•••┉┅━❀🕉️❀┉┅━•••
✍️ శ్రీమతి&శ్రీ పల్లపోతు వాణిశ్రీ-కృష్ణబాలాజీ
•••┉┅━❀🕉️❀┉┅━•••
*శ్రీవారి వారోత్సవాలు-3*
🙏 *శుక్రవారం అభిషేకం* 🙏
*"కంటి శుక్రవారము గడియ లేడింట -*
*అంటి అలమేల్మంగ అండ నుండే స్వామిని!"*
👉🏻 అన్న కీర్తనలో, అన్నమయ్య, శుక్రవారాభిషేకం సందర్భంగా శ్రీవారికి జరిగే ఉపచర్యలన్నీ ముగ్ధమనోహరంగా వర్ణించాడు. ఆ వాగ్గేయకారుని వర్ణన ముందు, మనం చెప్పుకునే అభిషేక ముచ్చట్లన్నీ, చంద్రుని ముందు దీవిటీ లాగా వెల వెల బోతాయని తెలిసీ, స్వామివారి మీద భారం వేసి ఈ సాహసానికి పూనుకుంటున్నాం.
👉🏻 శ్రీవేంకటేశుని మూలమూర్తికి ప్రతి శుక్రవారం ఉదయం 3:30 గం. ల నుండి 5 గం. ల మధ్య శుక్రవార అభిషేకం జరుగుతుంది. అభిషేక సమయంలో ఆభరణాది అలంకారాలు లేకుండా ఉన్న స్వామివారి మూర్తి యొక్క సొబగులు వర్ణించడం మహామహుల తరం కూడా కాదు. తీర్చిదిద్ది నట్లుండే పెదవులు, సంపెంగ వంటి ముక్కు, వికసించిన పుష్పంలా ఉండే ముఖారవిందాన్ని వీక్షిస్తూ భక్తజనులు మైమరచి పోతుంటారు.
🌈 *అభిషేక సేవ పుట్టు పూర్వోత్తరాల్లోకి వెళ్తే ----* 🌈
👉🏻 పల్లవరాణి "సామవై" భోగశ్రీనివాసుని వెండి ప్రతిమను బహూకరించినప్పటి కాలం, అనగా 614 వ సం., ముందు నుండీ, విశేష సందర్భాల్లో ఈ అభిషేకోత్సవం జరిగేది. తరువాతి కాలంలో ప్రతి రెండవ శుక్రవారం (పక్షానికో సారి) జరిగేది. అయితే, 11-12 శతాబ్దాల్లో భగవద్రామానుజుల వారు స్వామివారి వక్షఃస్థలంలో *"బంగారు అలమేలు మంగ"* ప్రతిమను అలంకరింప జేసిన శుక్లపక్ష ద్వాదశి ఉత్తరఫల్గుణీ నక్షత్ర శుక్రవారం నాటి నుండి, ప్రతీ శుక్రవారం ఈ అభిషేక సేవ నిరాఘాటంగా జరుగుతూ వస్తోంది.
👉🏻 ప్రాతఃకాల ఆరాధన పూర్తి కాగానే, అర్చకులు తెర వేసి శుక్రవార అభిషేక నిమిత్తం, ఏకాంతంగా శ్రీవారికి సంకల్పం చేస్తారు. ఉపచారాలు సమర్పించి, అష్టోత్తరశత నామార్చన కూడా చేస్తారు. అభిషేకానికి ముందుగా శ్రీవారి ఊర్ధ్వపుండ్రాన్ని (తిరునామం) అర్ధభాగానికి తగ్గించి సూక్ష్మ ఊర్ధ్వపుండ్రంతో ఉంచుతారు. ఉత్తరీయాన్ని తొలగించి స్నాన కౌపీనాన్ని ధరింప జేస్తారు.
👉🏻 ఆ సమయంలో పరిచారకులు శీవారి సన్నిధానంలో రెండు వెండి గంగాళాల గోక్షీరం, మరో రెండు గంగాళాల బంగారుబావి శుధ్ధోదకం సిద్ధం చేస్తారు.
👉🏻 జియ్యంగార్లు అందించే క్షీరంతో నిండి ఉన్న శంఖుపాత్రలను అర్చక స్వాములు స్వీకరించి, పండితులు వేదపారాయణం జరుపుతుండగా, క్షీరాభిషేకం చేస్తారు. అప్పుడు, శ్రీవారి వరదహస్తం నుండి జాలువారే గోక్షీరాన్ని పాత్రల్లో స్వీకరించి తరువాత భక్తులకు తీర్థంగా ఇస్తారు.
👉🏻 తరువాత చందనాన్ని శ్రీవారి దక్షిణహస్తం పై సమర్పించి, శ్రీవారి హస్తరేఖాంకితం చేసి అర్చకులు, జియ్యంగార్లు స్వీకరిస్తారు. పిమ్మట అర్చకులు పరిమళ పాత్రను తీసుకుని, ఆ పరిమళద్రవ్యాన్ని స్వామివారి కిరీటాన్నుండి ప్రారంభించి శరీరమంతా పూసి నలుగు పెడతారు. ఈ పరిమళ ద్రవ్యం పునుగు, జవ్వాది, కస్తూరి వంటి సుగంధద్రవ్యాల మిశ్రమం.
*"పచ్చకప్పురమె నూరి పసిడి గిన్నెల నించి*
*తెచ్చి శిరసాదిగ దిగనలది*
*అచ్చెరపడి చూడ అందరి కన్నులకింపై*
*నిచ్చెమల్లెపూవు వలె నిటుతానుండే స్వామిని!!"*
అనే కీర్తనలో అన్నమయ్య శ్రీవారిని అభిషేక నిమిత్తం సిద్ధం చేసే ఘట్టాన్ని ముగ్ధమనోహరంగా వివరించారు.
👉🏻 తరువాత, మహాభక్తుడు తిరుమలనంబి వంశీయులు తెచ్చి సిద్ధంగా ఉంచిన ఆకాశగంగ తీర్థంతో, తదుపరి శుధ్ధోదకంతో, స్నానాన్ని ప్రారంభించి స్వామివారి తిరుమేను పైనుండి పరమళ ద్రవ్యంతో కలిసి జాలు వారుతున్న అభిషేక ఉదకాన్ని అవయవాల వారిగా, ఆయుధాల వారిగా స్వీకరించి ఆ పవిత్ర తీర్థాన్ని తరువాత భక్తులకు ప్రసాదిస్తారు.
👉🏻 ఆ తరువాత పసుపుతో శ్రీవారి వక్షఃస్థల మహాలక్ష్మికి కూడా అభిషేకం జరుగుతుంది. ఏ యుగం లోనో బ్రహ్మాది దేవతల కోరిక మేర, కలియుగ మానవుల కోసం వెలసిన శ్రీనివాసుని యథాతథమైన రూపాన్ని, వక్షస్థల లక్ష్మితో సహా దర్శించే మహద్భాగ్యం శుక్రవార అభిషేక సమయంలో మాత్రమే కలుగుతుంది. శ్రీవారి మెడలో ఉన్న బంగారు అలమేల్మంగకు కూడా తరువాత అభిషేకం జరుగుతుంది.
👉🏻 తదనంతరం శ్రీవారికి 108 కలశాల శుద్ధ జలంతో అభిషేకం పూర్తి చేస్తారు. ఈ అభిషేక తీర్థాన్ని ప్రధాన అర్చకుడు పాత్రలలో సేకరించి, మొదట తన శిరస్సును సంప్రోక్షించుకుని, సన్నిధానంలో ఉన్న ఇతర అర్చకులు, ఏకాంగి, ఆచార్యపురుషులు, ఆలయ అధికారుల మీద *"భూతో భవః"* అంటూ ప్రోక్షణ చేస్తారు.
👉🏻 తరువాత అర్చకులు తెరవేసి శ్రీవారికి *ఉన్ శాత్* అనబడే 24 మూరల పొడవు గల *సరిగంచు పట్టు ధోవతి* ని ధరింపజేస్తారు. ఆలాగే 12 మూరల ఉత్తరీయాన్ని వల్లెవాటుగా వేస్తారు. వెంటనే శ్రీవారికి *గోనవనీతం* (వెన్న, పంచదార) నివేదన చేసి, *ముఖవాసం* (కస్తూరి తాంబూలం) సమర్పిస్తారు. తరువాత పచ్చకర్పూర హారతినిస్తూ, తెర తొలగిస్తారు.
👉🏻 తరువాత, మళ్ళీ తెరవేసి ఏకాంతంగా ఊర్ధ్వపుండ్రం, వస్త్రాలంకార సేవలు కావించి భక్తుల సందర్శనార్థం తిరిగి తెర తీయడంతో, అభిషేక సేవాకార్యక్రమం పూర్తవుతుంది. అభిషేకానంతరం గడ్డం బొట్టు మాత్రం అలంకరించరు.
👉🏻 *శ్రీవారి శుక్రవార అభిషేక దర్శనంతో, భక్తుల జన్మ జన్మాంతర పాపాలన్నీ శుభ్రంగా కడిగి వేసినట్లు తొలగిపోవడమే కాకుండా, ఆరోగ్య-ఐశ్వర్య సంపదలు సమృద్ధిగా కలుగుతాయని ప్రతీతి.*
👉🏻 అత్యంత దుర్లభమైన ఈ సేవలో పాల్గొనాలనే ప్రగాఢవాంఛ శ్రీనివాసుని ప్రతి భక్తునికీ ఉంటుంది. అయితే, శీవారి అనుగ్రహం పొందిన ఏ కొద్ది మందికో మాత్రమే ఈ భాగ్యం కలుగుతుంది.
👉🏻 అకుంఠిత భక్తి విశ్వాసాలతో, అసాధ్యాలను సుసాధ్యం చేయవచ్చని ఎందరో భక్తలు నిరూపించారు. మనమూ ప్రయత్నిద్దాం! కృషితో నాస్తి దుర్భిక్షం!
♾┉┅━❀🕉️❀┉┅━♾
🌈 *నిజపాద దర్శనం* 🌈
👉🏻 ప్రతి శుక్రవారం అభిషేకానంతరం, అభిషేక సేవలో పాల్గొన్న భక్తులు స్వామివారిని దర్శించి వెళ్ళిన తరువాత నిజపాద దర్శనం అనే ఆర్జితసేవ ప్రారంభ మవుతుంది. ఈ సేవలో పాల్గొనే భక్తులు స్వామివారి పాదాలను ఎటువంటి ఆచ్ఛాదన లేకుండా చూడవచ్చు. మిగిలిన వేళల్లో ఆ పాదాలు బంగారు తొడుగులతో విరాజిల్లుతూ ఉంటాయి.
👉🏻 మూలమూర్తిని శ్రద్ధగా గమనిస్తే, శ్రీవారు దక్షిణహస్తంతో తన పాదద్వయాన్ని సూచిస్తుంటారు. వామహస్తం కటి భాగాన, కుడివైపు తిరిగి నేలకు సమాంతరంగా ఉంటుంది. అంటే, భక్తులు తన పాదాల్ని శరణు వేడితే, వారిని తన వామహస్తంతో అక్కున చేర్చుకుంటానని సందేశమిస్తున్నారన్నమాట. అందువల్లనే, శ్రీవారి పాద దర్శనంతో పాపాలు పటాపంచలౌతాయని తరతరాల నమ్మిక.
🙏 *శ్రీవారి పాద దర్శనం సర్వ పాప విమోచనం.*
🙏 *బ్రహ్మ కడిగిన ఆ పాదాలు కనికరిస్తే కానిదే ముంటుంది?* 🙏
♾┉┅━❀🕉️❀┉┅━♾
🌈 *వస్త్రాలంకారసేవ* 🌈
👉🏻 ఈ ఆర్జితసేవ కూడా ప్రతి శుక్రవారం అభిషేకానంతరం జరుగుతుంది.
👉🏻 అర్చకులు ముందుగా భక్తులు సమర్పించిన నూతన వస్త్రాలను శ్రీవారికి ధరింపజేసి, వారిని ఆభరణాలతో అలంకరిస్తారు. ఇదంతా ఏకాంతంగా జరుగుతుంది.
👉🏻 వస్త్రాలంకార మరియు అభిషేక సేవల్లో పాల్గొన్న భక్తులను నైవేద్యం తరువాత, నూతన వస్త్రధారుడైన వేంకటేశుని దర్శించటానికి అనుమతిస్తారు.
👉🏻 శ్రీవారికి సడలింపు జేసిన వస్త్రాన్ని, విమాన ప్రదక్షిణ మార్గంలో ఉన్న సబేరా అనే గదిలో భద్రపరుస్తారు. స్వామి వారి
👉🏻 అలంకరణకు కావలసిన ఇతర సామగ్రి, ఏకాంతసేవలో ఉపయోగించే వెండి మంచం, మొదలైనవన్నీ కూడా ఈ గది లోనే భద్ర పరుస్తారు.
👉🏻 అత్యంత ప్రముఖులు శ్రీవారి దర్శనార్థం వచ్చినప్పుడు వారికి ఈ సడలింపు చేయబడిన వస్త్రాన్ని మేల్చాట్ వస్త్రంగా బహూకరిస్తారు. అందుకే ఈ సేవను *మేల్చాట్ వస్త్రసేవ* అని కూడా అంటారు. శ్రీవారి సేవలన్నింటిలో ఖరీదైన ఈ సేవ నిమిత్తం ఒక జంటకు ప్రస్తుతం ₹12,250 చెల్లించాలి.
👉🏻 తిరునామంతో పాటుగా, శ్రీవారి గడ్డం కూడా కర్పూరంతో అలంకరింప బడి ఉండటం మనం చూసే ఉంటాం. అలాగే, శ్రీవారి మహాద్వారానికి కుడివైపుగా (మందిరంలోకి వెళ్తూంటే) అలంకరింప బడిన గడ్డపారను కూడా తరచూ ఆలయాన్ని సందర్శించేవారు గమనించే ఉంటారు. వీటన్నింటికీ సంబంధించి ఓ ఆసక్తికరమైన కథను, మరో మహా భక్తుడు భక్తశిఖామణి అనంతాళ్వార్ గురించి తెలుసుకునే ముందు, ప్రతి సోమవారం నాడు జరిగే విశేషపూజల గురించి తెలుసుకుందాం.
♾┉┅━❀🕉️❀┉┅━♾
🌈 *విశేషపూజ* 🌈
👉🏻 ఈ ఆర్జితసేవ, ప్రతి సోమవారం ఉదయం 6 గం. లకు సంపంగి ప్రదక్షిణం లోని కళ్యాణ మంటపంలో, ఉభయ నాంచారులతో కూడిన మలయప్ప స్వామి వారికి జరుప బడుతుంది.
1991వ సం. లో ఈ సేవ ప్రవేశపెట్టబడింది.
👉🏻 శ్రీ మలయప్పస్వామి కళ్యాణమంటపానికి వేంచేసిన తరువాత, వైఖానస ఆగమ శాస్తోక్తంగా హోమాలు నిర్వహించిన పిదప, స్వామివారికి స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. తదనంతరం, భక్తులకు ప్రసాదాలు అందజేస్తారు.
✅ *శనివారం, ఆదివారం ప్రత్యేక సేవలు ఏమీ ఉండవు.*
[ రేపటి భాగంలో... *అనంతాళ్వార్* గురించి తెలుసుకుందాం]
•••┉┅━❀🕉️❀┉┅━•••
🙏 *శ్రీనివాసుని శ్రీచరణాలను సేవిద్దాం, సకల శుభాలనూ పొందుదాం* 🙏
*...తిరుమల సర్వస్వం..... సశేషం...*
♾️•••┉┅━❀🕉️❀┉┅━•••♾️
No comments :