♾️•••┉┅━❀🕉️❀┉┅━•••♾️
🙏 *ఓం నమో వేంకటేశాయ*🙏
*శ్రీవారి బ్రహ్మోత్సవాలు - 1*
✍️ శ్రీమతి&శ్రీ పల్లపోతు వాణిశ్రీ-కృష్ణబాలాజీ
♾️•••┉┅━❀🕉️❀┉┅━•••♾️
*"తిరువీధుల మెరసీ దేవదేవుడు*
*గరిమల మించిన సింగారముల తోడను"*
లక్షలాది మంది భక్తుల గోవిందనామ స్మరణతో దిక్కులు పిక్కటిల్లుతుండగా, అడుగడుగు దండాలతో ఆబాలగోపాలం హారతి పడుతుండగా, సర్వాలంకారశోభితుడైన శ్రీవారు వివిధ వాహనారూఢుడై మాడవీధుల్లో ఊరేగే మహత్తర ఘట్టాల సమాహారమే *"శ్రీవారి బ్రహ్మోత్సవాలు".* వాటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
♾┉┅━❀🕉️❀┉┅━♾
🌈 *పౌరాణిక నేపథ్యం*
👉 ఈ బ్రహ్మోత్సవాలను తొలిసారిగా సాక్షాత్తూ బ్రహ్మదేవుడే తన తండ్రిగారైన, కలియుగంలో శ్రీవేంకటేశ్వరుని రూపంలో ఆవిర్భవించిన శ్రీమహావిష్ణువుకు జరిపించినట్లు భవిష్యోత్తరపురాణంలో చెప్పబడింది. అందుకే అవి *"బ్రహ్మోత్సవాలు"* గా ప్రసిద్ధికెక్కాయి.
👉 అయితే, తిరుమలలో జరిగే మిగిలిన ఉత్సవాలతో పోలిస్తే ఇవి చాలా పెద్ద ఎత్తున జరుగుతాయి కాబట్టి వీటిని *"బ్రహ్మోత్సవాలు"* అంటారని కొందరు భావిస్తారు. ఏది ఏమైనా భక్తులను విశేషంగా ఆకర్షిస్తూ; మహమ్మదీయ, క్రైస్తవపాలకుల హయాంలో కూడా నిరంతరాయంగా కొనసాగుతూ, ఈ "బ్రహ్మోత్సవాలు" తమ వైశిష్ట్యాన్ని చాటుకుంటున్నాయి.
*"నానాదిక్కుల నరులెల్లా*
*వానలలోనే వత్తురు గదలి..."*
అంటూ, అన్నమాచార్యుల వారు బ్రహ్మోత్సవాలను సందర్శించటానికి భక్తులు నలు దిక్కుల నుండి ఎండవానలను లెక్కజేయకుండా, తండోపతండాలుగా ఎలా కదలి వస్తారో వివరించారు.
♾┉┅━❀🕉️❀┉┅━♾
🌈 *చారిత్రక నేపథ్యం*
👉 చారిత్రకాధారాలు లభ్యమైనంత వరకూ, మొట్టమొదటగా బ్రహ్మోత్సవాల ప్రస్తావన 614వ సం. లో వచ్చింది. అప్పట్లో, తమిళ నెల "పెరటాసి" మాసంలో జరిగే బ్రహ్మోత్సవాలలో భోగశ్రీనివాసుణ్ణి ఊరేగించేవారు. 966వ సం. లో, పది రోజులపాటు జరుపబడే బ్రహ్మొత్సవాల చివరి రోజును *"తీర్థవారి దినం"* గా పిలిచేవారు. తరువాతి కాలంలో నిడివిని మరో రోజు పొడిగించి, 11వ రోజున *"విదయాత్ర"* పండుగ నిర్వహించేవారు.
👉 వివిధ పాలకుల హయాంలో ఈ బ్రహ్మోత్సవాలను వివిధ పేర్లతో పిలిచినప్పటికీ, రోజుల సంఖ్యలో కొద్ది మార్పులున్నటికీ, ఈ ఉత్సవాలు దాదాపు 1400 సం. లుగా తమ మౌలికస్వభావాన్ని యథాతథంగా ఉంచుకో గలిగాయి. తెలుగు పల్లవరాజు విజయగండ గోపాలుడు *"ఆడితిరునాళ్ళు"* పేరుతోనూ, వీరప్రతాపదేవరాయలు *"మాసి తిరునాళ్ళు"* పేరుతోనూ, అచ్యుతరాయలు *"అచ్యుతరాయ బ్రహ్మోత్సవం"* పేరుతోనూ, ఈ ఉత్సవాలను ఘనంగా నిర్వహించేవారు.
👉 1583వ సం. లో నెలకో సారి జరిగే బ్రహ్మోత్సవాలు,1638వ సంవత్సరంలో 11 సార్లు నిర్వహించబడ్డాయి. ఒక్కోసారి 3 నుంచి 5 రోజులవరకూ ఈ ఉత్సవాలను జరిపించేవారు. బ్రహ్మోత్సవాల్లో ఏ రోజు ఏ వాహనం మీద స్వామిని ఊరేగించాలనే విషయం ఆగమశాస్త్రంలో నిర్దిష్టంగా చెప్పబడలేదు. ఆయా కాలాల్లో అప్పటి నిర్వాహకులు, అర్చకస్వాములు కలిసి ఏ ఏ వాహనాలను ఏ ఏ రోజుల్లో ఉపయోగించాలో నిర్ణయించేవారు.
👉 కాలక్రమేణా ఉత్సవాల స్థాయి, వైభవం పెరుగుతూ, రోజుల సంఖ్య తగ్గుతూ వచ్చి, ప్రస్తుతం ఈ ఉత్సవాలను సంవత్సరానికో సారి, తొమ్మిది రోజులపాటు నిర్వహిస్తున్నారు. అదే, అధికమాసం వచ్చిన సంవత్సరంలో మాత్రం రెండు సార్లు నిర్వహిస్తారు. ఆ వివరాలు తరువాత తెలుసుకుందాం.
♾┉┅━❀🕉️❀┉┅━♾
🌈 *బ్రహ్మోత్సవాలకు ఆహ్వానం*
👉 పూర్వకాలంలో బ్రహ్మోత్సవాల సందర్భంగా పంపించే ఆహ్వానం ఆసక్తికరంగా ఉండేది. శ్రీవారి ఆలయద్వారం ముందుగా పెద్దశబ్దం వచ్చేట్లు బాణాసంచా పేల్చేవారు. తరువాత మహంతుల కాలంలో భక్తులను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానిస్తూ; చుట్టుప్రక్కల పల్లెలు, పట్టణాలు, తిరుమల గ్రామంలో "దండోరా" వేసేవారు. ఈ మధ్య కాలం వరకూ తిరుమల గ్రామప్రజలు తమ ఇళ్ళను కొబ్బరి, అరటి, మామిడి ఆకులతో అలంకరించుకుని, దేవాలయాన్ని కూడా శోభాయమానంగా అలంకరించి; ఇతరగ్రామాల్లో ఉన్న తమ బంధుమిత్రులను స్వంత ఇంట్లో శుభాకార్యానికి ఆహ్వానించినట్లు బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించేవారు. దేవాలయ పరిశుభ్రత, భద్రత, యాత్రికులకు వసతి, భోజనం, మంచినీటి సౌకర్యం లాంటి ఏర్పాట్లన్నీ తిరుమల గ్రామప్రజలే స్వయంగా నిర్వహించేవారు.
♾┉┅━❀🕉️❀┉┅━♾
🌈 *బ్రహ్మోత్సవాల్లో రకాలు*
👉 నిర్ధారిత మాసంలో, నిర్ధారిత నక్షత్రంలో 3, 5, 7, 9, 11, 13 రోజులపాటు జరిగేవాటిని *"నిత్యబ్రహ్మోత్సవాలు"* అంటారు. ఇప్పుడు మనం చెప్పుకుంటున్నది ఈ బ్రహ్మోత్సవాల గురించే!
👉 కరువులు, వ్యాధులు, దుష్టగ్రహకూటములు సంభవించినప్పుడు ఐదు రోజులపాటు జరిగే ఉత్సవాలను *"శాంతి బ్రహ్మోత్సవాలు"* అంటారు.
👉 భక్తులెవరికైనా కోరిన కోర్కెలు నెరవేరిన సందర్భంగా, స్వంతధనం వెచ్చించి జరిపించుకునేవి *"శ్రద్ధా బ్రహ్మోత్సవాలు".* శ్రీవారి ఆలయంలో ప్రతిరోజూ జరిగే. *"ఆర్జిత బ్రహ్మోత్సవాలు"* ఈ కోవలోకే వస్తాయి.
👉 ఇవన్నీ కాకుండా, తిరుమలలో సంవత్సరానికి ఒక్కరోజు మాత్రమే జరిగే మరో మూడు బ్రహ్మోత్సవాలున్నాయి. అవి రథసప్తమినాడు జరిగే *"ఆర్షము",* కైశిక ద్వాదశి రోజున జరిగే *"రాక్షసం",* ముక్కోటి ఏకాదశి నాడు జరిగే *"దైవికం".*
♾┉┅━❀🕉️❀┉┅━♾
🌈 *పుష్ప, విద్యుద్దీపాలంకరణ*
👉 బ్రహ్మోత్సవాల సందర్భంగా, ఉద్యానవన విభాగ ఆధ్వర్యంలో తిరుమలప్రధాన ఆలయాన్ని, ఉత్సవ వాహనాలను, పరిసరాలను, మాడవీధులను, ఇతర దేవాలయాలను, మండపాలను, కూడళ్ళను, రహదార్లను రంగు రంగుల పుష్పాలతో శోభాయమానంగా అలంకరిస్తారు. ఇందు నిమిత్తం పోయిన బ్రహ్మోత్సవాల్లో సుమారు 40 టన్నుల సాంప్రదాయపుష్పాలు, రెండు టన్నుల కట్ ఫ్లవర్సు, 50 వేల ఆ కాలంలో మాత్రమే దొరికే పుష్పాలను వినియోగించారు. ఇంతే కాకుండా వందలకొద్దీ విద్యుత్ కార్మికులు వారాల తరబడి శ్రమించి కళ్ళు మిరుమిట్లు గొలిపేలా; లక్షలాది విద్యద్దీపాలతో అనేక పౌరాణిక పాత్రలు, భారత భాగవత ఘట్టాలు, వన్యప్రాణులు, దేవతలు మున్నగువాటిని ఆవిష్కరింప జేస్తారు.
♾┉┅━❀🕉️❀┉┅━♾
🌈 *కళాకార్ల బృందాలు*
👉 వివిధ కళారూపాలతో స్వామివారిని కొలుస్తూ భక్తులకు కనువిందు చేయటంకోసం, 2019 బ్రహ్మోత్సవాలకు 18 రాష్ట్రాలనుండి, 357 బృందాలుగా, 8200 మంది కళాకారులు విచ్చేశారు. ఏటా ఈ సంఖ్య పెరుగుతూనే ఉంది. మాడవీధుల్లో స్వామివారి వాహనానికి ముందుండి ఈ కళాకారులందరూ వివిధరకాల విన్యాసాలు, దేవతామూర్తుల వేషధారణ, అభినయం, కోలాట ప్రదర్శన, కోయనృత్యాలు, కూచిపూడి, భరతనాట్యం, అస్సాంకు చెందిన బిహు నాట్యం, ఉత్తరాఖండ్ కు చెందిన చోలియా నృత్యం, తమిళనాడుకు చెందిన టపాటం, గరగాటం, బయలాటం, సయ్యాండిమేళం, కొక్కిల్ ప్రదర్శనలతో భక్తులను అలరిస్తారు. దాదాపుగా భారతదేశంలో నుండే అన్ని కళారూపాలను మనం బ్రహ్మోత్సవాల సందర్భంగా, మాడవీధులలో చూసి ఆనందించవచ్చు. ఆలయానికి నాలుగు ప్రక్కలా ఉన్న మాడవీధుల గ్యాలరీల్లో కూర్చుని సుమారు రెండు లక్షలమంది భక్తులు ఈ ఉత్సవాల్ని కన్నులపండువగా వీక్షిస్తారు. వివిధ మాధ్యమాల ద్వారా ఈ ఉత్సవాల్ని ప్రత్యక్ష ప్రసారం చేస్తారు.
♾┉┅━❀🕉️❀┉┅━♾
🐘 *గజరాజుల సేవ* 🐘
👉 *పద్మ, పెద్దపద్మ, లక్ష్మి, మహాలక్ష్మి* అనే నలుగురు గజరాజులను మావటీలు ముందుగా శుభ్రం చేసి, ముస్తాబు చేసి, శరీరం కాంతివంతంగా మెరిసిపోవడానికి నువ్వలనూనెతో మర్దనా చేస్తారు. వీటి నుదుటన తెల్లనినామాలు, మధ్య సింధూరంతో అలంకరించి ఆలయం వద్దకు తీసుకుని వస్తారు. అలాగే, అలంకరించిన వృషభాలను కూడా తోడ్కొని వస్తారు.
♾┉┅━❀🕉️❀┉┅━♾
🌈 *నూతన గొడుగుల వితరణ*
👉 శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా చెన్నైకు చెందిన హిందూమహాసభ సభ్యులు గత ఎనిమిది సంవత్సరాలుగా శ్రీవారికి ఈ క్రింది వాటిని లాంఛనప్రాయంగా సమర్పిస్తున్నారు:
12 జానల శ్వేత గొడుగులు: 2
10 జానల పట్టుగొడుగులు : 2
6 జానల శ్వేత గొడుగులు : 2
👉 ఈ గొడుగులన్నింటినీ వైభవోత్సవమండపానికి తీసుకుని వచ్చి, అక్కడినుండి ఆలయ అధికారులతో కలసి వాటిని ఆలయంలోనికి తీసుకు వెళతారు.
💫 స్వామివారి వాహనానికి వెనుకగా, *"ఘటాటోపం"* అనబడే ఒక గుడారాన్ని పరిచారకులు మోసుకుంటూ వెళ్లారు. అకస్మాత్తుగా వర్షం వస్తే స్వామివారి వాహనానికి ఇది రక్షణ కల్పిస్తుంది.
♾┉┅━❀🕉️❀┉┅━♾
🌈 *దర్భ సమర్పణ*
👉 బ్రహ్మోత్సవాల సందర్భంగా తి.తి.దే. అటవీ శాఖాధికారులు, ఆలయ అధికారులకు దర్భను సమర్పిస్తారు. ధ్వజారోహణపర్వంలో; ఆలయం నందు నిర్వహించే సేవలు, కైంకర్యాలు, హోమాల్లో ఈ దర్భను వినియోగిస్తారు. ఈ దర్భతో తయారు చేయబడిన చాప, తాడు ఊరేగింపుగా తీసుకుని వచ్చి ఆలయాధికారులకు అందజేస్తారు. ఈ దర్భను తిరుమలలోని కళ్యాణ వేదికకెదురుగా ఉండే తి.తి.దే. అటవీ విభాగం నర్సరీల్లోనూ, తిరుపతి సమీపం నందున్న వడమాలపేట గ్రామంలోని పొలంగట్ల నుండి సేకరిస్తారు. ఇలా సేకరించిన దర్భలను పదిహేను రోజులు నీడలో ఆరబెడతారు. ఆ దర్భతో తయారు చేసిన *కొడితాడు, చాప, విడిగా సుమారు 10 కిలోల దర్భను* అధికారులకు అందజేస్తారు.
♾┉┅━❀🕉️❀┉┅━♾
🌈 *రవాణా సదుపాయాలు*
👉 తిరుపతి-తిరుమల మధ్య రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నడిపే తొలి బస్సుకు ప్రత్యేక పూజలు నిర్వహించి, బస్సులన్నింటినీ అరటి పిలకలు, మామిడి తోరణాలు, పూలమాలలతో ప్రత్యేకంగా అలంకరిస్తారు. బ్రహ్మోత్సవాల సమయంలో రోజుకు సుమారు 400 బస్సులతో, 2000 ట్రిప్పులతో, రెండు లక్షలమంది భక్తులను కొండపైకి చేరవేస్తారు. గరుడవాహనం రోజున ఈ సంఖ్య దాదాపుగా రెట్టింపవుతుంది.
♾┉┅━❀🕉️❀┉┅━♾
🌈 *భోజనసదుపాయాలు*
👉 బ్రహ్మోత్సవాల సందర్భంగా నిత్యం సుమారు మూడు లక్షల మందికి ఉచిత భోజనం అందజేస్తారు. గరుడసేవ రోజున రాత్రి 1:30 గం. వరకూ, భోజనాలు వడ్డిస్తుంటారు. ప్రధాన అన్నదాన కేంద్రమైన తరిగొండ వెంగమాంబ భవనంలోనే కాకుండా, తిరుమలలోని వివిధ కూడళ్ళలో కూడా అన్నదానం చేస్తుంటారు. భోజన ఏర్పాట్లు ఏ స్థాయిలో జరుగుతాయంటే క్రితం బ్రహ్మోత్సవాల్లో గరుడసేవ రోజున రెండు లక్షల పులిహోర పొట్లాలు, లక్షా డెబ్బయ్యెదు వేల పళ్ళాల టమాటా అన్నం, సాంబారన్నం సరఫరా చేశారు.
మొత్తం 32,500 కిలోల బియ్యం, 20 వేల లీటర్ల పాలు, 8000 కిలోల ఉప్మారవ్వను ఉపయోగించారు. దాదాపుగా ఈ మొత్తం సరుకుల్ని దాతలే సమకూర్చారు.
♾┉┅━❀🕉️❀┉┅━♾
🌈 *వివిధ విభాగాల సేవలు*
👉 వేలకొద్దీ పారిశుధ్య కార్మికులు నిరంతరం శ్రమిస్తూ, పరిశుభ్రతకు పెద్దపీట వేస్తారు. అలాగే, డజన్ల కొద్దీ వైద్యసిబ్బంది అహోరాత్రులు వైద్యసేవల నందిస్తుటారు. వేలకొద్దీ పోలీసులతో బాటుగా, వందలాది మంది ఆలయ సిబ్బందితో భద్రతా ఏర్పాట్లు చేస్తారు. వేలాదిమంది శ్రీవారి సేవకులు, స్కౌట్లు క్యూల నిర్వహణతో బాటు, భక్తులకు ఇతర సేవల నందిస్తుంటారు. *"వాహనబేరర్లు"* రెండు పూటలూ కలిపి సుమారుగా రోజుకు ఐదు గంటల పాటు స్వామివారి వాహనాల్ని మోస్తుంటారు. బ్రహ్మోత్సవాల్లో లడ్డూ మొదలగు ప్రసాదాల్ని కూడా భారీగా తయారు చేయిస్తారు.
♾┉┅━❀🕉️❀┉┅━♾
[ రేపటి భాగంలో... *శ్రీవారి బ్రహ్మోత్సవాల* విశేషాలు మరిన్ని తెలుసుకుందాం]
♾️•••┉┅━❀🕉️❀┉┅━•••♾️
🙏 *శ్రీనివాసుని శ్రీచరణాలను సేవిద్దాం, సకల శుభాలనూ పొందుదాం* 🙏
*తిరుమల సర్వస్వం సశేషం...*
♾️•••┉┅━❀🕉️❀┉┅━•••♾️
No comments :