*"సాలగ్రామాలు"*
తిరుమల ఆనందనిలయంలో శ్రీ స్వామివారి మూలవిరాణ్మూర్తి, ఇతర ఉత్సవమూర్తులతోపాటు, ప్రత్యేకంగా నాలుగు పెద్ద సాలగ్రామాలు, ఇంకా కొన్ని చిన్న సాలగ్రామాలు నిత్యాభిషేకాలు, అర్చనలు అందుకుంటూ వున్నాయి. ఈ సాలగ్రామాలన్నీ శ్రీస్వామివారి పాదాల చెంత వెండిపాత్రల్లో వుంచబడి పూజింపబడుతూ వున్నాయి.
🌞ప్రతిరోజూ భోగశ్రీనివాసమూర్తితో పాటు ఈ సాలగ్రామాలకు అభిషేకం జరిగిన తర్వాత అన్ని మూర్తులతోపాటు ఈ సాలగ్రామాలకు పుష్పార్చన, నివేదన జరుపబడుతున్నది. ఇలా పూజలందుకొంటూ వున్న సాలగ్రామాలు మాత్రమేకాక, శ్రీస్వామివారి దివ్యమూలవిరాణ్మూర్తికి ఇరువైపులా రెండు భుజాలనుండి పాదాలవరకు వేలాడుతున్న దివ్యసాలగ్రామ హారాలు నిత్యశోభాయమానంగా ప్రకాశిస్తూ వున్నాయి.
🌞బంగారు కవచాలలో పొదుగబడి కూర్చబడిన ఈ రెండు సాలగ్రామ హారాలు మాత్రమే కాకుండా పూర్వం ప్రసిద్ధ ద్వైత సంప్రదాయ పీఠాధిపతులైన శ్రీవ్యాసతీర్థులవారు శ్రీ వేంకటేశ్వరస్వామి వారికి సాలగ్రామహారం సమర్పించినట్లు తెలుస్తున్నది.
🌞ఈ వ్యాసతీర్థులవారు కూడా భగవద్రామానుజులవారివలెనే శ్రీస్వామివారి మూలవిరాణ్మూర్తిని దివ్యసాలగ్రామమూర్తిగా భావించడమే కాక తిరుమల దివ్యక్షేత్రం కూడా దివ్యసాలగ్రామమయమని , అందువల్లే వారు కూడా మోకాళ్లతోనే వేంకటాచల క్షేత్రాన్ని అధిరోహించినట్లు చెబుతారు.
🌞ఇంతేకాదు అన్నమాచార్యుల వారి చరిత్రలో కూడ ఇలా పేర్కొన బడింది. మొట్టమొదట పాదరక్షలతో తిరుమల కొండను ఎక్కుతూ
★అలసి,
★కళ్లుకనపడక,
★కాళ్లుముందుకు సాగక చతికిలబడిన అన్నమయ్యతో సాక్షాత్తు శ్రీవేంకటేశుని పట్టపురాణి అలమేలుమంగ ఇలా అంటుంది.
“........ యీ మహాపర్వతేంద్రంబు లాలిత సకల సాలగ్రామమయము ఘనులకు నిది చెప్పుఁగాళ్ల నెక్కంగ జనదు, నీ చెప్పులు సడలించి వైచి కనుఁగొను కన్నులఁ గనవచ్చుననిన.”
అన్నమయ్య తన కాళ్లకున్న చెప్పులను విసరివైచి పరికించినాడు అంతే!!
“ఆ రమా నారాయణాకృతి గలిగి శ్రీరామ కృష్ణ లక్ష్మీ నృసింహాది మూర్తులన్నియు నొక్క మొత్తమైనట్లు వర్తింపుచున్న నా వడువు వీక్షించి మహిత సాలగ్రామమయ మౌనటంచు బహు విస్మయము నొంది ప్రణతులొనర్చి."
తరువాత, అలమేలుమంగ అనుజ్ఞతో తిరుమల కొండ చేరుకొన్నాడు అన్నమయ్య.
ఓం సాల గ్రామ నివాసాయ నమః
🕉 స్వామి వారి కృప మనందరిపై మెండుగా ఉండాలని కోరుకుంటూ...
🙏🏻🙏🏻🙏🏻🔔🔔🔔🙏🏻🙏🏻🙏🏻
No comments :