♾️•••┉┅━❀🕉️❀┉┅━•••♾️
*శ్రీవారి భక్తాగ్రేసరులు - 1*
✍️ శ్రీమతి&శ్రీ పల్లపోతు వాణిశ్రీ-కృష్ణబాలాజీ
♾️•••┉┅━❀🕉️❀┉┅━•••♾️
🙏 *శ్రీవారి భక్తాగ్రేసరులు -1* 🙏
👉🏻 స్వామివారు రాజాధిరాజులను కాదని ప్రతిరోజూ తొలిదర్శనం ఓ గొల్లవానికి అనుగ్రహించారు. ఓ భక్తుణ్ణి "తాతా" అని ఆప్యాయంగా పిలిచారు. మరో భక్తుని "మామా" అని సంబోధించి ఆయనతో గునపం దెబ్బలు తిన్నారు. ఒకరితో పాచికలాడారు. ఒక భక్తుని మేలుకొలుపు లేనిదే నిద్ర లేవని స్వామి, మరో భక్తురాలి హారతి లేనిదే కునుకు తీయరు. ఇలా చెప్పుకుంటూ పోతే, భక్తజనకోటి పట్ల శ్రీవారి వాత్సల్యాన్ని తేటతెల్లం చేసే ఉదంతాలు ఎన్నో ఎన్నెన్నో!
👉🏻 *"వైకుంఠాన్నెనా వదులుకుంటాను గానీ, తన భక్తులను మాత్రం క్షణకాలమైనా విడిచి ఉండలేను"* అని చెప్పి, భూలోక వైకుంఠమైన తిరుమలలో శాశ్వతంగా నెలకొన్న భక్తుల పాలిటి కొంగుబంగారం ఈ శ్రీనివాసుడు!
🙏 *శ్రీవారి భక్తశిఖామణులను తలంచుకున్నా స్వామివారిని స్మరించినట్లే!*
👉🏻 శ్రీవారి సేవలో తరించి, వారి కృపకు పాత్రులైన అసంఖ్యాక భక్తుల్లో కొంతమందిని స్మరించుకుందాం.
♾┉┅━❀🕉️❀┉┅━♾
🙏 *సన్నిధిగొల్ల* 🙏
👉🏻 స్వామివారి తొలి దర్శనభాగ్యం ఆయనదే! అతని తరువాతే అర్చకులైనా, రాజాధిరాజులైనా, మరెవరైనా!
♾┉┅━❀🕉️❀┉┅━♾
🙏 *ఆవు - దూడగా బ్రహ్మ, రుద్రులు* 🙏
👉🏻 ఇతిహాసాలను అనుసరించి భృగుమహర్షి వృత్తాంతానంతరం, కోపంతో విసవిసా వైకుంఠాన్ని వీడి కొల్హాపూరుకు చేరుకున్న శ్రీమహాలక్ష్మీ జాడ కానక, విసిగి వేసారిన శ్రీమహవిష్ణువు వేంకటాచలాన్ని చేరుకుని, పుష్కరిణికి దక్షిణం వైపున ఉన్న పెద్దపుట్టలో ఆకలిదప్పులతో అలమటిస్తుంటాడు. ఆయన దయనీయ స్థితిని గమనించి తనయుడైన బ్రహ్మదేవుడు గోవుగానూ, శివుడు దూడగానూ మారి, చోళరాజు పాలనలో ఉన్న వేంకటాచలం పరిసర ప్రాంతానికి చేరుకుంటారు. శ్రీమహావిష్ణువు పట్ల పట్టరాని ఆగ్రహంతో ఉన్నప్పటికీ, శివుడు, బ్రహ్మల ప్రోద్బలంతో లక్ష్మీదేవి గోపస్త్రీగా మారి, ముందుగా నిర్ణయించుకున్న పథకం ప్రకారం చోళరాజుకు ఈ ఆవూ-దూడను విక్రయిస్తుంది.
♾┉┅━❀🕉️❀┉┅━♾
🙏 *శ్రీనివాసునికి నుదుటిపై గాయం* 🙏
👉🏻 మేతకు వెళ్ళిన ఆవు గొల్లకాపరి కన్నుగప్పి, పుట్టలో ఉన్న శ్రీనివాసుని వద్దకు వచ్చి పాలు ధారగా కార్చేది. ఆ ఆవుపాలతో శ్రీనివాసుడు ఆకలి-దప్పులు తీర్చుకునేవాడు. అయితే, దేవతాకళ ఉట్టిపడే ఆ గోమాత పాలను తన పిల్లవానికి త్రాగించాలనే ఉబలాటంతో ఉన్న రాణి, ఆవు పాలు ఇవ్వకపోవడంతో, రాజుగారికి ఫిర్యాదు చేస్తుంది. చోళరాజు ఆవుల కాపరిని తీవ్రంగా దండిస్తాడు. దాంతో, ఆ ఆవును రహస్యంగా వెంబడించిన గొల్లకాపరి, ఆ గోమాత పుట్టలో పాలు కార్చడం గమనించి, గొడ్డలితో గోవుపై వేటు వేస్తాడు. ఆవు ప్రక్కకు తప్పుకోగా, పుట్టలో దాగున్న వేంకటేశుడు ఒక్క ఉదుటున లేవడంతో గొడ్డలిదెబ్బ శ్రీవారి తలకు తగిలి రక్తం చిందింది.
♾┉┅━❀🕉️❀┉┅━♾
🙏 *గొల్లవానికి ప్రథమదర్శన భాగ్యం* 🙏
👉🏻 గోమాతను గొడ్డలితో దండించబోవడం వల్ల కోపోద్రిక్తుడైన స్వామి, గొల్లకాపరిని పరుషవాక్కులతో మందలిస్తాడు. శ్రీనివాసుని నుదిటిపై తగిలిన గాయం నుంచి ధారగా కారుతున్న రుధిరాన్ని చూసి కలవరపడిన గొల్లవాడు తీవ్రంగా భీతిల్లి, క్షమాభిక్ష వేడుకుంటూ అక్కడికక్కడే మరణిస్తాడు.
👉🏻 మృతుడై పడివున్న గొల్లవానిని కరుణించిన శ్రీనివాసుడు, *"ఈ భూలోకంలో తొలిసారిగా నన్ను చూసిన ఈ గొల్లవాని సుకృతం గొప్పది. అందువలన కలియుగాంతం వరకు ప్రతిరోజూ మొట్టమొదట నన్ను దర్శించుకునే మహద్భాగ్యాన్ని ఈ గోపకుని సంతతికి కలిగేట్లు అనుగ్రహిస్తున్నాను"* అని వరమిస్తారు. ఆనాటి నుండి నేటి వరకూ గొల్లవాని సంతతే వంశపారంపర్యంగా ఆనందనిలయంలో దివ్యమంగళమూర్తిని తొలిగా దర్శించుకుంటున్నారు. అలాగే, ప్రథమతాంబూలం కూడా సన్నిధిగొల్లకే ఇస్తారు. సుప్రభాత సేవలో భాగంగా లాంఛనప్రాయంగా బంగారువాకిళ్ళు తెరిచే సమయంలోను, తోమాల, ఏకాంతసేవల్లో, శ్రీవారి ఉత్సవమూర్తులను ఆనందనిలయం బయటకు లేదా లోనికి తీసుకువెళ్ళేటప్పుడు, వీరి సేవలు అమూల్యం. వారి భావితరాలకు కూడా ఈ మహద్భాగ్యం యుగాంతం వరకూ కలుగుతూనే ఉంటుంది.
👉🏻 ఈ గొల్లల గుర్తుగా ప్రతి సంక్రాంతికీ, కనుమనాడు అత్యంత వైభవంగా జరిగే *"పార్వేట ఉత్సవం"* గురించి మున్ముందు తెలుసుకుందాం.
♾┉┅━❀🕉️❀┉┅━♾
🙏 *ఆలమందలతో అనుబంధం* 🙏
👉🏻 స్వామివారి ఆకలిదప్పులను తీర్చిన గోమాత పేరు *"గౌతమీధేనువు".* స్వామివారు సుప్రభాత సమయాన మేల్కొన్న వెంటనే, తొట్టతొలిగా వెచ్చని ఆవుపాలను స్వీకరిస్తూ ఆ గోమాత సంతతిని కూడా అనుగ్రహిస్తూనే ఉన్నారు. ద్వాపరయుగంలో గోకులం, వెన్నముద్దలతో చిన్నికృష్ణునికి ఉన్న అనుబంధం అలాగే కొనసాగుతూ, ఈ కలియుగంలో సన్నిధిగొల్ల పట్ల వేంకటేశుని వాత్సల్యానికి మరియు వారి దినచర్య ఆవుపాల సేవనంతో ప్రారంభించటానికి దారి తీసిందేమో!
♾┉┅━❀🕉️❀┉┅━♾
🙏 *బ్రహ్మ - రుద్రులకు శ్రీవారి అనుగ్రహం* 🙏
👉🏻 అలాగే, గోమాత రూపంలో పాలందించిన బ్రహ్మదేవునికి ప్రతిరోజూ నిశిరాత్రివేళలో, బంగారువాకిలి ద్వారాలు తెరువక ముందే, తనను సేవించుకునే మహద్భాగ్యాన్ని కలిగించాడు శ్రీనివాసుడు. "బ్రహ్మతీర్థాన్ని" గురించి మనం ముందుగానే తెలుసుకున్నాం.
👉🏻 ఆవు వెంట దూడగా వచ్చిన పరమశివునికి తిరుమల ఆలయ "క్షేత్రపాలకుని" గా ఉండే మహద్భాగ్యాన్ని ప్రసాదించారు. అందువల్లనే, ఆలయ ధ్వజస్తంభ మంటపంలో, ఈశాన్యదిక్కున క్షేత్రపాలకుడైన శివునికి గుర్తుగా, ఈ రోజుకూ ఉన్న *"క్షేత్రపాలక శిల"* పై ప్రతిరోజూ అర్చకులు బంగారువాకిలి తాళంచెవులను తాకించి నమస్కరిస్తారు. ఈ శిలలో కొంత భాగాన్ని, చిన్న "బలిపీఠం" రూపంలో నేడూ మనం చూసి తరించవచ్చు. దీనిని గురించి వెలుగులో ఉన్న ఓ ఆసక్తికరమైన ఐతిహ్యం మరోసారి తెలుసుకుందాం.
👉🏻 ఇలా, స్వామివారు తనను సేవించిన భక్తులందరికీ తరతరాలుగా తన కృపాకటాక్షాలు అందజేస్తూనే ఉన్నారు.
♾┉┅━❀🕉️❀┉┅━♾
[ రేపటి భాగంలో... *మరికొంతమంది భక్తాగ్రేసరుల*
గురించి తెలుసుకుందాం]
♾️•••┉┅━❀🕉️❀┉┅━•••♾️
🙏 *శ్రీనివాసుని శ్రీచరణాలను సేవిద్దాం, సకల శుభాలనూ పొందుదాం* 🙏
*...తిరుమల సర్వస్వం..... సశేషం...*
♾️•••┉┅━❀🕉️❀┉┅━•••♾️
No comments :