*"వేంకటాద్రి సమస్థానం బ్రహ్మాండే నాస్తి కించన*
*వేంకటేశ నమో దేవో న భూతో న భవిష్యతి"*
*శ్రీవారి బ్రహ్మోత్సవాలు - 6*
*హనుమంత వాహనం*
బ్రహ్మోత్సవాలలో ఆరవనాటి ఉదయం వరదహస్తం దాల్చిన శ్రీవారు, హనుమంతుణ్ణి వాహనంగా చేసుకుని మాడవీధుల్లో ఊరేగుతూ, *"త్రేతాయుగం నాటి శ్రీరామచంద్రుణ్ణి నేనే"* అని ప్రకటిస్తున్నట్లు *వేంకటాద్రిరాముడి* గా దర్శనమిస్తారు.
*"కౌసల్యా సుప్రజా రామా పూర్వా సంధ్యా ప్రవర్తతే! ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవమాహ్నికమ్"* అంటూ, ప్రతిరోజు ఆ శ్రీరాముని పేరుతోనే మేలుకొలుపులు పాడించుకుంటున్న శ్రీనివాసుడు *"త్రేతాయుగంలోని శ్రీరాముణ్ణి నేనే"* అన్న విషయాన్ని భక్తజనులకు పదే పదే జ్ఞాపకం చేయడం కోసం, హనుమద్వాహనారూఢుడై వేంకటరామునిగా ఉత్సవ సేవలో పాల్గొంటారు.
హనుమ, భగవత్ భక్తులలో అగ్రగణ్యుడు. శ్రీమద్రామాయణంలో ఆంజనేయుని పాత్ర అద్వితీయమైనది. వేదవేదాంగ పారంగతునిగా, రావణదర్పదమనునిగా, భక్తాగ్రేసరునిగా వినుతికెక్కాడు.
కేసరి భార్య అంజనా దేవి వేంకటాద్రిలోని ఆకాశగంగ సమీపాన ఉన్న *"జాబాలి తీర్థం"* లో తపస్సు చేసింది. ఆ తపఃఫలితంగా ఆంజనేయుడు జన్మించాడు. అంజనాదేవి తపస్సు చేయడం వల్ల ఆ పర్వతం *"అంజనాద్రి"* గా వినుతికెక్కి సప్తగిరుల్లో ఒకటిగా భాసిల్లుతోంది. శ్రీవారి ఆలయానికి ఎదురుగా, శృంఖలాబద్ధుడైన *"బేడి ఆంజనేయస్వామి"* ఆలయాన్ని నేడూ చూసి తరించచ్చు. అంజనాదేవి పుత్రుడు అంజనాద్రీశునికి వాహనం అయినాడు.
ఆంజనేయుడు లేనిదే రామాయణం లేదు. శ్రీ రామునితో పాటుగా, రామపరివారమంతటికీ ఆంజనేయుడు ఎనలేని మేలు గావించాడు. లక్ష్మణునికి ప్రాణదాత. జానకీశోక వినాశకుడు. అతని చేతుల్లో రక్కసి మూకలు దోమల్లా నలిగిపోయారు. హనుమంతుడు లోకాల్లో రామరాజ్యస్థాపనకు దోహదపడ్డాడు. రామ-రావణ సంగ్రామంలో రావణుడు రథంపై నుండి యుద్ధం చేస్తుండగా, శ్రీరాముడు మాత్రం హనుమంతుని భుజస్కంధాల నధిరోహించి రావణుని పరిమార్చాడు.
భగవంతుని కంటే భగవన్నామస్మరణమే ముక్తిదాయకమని ఆంజనేయుడు చాటిచెప్పాడు. భారతదేశ నలుదిక్కులలో ఏ వూరు వెళ్ళినా, ఏ దిక్కు చూసినా హనుమంతుని చిన్నా, పెద్దా విగ్రహాలు లెక్కకు మిక్కిలిగా మనకు దర్శనమిస్తాయి. భారతదేశంలోని కోట్లాది కుటుంబాల్లో *"హనుమాన్ చాలీసా"* నేడు కూడా నిత్యం పఠిస్తారు.
దాస్యభక్తుల్లో మేటియైన హనుమంతుడు, వేదవేదాంగాలు, ఉపనిషత్తులు, అష్టాదశపురాణాలు క్షుణ్ణంగా తెలిసినవాడు. *హనుమంతుణ్ణి స్మరిస్తే బుద్ధి, బలం, యశస్సు, నిర్భయత్వం, ఆరోగ్యం, వాక్పటిమ సిద్ధిస్తాయి.* హనుమంతుడు తన భక్తులతో "మీకు కావలసిన భౌతిక, ఆధ్యాత్మిక, ధార్మిక ఫలాలన్నీ నేనే ఇస్తా. మోక్షం మాత్రం నాస్వామి రామయ్యను సేవించి పొందండి" అంటూ, తాను సర్వశక్తి సంపన్నుడైనప్పటికీ, "రాముడే దేముడు" అనే విషయాన్ని వినయంగా లోకానికి చాటిచెప్పాడు. తన బలాన్ని స్వయంగా తెలుసుకోలేనంత నిగర్వి, వినయశీలి హనుమంతుడు. జాంబవంతాదులు నుడివిన తరువాతనే ఆ వాయుపుత్రునికి తాను సాగరాన్ని లంఘించగలననే విషయం తేటతెల్లమైంది. మూర్ఛిల్లిన లక్ష్మణుడు తెప్పరిల్లగానే, యుద్ధపరిసమాప్తి కాకుండానే ఎంత వేగంతో సంజీవని పర్వతాన్ని తీసుకుని వచ్చాడో, అంతే వేగంగా దాన్ని యథాస్థానంలో చేర్చేశాడు. భావితరాల ఔషధావసరాల రీత్యా, ఆ పర్వతరాజాన్ని సత్వరమే స్వస్థలానికి జేర్చిన, అపారమైన దూరదృష్టి కలవాడు హనుమంతుడు. ఈనాడు మనం చెప్పుకునే *"పర్యావరణ సమతౌల్యత"* ఆవశ్యకతను ఆనాడే క్షుణ్ణంగా ఆకళింపు చేసుకొని, అమలు పరచిన దార్శినికుడు.
ఈనాటి వాహనమైన హనుమంత దర్శనంతో, ఇహలోక వాంఛలు సిద్ధించడమే కాకుండా, మోక్షం కూడా లభిస్తుంది. తాళ్ళపాక అన్నమయ్య హనుమంతుని సముద్రలంఘన, రావణవధ ఘట్టాల్ని ఇలా వర్ణించాడు -
*ఇతడే యతడు గాబోలేలిక బంటు నైరి*
*మితిలేని రాఘవుడు మేటి హనుమంతుడు*
*జలధి బంధించి దాటె హనుమంతుడు*
*అలరి వూరకే దాటె హనుమంతుడు*
*అలుకతో రావణుని దండించె నితడు*
*తలచి మైరావణుని దండించె నితడు*
హనుమద్వాహన విధమైన క్షణంతో ప్రతి భక్తుడు ఆంజనేయునిలా నిష్కళంక హృదయం, నిస్వార్థ సేవాతత్పరత, ప్రభుభక్తి పరాయణత్వం, సచ్ఛీలత, భావితరాల సంక్షేమం పట్ల నిబద్ధత వంటి సద్గుణసంపద కలిగి, స్వామికృపకు సదా పాత్రులవుతారు.
*స్వర్ణ రథోత్సవం*
ఆరవరోజు సాయంసంధ్యా సమయంలో అస్తమిస్తున్న సూర్యుని కిరణాలు ప్రసరిస్తుండగా, దివ్యకాంతులీనుతున్న స్వర్ణరథంలో ఇరువురు దేవేరులతో కలిసి మలయప్పస్వామి వారు మాడవీధుల్లో విహరిస్తూ భక్తులకు నేత్రానందం కలిగిస్తారు. పోయిన బ్రహ్మోత్సవాల్లో తన ప్రియభక్తుడు వాయిపుత్రునిపై, ధనుర్బాణాలు ధరించి, అయోధ్యాదీశునిగా, కటి-వరద హస్తాలతో, కలియుగ దైవంగా స్వామి దర్శనమిచ్చారు.
బ్రహ్మదేవుని శూన్యరథం, గజ-అశ్వ-వృషభాదులు యధావిధిగా స్వర్ణరథోత్సవంలో కూడా పాల్గొంటాయి. దాసభక్తులనృత్యాలతో, భజనబృందాల కోలాహలంతో మాడవీధులు కడురమణీయతను సంతరించుకుంటాయి.
స్వర్ణం అంటే, "మిక్కిలి ప్రకాశించేది" అని వ్యుత్పత్తి. బంగారం మహా శక్తివంతమైన లోహం. ఈలోహం శరీరాన్ని తాకుతుంటే దేహంలో రక్తప్రసరణ చక్కగా జరుగుతుంది. అనేకానేక ఔషధోత్పత్తుల్లో స్వర్ణం వినియోగించ బడుతుంది. ఆర్థిక ఇబ్బందుల్ని అధిగమించడంలో యుగయుగాల నుంచి ఈనాటివరకూ, స్వర్ణం పాత్ర వెలకట్టలేనిది. బంగారాన్ని తాకట్టు పెట్టో లేదా తెగనమ్మో, కష్టాల కడలి నుండి గట్టెక్కడం సత్యహరిశ్చంద్రునికాలం నుండి, ఆధునిక జగత్తులో కూడా మనం చూస్తూనే ఉన్నాం. వర్తక, వాణిజ్య, వినిమయాలకు సువర్ణ నాణాలను వినియోగించే సాంప్రదాయం, కలియుగారంభం నుండి, ఈ మధ్యకాలం వరకూ ఉండేది. పద్మావతీ పరిణయం సందర్భంగా శ్రీనివాసుడు కుబేరుణ్ణించి అప్పుగా తీసుకుంది సువర్ణముద్రికలే!
స్వర్ణం లభ్యమయ్యేది భూమి నుంచే! భూదేవి సాక్షాత్తు శ్రీవారిలో భాగం. శ్రీవారి ఇల్లు బంగారం. ఆనందనిలయ గోపురం బంగారుమయం. ధ్వజస్తంభం బంగారు తాపడం చేయబడింది. ఇంటిలోని పాత్రలు బంగారువి. సింహాసనం బంగారుది. ధరించేది మేలిమి బంగారు నగలు. రాజాధిరాజుల నుండి సామాన్యుల వరకూ భక్తులందరూ స్వామివారికి హుండీలో సమర్పించుకునేది కనకమే!
సకల సంపదలకు, ధనకనకాదులకు ఆధిపత్యం వహించేది శ్రీదేవిగా పిలువబడే లక్ష్మీదేవి. ఆమె కూడా శ్రీవారిలో భాగమే. బంగారంతో ఇంత ప్రగాఢమైన అనుబంధం కలిగిన శ్రీవారు ఇరువురు దేవేరులతో కలసి స్వర్ణరథంలో ఊరేగుతుండగా చూచి తరించటం ఓ అలౌకిక, ఆధ్యాత్మికానుభూతి.
దేవేరులతో స్వామివారు స్వర్ణరథంపై ఊరేగే ఈ స్వర్ణరథోత్సవం శ్రీవారి మహోన్నతిని, సార్వభౌమత్వాన్ని, శ్రీపతిత్వాన్ని, భూదేవీనాథత్వాన్ని సూచిస్తుంది.
https://whatsapp.com/channel/0029VaAqKJvBPzjfTHD3nC0V
స్వర్ణరథోత్సవంలో, కళ్యాణకట్ట సంఘంవారు సమర్పించిన బంగారు గొడుగును రథంపై అలంకరిస్తారు. కేవలం మహిళా భక్తులు మాత్రమే తేరును లాగటం ఈ స్వర్ణరథోత్సవ ప్రత్యేకత.
ఈ రథోత్సవాన్ని *"సువర్ణరంగ డోలోత్సవం"* అని కూడా వ్యవహరిస్తారు. ఉయ్యాలసేవ ఈ రథోత్సవంలో అంతర్భాగం కావడం వల్ల, బ్రహ్మోత్సవాల్లో ప్రతిరోజు సాయంత్రం జరిగే ఉయ్యాల సేవ స్వర్ణరథవాహనం నాడు జరగదు.
స్వర్ణరథోత్సవ దర్శనం ద్వారా శ్రీదేవి కరుణతో సమస్త భోగభాగ్యాలు, అప్లైశ్వర్యాలు; భూదేవి కరుణతో భూసంపద, కనక, మణిమయాదులు, నవరత్నాలు, ధాన్యసంపద, పశుసంపద; శ్రీవారి కరుణతో సర్వ సుఖాలూ, శుభాలు చేకూరుతాయి.
[ రేపటి భాగంలో... *శ్రీవారి బ్రహ్మోత్సవాలలో - వాహనోత్సవ క్రమం* విశేషాలు మరిన్ని తెలుసుకుందాం]
*శ్రీనివాసుని శ్రీచరణాలను సేవిద్దాం, సకల శుభాలనూ పొందుదాం*
*ఓం నమోవేంకటేశాయ*
No comments :