♾️•••┉┅━❀꧁🔯꧂❀┉┅━•••♾️
🙏 *ఓం నమో వేంకటేశాయ*🙏
*శ్రీవారి సేవలు-2*
✍️ శ్రీమతి&శ్రీ పల్లపోతు వాణిశ్రీ-కృష్ణబాలాజీ
♾️•••┉┅━❀꧁🔯꧂❀┉┅━•••♾️
🙏 *శ్రీవారి సేవలు-2* 🙏
🙏 *విశ్వరూప దర్శనం* 🌈
💫 శ్రీవారి పాదాలపై బంగారు తొడుగులు, తులసి, పుష్పాల వంటివి లేకుండా, స్వామివారి దివ్యమంగళరూపం ఆపాదమస్తకం కనిపించే ఈ దర్శనాన్ని "విశ్వరూపదర్శనం" అంటారు. ఇలా ఎందుకన్నారంటే.....
💫 రాత్రి ఏకాంతసేవకు ముందు చిన్న గంధం ముద్ద భోగశ్రీనివాసుని వక్షఃస్థలంలోనూ, మరో కొంచెం గంధం మూలమూర్తి పైనున్న అమ్మవారి వద్ద ఉంచుతారు. ఇతర పూజాద్రవ్యాలు వేరొక పళ్ళెంలోను, ఐదు బంగారు పాత్రలలో శుద్ధమైన నీరు కూడా ఉంచుతారు. అంతే గాకుండా, స్వామివారి పాదాలకున్న బంగారు తొడుగులు తీసి, రెండు పాదాలపై రెండు గంధం ముద్దలు ఉంచి వాటిపై చిన్న వస్త్రం కప్పుతారు.
💫 బ్రహ్మాది దేవతలు నిశిరాత్రి (రాత్రి ఏకాంతసేవకు మరియు మరునాటి వేకువఝామున జరిగే సుప్రభాతసేవకు మధ్య) సమయంలో విచ్చేసి శుధ్ధోదకం, చందనం, ఇతర పూజాద్రవ్యాలతో స్వామివారిని అర్చించుకోవడం కోసం ఈ ఏర్పాటు. ఇదివరలో ఈ గంధాన్ని, తీర్థాన్ని సుప్రభాత సేవకు విచ్చేసిన భక్తులకు ఇచ్చి, పాదవస్త్రాలను కళ్ళకద్దుకోనిచ్చేవారు. ఇప్పుడు మాత్రం చందన, తీర్థాలను మొదటగా అర్చకస్వాములు స్వీకరించి, తరువాత జియ్యంగారికి, ఏకాంగికి, సన్నిధిగొల్లకు అందజేస్తారు. సన్నిధి గొల్లకు వీటితో పాటుగా నివేదన పళ్ళెంలోని తాంబూలాన్ని కూడా ఇస్తారు. నిశిరాత్రి సమయంలో బ్రహ్మచే పూజించబడిన స్వామివారి "విశ్వరూపాన్ని" యథాతథంగా, మరునాడు ఉదయం సుప్రభాత సేవకు విచ్చేసిన భక్తులు దర్శించుకుంటారు కావున ఈ దర్శనాన్ని "విశ్వరూపదర్శనం" గా పిలుస్తారు.
♾️┉┅━❀🕉️❀┉┅━♾️
🙏 *నవనీతహారతి* 🌈
💫 అప్పుడే తీసిన వెన్న, ఆవుపాలను నివేదించి ఇచ్చే హారతి గావున, సుప్రభాత సేవలో స్వామివారికిచ్చే తొలిహారతిని "నవనీతహారతి" గా వర్ణిస్తారు. స్వామివారికిచ్చే అనేక రకాలైన హారతుల గురించి మరోసారి తెలుసుకుందాం.
💫 అనంతరం జియ్యంగార్, ఏకాంగి, సన్నిధి గొల్ల బంగారువాకిలి వెలుపలికి వస్తారు. దేవస్థానం పరిచారకులు లోనికి వెళ్ళి శ్రీవారి పాన్పునూ, మంచాన్నీ తీసి ఆనందనిలయానికి ఉత్తరంగా ఉన్న "సబేరా" అనబడే గదిలో ఉంచుతారు.
💫 సుప్రభాతం పఠించిన వేదపండితులు, అన్నమయ్య వంశీయులు, మహంతు, మైసూరు సంస్థానంవారు స్వామి వారి సన్నిధికి వెళ్ళి హారతి, తీర్థం, శఠారి, చందనం, వెన్న, ఇతర మర్యాదలు పొందుతారు. తదుపరి స్వామివారి సుప్రభాతసేవకై వేచివున్న భక్తులు వరుస క్రమంలో స్వామివారిని దర్శించుకుని, అనంతరం ఆనందనిలయానికి దక్షిణం వైపునున్న ఓ ఎత్తైన అరుగుపైన, అంకురార్పణ మండపం నందు తీర్థం, శఠారులను స్వీకరించి ధన్యులవుతారు.
💫 నిత్యం శ్రీవారికి జరిగే అనేక సేవల్లో తొలిసేవ కావటం, బంగారువాకిలిని తెరిచే ఆసక్తికరమైన సాంప్రదాయాన్ని కళ్ళారా వీక్షించగలగటం, బంగారువాకిలి ముందు దాదాపు ముప్ఫై నిముషాలు నిలబడి, వీనులవిందైన సుప్రభాతగానాన్ని వేదపండితుల ద్వారా వినగలగటం; అప్పుడే వెలిగించిన ఆవునెయ్యి దీపాలకాంతిలో స్వామివారి దివ్యమంగళ "విశ్వరూపాన్ని" కన్నులారా దర్శించ గలగటం వంటి కారణల వల్ల సుప్రభాత సేవంటే భక్తులకు ఎంతో ప్రీతిపాత్రమైనది.
🙏 *తాత్కాలిక అడ్డంకులన్నీ తొలగి, ఈ సేవాదర్శనభాగ్యం మీకు అతి త్వరలోనే కలగాలని ఆ దేవదేవుణ్ణి కోరుకుంటున్నాం.* 🙏
♾┉┅━❀🕉️❀┉┅━♾
🙏 *తిరుప్పావై పఠనం* 🌈
💫 సంవత్సరంలో పదకొండు మాసాల పాటు స్వామివారిని మేలుకొలిపే సుప్రభాతపఠనం, ధనుర్మాసంలో మాత్రం జరుగదు. ఆ మాసంలో సుప్రభాతానికి బదులుగా, "తిరుప్పావై" పఠిస్తారు. పన్నెండుగురు ఆళ్వార్లు రచించిన "దివ్యప్రబంధం" లోని ముప్ఫై పాశురాల మాలికను "తిరుప్పావై" గా పిలుస్తారు. "ఆండాళ్ అమ్మవారి" గా కొలువబడే గోదాదేవి, శ్రీరంగనాథుణ్ణి భర్తగా పొందటం కోసం చెలులతో కలిసి, ముప్ఫైరోజుల పాటు కఠిన వ్రతమాచరిస్తూ, "తిరుప్పావై' గానం చేసినట్లు ప్రతీతి.
💫 మూడు వైష్ణవదివ్యక్షేత్రాలలో ఒకటైన (శ్రీరంగం, కంచి మిగిలిన రెండు క్షేత్రాలు) తిరుమల, "పుష్పమంటపం" గా పేర్గాంచింది. పుష్పప్రియులైన స్వామివారి నిత్యకైంకర్యాలలో, ఉత్సవాలలో, అలంకరణలో పుష్పాల్ని విరివిగా వినియోగిస్తారు.
💫 సుప్రభాత సేవానంతరం, పుష్పాలే ప్రధానంగా శ్రీవారికి నిత్యం జరిగే "తోమాలసేవ" ను మంగళ, బుధ, గురువారాల్లో మాత్రమే భక్తులు దర్శించ గలరు. ఆ మూడు రోజులు ఇది అర్జిత సేవగా పరిగణించ బడుతుంది. మిగిలిన నాలుగు రోజులు ఈ సేవ ఏకాంతంగా జరుగుతుంది. అయితే, శుక్రవారం మాత్రం సుప్రభాత సేవానంతరం అభిషేకం, తదనంతరం తోమాలసేవ జరుగుతాయి.
♾┉┅━❀🕉️❀┉┅━♾
🙏 *తోమాలసేవ* 🙏
💫 *తోమాలసేవ అంటే?*
💫 తోమాలసేవ - భోగశ్రీనివాసునికి జరిగే అభిషేకం.
💫 శ్రీనివివాసుని దివ్యమంగళమూర్తికి అనేక పుష్పమాలలతో, తులసిమాలలతో, అనునిత్యం చేసే సేవాకైంకర్యమే "తోమాలసేవ". ఈ సేవకు "తోమాలసేవ" అనే పేరు రావడం వెనుక అనేక కథనాలున్నాయి.
🍁 తమిళంలో 'తోడుత్తమాలై' అంటే నారతో కట్టిన మాల అని అర్థం. కాలక్రమంలో అదే 'తోమాల' గా మారి ఉండవచ్చు.
🍁 'తోల్' అంటే భుజం అని అర్థం. భుజం నుంచి వ్రేలాడే మాలలు గనుక 'తోమాలలు' అని అంటారు.
🍁 'తోమాల' అంటే చేతితో కట్టిన పూలదండ అని మరియొక అర్థం కూడా ఉంది.
🍁 అంతే కాకుండా, తోమాల అంటే తోటలో నుండి తెచ్చిన పూమాలలు లేదా తులసిమాలలు అనే అర్థం కూడా ఉంది.
💫 దాదాపుగా పైన చెప్పిన అర్థాలన్నీ ఈ సేవకు వర్తిస్తాయి.
💫 ముందురోజు రాత్రే ఆయా కాలాల్లో లభించే అనేక రకాల, రంగురంగుల, పరిమళ పుష్పాలతో తయారు చేయబడిన పుష్పమాలికలను, విమాన ప్రదక్షిణం లోని యోగానరసింహస్వామి ఆలయం ప్రక్కనవున్న శీతల పుష్పఅర లో సిద్ధం చేస్తారు.
♾┉┅━❀🕉️❀┉┅━♾
🙏 *అభిషేకనిమిత్తం ఆకాశగంగ తీర్థం* 🙏
💫 మూలవిరాట్టుకు నవనీతహారతిని సమర్పించగానే భోగశ్రీనివాసునుకి జరిగే అభిషేకంతో "తోమాలసేవ" ప్రారంభమవుతుంది. ఈ అభిషేకానికి - పూర్వం శ్రీవారి నిత్యాభిషేక కైంకర్యంలో తరించిన మహాభక్తుడు తిరుమలనంబి వంశీయులు (వీరిని "తోళప్పాచార్యులు" గా పిలుస్తారు), దేవాలయానికి దాదాపు మైలున్నర దూరాన ఉన్న ఆకాశగంగ తీర్థాన్ని వెండి బిందెలతో, ఛత్రచామర మంగళవాద్య మర్యాదలతో, తెల్లవారకముందే తీసుకుని వచ్చేవారు. నడిరేయి చిమ్మచీకట్లలో, రక్షకభటులు వెంటరాగా, అరణ్యమార్గంలో, కాలినడకన, తరతరాలుగా ఈ అభిషేకజలాన్ని భుజాలపై మోసుకుంటూ తెస్తున్న తిరుమలనంబి వంశీయులు ధన్యజీవులు. అయితే ఈ మధ్యకాలంలో, ఆకాశగంగ నుండి అభిషేకజలాన్ని తెచ్చే లాంఛనం కేవలం శుక్రవారం నాడు మూలమూర్తికి జరిపించే శుక్రవారాభిషేకానికి మాత్రమే పరిమితం చేశారు.
💫 ఈ తీర్థాన్ని తెచ్చి, ఆలయానికి ప్రదక్షిణ చేసి, ఆ బిందెలను సన్నిధిలో ఉంచేవారు.
♾┉┅━❀🕉️❀┉┅━♾
🙏 *భోగశ్రీనివాసునికి అభిషేకం* 🙏
💫 అనంతరం అర్చకస్వాములు శ్రీవారికి నమస్కరించి, సుప్రభాతసేవలో మేల్కొలపబడిన భోగశ్రీనివాసుణ్ణి వెండి స్నానపీఠంపై వేంచేపు చేయిస్తారు. ఆర్ఘ్య, పాద్య, ఆచమన, అనుష్ఠాన, ఉపచారాలు చేసిన తరువాత, బంగారుబావిలో నిలువ ఉంచబడిన ఆకాశగంగ తీర్థంతో భోగశ్రీనివాసునుకి అభిషేకం చేస్తారు.
💫 తరువాత శ్రీవేంకటేశ్వరస్వామి (మూలవిరాట్టు) వారి నిజపాదాలపై ఉన్న బంగారు తొడుగులకు కూడా అభిషేకం చేస్తారు. వేదపండితులు పురుషసూక్తం పఠిస్తూండగా, అర్చకులు శ్రీవారి సన్నిధిలోని నృసింహ, శ్రీరామ సాలగ్రామాలకు కూడా అభిషేకం చేస్తారు. అనంతరం మూలమూర్తికీ, వక్షస్థలలక్ష్మికీ, శ్రీదేవీ-భూదేవి సహిత మలయప్పస్వామికీ, ఉగ్రశ్రీనివాసునికీ, ఇలా సన్నిధిలో వున్న పంచబేరాలకు, అభిషేకం చేయించినట్లుగా ఆకాశగంగ తీర్థంతో సంప్రోక్షిస్తారు.
💫 అయితే రోహిణీనక్షత్రం నాడు మాత్రం సన్నిధిలోనే వున్న రుక్మిణీ శ్రీకృష్ణులకు కూడా తిరుమంజనం (అభిషేకం) నిర్వహిస్తారు. అలాగే, పునర్వసు నక్షత్రం నాడు సీతారామలక్ష్మణులకూ, శ్రీవారి జన్మనక్షత్రమైన శ్రవణానక్షత్రం నాడు శ్రీదేవీ-భూదేవి సహిత మలయప్పస్వామికీ కూడా అభిషేకం జరుగుతుంది.
💫 అభిషేకానంతరం భోగశ్రీనివాసునికి వస్త్రాలంకరణ, తిలకధారణ చేసి; మిగిలిన ఉత్సవమూర్తులకు షోడశోపచారాలు సమర్పిస్తూండగా జీయ్యరు గార్లు, వైష్ణవస్వాములు దివ్యప్రబంధంలోని ఆళ్వార్లు గానం చేసిన 'తిరుప్పళ్ళి ఎళుచ్చి' అనే అరువది పాశురాలను పారాయణం చేస్తారు.
♾┉┅━❀🕉️❀┉┅━♾
🙏 *శ్రీవారికి పుష్పాలంకరణ* 💐
💫 ఉత్సవమూర్తు లందరికీ అభిషేకాదులు జరిగిన వెనువెంటనే, జియ్యంగారు పూలమాలలు ఉన్నట్టి వెదురుగంపను తలపై పెట్టుకుని, ఛత్రచామర మర్యాదలతో, పలక గంట-సన్నడోలు మ్రోగుతుండగా, సన్నిధి గొల్ల దివిటీతో దారి చూపుతుండగా, పుష్పఅర నుండి బయలుదేరి ధ్వజస్తంభానికి ప్రదక్షిణ చేసి, వెండివాకిలి ద్వారా లోనికి వచ్చి, విమాన ప్రదక్షిణ చేసి, బంగారు వాకిలి ద్వారా, శ్రీవారి సన్నిధిలో ఉన్న అర్చకులకు అందజేస్తారు.
💫 అర్చకస్వాములు ఈ మాలలను స్వీకరించి, నీళ్లతో శుద్ధి పరుస్తారు. ఆ మాలలతో ముందుగా భోగశ్రీనివాసుణ్ణి అలంకరించి, ఆ తరువాత మూలమూర్తికి కంఠంలోనూ, హృదయం పైనా పుష్పమాలు వేసి, శంఖుచక్రాలను, కిరీటాన్ని, నందకఖడ్గాన్ని అలంకరిస్తారు.
💫 ఆ తరువాత భుజాలమీదుగా నాభి వరకు, నడుమువరకు, ఊరువుల వరకు, మోకాళ్ళవరకు, పాదాల వరకు వ్రేలాడునట్లుగా పొడవైన పూలదండలను అలంకరిస్తారు. ఈ పుష్పాలంకరణం శ్రీవారి పాదాలతో మొదలవుతుంది.
💫 అమలులో ఉన్న ఆచారం ప్రకారం, శ్రీవారికి శిఖామణిని అలంకరించేటప్పుడు, తెరవేసి మరలా తీస్తారు.
♾┉┅━❀🕉️❀┉┅━♾
🙏 *మాలలకు పేర్లు* 💐
💫 ఆపాదమస్తకం అలంకరింపబడే ఈ పుష్పమాలలకు కొన్ని స్థిరమైన పేర్లు ఉండటం విశేషం -
⛩️ శ్రీవారి పాదాలపై అలంకరించే ఒక్కక్క మూర గల రెండు పుష్పమాలలను - *తిరువడి దండలు* అంటారు.
⛩️ శ్రీవారి కిరీటం మీదుగా రెండు భుజాలవరకు అలంకరింపబడే 8 మూరల పుష్పమాలను - *శిఖామణి* అంటారు.
⛩️ శ్రీవారి భుజాలనుండి ఇరువైపులా పాదాలవరకు వ్రేలాడునట్లుగా అలంకరించే పొడవాటి మాలను - *సాలగ్రామమాల* అంటారు.
⛩️ శ్రీవారి మెడలో రెండు వరుసలుగా భుజాలమీదికి అలంకరించబడే మూడున్నర మూరల పుష్పహారాన్ని - *కంఠసరి* అంటారు.
⛩️ శ్రీవారి వక్షస్థలంలో ఉన్న శ్రీదేవి భూదేవిలకు ఒకటిన్నర మూరల పొడవుండే రెండు పుష్పమాలికలను - *వక్షస్థలమాలలు* లేదా *వక్షఃస్థల తాయార్ల సరాలు* అంటారు.
⛩️ ఒక్కొక్కటి ఒక్కొక్క మూర ఉన్న రెండు దండలను శంఖుచక్రాలకు అలంకరిస్తారు. వీటిని - *శంఖుమాల, చక్రమాల* అంటారు.
⛩️ శ్రీవారి నందకఖడ్గానికి అలంకరించే రెండు మూరల పుష్పమాలికను - *కఠారిసరం* అంటారు.
⛩️ రెండు మోచేతుల క్రింద నుండి పాదాలవరకు వ్రేలాడదీసే రెండు పుష్పమాలలను - *తావళములు* అంటారు. వీటిలో ఒకటి 40 అంగుళాలు మరియొకటి 50 అంగుళాల పొడవు ఉంటాయి. వీటిని శ్రీవారికి ఇంగ్లీషు అక్షరం U ఆకారంలో ధరింపజేస్తారు.
♾┉┅━❀🕉️❀┉┅━♾
🙏 *ఉత్సవమూర్తులకు పుష్పమాలాలంకరణ* 💐
💫 శ్రీవైష్ణవస్వాములు గోదాదేవి కీర్తించిన తిరుప్పావై లోని *"తిరుప్పళ్ళియెళుచ్చి,*" *"తిరుప్పళ్ళాండు"* మొదలైన పాశురాలు శ్రావ్యంగా గానం చేస్తుండగా, అర్చకస్వాములు శ్రీదేవీ-భూదేవి సమేతుడైన మలయప్పస్వామికీ, ఉగ్రశ్రీనివాసమూర్తికీ, కొలుపు శ్రీనివాసమూర్తికీ, సీతాలక్ష్మణ సమేతుడైన కోదండరామస్వామికీ, రుక్మిణీ సమేతుడైన శ్రీకృష్ణునికీ, చక్రత్తాళ్వార్ కు మరియు సాలగ్రామాలకు పుష్పమాలలు అలంకరిస్తారు.
♾┉┅━❀🕉️❀┉┅━♾
🙏 *ధూప దీప హారతులు* 🙏
💫 పుష్పమాలాలంకరణ పూర్తయిన తరువాత వేదపండితులు మంత్రపుష్పాన్ని సమర్పిస్తారు. ఆ తరువాత స్వామివారికి ధూప, దీప, నక్షత్ర హారతులు, చివరగా కర్పూరహారతి సమర్పిస్తారు.
♾┉┅━❀🕉️❀┉┅━♾
🙏 *ముప్పూటలా తోమాలసేవ* 🙏
💫 ఈ సేవ సుమారు అరగంటకు పైగా జరుగుతుంది.
💫 నిత్యార్చనలో భాగంగా జరిగే ఈ తోమాలసేవ, ఉదయం విస్తారంగా, మధ్యాహ్నం క్లుప్తంగా మరల సాయంత్రం విస్తారంగానూ, ముప్పూటలా జరుగుతుంది. ఉదయం జరిగే తోమాలసేవ మాత్రమే అర్జితసేవ. అప్పుడు మాత్రమే ఈ సేవను భక్తులు దర్శించుకోగలరు. మధ్యాహ్నం, రాత్రి జరిగే తోమాలసేవలు ఏకాంతంగా జరుగుతాయి.
⛩️ ఈ మాలలన్నింటినీ మూర (18 అంగుళాలు), బార (36 అంగుళాలు) కొలమానంతో వ్యవహరిస్తారు.
🙏 *అంతటితో తోమాలసేవ ముగిస్తుంది.* 🙏
[ రేపటి భాగంలో.... మరిన్ని.... *శ్రీవారి సేవలు* వివరణ... ]
꧁♾️•••┉┅━❀🕉️❀┉┅━•••♾️꧂
🙏 *శ్రీనివాసుని శ్రీచరణాలను సేవిద్దాం, సకల శుభాలనూ పొందుదాం* 🙏
*...తిరుమల సర్వస్వం..... సశేషం...*
꧁♾️•••┉┅━❀🕉️❀┉┅━•••♾️꧂
No comments :