*తిరుమల సర్వస్వం -39*
🍁🍁🍁🍁🍁
*పద్మావతీ శ్రీనివాసుల పరిణయం*
భృగుమహర్షి వృత్తాంతానంతరం శ్రీమహాలక్ష్మి జాడ తెలియని శ్రీమహావిష్ణువు, కృతయుగాంతంలో భూలోకంలోని వేంకటాచల శ్రేణుల యందు ఒక వల్మీకంలో (పుట్ట) తల దాచుకుంటాడు.
ఇంతవరకు *"ఆదివరాహస్వామి ఆలయం"* ప్రకరణంలో ఇంతకు ముందే మనం తెలుసుకున్నాం.
*శ్రీనివాసుడు – ఆదివరాహస్వామి కలయిక*
ఆ విధంగా చాలాకాలం పుట్టలో గడిపిన శ్రీనివాసునికి కలియుగారంభంలో తాను ఒకనాడు పుట్టలో నుంచి బయటకు వచ్చి సంచరిస్తుండగా తన పరివారంతో విహరిస్తూ వృద్ధాప్యదశలో ఉన్న ఆదివరాహస్వామి తారసపడతాడు. శ్రీమహావిష్ణువే ఆదివరాహస్వామి అవతారంలో భూమండలాన్ని రక్షించి దేవతల కోర్కెపై ఈ పర్వతం మీద శాశ్వతనివాసం ఏర్పరుచుకున్న ఉదంతం కూడా మనం ఇంతకు ముందే తెలుసుకున్నాం. అంటే, ఇప్పుడు శ్రీ మహావిష్ణువు యొక్క ఒక అవతారమైన శ్రీనివాసుడు, మరో అవతార స్వరూపమైన ఆదివరాహస్వామితో భేటీ అయ్యారన్న మాట. శ్రీమహావిష్ణువు అనేక సందర్భాల్లో లోకకల్యాణార్థం పలు అవతారాలనెత్తడం మనకు విదితమే.
ప్రథమ పరిచయంలోనే ఈ క్షేత్రం ఆదివరాహుని అధీనంలో ఉన్నట్లు తెలుసుకున్న శ్రీనివాసుడు, తన నివాసనిమిత్తం కొంత స్థలం అనుగ్రహించాల్సిందిగా ఆదివరాహస్వామిని ప్రార్థిస్తాడు. కలియుగధర్మానుసారం, వరాహుడు స్థలం ఉచితంగా ఇవ్వడం కుదరదని, తగిన మూల్యం చెల్లించాల్సి ఉంటుందని శెలవిస్తాడు. అప్పుడు శ్రీనివాసుడు ప్రస్తుతానికి తన వద్ద ద్రవ్యం లేదని చెబుతాడు. అంతేకాకుండా, ముందు ముందు కోట్లాది భక్తులు తన దర్శనార్థం వస్తారని, అప్పుడు ప్రథమదర్శనం, ప్రథమపూజ, ప్రథమనైవేద్యం వరాహస్వామికే చెందుతాయని వాగ్దానం చేస్తాడు. ఆ ఒప్పందం ప్రకారం, స్వామిపుష్కరిణికి దక్షిణం వైపున ఉన్న నూరు చదరపు గజాల ప్రదేశం శ్రీనివాసుని శాశ్వతనివాస నిమిత్తం కేటాయించ బడుతుంది.
శ్రీనివాసుడు ఒంటరిగా ఉన్నాడన్న విషయాన్ని తెలుసుకున్న వరాహస్వామి, సపరిచర్యల నిమిత్తం *"వకుళాదేవి"* అనే దాసిని కూడా శ్రీనివాసునితో పంపుతాడు. ఈ సందర్భంలో వకుళాదేవి పూర్వజన్మ వృత్తాంతం కొద్దిగా తెలుసుకోవాలి.
*వకుళాదేవి పుర్వజన్మ వృత్తాంతం*
ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడు దేవకీవసుదేవులకు జన్మించినప్పటికీ, అతని బాల్యమంతా యశోద వద్ద ముద్దు మురిపాలతో, ఆలమందలతో, వెన్నముద్దలతో గడిచింది. శ్రీకృష్ణుని బాల్యలీలలన్నీ చూడటానికి నోచుకున్న యశోదాదేవి, కంస వధానంతరం శ్రీకృష్ణుడు తిరిగి దేవకీవసుదేవుల వద్దకు చేరుకోవడంతో శ్రీకృష్ణుని కళ్యాణం చూడలేకపోయింది. అష్టభార్యలున్న శ్రీకృష్ణ పరమాత్ముని ఒక్క వివాహమైనా యశోదమ్మ సమక్షంలో జరగలేదు. ఆ విషయమై చింతిస్తూ ఉన్న యశోద మనసునెరిగిన శ్రీకృష్ణుడు, ద్వాపరం నాటి యశోదమ్మ కలియుగంలో వకుళమాతగా జన్మిస్తుందని, అప్పుడు పద్మావతీదేవితో జరిగే తన వివాహాన్ని కన్నులారా తిలకించ వచ్చునని అభయమిస్తాడు. నాటి యశోదామాతయే నేడు వకుళమాతగా జన్మించిందన్న మాట.
ఈ విధంగా శేషాచలంగా పిలువబడే వరాహక్షేత్రంలో, ఆదివరాహునిచే దాసిగా నియమింప బడిన వకుళమాత సపర్యలలో కొంత ఉపశమనం పొందుతూ శ్రీనివాసుడు కాలం వెళ్లబుచ్చుతున్నాడు.
*వేటకు వెడలిన శ్రీనివాసుడు*
ఒకనాడు వేటకు వెళ్లాలన్న సంకల్పంతో, శ్రీనివాసుడు అశ్వరూపంలో ఉన్న వాయుదేవునిపై స్వారీ చేస్తూ, శేషాచలసానువుల్లో ఉన్న రమణీయ దృశ్యాలను ఆస్వాదిస్తూ మృగయావినోదం కొనసాగిస్తున్నాడు. ఆవిధంగా, నేడు *"శ్రీవారిమెట్లు"* గా పిలువబడే మెట్ల మార్గంలో చాలా దూరం వెళ్లిన శ్రీనివాసునికి "రక్షించండి! రక్షించండి!" అనే ఆర్తనాదాలు వినిపిస్తాయి. జగద్రక్షకుడైన శ్రీనివాసుడు విల్లంబులను సవరించుకుంటూ ఆ ఆక్రందనలు వచ్చిన దిశగా గుర్రాన్ని దౌడు తీయిస్తాడు. అక్కడ ఓ భయంకరమైన మదపుటేనుగు తరుము తుండడంతో ఆర్తనాదాలు చేస్తూ చెట్టుకొకరు పుట్టకొకరుగా పరుగులు తీస్తున్న కొందరు కన్యామణులు శ్రీనివాసుని కంట పడతారు. వెనువెంటనే శ్రీనివాసుడు "గజేంద్రా!" అని భీకరంగా గర్జిస్తూ, విల్లు ఎక్కుపెట్టి ఆ మత్తగజానికి ఎదురుగా వెళతాడు. దిక్కులు పిక్కటిల్లేలా ధ్వనించిన ఆ గర్జనకు బెదిరిపోయిన ఏనుగు కారడవిలోకి పారిపోవడంతో, యువతులందరూ ప్రాణాపాయం తప్పించుకుంటారు.
*పద్మావతితో తొలి సమాగమం*
ప్రాణాపాయం నుంచి తప్పించుకొని కృతజ్ఞతా దృక్కులతో నిలుచుని ఉన్న కన్యారత్నాల మధ్య గంధర్వకన్యలా ప్రకాశిస్తున్న ఓ యువతిని చూసి, ఆమె అందచందాలకు మోహావేశుడై, ఆమెనే చూస్తూ అచేతనంగా ఉండిపోతాడు శ్రీనివాసుడు. ఆ యువతి కూడా శ్రీనివాసుని యెడ పరవశురాలై తదేకంగా చూస్తూ ఉండి పోతుంది. ఈ ఇరువురి వాలకాన్ని గమనించిన చెలికత్తెలు భయాందోళనలతో; ఆ యువతి ఆ ప్రాంతాన్ని పరిపాలిస్తున్న ఆకాశరాజు గారి కుమార్తె పద్మావతీదేవి యని, ఆమెను ఆవిధంగా చూడటం ఎంత మాత్రం తగదని వారిస్తారు. అక్కడి నుంచి తక్షణమే వెళ్లిపోవలసిందిగా హెచ్చరిస్తారు.
అంతట పద్మావతీదేవి తన చెలికత్తెలను వారిస్తూ, తమ ప్రాణాలను రక్షించిన ఆపద్బాంధవుణ్ణి ఆ రీతిలో తూలనాడడం తగదని, అతని పూర్తి వివరాలను తెలుసుకొమ్మనీ ఆజ్ఞాపిస్తుంది. దానితో కొంచెం తెప్పరిల్లిన శ్రీనివాసుడు చిరు మందహాసం చేస్తూ దేవకీవసుదేవులను తల్లిదండ్రులుగా, బలరాముణ్ణి సోదరునిగా గలిగిన తాను వేంకటాచలవాసినని, ఆ అందాలరాశిని తొలిచూపులోనే ప్రేమించానని, వారంగీకరిస్తే వివాహం చేసుకుంటానని తన అంతరంగాన్ని వెల్లడించాడు. ఈ వ్యవహారం శృతిమించడంతో కలవరపడ్డ చెలికత్తెలు అతని నుంచి పద్మావతీదేవిని రక్షించటానికి శ్రీనివాసుని రాళ్ళతో కొడుతూ తరమసాగారు.
సాక్షాత్తు శ్రీమన్నారాయణుణ్ణి అబలులైన ఆ మానవమాత్రులు ఏం చేయగలరు?
శ్రీనివాసుని సంకల్పంతో, అశ్వరూపంలో ఉన్న వాయుదేవుడు చెలికత్తెల రాళ్ల దెబ్బలకు చనిపోయినట్లు నటించగా, పెనుగులాటలో చిరిగిపోయిన వస్త్రాలతో, చిందరవందరగా తయారైన కేశాలతో విషణ్ణవదనుడైన శ్రీనివాసుడు వేంకటాచలం లోని తన స్వగృహానికి చేరుకుంటాడు.
*వకుళమాత ఓదార్పు*
ఈ స్వగృహానికి చేరుకున్న శ్రీనివాసుడు నిరాహారుడై, విరహతాపంతో బాధపడటం చూసిన వకుళమాత శ్రీనివాసుని ఆవేదనకు కారణం చెప్పమని గుచ్చి గుచ్చి ప్రశ్నిస్తుంది. జరిగిన వృత్తాంతాన్నంతా యథాతథంగా వివరించిన శ్రీనివాసుడు, నారాయణవనం పరిసర ఉద్యానవనంలో ఆకాశరాజు కూతురైన పద్మావతిని చూశానని, తొలిచూపులోనే తామిరువురు ప్రేమించుకున్నామని, ఆమె లేనిదే తాను జీవించలేనని తెలియజేశాడు. వకుళమాత శ్రీనివాసునికి అతని పూర్వజన్మను గుర్తుచేస్తూ, సామాన్యమానవుని వలె ఓ అజ్ఞాత మానవకాంతను ప్రేమించడం విచిత్రంగా ఉందని, ముందు వెనుకలాలోచించి ఓ సముచితమైన నిర్ణయం తీసుకోమని శ్రీనివాసుణ్ణి ప్రార్థిస్తుంది. సాక్షాత్తు శ్రీమహావిష్ణువు అవతారమైన తాను అనైతికంగా ప్రవర్తించనని, ఆకాశరాజు కుమార్తె అతిలోక సౌందర్యవతి అయిన "పద్మావతిదేవి" సాక్షాత్తూ శ్రీమహాలక్ష్మి అంశతో, తనను వివాహమాడటం కోసమే ఈ భూలోకంలో అయోనిజగా అవతరించిందని శెలవిస్తాడు. అంతే కాకుండా, ఈ భూలోకంలో తనకు వేరెవరూ లేరు కనుక, వకుళమాతే మధ్యవర్తిగా వ్యవహరించి ఈ శుభకార్యాన్ని నెరవేర్చాలని వేడుకుంటాడు. ఇంతటి మహత్కార్యం తన చేతుల మీదుగా సంపన్నం కావడం తన పూర్వజన్మ సుకృతంగా భావించిన వకుళాదేవి, ఆకాశరాజు చెంతకు వెళ్ళటానికి సిద్ధమై, శ్రీనివాసుని అనుజ్ఞకై ప్రార్థిస్తుంది.
అంత శ్రీనివాసుడు, వేంకటాచలక్షేత్రం నుంచి దక్షిణదిశగా వెడలి *కపిలేశ్వరస్వామి* [(ఈ కపిలేశ్వరస్వామి ఆలయం తిరుపతి పట్టణంలో అలిపిరి కి ఒక కిలోమీటరు దూరంలో ఉంది. నారాయణవనం తిరుపతికి 30 కిలోమీటర్ల దూరంలోనూ, అగస్తేశ్వర ఆలయం (దీనినే "ముక్కోటి" అని కూడా పిలుస్తారు) తిరుపతి పట్టణ పరిసర ప్రాంతాల్లోనూ ఉంటాయి.)]. ఆశీస్సులందుకొని, తరువాత అగస్త్యేశ్వరుని సందర్శించి, తదుపరి నారాయణవనం చేరుకుని, ఆకాశరాజు దంపతులను కలిసి కన్యాదానం కోరవలసిందిగా వకుళాదేవిని ఆదేశిస్తాడు. ఇంతటి మహత్తర కార్యాన్ని తన భుజస్కంధాలపై ఉంచటంతో అమితానందం చెందిన వకుళాదేవి, వరుసగా కపిలతీర్థాన్ని, మార్గమధ్యన ఉన్న శుకమహర్షి ఆశ్రమాన్ని, తరువాత అగస్త్యేశ్వర ఆలయాన్ని సందర్శించి శ్రీనివాసకళ్యాణం సాఫల్యం చేయాల్సిందిగా మ్రొక్కుకుంటుంది.
శ్రీనివాసుని ఆదేశానుసారం అగస్త్యేశ్వరస్వామి ఆలయానికి చేరుకున్న వకుళమాతకు, అదే సమయంలో అక్కడికి విచ్చేసిన పద్మావతీదేవి యొక్క చెలికత్తెలు తారసపడతారు. వారితో మాట కలిపిన వకుళాదేవికి, పద్మావతిదేవి వనంలో ఓ అజ్ఞాత వ్యక్తిని చూసిందని, తొలిచూపులోనే అతనిపై ప్రేమలో పడి విరహతాపానికి గురై జ్వరంతో మంచం పట్టిందని, కుమార్తె రుగ్మతకు కారణం తెలియని ఆకాశరాజు తన గురువుగారైన బృహస్పతిని సంప్రదించాడని, అతడు సూచించిన తరుణోపాయం మేరకు పద్మావతిదేవి ఆరోగ్యం కుదుటపడటం కోసం ఆమె తరఫున ఆలయంలో
పూజాదికాలు నిర్వహించడానికై తాము వచ్చామని చెలికత్తెలు చెబుతారు. భగవత్సంకల్పంతో ఎదురుపడ్డ చెలికత్తెల ననుసరించి, ఆకాశరాజు, ధరణీదేవి దంపతుల వద్దకు వెళ్లడానికి వకుళాదేవి ఉద్యక్తురాలవుతుంది.
*ఎరుకలసాని వేషంలో శ్రీనివాసుడు*
అటు శ్రీ వేంకటాచలం పైనున్న శ్రీనివాసుడు, పద్మావతిదేవిపై బెంగతో, మానవసహజమైన ఆత్రుతతో, వికలమనస్కుడై ఉంటాడు. ఇప్పుడు తాను శ్రీమహావిష్ణువు కాదు మానవరూపధారియై ఉన్నాడు. కార్యసిద్ధి కోసం పూర్తిభారం వేరొకరిపై వేయకుండా, స్వశక్తిని కూడా నమ్ముకోవాలి కదా! సాధారణ మానవ మాత్రులందరూ తనపై భారం వేసి నిశ్చింతగా ఉంటారు. మరి తానెవరిపై భారం వేయాలి? వృద్ధురాలై, కొండకోనల్లో జీవితాన్ని సాగిస్తున్న వకళమాత ఇంతటి కార్యాన్ని సఫలం చేసుకు రాగలదా?
ఇలా పరి పరి విధాలుగా ఆలోచించిన శ్రీనివాసుడు, వకుళాదేవి ప్రయత్నానికి తోడుగా తాను కూడా కార్యరంగంలోకి ప్రవేశించ దలుచుకుంటాడు.
అనుకున్నదే తడవుగా, *"ఎరుకలసాని"* వేషధారణలో, గురువింద గింజల మాలను మెడలో ధరించి, భూమండలాన్నంతా తాటాకుబుట్టగా మార్చి, దానిని తలపై కెత్తుకుని, నారాయణవనం వీధుల్లో సంచరిస్తూ, తన విలక్షణమైన రూపంతో, వాక్చాతుర్యంతో, హావభావాలతో, పురజనులను విశేషంగా ఆకట్టుకుంటాడు. కుమార్తె అనారోగ్యంతో తల్లడిల్లుతున్న ధరణీదేవికి ఎరుకలసాని మాటలతో ఆశలు చిగురిస్తాయి. ఎరుకలసానిని రాజభవనంలోకి సాదరంగా ఆహ్వానించి *"సోది" (భవిష్యవాణి)* చెప్పవలసిందిగా కోరుతుంది. ఎరుకలసాని వేషంలో ఉన్న శ్రీనివాసుడు వృత్తిధర్మాన్ని అనుసరించి, బ్రహ్మాది దేవతలను, సమస్త పుణ్యక్షేత్రాలను స్మరించుకుంటూ సోది చెప్పడం ప్రారంభిస్తాడు.
పద్మావతిదేవి ఎడమచేతిని తన చేతిలోకి తీసుకుని ఎరుకల యాసలో కొండపైనున్న శ్రీనివాసుడనే వాడు పద్మావతిదేవి ప్రేమలో పడ్డాడని, ఈమె సైతం ఆ నామాలవాడిని ప్రాణప్రదంగా ప్రేమిస్తుందని, ఆ యువకుడు కారణజన్ముడు, అనితర శక్తిసామర్థ్యాలు కలవాడని, ఇరువురికి వివాహం జరిపిస్తే పద్మావతిదేవి ఆరోగ్యం కుదుటపడుతుందని, అంతేకాకుండా శ్రీనివాసునితో జరుగబోయే కళ్యాణం ద్వారా పద్మావతిదేవి అషైశ్వర్యాలతో, భోగభాగ్యాలతో తులతూగుతుందని కూడా నమ్మబలుకుతాడు.
కొద్దిసేపట్లోనే ఓ వృద్ధురాలు ఆ శ్రీనివాసుని తరఫున వచ్చి కన్యాదానం చేయమని కోరుతుందని, పద్మావతిదేవి ఏ వ్యక్తినైతే మోహించిందో అదే వ్యక్తితో ఆమె వివాహం సాఫల్యం కాబోతోందని చెప్పి నిష్క్రమిస్తాడు.
*జగన్నాటక సూత్రధారునికి లోకకల్యాణార్థం వింత వింత వేషాలు ధరించడం కరతలామలకమే!*
[ రేపటి భాగంలో... *పద్మావతీ - శ్రీనివాసుల పరిణయం* గురించి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం]
*ఓం నమోవేంకటేశాయ*
No comments :