♾️•••┉┅━❀🕉️❀┉┅━•••♾️
*శ్రీవారి ప్రసాద విశేషాలు - 3*
✍️ శ్రీమతి&శ్రీ పల్లపోతు వాణిశ్రీ-కృష్ణబాలాజీ
♾️•••┉┅━❀🕉️❀┉┅━•••♾️
🙏 *వార క్రమానుసారం అర్పించే ప్రసాదాలు*
✅ *వారక్రమానుసారం సమర్పించే ప్రసాదాలు ఈ క్రింది విధంగా ఉంటాయి.*
✅ *సోమవారం:*
🥀 51 పెద్ద దోశలు
🥀 51 చిన్న దోశలు
🥀 51 పెద్ద అప్పాలు
🥀 102 చిన్న అప్పాలు
✅ *మంగళవారం:*
🥀 ప్రత్యేక ప్రసాదాలు ఏవీ ఉండవు
✅ *బుధవారం*
🥀 పెసరపప్పు
🥀 పానకం
🥀 పాయసం
✅ *గురువారం*
తిరుప్పావడ సేవ
🥀 484 కిలోల పులిహార
🥀 51 తేనె తోళీలు
🥀 51 పెద్ద జిలేబీలు
🥀 వడలు
🥀 పాయసం
✅ *శుక్రవారం*
అభిషేకం
🥀 51 పోళీలు
🥀 పాయసం
✅ *శనివారం*
🥀 రోజువారీ నైవేద్యాలు మాత్రమే
✅ *ఆదివారం*
🥀 అమృత కలశం
లేదా గరుడ ప్రసాదం
👉🏻 ఆదివారం రోజున సమర్పించే ప్రసాదం పేరు *అమృతకలశం* లేదా *గరుడప్రసాదం.* ఈ ప్రసాదం వెనుక గల ఐతిహ్యం ఏమిటంటే, స్వామివారి వాహనమైన గరుడునికి సర్పాలంటే జాతివైరం. అందువల్ల సర్పదోష పీడితులై సంతానలేమితో బాధపడుతున్న వారు ఈ ప్రసాదం సేవిస్తే, గరుత్మంతుడు వారిని సర్పదోష విముక్తులను చేసి, సంతానప్రాప్తి కలిగిస్తాడు.
లెక్కకు మించిన ప్రసాదాలను గుర్తుంచు కోలేక, సతమతమవుతున్నారు కదూ!
👉🏻 ఈ తికమక వికటకవి తెనాలి రామలింగడికీ, నందకఖడ్గ అంశతో కారణజన్ముడిగా జన్మించిన అన్నమయ్యకు కూడా తప్పలేదు. ఆ సాహితీ, సంగీత సార్వభౌముల ముందు సామాన్యులమైన మనమెంత?
👉🏻 జగన్నాటక సూత్రధారి శ్రీవేంకటేశ్వరుడు ఇన్నిన్ని తినుబండారాలను ఆరగిస్తున్నట్లుగా నటిస్తూ, తెనాలి రామలింగడి లాంటి వికటకవుల వెటకారాలకు గురి అవుతూ (వారు కూడా శ్రీవారికి పరమభక్తులే! వెటకారంతో కూడిన వారి "నిందాస్తుతు" లలో శ్రీవారి పట్ల సాన్నిహిత్యం, చొరవ, ప్రియసఖుల పట్ల ఉండే స్వాతంత్ర్యం ధ్వనిస్తాయి) తన భక్తుల జిహ్వచాపల్యాన్ని, అన్నార్తిని తీరుస్తున్నాడు.
👉🏻 భక్తులను కాపాడడానికి, ఉద్ధరించటానికి తాను స్వయంగా శారీరక బాధలను, నీలాపనిందలను భరించటం శ్రీమహావిష్ణువుకు అన్ని యుగాల్లోనూ పరిపాటే!
👉🏻 గర్భాలయంలోని ఇతర ఉత్సవమూర్తులకు కూడా మధ్యాహ్న, సాయం సమయాల్లో నాలుగు రకాల అన్నప్రసాదాలు, నాలుగు రకాల పణ్యారాలు, పంచకజ్జాయం నివేదిస్తారు.
👉🏻 ప్రత్యేక సందర్భాలలో, అంటే – మూడు రోజుల పవిత్రోత్సవాలు, తొమ్మిది రోజుల బ్రహ్మోత్సవాలు, మూడు రోజుల జ్యేష్టాభిషేకం - ఉగాది, శ్రీరామనవమి, దీపావళి - ఆస్థాన సందర్భాల్లో ఈ ప్రసాదాల పరిమాణం రెట్టింపవుతుంది.
♾┉┅━❀🕉️❀┉┅━♾
🙏 *తోమనిపళ్ళాల వాడు* 🌈
👉🏻 అన్నమాచార్యుని *"వేడుకొందామా.... తోమనిపళ్ళాల వాడే"* అనే కీర్తన మనకు సుపరిచితం. శ్రీనివాసుణ్ణి ఈ విధంగా ఎందుకు కీర్తించారంటే -
👉🏻 స్వామి ఒకసారి ఆరగించిన పళ్ళాన్ని తోమి మరలా వాడకుండా, పారవేస్తారు. తదుపరి భోజనానికి మళ్ళీ కొత్తపళ్ళెం ఉపయోగిస్తారు. ఆ తోమనిపళ్ళాలే - *"పగిలిన మట్టికుండలు".* వీటిలో ఉంచే నైవేద్యమే *ఓడు ప్రసాదం.* కుమ్మరి భీమన్న అనే మహాభక్తుని గుర్తుగా, తరతరాల నుండి వస్తున్న ఈ సాంప్రదాయం వెనుకనున్న ఐతిహ్యాన్ని మరొకచోట వివరించడమైనది.
👉🏻 అపార కరుణామయుడైన వేంకటేశుడు తాను మాత్రం పగిలిన మట్టికుండలో భుజిస్తూ, *"తిండిమెండయ్య"* అనిపించుకుంటూ, భక్తకోటికి పంచభక్ష్య పరమాన్నాలు అందిస్తున్నాడు !
♾┉┅━❀🕉️❀┉┅━♾
🙏 *లడ్డూ చరిత్ర*
👉🏻 లెక్కకు మిక్కిలి ప్రసాదాలున్నా, దేనికీ లేని ఖ్యాతి తిరుపతి లడ్డూ (లాడుకము) సంపాదించుకుంది. మిగతా ప్రసాదాలకంటే ఎక్కువ కాలం మన్నటం, దేశవిదేశాలకు సునాయాసంగా ఆకారం చెడకుండా తీసుకెళ్ళ గలగటం, సులభంగా అందుబాటులో ఉండడంతో పాటుగా, దాని అద్భుతమైన రుచి కూడా "లడ్డూ" ప్రాచుర్యానికి కారణం. తిరుపతి యాత్ర చేసి వచ్చినవారు ఎవరైనా, లడ్డూ ప్రసాదం తీసుకు రాకుండా ఉండరు. శ్రీవారి ప్రసాదమంటే ఎవ్వరికైనా ఠక్కున గుర్తొచ్చేది లడ్డూయే!
👉🏻 దాదాపు, ఆలయ పరిసర ప్రాంతమంతా నోరూరిస్తూ, తియ్యటి, కమ్మని, ఘుమఘుమలాడే స్వచ్ఛమైన నేతి సువాసనలు లడ్డూల నుంచి వచ్చినవే!
👉🏻 ఎవరెన్ని రకాలుగా ప్రయత్నించినా, తిరుపతి లడ్డూ రుచి మాత్రం దేనికీ రాదు గాక రాదు. ఎందుకంటే....
👉🏻 చక్కెరమోము గల తల్లి అయిన అలమేలుమంగ యొక్క పతిదేవుని ఎంగిలి ఇతరత్రా చేసిన లడ్డూలకు తగలక పోవడమే దీనికి కారణమేమో!
👉🏻 అంతే గాక, ఎనభయ్యేళ్ళకు పైగా, ఒకే పద్ధతిలో, అదే పాళ్ళలో, లక్షలకొద్దీ లడ్డూలు నిరంతరాయంగా, శ్రీవారి పట్ల అచంచల భక్తితో, తయారు చేస్తుండడం వల్ల, *"పోటు"* బ్రాహ్మణులు ఈ విలక్షణమూ, నిత్యనూతనమూ అయిన లడ్డూ తయారీలో అత్యంత నైపుణ్యాన్ని సంపాదించారు.
👉🏻 *తిరుమల లడ్డూకు తి.తి.దే. 2009 సం. లో పేటెంటు హక్కు సాధించుకొని, జియోగ్రాఫికల్ ఇండికేటర్ జాబితాలో చేరింది*. లడ్డూ వేర్వేరు రూపాల్లో అనేక శతాబ్దాల నుంచి ఉన్నా, తీపి బూందీ ప్రసాదంగా సుమారు 1800 సం. లో విక్రయాలు మొదలై, తదనంతర కాలంలో రూపాంతరం చెందుతూ, 1940 ల్లో ప్రస్తుత లడ్డూ రూపం దాల్చుకుంది.
👉🏻 ప్రతిరోజూ ఇంచుమించు మూడు లక్షల లడ్లు తయారు చేస్తారు. ఒకప్పుడు వాడే కట్టెలపొయ్యి స్థానంలో నేడు ఆవిరి పొయ్యిలను (సుమారుగా 48 పొయ్యిలు) వాడుతున్నారు. దాదాపు 700 మంది పోటు కార్మికులు నిరంతరం శ్రమిస్తున్నారు. శ్రీవారి సంపంగి ప్రాకారానికి ఉత్తర భాగాన ఉన్న *"పడిపోటు"* అనబడే వంటశాలలో లడ్డూలను తయారు చేస్తారు. వంటలకు కావలసిన దినుసులన్నింటినీ *"ఉగ్రాణం"* అని పిలువబడే గిడ్డంగిలో భద్రపరుస్తారు.
👉🏻 లడ్డూల తయారీకి వాడవలసిన సరుకుల మోతాదును *"దిట్టం"* అని అంటారు. ప్రస్తుతం ఉపయోగిస్తున్న కొలమానాన్ని *"పడితరం దిట్టం"* గా వ్యవహరిస్తారు. దీని ప్రకారం, 5100 లడ్డూలను తయారు చేయడానికి సుమారుగా 830 కిలోల సరుకులను *"ఉగ్రాణం"* నుంచి *"పడిపోటు"* కు తరలిస్తారు.
🍁 ప్రస్తుతం మూడు రకాల లడ్డూలను తయారు చేస్తున్నారు:
*1. ఆస్థానలడ్డు -*
👉🏻 వీటిని ప్రత్యేక సందర్భాలలో తయారు చేసి అత్యంత ప్రముఖులకు మాత్రమే అందజేస్తారు. సాధారణంగా, ఈ లడ్డూల విక్రయం జరగదు. వీటి తయారీలో, అధిక మొత్తంలో నెయ్యి మరియు ముంతమామిడి పప్పు (సారపప్పు) వంటి ప్రత్యేక దినుసుల్ని ఉపయోగిస్తారు. దీని బరువు సుమారుగా 750 గ్రాములు ఉంటుంది. అమోఘమైన దీని రుచిని ఆస్వాదించి తెలుసుకోవాలే గానీ, వర్ణించనలవి కాదు.
*2. కళ్యాణోత్సవ లడ్డు -*
👉🏻 కళ్యాణోత్సవ ఆర్జిత సేవలో పాల్గొన్న గృహస్తులకు ఈ లడ్డూలను ప్రసాదంగా అందజేస్తారు. సుమారుగా 700 గ్రాముల బరువుంటుంది. దక్షిణ భారత దేశపు వివాహవిందుల్లో ఈ మధ్యకాలం వరకు – అంటే "క్యాటరింగ్" సంస్కృతి మొదలై సాంప్రదాయిక విందుభోజనాలు అంతరించి పోయేంత వరకు లడ్డూ వడ్డన తప్పనిసరి. ఈ ఆనవాయితీ, తిరుమల క్షేత్రంలో శ్రీవారి నిత్య కళ్యాణోత్సవానికి ప్రసాదంగా ఇచ్చే "లడ్డూ" ద్వారానే ప్రారంభమైందని చెపుతారు.
👉🏻 ఇలా, తరతరాలుగా మన దైనందిన జీవనంలో భాగమై పోయిన తిరుమల సాంప్రదాయాలు ఎన్నో ఉన్నాయి. కళ్యాణోత్సవం మరికొన్ని ఇతరసేవల్లో పాల్గొన్న భక్తులు, ఈ లడ్డూలను, దర్శనానంతరం సంపంగిప్రాకారంలో గల *"వగపడి"* నందు పొందవచ్చు.
*3. ప్రోక్తం లేదా సాధారణ లడ్డు -*
👉🏻 సాధారణ దర్శనానికి వచ్చే భక్తులకు ఈ లడ్డూలను, లెక్కగా, ఆలయం వెనుక భాగాన ఉన్న లడ్డూ కౌంటర్లలో విక్రయిస్తారు. కొన్ని రకాల ఆర్జిత సేవల్లో పాల్గొన్న భక్తులకు ఉచితంగా కూడా ఇస్తారు. దీని బరువు సుమారు 175 గ్రా. లడ్డూలన్నింటి లోకి అత్యంత ప్రాచుర్యంలోకి వచ్చింది ఇదే!
👉🏻 ఇవే కాకుండా, భక్తులకు దర్శనానంతరం ఉచిత ప్రసాదంగా ఒక్కోసారి బుల్లి లడ్డూలను కూడా అందజేస్తారు.
👉🏻 51 వస్తువుల్ని (లడ్డూ, వడ, జిలేబి లాంటివి) ఒక *"పడి"* గా వ్యవహరిస్తారు. ఒక పడి చిన్న లడ్డూలను తయారు చేయటనికి కావలసిన పదార్థాలు:
👉 1.80 కిలోల శనగపిండి
👉 1.65 కిలోల నెయ్యి
👉 4.00 కిలోల పంచదార
👉 300 గ్రాముల జీడిపప్పు
👉 160 గ్రాముల ఎండుద్రాక్ష
👉 80 గ్రాముల కలకండ (పటికబెల్లం)
👉 40 గ్రాముల యాలకులు
👉🏻 అదీ శ్రీవారికీ, భక్తులందరికీ అత్యంత ప్రీతికరమైన, ఖండఖండాంతరాల ఖ్యాతి గాంచిన *"తిరుపతి లడ్డూ"* కథ - కమామిషు..
♾┉┅━❀🕉️❀┉┅━♾
[ రేపటి భాగంలో... *శ్రీవారి భక్తాగ్రేసరులు* గురించి తెలుసుకుందాం]
♾️•••┉┅━❀🕉️❀┉┅━•••♾️
🙏 *శ్రీనివాసుని శ్రీచరణాలను సేవిద్దాం, సకల శుభాలనూ పొందుదాం* 🙏
*...తిరుమల సర్వస్వం..... సశేషం...*
♾️•••┉┅━❀🕉️❀┉┅━•••♾️
No comments :