•••┉┅━❀🕉️❀┉┅━•••
*తరిగొండ వెంగమాంబ*
✍️ శ్రీమతి&శ్రీ పల్లపోతు వాణిశ్రీ-కృష్ణబాలాజీ
•••┉┅━❀🕉️❀┉┅━•••
💫 శ్రీవారి దర్శనం ముగించుకోగానే, మనం సాధారణంగా, మాడవీధుల ప్రక్కనే ఉన్న తరిగొండ వెంగమాంబ సత్రం లో ఉచిత భోజనం చేసి, అదే శ్రీవారి మహాప్రసాదంగా భావిస్తాము. ప్రతిరోజూ సుమారు లక్ష మందికి, అదే బ్రహ్మోత్సవాల్లో రెండు లక్షల మందికి, వండి వడ్డించే, *"నభూతో నభవిష్యతి"* అన్న చందంగా ఉండే ఈ భోజనశాలకు ఆ భక్తురాలి పేరెందుకు పెట్టారు?
♾┉┅━❀🕉️❀┉┅━♾
🙏 *తరిగొండ వెంగమాంబ* 🙏
👉🏻 తిరుమలేశుడు ప్రతిరాత్రీ ఏకాంతసేవ తరువాత, ఓ భక్తురాలి ఇంటికి వెళ్ళి, ఆమె భక్తి పారవశ్యంతో తనను కీర్తిస్తుంటే, తాను నాట్యం చేస్తుండేవాడు. ఆమె చెప్పే ముచ్చట్లు ఆసక్తిగా వింటుండేవాడు. ఆమెకు అవమానం జరిగితే, తనకు జరిగినట్లుగానే భావించేవాడు. ఈ లీలలన్నీ పూర్వయుగాల నాటివో, వేల ఏళ్ళ నాటివో కాదు; కేవలం రెండు వందల యాభై ఏళ్ళ క్రితం జరిగిన యథార్థ సంఘటనలు!
💫 *ఆ మహాభక్తురాలే పరమ పూజ్యురాలైన తరిగొండ వెంగమాంబ గారు.*
👉🏻 మహా మహిమాన్వితురాలు వెంగమాంబ ప్రస్తావన లేకపోతే శ్రీనివాసుని ఐతిహ్యం అసంపూర్తిగానే మిగిలి పోతుందంటే, అతిశయోక్తి కాదు.
♾┉┅━❀🕉️❀┉┅━♾
🌈 *వెంగమాంబ బాల్యం* 🌈
👉🏻 తిరుపతి నుండి మదనపల్లె వెళ్ళే మార్గంలో, నేడు "వాయల్పాడు" గా పిలువబడే "వాల్మీకపురం" అనే పట్టణానికి నాలుగు మైళ్ళ దూరంలో "తరిగొండ" అనే గ్రామం నేటికీ ఉంది. ఆ గ్రామంలో, కానాల కృష్ణయ్య-మంగమ్మ అనే దంపతులకు ఐదుగురు కొడుకుల తరువాత, శ్రీనివాసుని కటాక్షంతో జన్మించిన ఆడపిల్లకు ఆమె తల్లిదండ్రులు *"వెంకమ్మ"* అని స్వామివారి పేరు పెట్టారు. ఆమె అతి చిన్నతనం నుండీ భజనలూ, ఉపవాసాలతో గంటలకొద్దీ ధ్యానంలో మునిగి ఉండడంతో, తల్లిదండ్రులు మొదట్లో ముచ్చట పడ్డారు. అయితే, రోజులు గడిచే కొద్దీ, పెళ్ళి కావలసిన పిల్ల ఇలా పనిపాటలు మానేసి ఎడతెరిపి లేకుండా పూజా పునస్కారాలలో మునిగి ఉండటం వారికి ఆందోళన కలిగించింది. ఆ చింతతోనే వెంకమ్మకు పెళ్ళి ప్రయత్నాలు ప్రారంభించారు. వెంకమ్మ మాత్రం..... *"వేంకటేశ్వరుడే నా భర్త. నాకు వివాహ ప్రయత్నాలు విరమించండి."* అని వేడుకొంటూ ఉండేది. అమె మొరను పెడచెవిని పెట్టిన తల్లిదండ్రులు సమీప గ్రామానికి చెందిన వెంకటాచలపతి అనే యువకుడితో ఆమెకు అతి చిన్నతనం లోనే బలవంతంగా వివాహం జరిపించారు. కానీ, వేంకటేశ్వరుని తలంపు వేరే విధంగా ఉండడంతో, వెంకమ్మ కాపురానికి వెళ్ళక ముందే భర్త మరణించాడు. ఇవేమీ పట్టించుకోని వెంకమ్మ మాత్రం శ్రీనివాసుణ్ణే తన భర్తగా తలుస్తూ, కొలుస్తూ, పసుపు కుంకుమలు సిగారించుకొని, సమీపంలోనే ఉన్న ఆలయం లోని ఆంజనేయస్వామికి, నారసింహునికి హారతులిచ్చేది. తరిగొండ గ్రామంలో ఈ ఆలయాన్ని నేడూ చూసి తరించవచ్చు.
♾┉┅━❀🕉️❀┉┅━♾
🌈 *వెంగమాంబగా మారిన వెంకమ్మ* 🌈
👉🏻 కూతురి వ్యవహారంతో ఏంచేయాలో పాలుపోని పరిస్థితుల్లో తండ్రి కృష్ణయ్య, వెంకమ్మకు, మదనపల్లి వాస్తవ్యులైన సుబ్రహ్మణ్యశాస్త్రి అనే ఆధ్యాత్మికవేత్తతో ఉపదేశం చేయించాడు. అసలే మహాభక్తురాలైన వెంకమ్మ, ఆ ఉపదేశ మహిమతో మహాతపస్వినిగా మారిపోయింది. ఆమె నోటినుండి; వేంకటేశ్వరుణ్ణి కీర్తిస్తూ అనేక శ్లోకాలు, శతకాలు ఆశువుగా వెలువడుతుండేవి. ఇరుగు పొరుగు వారందరూ అప్పటినుండి ఆమెను ఓ మహాయోగినిగా భావించి, *'వెంగమాంబ"* అంటూ, గౌరవ మర్యాదలతో సంబోధించేవారు.
♾┉┅━❀🕉️❀┉┅━♾
🌈 *పీఠాధిపతుల ఆగమనం* 🌈
👉🏻 అయితే, వితంతువులను చిన్నచూపు చూసే ఆ రోజుల్లో భర్తను కోల్పోయిన ఓ మహిళ, సౌభాగ్యవతి వలె ఆలయాన్ని సందర్శించడం కొందరు సాంప్రదాయ వాదులకు కంటగింపైంది. ఆమెను ఎలాగైనా ఇంటికే పరిమితం చేయాలని భావించారు. అదే సమయంలో తన ఆధ్యాత్మిక పర్యటనలలో భాగంగా ఆ గ్రామానికి వేంచేసిన పుష్పగిరి పీఠాధిపతుల వారికి, గిట్టనివారు కొందరు వెంగమాంబ వ్యవహారంపై ఫిర్యాదు చేశారు. ఆ విషయాన్ని స్వాములవారు వెంగమాంబతో ప్రస్తావించగా, ఆమె తన భర్త వేంకటనాథుడని, ఆయనకు మరణం లేదని, తాను నిత్య సౌభాగ్యవతినని ఖరాఖండిగా సమాధాన మిచ్చింది. ఆమె మాటలకు అవాక్కయిన పీఠాధిపతుల వారు ఆమెను ఏమార్చలనే ఉద్దేశ్యంతో, తానో పీఠానికి అధిపతిననీ, తనకు నమస్కరించాలని తెలియదా? అంటూ వెంగమాంబను ప్రశ్నించారు. అంతట వెంగమాంబ, *"స్వామీ! నేను నమస్కరిస్తాను. ఒక్కసారి తాము ఆసీనులై ఉన్న పీఠం మీద నుండి లేవండి"* అని ప్రార్థించటంతో స్వామివారు పీఠం మీద నుండి పైకి లేచారు. ఆమె నమస్కరించగానే, హఠాత్తుగా పీఠం అగ్నికి ఆహుతై పోయి, పీఠాధిపతుల వారికి తృటిలో ఘోరప్రమాదం తప్పింది. అచ్చెరువొందిన స్వామివారు, ఆమె మహా తపస్సంపన్నురాలనీ, దైవకృప సంపూర్ణంగా కలిగిన మహిళామూర్తి అనీ, ఆమె ఆలయంలో ప్రవేశించడానికి ఏ విధమైన అభ్యంతరం పెట్టవద్దని గ్రామస్తులకు నచ్చజెప్పారు. ఆ ఉదంతంతో వెంగమాంబ మరింత ప్రసిద్ధురాలైంది.
♾┉┅━❀🕉️❀┉┅━♾
🌈 *తిరుమలకు పయనం* 🌈
👉🏻 అయినా కొందరు ఆమెనూ, ఆమె కుటుంబాన్ని ఇంకా వేధిస్తూనే ఉన్నారు. ఇవేమీ పట్టించుకోని వెంగమాంబ ఆ వూళ్ళోనే ఉన్న నృసింహస్వామినీ, ఆంజనేయుణ్ణి పూజించడం కొనసాగించింది. ఒకనాడు ఆ దేవాలయం లోని ఆంజనేయస్వామి విగ్రహం వద్ద ధ్యానం చేసుకుంటున్న వెంగమాంబను కొందరు ఛాందసవాదులు "ఏ క్షేత్రానికో వెళ్ళి తపస్సు చేసుకోకండా, ఈ గుళ్ళో ఎందుకు దాపురించావు?" అని దూషిస్తూ, ఆమెను జుట్టు పట్టుకుని ఆలయం నుండి బరబరా బయటకు ఈడ్చివేశారు. వారి మాటలను భగవత్సంకల్పంగా భావించిన వెంగమాంబ వేరే ఆలోచన లేకుండా, అరణ్యమార్గం పట్టి హుటాహుటిన తిరుమల క్షేత్రం చేరుకుంది.
♾┉┅━❀🕉️❀┉┅━♾
🌈 *క్షేత్ర సందర్శన* 🌈
👉🏻 తిరుమల క్షేత్రాన్ని తొలిసారిగా సందర్శించు కొన్నపుడు, ఆనందపారవశ్యంలో అలవోకగా ఆమె నోటినుండి జాలువారిన ముత్యాల మూటలు *"శ్రీ వేంకటాచల మహాత్మ్యం"* లో ఈ విధంగా పొందు పరచబడి ఉన్నాయి.
*ఘనగోపురములు, ప్రాకారమంటపములు*
*తేరులు, సత్పుణ్యతీర్థములును*
*ముద్దుగా బల్కు శుక, పికములును నీలి*
*కంఠములును తులసికాదళ సుమములు*
*క్రిక్కిరిసియుండు వేంకటగిరి పురమున*
👉🏻 కొద్ది మార్పులు, చేర్పులతో తిరుమల క్షేత్రం నేటికీ అదే విధమైన ముగ్ధమనోహర ప్రాకృతిక సౌందర్యంతో భక్తజనులను అలరిస్తోంది.
♾┉┅━❀🕉️❀┉┅━♾
🌈 *వెంగమాంబకు నిలువనీడ* 🌈
👉🏻 వెంగమాంబ ప్రతిరోజూ శ్రీనివాసుణ్ణి దర్శించి, సేవించి; ఆశువుగా వచ్చే పద్యాలతో, శతకాలతో భక్తి పరవశురాలై వేంకటేశుణ్ణి స్తుతించేది. ఆమె భక్తికి ఎందరో తన్మయులయ్యే వారు. ఆమెను ఎంతగానో కొనియాడేవారే తప్ప, నిలువనీడ లేక గుడిలోనే తలదాచుకుంటున్న ఆమె దీనావస్థను మాత్రం ఎవరూ పట్టించుకోలేదు. తనకో నీడ కల్పించమని ఆనందనిలయుణ్ణీ, ఆయనకూ సిఫారసు చేయమని అమ్మవారినీ ఆమె పరిపరి విధాలా వేర్కొనగా ఎట్టకేలకు శ్రీనివాసుడు కరుణించాడు.
👉🏻 స్వామివారి ప్రేరణతో, వారి ఆంతరంగిక భక్తుడైన హాథీరాంబావాజీ వారి శిష్యులు, మహంతుమఠానికి ఆనాటి అధిపతి అయిన ఆత్మారాందాసు సుమారు 1750వ సం. లో వెంగమాంబకు తగిన నివాసాన్ని ఏర్పరచడానికి, సంకల్పించారు
👉 (హాథీరాం బావాజీ గురించీ, దేవాలయ పరిపాలనా కార్యకలాపాలను సుదీర్ఘకాలం నిర్వహించిన మహంతుమఠం గూర్చి మరో ప్రకరణంలో వివరించబడింది).👈
👉🏻 భగవత్ప్రేరణతో ఆత్మారాందాసు గారు శ్రీవారి మందిరానికి తూర్పు మాడవీధి చివరన, ఈశాన్యమూలలో, శ్రీవారి రాతిరథానికి ప్రక్కగా ఓ పూరి గుడిశెను నిర్మించి, వెంగమాంబ వద్దకు వెళ్ళి, ఆ గుడిశెను ఆమె నివాసనిమిత్తం స్వీకరించాల్సిందిగా అర్థించాడు. అంతే గాకుండా, "వకుళమాత" పేరుతో ఒక పడి బియ్యాన్ని, ఇతర వంటవస్తువులనూ వెంగమాంబ నివాసానికి నిత్యం పంపేటట్లుగా తీర్మానించాడు. మహంతు ఏర్పాటు చేసిన కట్టడి ననుసరించి ఆలయాధికారులు వెంగమాంబకు కావలసిన సంభారాల్ని ఆలయ ఉగ్రాణం (సరుకుల గిడ్డంగి) నుంచి వెంగమాంబ ఇంటికి పంపేవారు.
♾┉┅━❀🕉️❀┉┅━♾
🌈 *స్వామివారికి తులసీ కైంకర్యం* 🌈
👉🏻 ఇలా ఆవాసం మరియు ఆహారం విషయాల్లో నిశ్చింత అయిన వెంగమాంబకు; కళ్ళు తెరిచినా, మూసినా ఆ సప్తగిరీశుడే సాక్షాత్కరించేవాడు. శ్రీనివాసుడు ఆమె పాటకు పదం కలుపుతూ, ఆమె ముచ్చట్లను మైమరచి వినేవాడు. భక్తిపారవశ్యంలో ఆసాంతం మునిగిన వెంగమాంబ అలంకారప్రియుడైన శ్రీనివాసునికి ప్రతిరోజూ పూమాలలు సమర్పించాలనీ, ప్రతి సాయంత్రం చివరగా కర్పూరహారతితో నీరాజనం సమర్పించాలని కలలు గనేది. అంతేగాకుండా, తులసీ ప్రియుడైన తిరుమలేశుని కోసం తన కుటీరం వెనుక తులసివనాన్ని ఏర్పాటు చేయదలిచి, ఒక దిగుడుబావిని త్రవ్వించింది. బావి అడుగున ఓ పెద్ద బండరాయి తగలగా వెంగమాంబ గంగమ్మను ప్రార్థించడంతో, బండ చిట్లి జలధార వెల్లువలా ఉబికి వచ్చింది. ఆ వనం నుండి ప్రతిరోజూ తులసీ దళాలు తెచ్చి, మాలలు కట్టి శ్రీవారికి కైంకర్యం చేసేది.
👉🏻 ఆనాడు వెంగమాంబ త్రవ్వించిన దిగుడుబావిని పాపవినాశనంకు వెళ్ళే దారిలో, ఏనుగుశాల వద్ద *"అమ్మోరిబావి"* అనే పేరుతో నేడూ చూడవచ్చు. ఇందులోని నీళ్ళను ఈనాడు కూడా తి.తి.దే. వారు తోటను పెంచడానికి ఉపయోగిస్తున్నారు.
👉🏻 ఇలా వెంగమాంబ సమర్పించిన తులసి మాలలతోనూ, కర్పూర నీరాజనంతోనూ శ్రీ వారు మరింత అందంగా, వింత వింత కాంతులు విరాజిల్లుతూ ఉండేవారు.
👉🏻 వెంగమాంబ మరో ధ్యాస లేకుండా స్వామివారి మీద కవితలల్లుతూ, పాటలు పాడుతూ, శ్రీవారి సేవ చేసుకుంటూ కాలం గడిపేది. శ్రీవారికి అంకితభావంతో ఆమె చేసే సపర్యల వల్ల యాత్రికులకూ, తిరుమల వాసులకూ, శ్రీవారి కైంకర్యపరులకూ, వెంగమాంబ పట్ల అపరిమిత గౌరవాభిమానాలు కలిగాయి. ఆమెను సాక్షాత్తూ భగవదంశగా తలచి, ఆమె ఆశీస్సులకోసం తహతహ లాడుతుండే వారు.
♾┉┅━❀🕉️❀┉┅━♾
🌈 *తాళ్ళపాక వారి ప్రాపకం* 🌈
👉🏻 ఆ సమయంలో, స్వామివారి మరొక పరమ భక్తుడైన తాళ్ళపాక అన్నమయ్య (ఈ భక్తుని గురించి వేరే ప్రకరణంలో వివరించబడింది.) వంశీయులు వెంగమాంబ భక్తి తత్పరత గూర్చీ, ఆమె మహిమల గూర్చి విన్నారు. ఆమె కూడా తమ బ్రాహ్మణశాఖకు చెందినదే నని తెలుసుకుని ఉత్తరమాడవీధిలో, శ్రీవరాహస్వామి ఆలయానికెదురుగా తాము నివాసముంటున్న ఇంటిలో కొంతభాగాన్ని ఆమె నివాసార్థం ఉచితంగా ఇచ్చారు.
వెంగమాంబ శ్రీనివాసునికి మరొక్కసారి కృతజ్ఞతలు ప్రకటించుకొని, తాను ఉంటున్న పూరింటిని వదిలి, తాళ్ళపాక వారింటికి చేరింది. ఆ ఇంటి వెనుక కూడా తులసివనాన్ని పెంచుతూ, శ్రీవారికి కైంకర్యం నిర్వహిస్తూండేది.
♾┉┅━❀🕉️❀┉┅━♾
🌈 *అక్కరామ దీక్షితుల అక్కసు* 🌈
👉🏻 ఆ రోజుల్లో వంశ పారంపర్యంగా ఉండే అర్చకులు మాత్రమే కాకుండా, ప్రభుత్వం తరఫున కూడా అర్చకులు నియమింపబడే వారు. *అక్కరామ దీక్షితులు* అనే శ్రీవారి సర్కారు అర్చకుడు వెంగమాంబ ఇంటి ప్రక్కనే మందీ మార్బలంతో నివసించేవాడు. హోదా, సంపద, పరివారజనం కారణంగా ఆయనకు గర్వమూ, అహంకారమూ తలకెక్కాయి. పైగా శ్రీవారిని స్పృశించి, వారికి సేవలు చేయగలిగే భాగ్యం గలిగిన తాను సాక్షాత్తూ భగవత్సంభూతుడే అన్న అహంభావం ఆయన మదిలో మెదిలేది. అందరూ ఆయనకు వంగి వంగి నమస్కరిస్తూంటే, శ్రీవారినే సమస్తంగా భావించే వెంగమాంబ మాత్రం తన పనిలో తాను నిమగ్నమై ఉండేది. అది అక్కరామ దీక్షితులుకు కంటగింపుగా తయారైంది.
👉🏻 సౌభాగ్యం కోల్పోయిన స్త్రీ రోజూ వచ్చి హారతి ఇవ్వడం ఏమిటని ఆయనకు అక్కసుగా కూడా ఉండేది. వేదవేదాంగ పారాయణుడు తానుండగా, తన ఎదుటే ఓ వితంతువు సత్కారాలు పొందటం ఏమిటి? అని ఈర్ష్యతో రగిలిపోయేవాడు. పుండు మీద కారం అద్దినట్లు తాళ్ళపాక వారు ఆమెను చేరదీసి, వారి ఇంట్లో ఆశ్రయం ఇవ్వడం వల్ల అతని అంతరంగం ఇంకా క్రోధపూరిత మయ్యింది. ఉద్యోగరీత్యా నిత్యం శ్రీవారి సమక్షంలోనున్నప్పటికీ, అరిషడ్వర్గాలపై ఆధిపత్యం సాధించనట్టి ఆ అర్చకుడు స్వామి తోడిదే లోకంగా జీవిస్తున్న వెంగమాంబను నోటికి వచ్చినట్లు దూషించేవాడు. అయినప్పటికీ అలౌకికమైన ఆధ్యాత్మిక జగత్తులో తాదాత్మ్యమై ఉన్న వెంగమాంబ పన్నెత్తు మాట కూడా అనక పోవడంతో, ఆమె సహనాన్ని అలుసుగా తీసుకున్న అర్చకుని ఆగడాలు అంతకంతకూ మితిమీరి పోయాయి. ఆయన బుద్ధి మరింత వక్రించి, ఆమె పెంచుతున్న తులసివనంలో ఎంగిలి విస్తళ్ళు వేయించేవాడు. ఆసూయా ద్వేషాలు మనుషుల్ని ఎంతకైనా దిగజారుస్తాయి కదా!!
♾┉┅━❀🕉️❀┉┅━♾
🌈 *శ్రీవారి క్రోధాగ్ని* 🌈
👉🏻 ఎంగిలివిస్తళ్ళ వల్ల శ్రీవారికి చెందాల్సిన తులసిదళాలు అపవిత్రం కావడంతో నొచ్చుకొన్న వెంగమాంబ, ఒకటికి రెండు సార్లు అర్చకుణ్ణి మృదువుగా వారించింది. అయినా ఆయన వంకరబుద్ధి మారలేదు.
👉🏻 ఒకనాడామె పెరటిలో కూర్చొని ఆనందనిలయ శిఖరాన్ని తదేకంగా చూస్తూ, ధ్యానమగ్నలై ఉండగా; అపరాహ్ణ సమయంలో, పక్కింటిలోని అర్చకుడూ, అతని పరివారగణం, మధ్యాహ్నభోజనాలు ముగించుకొని యథాప్రకారం ఎంగిలి విస్తళ్ళు విసిరారు. అవి తులసివనం లోనూ, వెంగమాంబ మీదా పడ్డాయి. ఇన్నాళ్ళూ తనకు అర్పితమయ్యే తులసిదళాలు పెరుగుతూ ఉన్న వనంలో ఎంగిలి విస్తళ్ళు పడేస్తున్నా పట్టించుకోని శ్రీనివాసుడు ఆరోజు ఎంగిలాకులు తన భక్తురాలైన వెంగమాంబ మీద పడడంతో, అది ఆమెకు తద్వారా తనకు తీరని అవమానంగా భావించి ఆగ్రహోదగ్రుడయ్యాడు. ఆశ్రిత పక్షపాతియైన శ్రీనివాసుడు తనకెన్ని అవమానాల నైనా భరిస్తాడు గానీ, తనను నమ్మినవారినెవరైనా దూషిస్తే మాత్రం అణుమాత్రం సహించడు! దోషులను శిక్షించి గానీ వదలడు! అందుకే శ్రీవారిని శరణాగత రక్షకుడూ, ఆర్తత్రాణపరాయణుడూ అని కీర్తిస్తారు.
👉🏻 కట్టలు తెంచుకున్న ఆగ్రహంతో ఉన్న స్వామివారు వెంగమాంబను ఆవహించి, ఆమె నోటి ద్వారా.. *"ఓరీ పాపీ! నేటితో నీ వంశం సరి. అందరూ నెత్తురు కక్కుకుని మరణిస్తారు"* అని పరుషవాక్కులు పలికింపజేశాడు. ఆమె వాణిని సాకారం చేస్తూ, ప్రధానార్చకునితో సహా వారి కుటుంబ సభ్యులందరూ తక్షణమే నెత్తురు కక్కుకుని మరణించారు. అర్చకుని ఒక్క కొడుకు మాత్రం పాక్కుంటూ వచ్చి వెంగమాంబ పాదాల మీద పడి శరణు వేడాడు. అప్పుడు కొంచెం శాంతించిన వెంగమాంబ - మీ వంశంలో ఒక్కడు మాత్రం బ్రతుకుతాడని అభయమిచ్చింది. వెంగమాంబ ఇచ్చిన శాపమూ, అభయమూ నేటికీ తిరుమల యందు చెల్లుబాటులో ఉన్నాయని స్థానికులంటారు.
👉🏻 ఆ దైవిక ఘటన జరిగిన రోజు సాయంకాలం, వికలమనస్కురాలై ఉన్న వెంగమాంబతో శ్రీవారు జరిగిన దానికి చింతించవలదనీ, అంతా తన ప్రమేయంతోనే జరిగిందనీ, వెంగమాంబ నిమిత్త మాత్రురాలనీ, తన భక్తురాలిని నిష్కారణంగా దూషించినవారికి తగిన శాస్తి జరిగిందని చెప్పి సమాధాన పరుస్తాడు. శ్రీవారి ఓదార్పుతో కుదుట పడ్డ వెంగమాంబ ఆ దినం నుండి క్రమం తప్పకుండా, ఆలయంలో ఆనందనిలయునికి మరింత భక్తిశ్రద్ధలతో హారతినిస్తూ ఉండేది. అధికారులు అమెకే విధమైన ఆటంకాలూ కలిగించే వారు కాదు. భక్తులు కూడా, ఆమె శ్రీవారి సమక్షంలో ఉండటమే మంగళదాయకంగా భావించేవారు.
❓ శ్రీవారికి తాత్కాలికంగా దూరమైన వెంగమాంబ... ఎందుకు!?!❓
♾┉┅━❀🕉️❀┉┅━♾
[ రేపటి భాగంలో... *తరిగొండ వెంగమాంబ* గురించి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం]
•••┉┅━❀🕉️❀┉┅━•••
🙏 *శ్రీనివాసుని శ్రీచరణాలను సేవిద్దాం, సకల శుభాలనూ పొందుదాం* 🙏
*...తిరుమల సర్వస్వం..... సశేషం...*
•••┉┅━❀🕉️❀┉┅━•••
No comments :