శ్రీవారి బ్రహ్మోత్సవాలు - 7
*గజవాహనం 🐘*
బ్రహ్మోత్సవాల్లో ఆరవనాటి రాత్రి గజేంద్రమోక్ష ఘట్టానికి గుర్తుగా జరిగే "గజవాహనసేవ" లో మలయప్పస్వామివారు ఒక్కరే గజరాజుపై ఊరేగుతారు.
పూర్వకాలం నందు చతురంగబలాలలో గజబలం ఒకటి. "గజం" అంటే విశ్వాసానికి సంకేతం. రాజులకు పట్టాభిషేకం కావించేటప్పుడు వారిని గజాధిష్ఠితులుగా చేసి ఊరేగిస్తారు. ఓ విశిష్ట వ్యక్తిని ఘనంగా సత్కరించాలంటే, వారిని "గజారోహణ" చేయించే సాంప్రదాయం నేటికీ ఉంది.
పూర్వం రాజుల శక్తిసామర్థ్యాలను, సేనాపాటవాన్ని గజబలంతో సూచించేవారు. ఎన్ని ఎక్కువ ఏనుగులుంటే అంత ఎక్కువ సైన్యబలం ఉన్నట్లు లెక్క. ఏనుగు కుంభస్థలం లక్ష్మీనివాసంగా అభివర్ణింప బడుతుంది.
తిరుమల ఆలయ నిర్మాణంతో కూడా గజరాజులకు ప్రత్యక్ష సంబంధం ఉంది. ఆలయనిర్మాణం జరిగేటప్పుడు ఆలయమండప స్తంభాలను క్రిందనే చెక్కించి వందలాది ఏనుగుల ద్వారా కొండపైకి చేర్చేవారు. మైళ్ళదూరం పైకి ఎక్కుకుంటూ వెళ్ళి ఆలయకుడ్యాలకు వాడిన టన్నుల కొద్దీ బరువైన అత్యంత భారీ రాతి ఇటుకలనూ, పైకప్పుకు ఉపయోగించే రాతిపలకలనూ, శిల్పస్తంభాలనూ గజరాజులు భద్రంగా కొండపైకి చేర్చాయి. ఒక్క వేయికాళ్ళ మండపానికే "వేయి" స్తంభాలుండేవంటే, మొత్తం ఆలయనిర్మాణానికి ఎన్ని స్తంభాలను వినియోగించారో ఊహించుకోవచ్చు!
అంత శ్రమకోర్చి, శ్రీవారి ఆలయానికో రూపం ఇచ్చిన గజరాజుల ఋణం ఏమిచ్చి తీర్చుకోగలం?
అంతేకాదు. తిరుమలను దర్శించుకున్న వందలకొద్దీ రాజులనూ, వారి పరివారాలను ఏనుగు అంబారీలే సురక్షితంగా పైకి చేర్చేవి.
స్వామివారితో నిత్యం పాచికలాడే, వారి ప్రియభక్తుడైన "హాథీరాంబాబా" ను అప్పటి పాలకులు ఏవో నిందారోపణలపై ఖైదు చేయగా, శ్రీవారు ఏనుగు రూపంలో వచ్చి, రాత్రికి రాత్రే బండెడు చెరకుగడలను పిప్పి చేసి అతణ్ణి రక్షించి, ఆ పాలకులను కూడా పరమ భక్తులుగా మార్చిన చరిత్ర మనందరికీ చూచాయగా తెలుసు (వివరంగా మున్ముందు తెలుసుకుందాం). అందుకే ఆయన "హాథీ రాం" గా పిలువబడ్డాడు.
అంతటి ప్రశస్తిగాంచిన గజరాజుపై శ్రీనివాసుడు ఊరేగుతూ ఉంటే అత్యద్భుతమైన దృశ్యం ఆవిష్కరింప బడుతుంది. గజేంద్రమోక్షపురాణాన్ని అనుసరంచి ఒకనాడు జలక్రీడ లాడుతూ మొసలికి పట్టుబడ్డ గజేంద్రుడు దానితో చాలాకాలం పోరాడి, కడు దయనీయ స్థితిలో శ్రీ మహావిష్ణువును ఇలా ప్రార్ధించాడు -
*లావొక్కింతయు లేదు, ధైర్యము విలోలంబయ్యె, బ్రాణంబులున్*
*తావుల్ దప్పెను, మూర్ఛ వచ్చె దనువున్ డస్సెన్ శ్రమంబయ్యెడిన్*
*నీవే తప్ప నితఃపరం బెరుగ మన్నింపందగున్ దీనునిన్*
*రావే ఈశ్వర! కావవే వరద! సంరక్షించు భద్రాత్మకా!*
గజేంద్రుని ఆక్రందన విన్న, శ్రీమహావిష్ణువు, *"సిరికిన్ జెప్పకన్",* అంటే సమక్షంలోనే ఉన్న శ్రీమహాలక్ష్మికి సైతం చెప్పకుండా, హుటాహుటిన అలవైకుంఠపురం వీడి, మొసలిని సంహరించి, గజరాజును కాపాడాడు. భక్తులను కాపాడాలనే విష్ణుమూర్తి ఆతృత అలాంటిది మరి.
*సంసారం ఒక సరస్సు. మొసలి కర్మకు సంకేతం. ప్రతి భక్తుడు గజేంద్రుడు. సంసారసాగరంలో కొట్టుమిట్టాడుతూ, "కర్మ" అనబడే మొసలి కోరలకు చిక్కి శరణు వేడిన వారికి కర్మ బంధాలనుండి విముక్తుని ప్రసాదించేవాడు శ్రీవేంకటేశ్వరుడు. ఎంతటి బలం గల ఏనుగైనా మావటివాని అంకుశానికి ఏ విధంగా లొంగిపోతుందో, అదే విధంగా, మానవుడు ఎంతటి బలవత్తరమైన ప్రాపంచిక విషయాల్లో చిక్కుకున్నా, శ్రీవారు నైపుణ్యం కలిగిన మావటివానిలా ఆ భవబంధాలను తొలగించగలరు.*
గజరాజులు ప్రతిరోజు శ్రీవారి వాహన సేవల్లో వాహనం ముందు ప్రత్యక్షంగా పాల్గొంటూనే ఉంటాయి. తమ పూర్వీకుడైన గజేంద్రుణ్ణి రక్షించినందుకుగాను తమ కృతజ్ఞతను ప్రదర్శించే అవకాశం కోసం, "స్వామివారు తమపై ఎప్పుడెప్పుడు అధిరోహిస్తారా !" అని ఆ మత్తేభాలు ఆశగా ఎదురు చూస్తుంటాయి.
బ్రహ్మోత్సవాల్లో గజవాహనం నాడు గజరాజులకు ఈ పరమాద్భుతమైన అవకాశం లభిస్తుంది. తమ జాతిలో ఏ ఒక్క ఏనుగుకు ఆ అదృష్టం లభించినా జాతి మొత్తానికి సంతోషదాయకమే కదా! స్వామి శరణాగతవాత్సల్యానికి గజవాహనసేవ ఓ ప్రత్యక్ష తార్కాణం. భక్తితో ప్రార్ధిస్తే, గజేంద్రుణ్ణి రక్షించినట్లు మనని కూడా శ్రీవారు రక్షిస్తారని గజవాహనసేవ ద్వారా వ్యక్తం అవుతుంది.
తాళ్ళపాక అన్నమయ్య గజవాహనోత్సవ వైభవాన్ని ఇలా మనోహరంగా వర్ణించాడు -
*చొల్లపు జుట్టుతోడి చుంగుల రాజసముతో*
*వెల్లివిరిగా నేగి వెలదులు గొలువ*
*వీపు గుచాలు మోపి వెలది కౌగిలించగా*
*నేపున నేనుగు నెక్కి విదె దేవుడు*
*చేపట్టి యాపె చేతులు బిగె బట్టక*
*పైపై వీధుల వెంట బరువు దోలీని*
మూడు వాహనోత్సవాలతో అత్యంత ప్రత్యేకతను సంతరించుకున్న ఆరవరోజు బ్రహ్మోత్సవాలు ముగిశాయి. (మిగిలిన అన్ని రోజులూ రెండు వాహనసేవలు మాత్రమే జరుగుతాయి).
ఆరవరోజు ఉత్సవ కార్యక్రమం ఈ విధంగా ఉంటుంది
హనుమంత వాహనం: ఉ. 9-11 గం.
స్వర్ణరథోత్సవం : సా 4-6 గం.
గజవాహనం : రా. 8-10 గం.
[ రేపటి భాగంలో... *శ్రీవారి బ్రహ్మోత్సవాలలో - వాహనోత్సవ క్రమం* విశేషాలు మరిన్ని తెలుసుకుందాం]
*శ్రీనివాసుని శ్రీచరణాలను సేవిద్దాం, సకల శుభాలనూ పొందుదాం*
https://whatsapp.com/channel/0029VaAqKJvBPzjfTHD3nC0V
*ఓం నమోవేంకటేశాయ* 🙏🍁🙏
No comments :