🙏 శ్రీ వేంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవం 🙏
☘️ కోయిల్ ఆళ్వారు తిరుమంజనం ☘️
🍃🌹 అర్థం మరియు ప్రాముఖ్యత
బ్రహ్మోత్సవ పండుగలు ప్రారంభానికి ముందు శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయాన్ని శుద్ధి చేసే పవిత్ర కార్యక్రమాన్ని “కోయిల్ ఆళ్వారు తిరుమంజనం” అంటారు.
• కోయిల్ అంటే దేవాలయం, ఆళ్వారు అంటే భక్తుడు.
• భక్తుని హృదయంలో భగవంతుడు ఉండినట్లే, దేవుడు దేవాలయంలోని గర్భగృహంలో నివసిస్తాడనే భావనతో ఈ శుద్ధి నిర్వహిస్తారు.
• ఆలయం ఒక జీవంతమైన భక్తునిలా గౌరవింపబడుతుంది.
🍃🌹 ఎప్పుడు జరుపుతారు?
• వార్షిక బ్రహ్మోత్సవాల ప్రారంభానికి ముందు మంగళవారం.
• సంవత్సరంలో నాలుగు సార్లు:
1. బ్రహ్మోత్సవాలకు ముందు
2. ఉగాది పండుగకు ముందు
3. ఆణివారి ఆస్థానం ముందు
4. వైకుంఠ ఏకాదశి పండుగ ముందు
🍃🌹 శుద్ధి విధానం
• గర్భగృహ గోడలు, పైకప్పులు, దీపాల మసి, ధూళి, బూజు అన్నీ శుభ్రం చేస్తారు.
• తర్వాత సుగంధద్రవ్యాలతో తయారైన లేహ్యం (పరిమళం) గోడలకు, పైకప్పులకు పూస్తారు.
• పంచపాత్రలు, తీర్థపాత్రలు, దీపాలు మొదలైన వాటిని బంగారు బావి వద్ద శుభ్రం చేస్తారు.
• వాకిళ్లు, వాహనాలు, పరివారదేవతాల ఆలయాలు అన్నీ శుద్ధి చేస్తారు.
🍃🌹 మలైగుడారం
• స్వామివారి మూలమూర్తిపై దుమ్ము పడకుండా ఒక వస్త్రం తొడుగుతారు. దీనినే మలైగుడారం అంటారు.
• ఉత్సవ విగ్రహాలు, సాలగ్రామాలు ఘంటామండపానికి తరలించి ప్రత్యేక తిరుమంజనం చేస్తారు.
🍃🌹 ముగింపు క్రమం
• కొత్త తెరలు కడతారు.
• మలైగుడారం తొలగించి స్వామివారికి కర్పూరహారతి చేస్తారు.
• భక్తులు స్వామిని దర్శించి హారతి స్వీకరిస్తారు.
🍃🌹 ఆలయ సింగారం
• విద్యుద్దీపాలతో, పూలతోరణాలతో, అరటి స్తంభాలతో, మామిడి ఆకులతో ఆలయాన్ని వైభవంగా అలంకరిస్తారు.
• అర్చకులు, ఉద్యోగులు, భక్తులు అందరూ బ్రహ్మోత్సవాల కోసం సిద్ధమవుతారు.
✨ ఇలా బ్రహ్మోత్సవాల ఆరంభానికి ముందుగా కోయిల్ ఆళ్వారు తిరుమంజనం అనే పవిత్ర శుద్ధి కార్యక్రమం పూర్తవుతుంది. ✨
తిరుమలలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం ఎప్పుడు?
ఎందుకలా చేస్తారు?
తిరుమల శ్రీవారి సన్నిధిలో ఏడాదికి నాలుగు సార్లు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం సేవ అనాదిగా వస్తున్న సంప్రదాయం. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాసుడు వెలసిన తిరుమల కొండ భువిపై వైకుంఠం. శ్రీవారి ఆలయంలో జరిగే ప్రతి ఉత్సవం, ప్రతి పూజా విశేషమైనవే! నిత్యోత్సవాలు, పక్షోత్సవాలు, మాసోత్సవాలు, సంవత్సరోత్సవాలు, బ్రహ్మోత్సవాల పేరుతో ఏడాది మొత్తం శ్రీవారి ఆలయం నిత్య కళ్యాణం, పచ్చ తోరణంగా అలరారుతోంది. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 16వ తేదీ, మంగళవారం శ్రీవారి సన్నిధిలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జరుగనుంది. శ్రీవారికి జరిగే సేవలలో అతి ప్రధానమైన కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం. తిరుమల శ్రీవారి సన్నిధిలో ఏడాదికి నాలుగు సార్లు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం సేవ జరుగుతుంది. ఉగాది, వార్షిక బ్రహ్మోత్సవాలు, వైకుంఠ ఏకాదశి, ఆణివార ఆస్థానం ఉత్సవాలకు ముందుగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం సేవను నిర్వహించడం అనాదిగా వస్తున్న సంప్రదాయం.
కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం అంటే...?
తిరుమల శ్రీవేంకటేశ్వరుడికి ఏటా 450కిపైగా ఉత్సవాలు, సేవలు నిర్వహిస్తుంటారు. అందులో అత్యంత పవిత్ర కైంకర్యమే కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం. కోయిల్ ఆళ్వారు తిరుమంజనం అంటే తమిళంలో కోయిల్ అంటే కోవెల అని, ఆళ్వారు అంటే భక్తుడు అని అర్థం. భక్తుని హృదయ స్థానంలో భగవంతుడు ఉన్నట్టే కోవెలలో భగవంతుడు కొలువై ఉంటాడు. పవిత్ర గర్భాలయ స్థానాన్ని సంప్రదాయ, వైఖానస ఆగమోక్తంగా శుద్ధి చేసే కైంకర్యమే కోయిల్ ఆళ్వారు తిరుమంజనం. 15 వ శతాబ్దం నుంచి బ్రహ్మోత్సవానికి ముందు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించేవారని శాసనాల ద్వారా తెలుస్తోంది.
కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం ఎలా చేస్తారు...?
కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం పేరుతో శ్రీవారి ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. తిరుమల గర్భాలయంలో స్వయంవ్యక్త సాలిగ్రామ శిలామూర్తిగా శ్రీవారు వెలసిన ఆనంద నిలయం నుంచి ఆలయ మహాద్వారం వరకు శుద్ధిచేయటమే ఈ కార్యక్రమం ముఖ్యోద్దేశ్యం. శుద్ధి కార్యక్రమం సందర్భంగా దుమ్మూధూళి పడకుండా స్వామి శిరస్సు నుంచి పాదాల వరకు ధవళవర్ణ వస్త్రాన్ని కప్పుతారు. దీన్నే మలైగుడారం అంటారు. స్వామి అంశగా భావించే భోగ శ్రీనివాసమూర్తి విగ్రహాన్ని కూడా మలైగుడారం లోపలే ఉంచుతారు.
మహా యజ్ఞం తిరుమంజనం...
స్వామివారి సన్నిధిలో కొలువైన అనంత, గరుడ, విష్వక్సేన, సుగ్రీవ, హనుమంత, అంగద. పరివార దేవతా మూర్తులను ఘంటా మండపం గరుడాళ్వార్ సన్నిధికి తరలిస్తారు. చుట్టూ తెరలు కట్టి ఈ మూర్తులకు ఏకాంతంగా తిరుమంజనం పూర్తిచేసి పట్టువస్త్రాలతో అలంకరిస్తారు. అనంతరం గర్భాలయంలో అర్చకులు, పరిచారకులు, ఏకాంగులు మాత్రమే ప్రవేశించి నాలుగు గోడలు, పైకప్పునకు అంటుకున్న బూజు, కర్పూరమసిని తొలగించి, శుద్ధిచేస్తారు.
ఆలయ ప్రాకారాలకు లేపనం...
నామంకోపు సుద్దపొడి, శ్రీచూర్ణం, ముద్దకర్పూరం, గంధంపొడి, కుంకుమ, కిచిలిగడ్డ వంటి ఔషధ పదార్థాలతో లేహ్యంను తిరుమంజనానికి ముందురోజే భారీ గంగాళాల్లో సిద్ధం చేస్తారు. ఈ లేహ్యాన్ని శుద్ధి చేసిన ప్రాకారాలకు లేపనం చేస్తారు. తరువాత పవిత్ర పరిమళ జలాన్ని ఆలయమంతటా ప్రోక్షణం చేస్తారు. దీనివల్ల ప్రాకారాలు సుగంధ పరిమళాలు వెదజల్లటంతో ప్రాకారం పటిష్టతకు దోహద పడతాయని ఆగమశాస్త్ర పండితులు చెబుతారు.
అంతా ప్రత్యేకం...!
పరిమళ ద్రవ్యాలతో ఆలయ శుద్ధి కార్యక్రమం పూర్తైన తర్వాత స్వామివారి మూలవిరాట్టుకు కప్పిన వస్త్రాన్ని తొలగించి ప్రత్యేక పూజ, నైవేద్యం కార్యక్రమాలను అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు. ఈ కైంకర్యానికి సాధారణ భక్తులకు ప్రవేశం ఉండదు. ఆలయ అర్చకులు, అధికారులు మాత్రమే ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.
సాధారణంగా సంవత్సరంలో నాలుగుసార్లు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీ. ఉగాది, ఆణివార ఆస్థానం, బ్రహ్మోత్సవం, వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందుగా వచ్చే మంగళవారం రోజు మాత్రమే ఈ ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. సెప్టెంబర్ అంకురార్పణతో శ్రీవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్న సందర్భంగా 16 వ తేదీ కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం కార్యక్రమం జరుగనుంది. ప్రసార మాధ్యమాల ద్వారా ప్రత్యక్ష ప్రసారం కానున్న ఈ కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం కార్యక్రమాన్ని మనం కూడా వీక్షించి ధన్యులమవుదాం!
ఓం నమో వేంకటేశాయ...🙏
🙏🏻🙏🏻🙏🏻🔔🔔🔔🙏🏻🙏🏻🙏🏻
No comments :