♾️•••┉┅━❀┉┅━•••
*శ్రీవారి సేవలు-3*
✍️ శ్రీమతి&శ్రీ పల్లపోతు వాణిశ్రీ-కృష్ణబాలాజీ
♾️•••┉┅━❀🔯❀┉┅━•••♾️
🙏 *శ్రీవారి సేవలు-3* 🙏
*కొలువు (లేదా ఆస్థానం లేదా దర్బార్):*
💫 బంగారు వాకిలిని ఆనుకుని లోపల ఉన్న గదిని *'స్నపన మండపం'* అంటారు. అక్కడే శ్రీవారికి ప్రతిరోజూ ఉదయం 4.30 గం.ల నుండి ఆస్థానం జరుగుతుంది.
💫 సన్నిధిలో ఉన్న పంచబేరాలలో ఒకరైన కొలువు శ్రీనివాసమూర్తిని ఛత్రచామరాది మర్యాదలతో, మంగళవాద్యాలతో, స్నపన మండపంలో ఉంచిన బంగారు సింహాసనంపై వేంచేపు చేస్తారు. ఆ తరువాత స్వామివారికి కొలువు నిర్వహింప బడుతుంది. ఈ సేవ పూర్తిగా ఏకాంతం. అర్చకులూ, ఆలయ అధికారులచే నిర్వహించ బడుతుంది. భక్తులకు అనుమతి లేదు.
💫 కొలువు శ్రీనివాసునికి షోడశోపచారాలు నిర్వహించి, ధూపదీప హారతులు సమర్పిస్తారు. అనంతరం అర్చకులు, శ్రీవారి నుండి తాంబూలం, దక్షిణతో కూడిన 20 శేర్ల (ఇంచుమించగా 16 కిలోలు) బియ్యాన్ని దానంగా స్వీకరించి, *"నిత్యేశ్వర్యాభవ"* అని శ్రీవేంకటేశ్వరస్వామిని ప్రార్థిస్తారు. ఆస్థానసిద్ధాంతి శ్రీనివాసునికి పంచాంగశ్రవణం చేస్తూ, ఆనాటి తిథి, వార, నక్షత్ర, యోగ, కరణాలను వినిపిస్తూ, నాటి ఉత్సవ విశేషాలను శ్రీవారికి తెలుపుతారు. ఆలయం యొక్క బొక్కసం (ట్రెజరీ) అధికారులు క్రితంరోజు ఆలయానికి హుండీ ద్వారా వచ్చిన రొఖ్ఖం, ఇతర కానుకల వివరాలను, ఆర్జిత సేవల ద్వారా వచ్చిన ఆదాయ వివరాలను మొదలగు వాటిని చదివి వినిపిస్తారు.
💫 కొలువు లేదా దర్బార్ యొక్క మిగతా విశేషాలన్నింటినీ మనం పంచబేరాలు కొలువు శ్రీనివాసుడు అనే ప్రకరణంలో తెలుసుకున్నాం. ఉదయం 4.30 గం. ల ప్రాంతంలో, ఆలయ పరిసరాల్లో మనం ఎక్కడ ఉన్నా "కొలువు" సందర్భంగా శ్రీవారికి చెప్పబడే వివరాలన్నింటినీ మనం కూడా వీనులవిందుగా విని తరించవచ్చు.
♾┉┅━❀🕉️❀┉┅━♾
🙏 *సహస్రనామార్చన* 🙏
💫 స్వామివారికి ప్రతిరోజూ మూడుపూటలా ఆనందనిలయంలో ఈ అర్చన సేవ జరుగుతుంది. ఉదయం 4.45 గం. నుండి 5.30 గం. వరకు జరిగే మొదటి అర్చనలో సహస్రనామావళితోనూ, మధ్యాహ్న మరియు సాయం సమయాల్లో అష్టోత్తరనామాలతోనూ స్వామిని అర్చిస్తారు. శ్రీవారి సహస్రనామాలలో ఒక్కో దానికి ఒక్కో విశేషం, ఒక్కో పరమార్థం ఉంది. ఈ నామాలు శ్రీమహావిష్ణువు యొక్క అన్ని అవతార విశేషాలను స్ఫురణకు తెస్తాయి.
💫 భక్తులు, కులశేఖరపడి నుంచి గరుడాళ్వార్ సన్నిధి వరకు బారులుతీరి కూర్చుని, సహస్రనామార్చనలో పాల్గొంటారు. శ్రీవారి పాదపద్మాలవద్ద వైఖానస అర్చకస్వాములు ఒక మేడికర్రతో చేయబడిన కూర్మాసనంపై కూర్చుని, సహస్రనామార్చనను ప్రారంభిస్తారు.
💫 ఆ తరువాత అర్చకులు తులసిదళాలతో శ్రీవారి పాదాలను, వారి వక్షస్థలంలో వెలసివున్న మహాలక్ష్మి అమ్మవారినీ అర్చిస్తారు. అనంతరం నక్షత్ర హారతినిచ్చి, నారికేళాన్ని, అరటిపండ్లనూ సమర్పిస్తారు.
💫 ఆ తరువాత స్వామివారికి చక్కెర పొంగలి, పులిహోర, పొంగలి మున్నగు అన్నప్రసాదాలతోనూ, లడ్లు, వడల వంటి పిండివంటలతో నిండిన గంగాళాలను స్వామివారి ముందుంచి నివేదన జరుపుతారు.
💫 అంతకు ముందుగానే ఒక పరిచారకుడు శ్రీవారి వంటశాల నుండి ప్రసాదాలను ఛత్రచామర మంగళవాద్యాలతో వరాహస్వామి ఆలయానికి తీసుకువెళ్ళి క్షేత్రనియమానుసారం, కలియుగారంభంలో శ్రీనివాసుడు ఇచ్చినమాట ప్రకారం, తొలి నివేదన ఆదివరాహునికి చేస్తారు. అక్కడ నివేదన జరిగిన తరువాత మాత్రమే, ఇక్కడ ఆనందనిలయంలో శ్రీవారికి నైవేద్యసమర్పణ జరుగుతుంది.
💫 ఆనంతరం అర్చకులు సుగంధద్రవ్య పూరితమైన తాంబూలాన్ని శ్రీవారికి సమర్పిస్తారు. ఈ అర్చన చేసినా, విన్నా, పాప విముక్తులౌతారని, సర్వదోషాలు హరిస్తాయని భక్తుల నమ్మిక.
💫 ఈ నామావళి మహాత్మ్యాన్ని సాక్షాత్తూ నారదమహర్షి తన తుంబుర నాదంతో కీర్తించడమే కాకుండా, స్వయంగా శ్రీనివాసునికి సహస్రనామార్చన గావించి జన్మ ధన్యం గావించుకన్నాడని ప్రతీతి.
♾┉┅━❀🕉️❀┉┅━♾
🙏 *నిత్యకళ్యాణోత్సవం* 🙏
💫 శ్రీదేవీ-భూదేవి సమేతుడైన శ్రీమలయప్పస్వామికి ప్రతినిత్యం మధ్యాహ్నం 12 గం. లకు అభిజిల్లగ్నంలో నిత్యకళ్యాణోత్సవం ప్రారంభమవుతుంది. రెండవ అర్చన, గంట ('గంట' గురించి తరువాత తెలుసుకుందాం), నివేదన పూర్తయిన తరువాత సంపంగి ప్రాకారం లోని కళ్యాణమంటపంలో శ్రీమలయప్పస్వామి వారు తూర్పు ముఖంగా ఒక బంగారు సింహాసనం మీద వేంచేపు చేయబడుతారు. దక్షిణంగా శ్రీదేవీ-భూదేవి అమ్మవార్లు మరొక బంగారు సింహాసనం మీద వేంచేపు చేస్తారు. 15-17 శతాబ్దాలలో తాళ్ళపాక వంశీయులు ఈ కళ్యాణోత్సవం ప్రారంభించినట్లు శాసనాల ద్వారా తెలుస్తోంది. తాళ్ళపాక వంశస్థులే నేటికీ కన్యాదాతలుగా వ్యవహరిస్తారు. శ్రీవారికి కళ్యాణం చేయించటానికి విచ్చేసిన గృహస్థులను కళ్యాణమంటపానికి అనుమతించి, వారి గోత్రనామాదులతో సంకల్పం చెప్పించి, వారిని స్వామి వారికి అభిముఖంగా కూర్చోబెడతారు.
💫 కళ్యాణోత్సవ కైంకర్యం జరిపించే వైఖానస అర్చకులు పసుపు ధోవతి ధరించి, బృహస్పతిగా వ్యవహరించే మరో అర్చకునితో సహా 'వోచి' సహాయంతో మంటపప్రవేశం చేసి శ్రీవారి పాదసేవ చేసుకుంటారు.
💫 తదుపరి క్రమంగా విష్వక్సేన ఆరాధన, పుణ్యాహవచనం, అంకురార్పణ, రక్షాబంధన (కంకణధారణ), అగ్నిప్రతిష్ఠ, హోమములు, తెరపట్టడం, కన్యావీక్షణము, మహాసంకల్పము, కన్యాదానము, గోత్రపఠనం, మాంగల్యపూజ, మాంగల్యధారణ, కర్పూరనీరాజనం, ప్రధానహోమం, లాజహోమం, పూర్ణాహుతి, రక్షాతిలకధారణ వంటి కైంకార్యాలను పూర్తి చేస్తారు.
💫 ఆ వెంటనే *'వారణమాయిరం'* (వధూవరులు నారికేళాలు చేతులు మార్చుకునే వివాహ లాంఛనం) కైంకర్యం జరిపి, *పుష్పమాలా పరివర్తనం* (శ్రీవారు-అమ్మవార్లు వేడుకగా పుష్పమాలలు మార్చుకునే ఘట్టం) గావించి, అమ్మవార్లను స్వామివారి వద్దకు వేంచేపు చేసి, *'అక్షతారోపణ'* తంతు (తలంబ్రాలు పోసుకోవడం) కావించి, చివరిగా ఆనందకర్పూరహారతితో కళ్యాణం ముగిస్తారు.
💫 సర్వజనులు క్షేమ, స్టైర్య, ధైర్యాదులతో ఉండాలనీ, స్త్రీలు ఈ జన్మలోనూ, మరుజన్మలోనూ, సువాసినులుగా ఉండాలనే మహాసంకల్పంతో శ్రీవారికి నిత్యకళ్యాణోత్సవం జరిపించటం పరిపాటి. ఈ నిత్యకళ్యాణోత్సవం వల్లనే శ్రీవారికి *'కళ్యాణచక్రవర్తి'* అని, తిరుమల క్షేత్రం నిత్యకళ్యాణం పచ్చతోరణంగా విరాజిల్లుతున్నదని ప్రశస్తులు ఏర్పడ్డాయి.
💫 ప్రతిరోజూ మధ్యాహ్నం 12 గం. నుండి 1 గం. వరకూ ఈ నిత్యకళ్యాణోత్సవం జరుగుతుంది.
♾┉┅━❀🕉️❀┉┅━♾
🙏 *డోలోత్సవం* 🙏
💫 నిత్యకళ్యాణోత్సవం పూర్తయిన తరువాత శ్రీదేవీ-భూదేవి సమేత శ్రీమలయప్పస్వామిని ధ్వజస్తంభానికి ఎడమవైపు (మనం మందిరంలోకి వెళ్ళేటప్పుడు కుడి వైపు) ఉన్న ఆయినామహల్ (అద్దాలమంటపం) లోకి తీసుకుని వెళతారు. ఈ మండపం మధ్యలో ఉన్న డోల (ఉయ్యాల) లో, స్వామివారికి ఉభయదేవేరుల సమేతంగా డోలోత్సవం నిర్వహిస్తారు. భక్తులను స్వామివారికి ఎదురుగా కూర్చుండబెట్టి, వేదపఠనం, వేదాశీర్వాదం జరుపుతారు. ఈ మండపంలో బిగించివున్న అద్దాలలో స్వామి అన్నివైపులా కనిపిస్తూ, భక్తులకు దివ్యదర్శనాన్ని అనుగ్రహిస్తూ, తన సర్వవ్యాపకత్వాన్ని తెలియజేస్తారు. తదుపరి, శ్రీవారికి *పంచకజ్జాయం* అనే ప్రసాదాన్ని నివేదన చేసి, హరతిస్తారు.
👉 (శ్రీవారికి సమర్పించే అనేక రకాలైన ప్రసాదాల గురించి మరొక ప్రకరణంలో విస్తారంగా తెలుసుకుందాం).
💫 ప్రతిరోజూ మధ్యాహ్నం 1-2 గం. ల మధ్య ఈ డోలోత్సవం జరుగుతుంది.
♾┉┅━❀🕉️❀┉┅━♾
🙏 *ఆర్జిత బ్రహ్మోత్సవం* 🙏
💫 ఉభయదేవేరులతో కూడిన మలయప్పస్వామికి సంక్షిప్తంగా వాహనసేవలను నిర్వహించడం *'ఆర్జిత బ్రహ్మోత్సవం'* గా పిలువబడుతుంది. శ్రీవారి ఉత్సవమూర్తులను బంగారు తిరుచ్చి మీద ఆలయం వెలుపల ఉన్న వైభవోత్సవ మండపానికి (ఈ మండపాన్ని రాంబగీచా ఆతిథి గృహం నుంచి శ్రీవారి మందిరానికి వెళ్ళేటప్పుడు, గేటు దాటగానే కుడి ప్రక్కన చూడవచ్చు).
💫 అక్కడ శ్రీవారికి ఆర్జిత బ్రహ్మోత్సవంలో భాగంగా ముఖ్యమైన వాహనాలైన గరుడవాహనం, హనుమంతవాహనం, పెద్దశేషవాహనంలో వేంచేపుచేసి హారతి ఇస్తారు.
💫 ఈ సేవలో పాల్గనటం ద్వారా భక్తులకు శ్రీవారి అనుగ్రహం ద్వారా బుద్ధిబలం, యశస్సు, ధైర్యం, ఆరోగ్యం, ధనలాభం, సంతానప్రాప్తి కలుగుతాయి.
💫 ప్రతిరోజూ మధ్యాహ్నం 2-3 గం. ల మధ్య ఈ సేవ జరుగుతుంది.
♾┉┅━❀🕉️❀┉┅━♾
🙏 *ఆర్జితవసంతోత్సవం* 🙏
💫 ఆర్జిత బ్రహ్మోత్సవానంతరం, శ్రీవారి ఉత్సవమూర్తులను (శ్రీదేవీ-భూదేవి సమేత మలయప్పస్వామిని) స్నానపీఠం మీదకు వేంచేపుచేసి తెల్లటి స్నానవస్త్రాలను ధరింపజేస్తారు. తదుపరి, భక్తులను అనుమతించిన తరువాత, వైఖానస అర్చకులు ఘంటానాదంతో వసంతోత్సవ కైంకర్యాన్ని ప్రారంభించి, విష్వక్సేనారాధన, పుణ్యాహవాచనం, వరుణదేవతారాధన, ద్రవ్యదేవతారాధన నిర్వహిస్తారు. పంచామృతద్రవ్యాలైన ఆవుపాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్ళు, మరియు చందనాదులతో ఆయా దేవతలను ఆవాహన చేసి అర్చిస్తారు. అనంతరం అర్చకులు ఉత్సవమూర్తులకు పంచామృతద్రవ్యాలతో స్నపన తిరుమంజనం (అనగా, పవిత్ర అభిషేకం) నిర్వహిస్తారు. చివరగా, కుంభంలోని మంత్రోదకంతో సహస్రధారాస్నపన (జల్లెడ వంటి, వెయ్యి రంధ్రాలు కలిగిన, వెండి సహస్రధారాపాత్ర ద్వారా అభిషేకద్రవ్యాన్ని మూర్తులపై ప్రోక్షింపజేయటం) చేసిన పవిత్రతీర్థజలాన్ని భక్తుల శిరస్సు మీద జల్లుతారు. తరువాత శ్రీవారికి వస్త్ర, ఆభరణ, పుష్పమాలా సమర్పణ మరియు మహానివేదన జరిపి, కర్పూరహారతి సమర్పణతో వసంతోత్సవం పూర్తి చేస్తారు.
💫 ఈ సేవలో పాల్గొన్న భక్తులకు శ్రీవారి కరుణ వల్ల సంతానవృద్ధి, విజయప్రాప్తి, కీర్తి, కామ్యసిద్ధి, సర్వవ్యాధి పీడ నివారణ, దేహాంతంలో విష్ణుసాయుజ్యం లభిస్తాయి.
💫 వసంతోత్సవం వైభవమండపంలో సాయంకాలం 3-4 గం. ల మధ్యలో జరుగుతుంది.
♾┉┅━❀🕉️❀┉┅━♾
🙏 *సహస్రదీపాలంకరణసేవ* 🙏
💫 ఉభయదేవేరులతో కూడిన మలయప్పస్వామి వారు వైభవోత్సవమండపం నుండి సహస్రదీపాలంకరణ మండపానికి విచ్చేస్తారు. ఈ మండపం నాదనీరాజనం వేదికకు కుడిప్రక్కగా, తూర్పు-దక్షిణ మాడవీధుల కూడలిలో ఉంటుంది.
💫 అప్పటికే దేదీప్యమానంగా ప్రకాశిస్తున్న సహస్రదీపాల మధ్య ఉన్న ఊయలో స్వామివారు ఉభయదేవేరుల సమేతంగా ఆసీనులై భక్తులకు దర్శనమిస్తారు. శ్రీవారికి మొదటగా, *పంచకజ్జాయం* నివేదన చేసిన తరువాత వేదపారాయణ పఠనం, అన్నమాచార్య - పురందరదాసు కీర్తనల ఆలాపన, నాదస్వరవాదన వినిపిస్తారు. ఈ విధంగా వేద, నాద, గానాలతో మలయప్పస్వామి మెలమెల్లగా ఊయల ఊగుతూ భక్తులకు దర్శనమిస్తారు. తరువాత శ్రీవారికి నక్షత్ర హారతి, కర్పూర నీరాజన సమర్పణతో ముగిసే ఈ సేవ ప్రతిరోజూ సాయంకాలం 5.30 గం. లకు మొదలవుతుంది. ఏ విధమైన ముందస్తు బుకింగు లేకుండా, టిక్కెట్టు లేకుండా కూడా ఎవరైనా ఈ సేవ చూసి తరించవచ్చు. ముందస్తు టిక్కెట్టు తీసుకున్న భక్తులకు మాత్రం, ముందు వరుసల్లో కూర్చుని, సేవను సమీపం నుంచి దర్శించుకునే అవకాశం కలుగుతుంది.
💫 అనంతరం స్వామివారు ఉభయనాంచారులతో, నాలుగు మాడవీధులలో నిత్యోత్సవానికి వేంచేస్తారు. ఆలయానికి 8 దిక్కులలో కర్పూర నీరాజనం సమర్పిస్తారు. తూర్పు మాడవీధిలో పుష్కరిణి వద్ద *'పుష్కరిణి హారతి'* సమర్పింప బడుతుంది. తదుపరి, కుంభహారతి మరియు కర్పూరహారతి సమర్పణతో శ్రీవారు ఆలయ పునఃప్రవేశం చేస్తారు.
💫 దీనితో, ఉత్సవమూర్తులకు ఆలయం వెలుపల జరిగే నిత్యసేవలు పూర్తవుతాయి.
♾┉┅━❀🕉️❀┉┅━♾
🙏 *సాయంకాలం అర్చన* 🙏
💫 శ్రీవారి ఉత్సవమూర్తులను బంగారువాకిలిలో వేంచేపు చేసి, *సిరాతళిగ* ను (రవ్వతో చేసిన ప్రసాదము - రవ్వకేసరి లాగా ఉంటుంది) నివేదించి నీరాజనం సమర్పిస్తారు. ఉత్సవర్లను తిరిగి సన్నిధిలో యథాస్థానానికి వేంచేపుచేసి హారతి సమర్పిస్తారు. అప్పుడు రెండవ తోమాలసేవ ప్రారంభమవుతుంది.
💫 సన్నిధిగొల్ల ముందు రాగా అర్చకులు ఆలయప్రవేశం చేసి స్వామికి పాదసేవ చేసి, హారతి ఇచ్చిన తరువాత మూలవర్లకూ, ఇతర దేవతా మూర్తులకు ఉదయం తోమాలసేవలో అలంకరింపబడిన పుష్పమాలలు సడలింపు చేయబడతాయి. తరువాత స్థలశుద్ధి, పాత్రశుద్ధి జరుపబడతాయి. అనంతరం జియ్యరు స్వాములు యమునోత్తరైలోని పుష్పమాలలు వెదురుబుట్టలో ఉంచి, శిరస్సు మీదుంచుకొని, ధ్వజస్తంభ ప్రదక్షిణగా సన్నిధికి చేరుతారు. పిమ్మట అర్చకులు ఘంటానాదం చేసి, జియ్యంగార్ స్వామికి ఆలవట్టం (వెడల్పైన, నగిషీలతో కూడిన వెండి వింజామర) ఇచ్చి, వారిచేతి నుండి తులసి స్వీకరించి, ప్రాణాయామం, సంకల్ప క్రియలు చేస్తారు. బంగారుబావి తీర్థంతో పాత్రలు నింపి శ్రీవారి ఆరాధనకు సిద్ధం చేస్తారు. మూలవర్లకు ఆసనం, పాదం, ఆర్ఘ్యం, ఆచమనం, శంఖోదకం వంటి ఉపచారాలు చేస్తారు. తర్వాత మూలవర్లతో సహా దేవతా మూర్తులందరినీ పుష్పమాలలతో నేత్రపర్వంగా అలంకరిస్తారు. మంత్రపుష్పం చదివిన తరువాత, ఉదయం వలె జియ్యర్ స్వాములు, *"సాయిత్తిరుళా..."* అని పాత్రం చెప్పగానే, కులశేఖరపడి వెలుపల ఉన్న అధ్యాపకులు, *"నిత్యానుసంధానం"* అనే నాలాయిర దివ్యప్రబంధలోని పాశురాలను గానం చేస్తారు.
💫 అనంతరం శ్రీవారికి నక్షత్ర హారతి, కర్పూర నీరాజన సమర్పణ జరుగుతుంది. అర్చకస్వామి శ్రీవారికి ఆలవట్టం సమర్పించి క్షమాప్రార్థన, పాదసేవ చేసిన తరువాత జియ్యరు స్వాములకు, గోష్ఠికి (అర్చక బృందం) శఠారి ఇస్తారు.
♾┉┅━❀🕉️❀┉┅━♾
🙏 *రాత్రి అర్చన* 🙏
💫 అర్చకస్వామి ఘంటానాదం చేసి, కూర్మాసనం మీద ఆసీనుడై, సంకల్పం చేసి అర్చన ప్రారంభించగానే, వేదపారాయణదారు కేశవాది చతుర్వింశతి నామాలు పఠిస్తుండగా, తులసిదళాలను శ్రీవారి పాదాలకు అర్పించి, ధూప, దీప సమర్పణ చేస్తారు. తర్వాత శ్రీవారికి అష్టోత్తర నామావళి పఠనంతో పాటుగా తులసీదళార్చన జరుగుతంది. వెంటనే వక్షఃస్థల మహాలక్ష్మికి "చతుర్వింశతి" నామార్చన చేసి, నీరాజనం సమర్పణ చేసి, నైవేద్యాన్ని సమర్పించి బంగారువాకిలి ప్రక్కన ఉన్న ఘంటామండపం లోని గంటలన్నింటినీ ఒకే సారి గంభీరంగా మ్రోగిస్తారు.
♾┉┅━❀🕉️❀┉┅━♾
🙏 *పర్యంకాసనము (లేదా ఏకాంతసేవ)* 🙏
💫 శ్రీవారి ఆలయంలో చిట్టచివరిగా జరిగే సేవ ఏకాంతసేవ. దీనినే ఆగమ పరిభాషలో *"పర్యంకాసనము"* లేదా *"శయనాసనము"* అని కూడా అంటారు.
💫 మొట్టమొదటగా, సన్నిధిలో శ్రీవారి మూలవర్లకు, ఇతర దేవతా మూర్తులకు రాత్రి తోమాలసేవలో అలంకరించిన పుష్పమాలలను సడలింపు చేస్తారు. బంగారు పట్టెమంచాన్ని తెచ్చి అనందనిలయానికి ముందున్న శయనమండపంలో వెండిగొలుసుతో వ్రేలాడదీసి దానిపై పట్టుపరుపునూ, దిండ్లను అమర్చుతారు. శయనమండపంలో ముగ్గు వేసి దీపాలను వెలిగించుతారు.
👉 *పర్యంకాసనంలో అయిదు ఉపచారాలు ఉంటాయి.*
1. మృగనాభిశ్చతాంబూలం (కస్తూరి సహిత సువాసన భరిత తాంబూలం),
2. గంధము,
3. పుష్పము,
4. ప్రదక్షిణ,
5. నమస్కారాదులు.
💫 ఈ ఉపచారాల తదుపరి, మహా భక్తురాలైన తరిగొండ వెంగమాంబ వంశీయులు పట్టెమంచం చుట్టూ రంగవల్లులు తీర్చి దిద్దుతారు. ఈ సేవను కౌతుకబేరం భోగశ్రీనివాసునికి జరుపుతారు. అయితే, ధనుర్మాసంలోని 30 రోజులూ భోగశ్రీనివాసునికి బదులుగా సన్నిధిలో ఉన్న వెండి కృష్ణమూర్తికి జరుపుతారు.
💫 అర్చకులు, ఆనంద నిలయాంతర్భాగంలో గల రాములవారి మేడ తలుపు దగ్గరగా వేసి, బంగారువాకిలికి తెర వేస్తారు. అప్పుడు గరుడమండపం వద్ద సన్నాయిమేళం శ్రవణానందంగా మ్రోగింపబడుతుంది. పోటువారు వేడిగా కాచిన ఆవుపాలు సన్నిధికి తెస్తారు. సభ అరవారు *పంచకజ్జాయం* (జీడిపప్పు, పంచదార, యాలకులు, గసగసాలు, ఎండుకొబ్బరి ముక్కల మిశ్రమం), మధురఫలాల ముక్కలు, తాంబూలం, చందనం సిద్ధం చేసి సన్నిధికి తెస్తారు. అర్చకస్వామి పంచపాత్రలలో, బంగారు బిందెలోని తీర్థం నింపి ఉంచుతారు. ఆలయ ఐతిహ్యం ప్రకారం రాత్రి తలుపులు వేసిన తరువాత బ్రహ్మాది దేవతలు శ్రీవారికి ఏకాంతంగా ఆరాధన చేస్తారని ప్రతీతి. వారి ఆరాధన కోసం పంచపాత్రలలో ఈ తీర్థం సిద్ధం చేస్తారు. శ్రీవారి దర్శనం తరువాత, వకుళమాత దర్శనానంతరం ముఖ్యాలయానికి ఎడంప్రక్కగా ఉన్న గట్టుమీద, అంకురార్పణ మంటపంలో సుప్రభాత సేవ భక్తులకు వితరణ చేసే తీర్థం అదే. బ్రహ్మచే అభిషేకించబడిన తీర్థం కనుక దాన్ని *"బ్రహ్మతీర్థం"* అంటారు.
💫 శ్రీవారి గెడ్డాన్ని పచ్చకర్పూరంతో అలంకరిస్తారు (దీనికి సంబంధించి ఆసక్తికరమైన కథను శ్రీవారి భక్తశిఖామణి అయిన అనంతాళ్వార్ చరిత్రలో తెలుసుకుందాం). శ్రీవారి బంగారు పాదకవచాలు తీసి, స్వామిపాదాల మీద రెండు చందనపుముద్దలు సమర్పిస్తారు. వక్షస్థల లక్ష్మీ అమ్మవారికి ఒక చందనపు ముద్ద ఉంచుతారు. మరొక ముద్ద బ్రహ్మాది దేవతల ఆరాధన నిమిత్తం, అరముద్ద భోగశ్రీనివాసమూర్తి హృదయంపైనా ఉంచుతారు. తరిగొండ వంశీయులు "ముత్యాలహారతి" తట్టలో ముత్యాలతో శ్రీవారి రూపం ఏర్పరిచి, హారతికర్పూరం, ముడుపు (తమలపాకులు, వక్కలు) సిద్ధం చేస్తారు.
💫 తదుపరి, సన్నిధిలో వైఖానస అర్చకులు మాత్రం ఉండగా, రాములవారి మేడ తలుపులు వేయబడతాయి. అర్చకులు మంచాన్ని మంత్రోదకంతో సంప్రోక్షించి, ఉదయం ఆరాధన సమయంలో మూలవర్ల నుండి ఇతరబేరములకు ఆవాహన చేసిన శక్తిని మూలవర్లలోనికి పునరావాహన చేసి, శ్రీవారి శయనబేరం అయిన భోగ శ్రీనివాసుణ్ణి శయనం పైకి ఆహ్వానించి, పట్టెమంచంపై నుండి భక్తులను చూస్తున్నట్లుగా, దక్షిణం తలంపుగా శయనింపజేస్తారు. తదుపరి, హారతి సమర్పించడంతో ఆ రోజు నిత్యకైంకర్యాలు సమాప్తి అవుతాయి.
💫 అర్చకులు, *సాబూతు* (స్వామివారికి అలంకరించిన నగల పరిశీలన) చూసుకుని, మంత్రోచ్ఛారణ జరుగుతుండగా, కుంచెకోలతో తలుపులు మూసివేస్తారు.
🙏 *నేటితో "శ్రీవారిసేవలు" సమాప్తం* 🙏
[ రేపటి భాగంలో... *శ్రీవారి కైంకర్యపరులు*... ]
•••┉┅━❀🕉️❀┉┅━•••
🙏 శ్రీనివాసుని శ్రీచరణాలను సేవిద్దాం, సకల శుభాలనూ పొందుదాం🙏
*...తిరుమల సర్వస్వం..... సశేషం...*
No comments :