తులు తమను తాము ఆర్తిగా దేవునికి సమర్పించుకోవాలే తప్ప; మూగ జంతువులను కడతేర్చరాదని, భగవదారాధన కోసం నిర్దేశించబడ్డ మానవశరీరాన్ని ఆకారణంగా చిత్రహింసలకు గురి చేయరాదని ఉపదేశించాడు.

*నరులకు నరులే పరలోక క్రియలు* 
*సిరిమోహాచారాలు జేతులు గాక* 
*తరుపాషాణ పశుతతుల కెవ్వరు సేసే*
*రరయగ భ్రమగాక అని పస్తులున్నవా ||*

💫 ఈ కీర్తనలో అన్నమయ్య తన హేతువాద దృక్పథాన్ని వెల్లడించాడు. మరణించిన వ్యక్తికి పిండ ప్రదానం చేసే హైందవ ఆచారప్రక్రియలపై పెదవి విరిచాడు. మనుషులకు మనుషులే పరలోక కర్మలు జరపటం హాస్యాస్పదమని; రాళ్లకు, వృక్షాలకు, జంతుజాలానికి కర్మకాండలు జరగనంత మాత్రాన అవన్నీ పస్తులున్నాయా? అని సూటిగా ప్రశ్నించాడు.

*ఏ కులజుడేమి యెవ్వడైననేమి |* 
*ఆకడనాతడె హరినెరిగినవాడు ||* 
*పరగిన సత్యసంపన్నుడైనవాడే* 
*పరనింద సేయ తత్పరుడు కానివాడు* 
*అరుదైన భూతదయానిధి యగు వాడే* 
*పరులు తానేయని భావించువాడు ||*

💫 ఈ సంకీర్తన ద్వారా హరి చరణాలను చేరుకోవడానికి "కులం" ముఖ్యం కాదని, సత్ప్రవర్తన తోనే శ్రీమహావిష్ణువు సాయుజ్యం పొందగలరని నొక్కి వక్కాణించాడు. సత్యసంపన్నుడు, పరనింద చేయనివాడు, భూతదయ గలవాడు, సమస్తజీవ రాశులను తనకు అభిన్నంగా భావించి అన్నింటి హితం కోరేవాడు, నిర్మలమైన అంతరాత్మ గలవాడు, ధర్మతత్పరత గలిగి కర్మమార్గమును వీడనివాడు, సర్వకాల సర్వావస్థల యందు హరిభక్తిని వీడని వాడు, సతతము సద్బుద్ధితో సంచరించే వాడు, ఈర్ష్యా ద్వేషములను దరిజేరనివ్వక స్వామివారి పాదపద్మాలను నమ్ముకున్నవాడు మాత్రమే విష్ణుమూర్తి సాన్నిధ్యాన్ని సాకారం చేసుకోగలడని, పుణ్యపురుషులకు ఉండవలసిన లక్షణాలను రసరమ్య భరితంగా విశదీకరించాడు.

💫 ఆ విధంగా అంటరానితనం ప్రబలి అగ్రవర్ణాల ఆధిపత్యం అప్రతిహతంగా ఉన్న ఆ రోజుల్లో కులాల కట్టుగోడలను కూల్చివేసి సమసమాజ నిర్మాణం కోసం ఆనాటి సాంప్రదాయవాదుల్ని తన కవితా పాటవంతో, సామాజిక సృహతో "ఢీ" కొన్నాడు.

*తందనాన ఆహి తందనాన పురే తందనాన భళా తందనాన ||* 
*బ్రహ్మ మొకటే పరబ్రహ్మ మొకటే పరబ్రహ్మ మొకటే పరబ్రహ్మ మొకటే ||*

💫 లోకప్రసిద్ధమైన, మన అందరికీ సుపరిచితమైన ఈ కీర్తనలో అన్నమయ్య పశుపక్ష్యాదుల లోనూ, మానవులలోనూ శ్రీహరే నిండి ఉన్నాడని; అధికుడు-అల్పుడు అనే తారతమ్యం లేకుండా అందరి అంతరాత్మల్లోనూ శ్రీహరి కొలువై ఉంటాడని చాటి చెప్పాడు. రాజాధిరాజు కైనా, సాధారణ భటునికైనా నిద్ర ఒకేరీతిగా ఉంటుందని; సద్భాహ్మణుడైనా, అంటరానిగా భావింపబడే వాడైనా చివరకు చేరుకునేది మరుభూమి కేనని; దేవాధిదేవతలకు, పశుపక్ష్యాదులకు, క్రిమికీటకాలకు కూడా కామసుఖం ఒక్కటిగానే అనిపిస్తుందని; భాగ్యవంతులకైనా, నిరుపేదలకైనా దివారాత్రములు ఒకటిగానే గోచరిస్తాయని; రుచికరమైన శిష్టాన్నమునైనా, అరుచికరమైన ఆహారాన్నైనా రుచి చూసేది ఒకటే నాలుక యని; పరిమళద్రవ్యాల పైనా, దుర్గంధ భూయిష్ట పదార్థాలపైనా వీచే వాయువు ఒకటేనని; దుర్గమారణ్యంలో నిరవసించేటటువంటి గజరాజుపైనా, రహదారిపై నుండే శునకము మీదా కాచే ఎండ ఒకటేనని; పుణ్యాత్ములకైనా, పాపాత్ములకైనా శ్రీవేంకటేశ్వరుని నామజప మొక్కటే దిక్కని ఘంటా పథంగా చాటిచెప్పాడు.

💫 ‌ఈ విధంగా తరతమ బేధాలు, తారతమ్యాలు లేని సమాజాన్ని తన సాహిత్యసౌరభంతో, ఆరు వందల యేళ్ళ క్రితమే ఆవిష్కరింప జేసిన అన్నమాచార్యుడే, తరువాతి కాలంలో ఈ భావజాలంతో మొలకెత్తిన అన్ని "వాదా" లకు (ఉదా.: సామ్యవాదం), అన్ని "ఇజా" లకు (ఉదా.: కమ్యూనిజం, సోషలిజం) ఆద్యుడంటే అందులో అణుమాత్రమైనా అతిశయోక్తి ఉన్నదా?

💫 అన్నమయ్య, వారి వారసులు తమ జీవిత కాలాలలో రచించిన అసంఖ్యాకమైన సంకీర్తనలను పొందుపరిచి నటువంటి రాగిరేకులను పదిలపరచి, భావితరాలకు భద్రంగా అందజేసి నటువంటి, తిరుమల ఆలయ విమానప్రదక్షిమార్గంలో గల అన్నమయ్య సంకీర్తనా భాండాగారం గురించి వివరంగా తెలుసుకుందాం.




🙏 *ఓం నమో వేంకటేశాయ*🙏

*"వేంకటాద్రి సమస్థానం బ్రహ్మాండే నాస్తి కించన* 
*వేంకటేశ నమో దేవో న భూతో న భవిష్యతి"*


🌹 *అన్నమయ్య సంకీర్తనా భాండాగారం* 🌹

💫తిరుమల ఆలయం నందలి విమానప్రదక్షిణ మార్గంలో, ఆనందనిలయానికి ఉత్తరాన, రాగిరేకులపై వ్రాయబడ్డ అన్నమాచార్యుని సంకీర్తనలను భద్రపరచినట్టి రాతిశిలపై మలచిన, బీరువా లాంటి *"తాళ్ళపాక అర"* ను *"అన్నమయ్య సంకీర్తనా భాండాగారం"* గా పిలుస్తారు. దీనిని గూర్చిన ప్రాథమిక సమాచారాన్ని మనం "విమానప్రదక్షిణ మార్గం" ప్రకరణంలో ఇంతకు ముందే తెలుసుకున్నాం.


🌈 *ఎవరు వ్రాశారు?* 🌈

💫 తొలి తెలుగు వాగ్గేయకారుడు, పదకవితా పితామహుడు తాళ్ళపాక అన్నమాచార్యుల వారు అత్యంత పిన్న వయసులోనే శ్రీవేంకటేశ్వరుని సాక్షాత్కారం పొంది, స్వామివారి సన్నిధిలో వసించి తన పదహారవ యేట నుండే సంకీర్తనాయజ్ఞాన్ని ప్రారంభించాడు. వాస్తవానికి ఎనిమిదేళ్ళ వయసు నుండే రాగాలు ఆలపించడం ప్రారంభించిన అన్నమయ్య పదహారేళ్ళ ప్రాయం నుండి వాటిని గ్రంథస్థం చేయడం మొదలు పెట్టాడు. అన్నమాచార్యుని మనుమడైన చిన తిరుమలాచార్యులు రచించిన *"అన్నమయ్య చరిత్ర"* అనే గ్రంథంలో అన్నమాచార్యుల వారే స్వయంగా ముప్ఫై రెండు వేల కీర్తనలు రచించినట్లు చెప్పబడింది. వాటిలో ఇప్పటివరకు మనకు లభ్యమైనవి 16,582 కీర్తనలు మాత్రమే. వీటిలో కూడా అది కొద్దిభాగం మాత్రమే సంస్కరింపబడి, ప్రచురణకు నోచుకున్నాయి. అయితే, ప్రసిద్ధికెక్కిన తిరుమల ఆలయ పురావస్తు పరిశోధకుడు *"సాధు సుబ్రహ్మణ్యశాస్త్రి"* గారు మాత్రం అన్నమయ్య రచించిన కీర్తనలు 10,000 నుండి 12,000 వరకు ఉండవచ్చని, మిగిలినవి వారి వంశీయులచే వ్రాయబడి ఉండవచ్చునని అభిప్రాయపడ్డారు.


🌈 *భాండాగారం నిర్మాణం* 🌈

💫 అన్నమయ్య కాలం నాటికి వారి కీర్తనలన్నీ తాళపత్రాల పైనే (పూతపూయబడిన తాటి యాకులు) వ్రాయబడి ఉన్నాయి. తండ్రి గారి ఆదేశానుసారం, ఆయన తదనంతరం అన్నమయ్య తనయుడైన పెద తిరుమలయ్య ఈ కీర్తలన్నింటిని రాగిరేకులపై చెక్కించి వాటికి శాశ్వతరూపం కల్పించే కార్యక్రమానికి పూనుకున్నాడు. ప్రప్రథమంగా ఈ భాండాగారం యొక్క ఉనికిని తెలిపిన తి.తి.దే. శాసనం 589 ప్రకారం; 1525-1530 సంవత్సరాల మధ్యకాలంలో, విజయనగర సామ్రాజ్య చక్రవర్తి అచ్యుతరాయలు సహకారంతో, పెద తిరుమలాచార్యుడు ఈ భాండాగారాన్ని నిర్మించాడు. ఆయన కాలంలోనూ, వారి తర్వాత అన్నమాచార్యుని మనుమడైన "చిన తిరుమలాచార్యుల" వారి హయాంలోనూ వ్రాయబడిన కీర్తన లన్నింటిని తామ్రఫలకాలపై చెక్కించి ఈ భాండాగారంలో భద్రపరిచారు. కీర్తనలు మలచబడ్డ మరికొన్ని రాగిరేకులను ప్రసిద్ధ వైష్ణవ క్షేత్రాలైన అహోబిలం, మంగళగిరి, సింహాచలం, శ్రీరంగం మొదలైన వాటికి తరలించారు.


🌈 *దక్కిన వెన్ని? కోల్పోయిన వెన్ని??* 🌈

💫 తిరుమల ఆలయంలోని ఈ సంకీర్తనాభాండాగారం తో పాటుగా, మిగిలిన ప్రదేశాలన్నింటిలో కలిపి మనకు దక్కిన మొత్తం రాగిరేకులు 2590. ప్రతి రేకుపై సగటున ఆరు కీర్తనల చొప్పున, మొత్తం 16,582 కీర్తనలు లభ్యమయ్యాయి. కొన్నింటిలో ఆరు కంటే ఎక్కువ కీర్తనలు కూడా ఉన్నాయి.

💫 తర్వాతి కాలంలో, పురావస్తు పరిశోధకులు, రచనాశైలిని బట్టి, ఉపయోగించిన పదాలను బట్టి, కాలానుగుణంగా పరిణామం చెందిన భావగతులను బట్టి, ఈ కీర్తనలన్నింటినీ రచయితల వారీగా విభజించారు. ఆ వర్గీకరణ ప్రకారం

🌈 *దొరికిన మొత్తం కీర్తనలలో....*

💫 అన్నమాచార్యుడు స్వయంగా రాసినవి - 14,400

💫 వారి కుమారుడైన పెద తిరుమలాచార్యులచే రచింపబడినవి – 1,062

💫 మనుమడైన చిన తిరుమలాచార్యులు వ్రాసినవి - 1,120.

💫 అంటే, మొత్తం రచించినట్లుగా చెప్పబడుతున్న సుమారు 32 వేల కీర్తనలలో సగభాగాన్ని తెలుగు జాతి కోల్పోయింది. సంకీర్తనా సౌరభాన్ని ఆఘ్రాణించడం చేతగాక, *"రాగం కంటే రాగి ముఖ్యం"* అనుకున్న అత్యాశాపరుల కారణంగా; ఆయా కాలాల్లోని దేవాలయ యాజమాన్యాల నిర్లక్ష్యం వల్ల, తెలుగుజాతికి తీరని నష్టం వాటిల్లింది.



🌈 *అన్నమాచార్యుని వంశీయులు* 🌈

💫‌16-17 శతాబ్దాల యందు ఉత్సవాల సమయాలలో అన్నమయ్య, పెద తిరుమలాచార్యులు, చిన తిరుమలాచార్యులు ఈ భాండాగారం ముందు మలయప్పస్వామి వారికి హారతినిచ్చి, నైవేద్యం సమర్పించే సాంప్రదాయం చాలా కాలం కొనసాగింది. తరువాతి కాలంలో నైవేద్య సమర్పణలు, నిత్యదీపారాధనలు, తాళ్ళపాక వారి ధర్మాదాయాలు వేర్వేరు కారణాల వల్ల రద్దయ్యాయి. తదనంతర పాలకుల నిర్లక్ష్యంతో విజయనగర రాజులు ప్రవేశపెట్టిన అనేక ప్రత్యేక ఉత్సవాలు కూడా కాలగర్భంలో కలిసిపోయాయి. అందుచేత సంకీర్తనా భాండాగారం ముందు హారతినిచ్చే సాంప్రదాయం కూడా అర్ధాంతరంగా ఆగిపోయింది. తర్వాతి కాలంలో అక్కడ ఒక అమూల్యమైన సాహిత్యనిధి నిక్షిప్తమై ఉందన్న విషయం కూడా మరుగున పడిపోయింది. భక్తులకు, అర్చకులకు, ఆలయ అధికారులకు, చివరకు తాళ్ళపాకవంశం వారికి కూడా ఈ భాండాగారం గురించిన సమాచారం పూర్తిగా లుప్తమై పోయింది. తదనంతర కాలంలో, ఈ భాండాగారాన్ని తిరిగి వెలికి తీసిన తరువాత కూడా, వీరి వారసులు తమ పూర్వీకులు ముగ్గురు వ్రాసిన సంకీర్తనలను గానం చేసే వారే కానీ, సరిక్రొత్త కీర్తనలను రచించే సామర్థ్యాన్ని కోల్పోయారు. ఆ తరువాతి తరాల వారిలో కొంతమందికి ఆ శ్రీనివాసుడు కనీస సంగీత పరిజ్ఞానం కూడా ప్రసాదించలేదు. ఈ మధ్యకాలంలో, అన్నమయ్య పరంపరను అనూచానంగా కొనసాగించే లక్ష్యంతో, తాళ్ళపాక వంశీయులకు సంగీత కళాశాలలలో ప్రత్యేక శిక్షణనిచ్చి; సుప్రభాత, ఏకాంత సేవలలోనూ, ప్రత్యేక ఉత్సవాలలోను అన్నమాచార్యుని సంకీర్తనలను వీనులవిందుగా గానం చేయించే ఏర్పాటు జరిగింది. 

💫 తిరుమల క్షేత్రంలో ఉగాది రోజున ప్రారంభమై 40 రోజులపాటు కొనసాగే శ్రీవారి నిత్యోత్సవాలలో, శ్రీనివాసుడు కేవలం అన్నమయ్య కీర్తనలను మాత్రమే వింటూ పురవీధుల్లో ఊరేగుతారు. ఏ విధమైన బాజాభజంత్రీలు, సంగీత వాయిద్యాల సంరంభం లేకుండా, అన్నమయ్య వారసులు తుంబురను మీటుతూ గానం చేస్తుండగా, ఆనందనిలయుడు మైమరచి వింటూ ముందుకు సాగుతాడు.


🌈 *సాధు సుబ్రహ్మణ్యశాస్త్రి గారి కృషి* 🌈

💫 తిరుమల ఆలయంలో మహంతుల ఆజమాయిషీ కాలం నుండి, ఆలయం తి.తి.దే. ఆధ్వర్యం లోకి వచ్చిన తర్వాత కూడా, 1919వ సం. నుండి 1944వ సం. వరకు పురాతత్వశాస్త్ర పరిశోధకుడిగా సేవల నందించిన సుబ్రహ్మణ్యశాస్త్రి గారి నిరంతర శ్రమ ఫలితంగా దేవాలయం నందలి విమానప్రదక్షిణంలో ఈ సంకీర్తనాభాండాగారం ఉన్నదని, అందులో అమూల్యమైన వారసత్వ సంపద అయిన వేలాది కీర్తనలు రాగిరేకులపై భద్రపరచబడి ఉన్నాయనే విషయాలు వెలుగులోకి వచ్చాయి. 1922వ సంవత్సరంలో ఈ రాగిరేకులను కొండపై నుండి తిరుపతి లోని తి.తి.దే. వారి కార్యాలయానికి చేర్చిన తరువాత, శాస్త్రిగారు వాటిలోని సంకీర్తనలను కాగితాలపై కాపీ చేశారు. అనేక సంవత్సరాలు కృషిచేసి అలా తయారు చేసిన కాగితపు వ్రాతప్రతులను మూడు భోషాణాలలో భద్రపరిచారు. అంతేగాకుండా, కొన్ని ముఖ్యమైన కీర్తనలను - *"మైండ్ వర్త్", "ఆధ్యాత్మ సంకీర్తనలు", "శృంగారసంకీర్తనలు"* - అని మూడు సంపుటాలుగా ముద్రించి; శ్రీ కళాచారి వెంకటరమణ గారితో ఆ కవితలకు సామాన్యులకు సైతం అర్థమయ్యే రీతిలో, వివరణాత్మక వ్యాఖ్యానం కూడా వ్రాయించారు. అప్పటి పరిశోధనల ఫలితంగానే అన్నమయ్య జన్మదినం *'1408వ సంవత్సరం, వైశాఖ శుద్ధపూర్ణిమ'* అని సహేతుకంగా, శాస్త్రబద్ధంగా నిర్ధారింపబడింది. ఈ బృహత్తర కార్యక్రమం 1930 సంవత్సరం వరకు కొనసాగింది.


🌈 *కార్యాలయ అధికారి నిర్వాకం* 🌈

💫 విధివశాత్తూ, 1931వ సంవత్సరంలో మలయప్పస్వామి వారికి అప్పటి గద్వాల మహారాణి వారు వజ్రకిరీటం తయారు చేయించాలని సంకల్పించింది. ఆ కిరీటం తయారీ కార్యక్రమాన్ని పర్యవేక్షించడం కోసం సుబ్రహ్మణ్యశాస్త్రి గారు చెన్నపట్టణానికి తరలి వెళ్లారు. ఆ వ్యవధిలో ముద్రణా కార్యాలయాన్ని వేరే ప్రదేశానికి తరలించాల్సి రావడం వల్ల; దేవస్థానానికి చెందిన ముద్రణాలయ అధికారి ఒకరు, శాస్త్రిగారు మూడు టేకు పెట్టెలలో పదిలపరచిన వ్రాతప్రతులను చిత్తు కాగితాలుగా భ్రమించి, వాటిని తగులబెట్టించి, ఖాళీ పెట్టెలను కొత్త కార్యాలయానికి క్షేమంగా చేరవేశాడు. అలా శాస్త్రిగారి శ్రమ చాలా భాగం బూడిదలో పోసిన పన్నీరై పోగా, వారు అంతకుముందే పొందుపరచిన. మూడు సంపుటాలలో గల అతి కొద్ది సంకీర్తనలు మాత్రం మనకు మిగిలాయి.

💫 భాండాగారంలో బయటపడ్డ రాగిరేకుల లోని రకాలను, ఈ కీర్తనలను వెలుగులోకి తీసుకురావటం కోసం ఇంకెందరో మహానుభావులు చేసినట్టి అవిరళ కృషిని, తి.తి.దే. వారు చేపట్టిన *"అన్నమాచార్య ప్రాజెక్టు"* అనబడే బృహత్తర కార్యక్రమం గురించి సవివరంగా తెలుసుకుందాం.

💫 అన్నమాచార్యుని రచనలను వెలుగులోకి తెచ్చి, ఆధ్యాత్మిక-ధార్మిక-నైతిక విలువలతో కూడిన ఆ అమూల్యమైన సాహిత్యసంపదను తెలుగు జాతికి అందించిన వారందరినీ తలచు కోవడం, తెలుగువారిగా మనందరి కర్తవ్యం! ఒక్కొక్కరు చేసిన కృషి సంక్షింప్తంగా చెప్పుకున్నా ఒక్కో ఉదంతమవుతుంది. "చంద్రునికో నూలుపోగు" అన్న చందంలో, అతి క్లుప్తంగా, వారందరినీ కొన్ని వాక్యాల్లో పరిచయం చేయడానికే ఈ చిన్ని ప్రయత్నం.


🌈 *పండిత విజయ రాఘవాచార్యులు* 🌈

💫 సాధు సుబ్రహ్మణ్యశాస్త్రి గారు తయారుచేసిన కీర్తనల వ్రాతప్రతులు టేకు పెట్టెలలో భద్రపరచినంత వరకు పూర్తిగా భస్మీపటలమై పోగా, వారు ఇతరత్రా ప్రదేశాల్లో పదిలపరచి నటువంటి అతికొద్ది వ్రాతప్రతులను మాత్రం పండిత విజయ రాఘవాచార్యులు గారు ప్రచురించి వెలుగులోకి తెచ్చారు.


🌈 *శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రి గారు* 🌈

💫 ఆ తర్వాత 1945వ సంవత్సరంలో, తి.తి.దే. వారి ప్రాచ్యకళాశాలలో తెలుగుభాషా విభాగానికి అధ్యక్షునిగా ఉన్న శ్రీవేటూరి ప్రభాకరశాస్త్రి గారు, సుబ్రహ్మణ్యశాస్త్రి గారు చేపట్టిన మహాయజ్ఞాన్ని పునఃప్రారంభించి, రాగి రేకుల యందు నిక్షిప్తమై ఉన్న వేలాది కీర్తనలను జనబాహుళ్యం లోనికి తీసుకు వెళ్ళడంలో సఫలీకృతు లయ్యారు. అప్పటినుండి అన్నమాచార్య కీర్తనలు తిరుమల తిరుపతి దాటుకొని, ఆంధ్రదేశ మంతటా మాత్రమే కాకుండా, ఖండఖండాంతరాలకు విస్తరించి అన్నమయ్య ప్రతిభను, తెలుగునేల సౌభాగ్యాన్ని ప్రపంచమంతా చాటిచెప్పాయి. ప్రభాకరశాస్త్రి గారు రాగిరేకుల నన్నింటిని రచయితల వారిగా వర్గీకరించి, కీర్తనలను రెండు సంపుటాలుగా ప్రచురించారు. *"అన్నమాచార్య చరిత్ర - పీఠిక"* అనే గ్రంథాన్ని రచించి, అప్పటివరకు మరుగున పడి ఉన్న అన్నమాచార్యుని జీవితచరిత్రను ప్రాభవాన్ని వెలుగులోకి తెచ్చారు.



🌈 *శ్రీ రాళ్ళపల్లి అనంతకృష్ణ శర్మ గారు* 🌈

💫 ఆ తర్వాత 1951వ సంవత్సరంలో, రాగిరేకుల లోని మరికొన్ని కీర్తనలను పఠన యోగ్యమైన ఈ నాటి తెలుగుభాష లోకి అనువదించే బృహత్తర కార్యాన్ని తి.తి.దే. వారు రాళ్ళపల్లి అనంతకృష్ణ శర్మ గారికి అప్పగించారు. వారు వేలాది కీర్తనలను దాదాపు 20 సంపుటాలుగా ప్రచురించి, వాటిలో 108 కీర్తనలకు స్వరాలు సమకూర్చి, వాటిని వినసొంపుగా తీర్చిదిద్దారు. ఇంతే కాకుండా , అన్నమయ్య సాహిత్యంలో అంతర్లీనంగా ఉన్న కొన్ని కన్నడ, తమిళ, సంస్కృత శబ్దాలను అందుబాటులో ఉన్న నిఘంటువుల సహాయంతో ఆంద్రీకరించారు. అన్నమాచార్యుడు తన

💫 ఆ కీర్తనలను రాగయుక్తం చేసిన ముప్ఫయ్యొక్క రాగాలను కూడా వెలుగులోనికి తెచ్చి తెలుగు సాహిత్యానికి ఎనలేని కృషి చేశారు. రాగయుక్తంగా పాడగలిగే సంగీతపరిజ్ఞానం లేని వారు, ఆ కీర్తనలను కేవలం పద్యాలుగా చదువుకొని; అందులోని చమత్కారాలను, సందేశాలను, సూక్తులను అర్థం చేసుకోగలిగినా చాలుననే లక్ష్యంతో రెండు దశాబ్దాలపాటు వారీ మహా యజ్ఞాన్ని చేపట్టారు.

💫 వారి తరువాత శ్రీనివాసాచార్యులు గారు, జగన్నాధరావు గారు, గౌరు పెద్దరామసుబ్బశర్మ గారు వంటి మహానుభావులెందరో తాళ్ళపాక వారి కీర్తనలను ప్రచురించి తెలుగుజాతికి అందించారు. వారందరికీ చేతులెత్తి నమస్కరిద్దాం! 🙏


🌈 *రాగిరేకుల్లో రకాలు* 🌈

💫 పైన ఉదహరించిన మహానుభావు లందరూ కేవలం సాహిత్య సాధకులుగా మాత్రమే గాకుండా, అనువాదకులు గానూ, పురావస్తు శాస్త్రవేత్తలు గాను, జిజ్ఞాస కలిగిన పరిశోధకులు గానూ, ఇలా పలురకాలుగా సేవలందించారు. వారి కృషి ఫలితంగా రాగిరేకులన్నీ పరిమాణాన్ని బట్టి, విభజించ బడి; ఆయా రేకులు ఏ ఏ సందర్భాల్లో ఎలా ఉపయోగించ బడ్డాయో భావితరాలు తెలుసుకో గలిగే అవకాశం లభించింది.

💫 సంకీర్తనాభాండాగారంలో లభ్యమైన తామ్ర ఫలకాలన్నీ వాటి పరిమాణాన్ని బట్టి నాలుగు రకాలుగా విభజించబడ్డాయి: 

🌈 *సాధారణ రేకులు*

💫 ఒకచోట స్థిరంగా ఉంచి ఉపయోగించడం కోసం వ్రాయబడ్డ ఈ రాగిరేకులను ఈనాటి గ్రంథాలయాలలో ఉండే "రిఫరెన్స్ పుస్తకాల" తో పోల్చవచ్చు. ఇలాంటి రేకులు మొత్తం 2531 లభ్యమయ్యాయి. 

🌈 *పెద్ద రేకులు*

💫 ఈ రేకులు ఉపరితలం పెద్దవిగా నుండి, ఒక్కొక్క గుత్తికి ఐదారు రేకుల చొప్పున ఇనుప కడియాలతో చుట్టబడి ఉన్నాయి. ఈ కడియాలలో పెద్ద పెద్ద కలప దుంగలను దూర్చి, వాటిని కావడి లాగా లేదా డోలీలాగా సుదూర ప్రాంతాలకు తరలించడానికి అనువుగా తీర్చిదిద్దారు. ఈ పెద్దరేకులలో కొన్నింటిని శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రి గారు అహోబిల క్షేత్రానికి వెళ్లి స్వయంగా అన్వేషించి సేకరించారు. ఇలాంటివి మొత్తం 36 రేకులు బయట పడ్డాయి. కీర్తనలు ప్రచారం చేసే సత్కార్యానికి ఆనాడే శ్రీకారం చుట్టబడిందన్న మాట!

🌈 *శాసనపు రేకులు*

💫 ఈ రేకులు సాహిత్య పరమైన విలువల కంటే, చారిత్రక ప్రాధాన్యాన్ని ఎక్కువగా సంతరించుకున్నాయి. ఆయా కాలాల్లో అప్పటి రాజులు చేసినటువంటి సాహిత్య సేవ గురించి, అన్నమాచార్యులు, వారి వంశీయులకు సమకాలీన చక్రవర్తులు అందించిన సహకారం గురించిన వివరాలు, ఈ రేకులలో పొందు పరచబడి ఉన్నాయి. ఇవి కూడా ఇనుప తీగెలతో నాలుగైదు రేకుల గుత్తిగా కట్టబడి ఉన్నాయి. ఇలాంటి రేకులు కేవలం పది మాత్రమే లభ్యమయ్యాయి!

🌈 *తాళపత్ర రేకులు*

💫 ఇవి మొత్తం 119 - తాళపత్ర ఆకృతిలో సన్నగా, పొడవుగా ఉంటాయి. బహుశా దేవాలయాలలో దేవునికి ఎదురుగా కూర్చుని లేదా సాహిత్య సమారోహాలలో పఠనం చేయడానికి వీలుగా ఇవి తయారు చేయబడ్డాయి. వీటిని ఈనాటి కరపత్రాలతో పోల్చవచ్చు.


🙏 *ఓం నమో వేంకటేశాయ*🙏

*"వేంకటాద్రి సమస్థానం బ్రహ్మాండే నాస్తి కించన* 
*వేంకటేశ నమో దేవో న భూతో న భవిష్యతీ

🌈 *అన్నమాచార్య ప్రాజెక్టు* 🌈

💫 పైన పేర్కొన బడ్డ మహానుభావులందరి కృషి వల్ల అసంఖ్యాకంగా ఉన్న కీర్తనలను ప్రచురించడంలో ఎంతో పురోగతి సాధించబడింది. అయితే, అసలు సమస్య ఇప్పుడే మొదలైంది!

💫 ఈ కీర్తనలు సామాన్య ప్రజానీకానికి చేరువ కాకపోతే వీరందరికి శ్రమకు అర్థం ఏముంది? దేశవిదేశాల్లో నివసిస్తున్న తెలుగు వారందరికీ ఈ కీర్తనలు దరిజేరాలంటే ఏంచేయాలి?

💫 ఈ ప్రశ్నలకు సమాధానంగా ఆవిర్భవించిందే,  *"అన్నమాచార్య ప్రాజెక్టు"!*

💫 పురందరదాసు కీర్తనలను కన్నడిగులకు చేరువ చేయడం కోసం తి.తి.దే. ఏ విధంగా *"దాసప్రాజెక్టు"* ను చేపట్టిందో, అదే లక్ష్యంతో తెలుగువారి కోసం *"అన్నమాచార్య ప్రాజెక్టు"* తి.తి.దే. ద్వారా రూపు దిద్దుకుంది.

💫 ఈ బృహత్తర లక్ష్యంతో 1978 లో ప్రారంభింప బడిన "అన్నమాచార్య ప్రాజెక్టు" కు మొట్టమొదటి స్పెషలాఫీసరుగా, తి.తి.దే. కళాశాలకు ఆ కాలంలో అధ్యాపకునిగా ఉన్న కామిశెట్టి శ్రీనివాసులు గారు నియమింప బడ్డారు. సాహితీ సంపుటాలు తయారుచేసి ముద్రింప జేసే బాధ్యత అధ్యాపకులు సుబ్బరాయశర్మ గారిది కాగా; ఆ సంకీర్తనలకు సంగీతం జోడించి వాటిని జనబాహుళ్యంలోకి తీసుకొని వచ్చే మహత్తర కార్యక్రమాన్ని శ్రీనివాసులు గారు స్వయంగా చేపట్టారు. అప్పట్లో తి.తి.దే. సంగీత కళాశాలకు ప్రధానాధ్యాపకునిగా ఉన్న నేదునూరి కృష్ణమూర్తి గారి సారథ్యంలో కళాశాల విద్యార్థులు ఈ సంకీర్తనలకు బాణీలు కట్టేలా ప్రోత్సహింపబడి, వారికి ఆర్థిక సహాయం కూడా అందజేయబడింది. అలా వారి మార్గదర్శకత్వంలో తెలుగు జాతి గర్వించ దగ్గ గాయకులెందరో వెలికి వచ్చారు. మనకు సపరిచితులైన శ్రీమతి శోభారాజు గారు, శ్రీ గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారు ఆ కోవకు చెందినవారే!

🌈 *ప్రాజెక్టు ముఖ్యోద్దేశాలు* 🌈

💫 తామ్ర పత్రాలను పర్యవేక్షించడం, కీర్తనలు ప్రచురింప చేయడం, వాటికి రాగ స్వర స్థానాలను నిర్దేశించడం, జనాకర్షణ కలిగిన గాయనీ గాయకులతో వాటిని గానం చేయించటం, ఔత్సాహిక గాయక బృందాలను ఏర్పరిచి వారిద్వారా కీర్తనలను ఊరూరా ప్రచారం చేయించడం, ప్రచారనిమిత్తం ఎలక్ట్రానిక్ మాధ్యమాలను విస్తృతంగా వినియోగించుకునే ప్రణాళికలు రచించి వాటిని అమలు పరచడం, భజన కీర్తనల ఆధారంగా చెక్క భజనలు, కోలాటాలు, బుర్రకథలు వంటి కళారూపాలను ప్రదర్శింపజేయటం, ఆ ప్రచార బృందాలలోని సభ్యులకు శిక్షణనిచ్చి వారిని తిరుమలలో ఏటా జరిగే మెట్లోత్సవానికి ఆహ్వానించడం, విద్యార్థులకు సంగీత పోటీలు నిర్వహించడం, కీర్తనలకు అనుగుణంగా నృత్యరూపాలను ఏర్పరచడం, అన్నమాచార్యుని జన్మస్థలమైన తాళ్ళపాక గ్రామాన్ని తి.తి.దే. వారు దత్తత తీసుకొని దానిని ప్రసిద్ధ పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయడం, విశ్వవిద్యాలయాలలో అన్నమయ్యపై పరిశోధనలను ప్రోత్సహించడం - ఈ ప్రాజెక్టు లక్ష్యాల్లో కొన్ని మాత్రమే!

💫 ఈ తిరుపతి పట్టణానికి 93 కిలోమీటర్ల దూరంలో, తిరుపతి-కడప రహదారిలో, రాజంపేట పట్టణం దాటిన తర్వాత, తాళ్ళపాక గ్రామం సమీపం లోని బోయినపల్లి ప్రాంతం వద్ద, అన్నమాచార్యుని 600 జన్మదినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేయబడ్డ 108 అడుగుల ఎత్తయిన అన్నమాచార్యుని విగ్రహ ఆవిష్కరణ ఈ ప్రాజెక్టులో అంతర్భాగమే.

💫‌ కడప జిల్లాలో చూసి తీరవలసిన ప్రదేశాలలో ముఖ్యమైనది ఈ విగ్రహం!

💫 ఈనాడు మనం కోరుకున్న, అర్థసహస్రాబ్ది కాలం నాటి అన్నమయ్య గీతాన్ని; టీకా తాత్పర్యాలు, రాగం కీర్తనలతో సహా; అంతర్జాలంలో క్షణాలలో పొందగలుగుతున్నామంటే ఆ ఖ్యాతి చాలా వరకూ "అన్నమాచార్య ప్రాజెక్టు" కే దక్కుతుంది.

💫‌ఎందరో ఔత్సాహిక కళాకారుల, అంకితభావంతో పనిచేసే సిబ్బంది, పేరెన్నికగన్న సంగీత విద్వాంసుల అవిరళ కృషితో నిర్ణీత లక్ష్యాలను శరవేగంగా సాధిస్తూ, తెలుగుజాతి కీర్తి కిరీటాలను సప్తగిరి శిఖరాల నుండి సప్తసముద్రాల కావలి వరకు తీసుకు వెళ్లడంలో ఈ ప్రాజెక్టు చాలా వరకు కృతకృత్యమయ్యింది! అయినా చేయవలసింది ఇంకా ఎంతో మిగిలే ఉంది.

🙏 *శ్రీవేంకటేశ్వరునిలో ఐక్యం* 🙏

💫‌ తొంభయ్యైదు సంవత్సరాల పాటు శ్రీనివాసుడి నుండి విడివడి, హరి యవతారంగా కీర్తించబడే, నందకఖడ్గ సంభూతుడైన అన్నమయ్య, స్వామివారితో సుదీర్ఘ విరహాన్ని భరించలేక 1503, దుందుభి నామ సంవత్సరం, ఫాల్గుణ బహుళ ద్వాదశి నాడు తన పాంచభౌతిక దివ్యశరీరాన్ని శాశ్వతంగా విడిచి తిరిగి స్వామివారిలో ఐక్యమై అమరుడయ్యారు!

Share
History Tallapaka Annamacharya Temple Tirumala TirumalaHills

No comments :

Please submit your suggestions, recommendations & queries

Translate

Popular Posts

  • image
    Tirumala Seva Details
    https://tirupatibalaji.ap.gov.in/#/sevaCal Advance Booking | Seva in Tirumala | Tirumala Daily Sevas Arjitha Seva  means performing seva to ...
  • image
    Tirumala Accommodation
      https://tirupatibalaji.ap.gov.in/#/accommodationCal TTD has built cottages in Tirumala that can be rented by pilgrims. There are 3 categor...
  • image
    TTD Eco Friendly initiative to sell incense Agarbathi Sticks
    TTD as part of Eco-friendly initiative to sell incense sticks made out of the used sacred garlands of TTD temples. Devotees of Sri Venkatesw...
  • image
    Matrusri Tarigonda Vengamamba | Tarigonda
    The deity of Tarigonda Sri Lakshmi Narasimha Swami who is known for Sathya Pramanalu (Promise) and consideration towards the devotees who ar...
  • image
    Tirumala Varaha Swamy Temple
      On leaving the Vaikuntha (the celestial abode of Lord Vishnu) Lord Srinivasa hid Himself in an anthill in a forest. One day, he came out o...
  • image
    Vehicle Purchase dates with auspicious Muhurat timings
  • image
    How to Buy 2023 TTD Calendar Online - Buy Now!
    TTD started Online sales of the 2023 Calendar are sold online. Also you can buy Small & Big Diary and Table Top Calendar. Please follow ...
  • image
    Auspicious Dates for Property Registration
  • image
    Srivari Padalu at Tirumala
    Following the scratch caused to the historically significant Srivari Padalu located in the highest peak of Narayanagiri in Tirumala, TTD has...
  • image
    Tirumala TTD Wedding Prasadam (Kalyana Talambralu)
    Special blessings for all newly weds from Lord Venkateswara. Blessings in return for your Wedding card. Akshintalu, Kumkamam,Kankanam, Ashir...

Loading...

TirumalaHills Archive

  • ►  2023 (2)
    • ►  February 5 - February 12 (1)
    • ►  January 8 - January 15 (1)
  • ▼  2022 (87)
    • ►  December 25 - January 1 (2)
    • ►  November 27 - December 4 (2)
    • ►  November 20 - November 27 (1)
    • ►  November 13 - November 20 (1)
    • ►  November 6 - November 13 (2)
    • ►  October 30 - November 6 (2)
    • ►  October 16 - October 23 (3)
    • ►  October 9 - October 16 (1)
    • ►  October 2 - October 9 (1)
    • ►  September 18 - September 25 (3)
    • ►  September 11 - September 18 (1)
    • ►  August 28 - September 4 (1)
    • ►  August 21 - August 28 (9)
    • ▼  June 19 - June 26 (30)
      • Tirumala Alipiri అలిపిరి మార్గం ❤💕
      • How to reach Tirumala by ✈️️🚂🚍🚘🚴👣🚶
      • Tirumala Srivari Vimana Pradakshinam - విమానప్రదక్...
      • Tallapaka Annamacharya | తాళ్ళపాక అన్నమాచార్య 💕🙏
      • Important Choultry Phone Numbers at Tirumala
      • Why Hathiramji Played LUDO with Sri Venkateshwara ...
      • How to send marriage invitation card to Tirumala? ...
      • How to Book Free Kalyana Vedika at Tirumala 👫💐 త...
      • Why Britishers Handover Tirumala Temple to Mahanth...
      • Srivari Kalyanam & Loan from Kuber
      • Tirumala Inside Temple Darshanam
      • Tirumala Sri Venkateshwara Swamy Moola Virat Darsh...
      • Tirumala Bangaru Vakili
      • Vimana Pradakshinam
      • Sri Padmavathi Srinivasa Parinayam Festival
      • Contribution of Bhagavad Ramanujacharya
      • Srivari Brahmotsavams
      • Vijayanagara Empire as Srivari Devotee
      • Srivari Varshikotsava / Annual Sevas
      • Tirumala Srivari Temple - A Religious & Spiritual ...
      • Tarigonda Vengamamba
      • Tirumala Paksha & Maasovastavam
      • Tirumala Sri Bhu Varaha Swamy Temple
      • Tirumala Srivari Devotee & History - Ananthalwar
      • Srivari Weekly Seva Varotsavalu - Volume 1
      • Srivari Weekly Seva Varotsavalu - Volume 2
      • Srivari Weekly Seva Varotsavalu - Volume 3
      • Srivari Bhakhagresarulu - Volume 3
      • Srivari Bhakhagresarulu - Volume 2
      • Srivari Bhakhagresarulu - Volume 1
    • ►  May 29 - June 5 (23)
    • ►  January 2 - January 9 (5)
  • ►  2021 (71)
    • ►  October 17 - October 24 (1)
    • ►  September 26 - October 3 (1)
    • ►  September 12 - September 19 (1)
    • ►  September 5 - September 12 (4)
    • ►  August 22 - August 29 (2)
    • ►  August 15 - August 22 (3)
    • ►  August 8 - August 15 (12)
    • ►  August 1 - August 8 (22)
    • ►  July 25 - August 1 (25)

Global Page Views

Article Categories

TirumalaHills (157) Seva (23) Festivals (19) TTD (14) Visiting Places (11) Astrology (8) Muhuratham (8) Video (8) YouTube (8) SVBC (3) Accommodation (2) Darshanam (2) Photos (1)

Write your queries / suggestions

Name

Email *

Message *

Translate

Popular Photos

  • image
    Tirumala Seva Details
  • image
    Tirumala Accommodation
  • image
    TTD Eco Friendly initiative to sell incense Agarbathi Sticks
  • image
    Matrusri Tarigonda Vengamamba | Tarigonda
  • image
    Tirumala Varaha Swamy Temple
  • image
    Vehicle Purchase dates with auspicious Muhurat timings
  • image
    How to Buy 2023 TTD Calendar Online - Buy Now!
  • image
    Auspicious Dates for Property Registration

Loading...

Play - Om Namo Venkatesaya

Facebook

ॐ TirumalaHills తిరుమలహిల్స్ तिरुमालाहिल्स ತಿರುಮಲಹಿಲ್ಸ್ திருமளாவுக்கு ॐ

Loading...

Search...

Powered by Blogger
All Right Reserved | Copyright © 2008-2021, TirumalaHills.org