♾️•••┉┅━❀🕉️❀┉┅━•••♾️
*శ్రీవారి వారోత్సవాలు -2*
✍️ శ్రీమతి&శ్రీ పల్లపోతు వాణిశ్రీ-కృష్ణబాలాజీ
♾️•••┉┅━❀🕉️❀┉┅━•••♾️
*శ్రీవారి వారోత్సవాలు-2*
🙏 *గురువారపు సేవలు – తిరుప్పావడ లేదా అన్నకూటోత్సవం* 🙏
*"గురువార-గురుతర సేవా మహిమా వర్ణింపగ మా తరమా!*
*పరమాత్మా... తిరువేంకట శిఖర పరంధామా!"*
👉🏻 ప్రతి గురువారం స్వామి వారికి రెండవ అర్చనానంతరం, ఉదయం 6 గం. లకు జరిగే నివేదనను *తిరుప్పావడసేవ* లేదా *అన్నకూటోత్సవం* అంటారు. సాధారణంగా మనం ఇంట్లో, మహా అయితే 1-2 కిలోలు, అదే దేవాలయాల్లో, రామనవమి, వినాయక చవితి ఉత్సవాల్లో 10-15 కిలోల పులిహోర వండుకుంటాం. కానీ, గురువారం జరిగే తిరుప్పావడ లేక అన్నకూటోత్సవ సేవలో, బళ్ళ కొద్దీ, వందలాది కిలోల పులిహోర కలిపి, స్వామి నైవేద్యానంతరం భక్తులకు ప్రసాదవితరణ చేస్తారు.
👉🏻 గురువారం ప్రాతఃకాల ఆరాధన పూర్తి కాగానే, అర్చకస్వాములు ఏకాంతంగా శ్రీవారికి అలంకరించిన స్వర్ణాభరణాలు, పీతాంబరాల నన్నింటినీ సడలింపు చేస్తారు. తరువాత ఊర్ధ్వపుండ్రాన్ని (తిరునామాన్ని) సగానికి తగ్గించి, స్వామి వారి నేత్రాలు స్పష్టంగా, నయనానంద కరంగా కనపడేట్లు చేస్తారు. ఆభరణాలు లేకుండా స్వామి వారి దివ్యమంగళకరమైన, రూపాన్ని రోజల్లా చూడగలిగే భాగ్యం కేవలం గురువారం నాడు మాత్రమే కలుగుతుంది.
👉🏻 అనంతరం, పండితులు వేదపారాయణతో పాటు *శ్రీనివాసగద్యం* పఠిస్తుండగా, ఈ "అన్న" నివేదన జరుగుతుంది.
👉🏻 బంగారువాకిలి ముందు గరడాళ్వార్ సన్నిధిలో ఉన్న నాలుగు స్తంభాల మధ్య 484 కిలోల బియ్యంతో తయారు చేసిన పులిహోర రాశిని, ప్రత్యేకంగా తయారు చేయబడ్డ ఓ అతిపెద్ద, లాగుడుబండి వంటి వెండి శకటంలో పెద్దశిఖరం లాగా అమర్చుతారు. దానికి ఎనిమిది దిక్కుల్లో పులిహోరతో ఎనిమిది చిన్న శిఖరాలను ఏర్పాటు చేసి నివేదన చేస్తారు. పులిహోరతో పాటుగా, గురువారం నాడు మాత్రమే తయారు చేయబడే పెద్ద జిలేబీలు, మురుకులు (తేనేతోళీలు లేదా కారం జిలేబీ) వంటి వాటిని కూడా చక్కగా అమర్చి పూలతో అలంకరిస్తారు.
♾┉┅━❀🕉️❀┉┅━♾
*స్వామివారికి అన్నం ఎందుకు నివేదించాలి?*
👉🏻 సమస్త జీవకోటికి ప్రాణాధారం అన్నం. అన్నం పరబ్రహ్మ స్వరూపం. మన జీవనం సజావుగా సాగిపోవడానికి భగవంతుడు మనకు ప్రసాదిస్తూ వస్తున్న అన్నానికి కృతజ్ఞతగా, సమస్త జీవరాశులకు మున్ముందు కూడా ఏ లోటూ లేకుండా అన్నలభ్యత చేకూరాలని ప్రార్థిస్తూ జరిగే ఈ సేవ అత్యంత ప్రముఖమైన సేవల్లో ఒకటి.
👉🏻 వీటితో పాటు ఇంకా అనేక నైవేద్యాలు సమర్పించి..., "ఓ స్వామీ! ఈ రోజు నువ్వు నిజనేత్రాలతో సమస్తమైన భక్తులందరినీ అనుగ్రహిస్తున్నావు. ఇదుగో స్వీకరించు నాయనా.." అంటూ స్వామివారికి నివేదిస్తారు.
👉🏻 ఈ తిరుప్పావడ సేవ గాంచిన భక్తులకు, నివేదించిన పులిహోరలో ఎన్ని మెతుకు లున్నాయో, అన్ని సంవత్సరాల పాటు స్వర్గవాసం లభిస్తుందని పెద్దలు చెబుతారు.
♾┉┅━❀🕉️❀┉┅━♾
🙏 *నిజనేత్ర దర్శనం* 🙏
*"కంటి నఖిలాండతతి కర్తనధికుని గంటి -*
*కంటి నఘములు వీడుకొంటి నిజమూర్తి గంటి...."*
👉🏻 అంటూ, అన్నమయ్య కీర్తించిన, మహా మహిమాన్వితమైన శ్రీవారి నిజనేత్ర శోభను దర్శించడం పూర్వ జన్మ సుకృతం.
👉🏻 ప్రతి గురువారం జరిగే నిజనేత్ర దర్శనోత్సవం లో స్వామివారు సన్నటి నామాలతో, విప్పారిన నేత్రాలతో, ఆభరణాలు లేకుండా, కేవలం ధోవతి, పైపల్లెవాటుతో, మెడలో రెండు కంటెలతో, బుగ్గన పచ్చకర్పూరపు దిష్టిచుక్కతో, సొగసైన తలగుడ్డతో, నిరాడంబరంగా ఉంటారు. నల్లని మేనుతో మెరిసిపోతూ, ద్వాపరం నాటి ఆ నల్లనయ్యే కలియుగంలో ఈ శ్రీనివాసునిగా ఉద్భవించాడనే జగద్విదితమైన సత్యాన్ని దృఢపరుస్తారు. అందువల్లనే కొందరు నిజనేత్ర దర్శనాన్ని *'గోపాలుని దర్శనం"* అని కూడా అంటారు. గోమాతతో అనుబంధం, గొల్లల సాన్నిహిత్యం, పాలు-పెరుగుల సేవనం, ఇవన్నీ గుర్తుకు తెచ్చుకుంటుంటే, ఆ నల్లనయ్యే ఈ చక్కనయ్య అనే నమ్మకం మరింత బలపడట్లేదూ?
👉🏻 నిజనేత్ర దర్శనానికి సంబంధించి ఓ ఆసక్తి కరమైన అంశం స్థానికంగా వెలుగులో ఉంది.
👉🏻 తిరుమలలో ఉన్నటువంటి సిబ్బంది, వ్యాపారులు అందరూ, గురువారం నాడు మరింత జాగ్రత్తగా, ఏ విధమైన పొరపాట్లు, తప్పిదాలు జరగకుండా జాగ్రత్త పడతారట. ఎందుకంటే, స్వామివారు సన్నటి నామాల కారణంగా వికసిత నేత్రాలతో ఉండడం వల్ల, ఏ తప్పు జరిగినా వెంటనే గమనిస్తారని వారి నమ్మకం. మిగతా రోజుల్లో అర్ధనిమీలిత నేత్రాలతో ఉన్నంత మాత్రాన ఆ సర్వాంతర్యామికి, సహస్రనేత్రుడికీ మనం చేసే తప్పొప్పులు కనబడటం లేదనుకోవడం కేవలం అజ్ఞానం!
♾┉┅━❀🕉️❀┉┅━♾
🙏 *పూలంగి సేవ* 🙏
*"పూలంగి సేవకే పూలెన్నో తెచ్చేము!*
*మా భక్తి సీమలో పూమాల లల్లేము!"*
👉🏻 *పూలంగి అంటే పువ్వుల అంగీ. అనగా పుష్పాలనే వస్త్రాలు గా ధరించడం.*
👉🏻 గురువారం నాడు జరిగే మరో సేవ పూలంగి సేవ. రాత్రి 8 గం. లకు జరిగే ఈ సేవ పూర్తిగా ఏకాంతం. జియ్యంగార్లు అందించే పూలమాలలను అర్చకులు శ్రీవారిమూర్తికి వస్త్ర రూపంగా, ఉత్తరీయ రూపంగా, ఆభరణ రూపంగా, కిరీటశంఖు-చక్రాల రూపంగా, మొత్తం పుష్పమయంగా, శోభాయమానంగా అలంకరిస్తారు. స్వామి వారు పూల అంగీని తొడిగినట్లుగా, కోటి రెట్ల సౌందర్యంతో, నవ మన్మథునిలా కను విందు చేస్తారు.
👉🏻 వైష్ణవాలయాలను పుష్పమండపం, జ్ఞానమండపం, త్యాగమండపాలు గా వర్గీకరిస్తారు. తిరుమల పుష్పమండపమన్న మాట. ఈ క్షేత్రంలో పూచే పువ్వులన్నీ, పూర్వ జన్మల్లో మహా భక్తులు, సిద్ధపురుషులు, మునిపుంగవులే. వారి వారి పూర్వజన్మ పుణ్యఫలాల ననుసరించి వారు ఈ జన్మలో పూవులుగా పూచి స్వామి వారికి అలంకృతమవుతున్నారు. అందువల్లనే, తిరుమలలో పుష్పాలన్నీ స్వామికే చెందుతాయనీ, వేరెవ్వరూ పూలు అలంకరించు కోరాదనే సాంప్రదాయం అమల్లో ఉంది.
👉🏻 సువాసనలు వెదజల్లే పుష్పాలతో అలంకరింప బడిన స్వామివారిని దర్శించుకుంటే, జన్మాంతర వాసనలన్నీ పోయి, గత జన్మల పాపాలన్నీ పటాపంచలవుతాయని భక్తుల నమ్మిక.
👉🏻 గురువారం నాడు జరిగే వారపు సేవలైన - *తిరుప్పావడ సేవ, నిజనేత్ర దర్శనం, పూలంగి సేవలు సమాప్తం.*
[ రేపటి భాగంలో... *శుక్రవార సేవలు* గురించి తెలుసుకుందాం]
♾️•••┉┅━❀🕉️❀┉┅━•••♾️
🙏 *శ్రీనివాసుని శ్రీచరణాలను సేవిద్దాం, సకల శుభాలనూ పొందుదాం* 🙏
*...తిరుమల సర్వస్వం..... సశేషం...*
♾️•••┉┅━❀🕉️❀┉┅━•••♾️
No comments :