*పద్మావతీ - శ్రీనివాసుల పరిణయం -3*
*ముక్కోటి దేవతలకు విందుభోజనాలు:*
కుబేరుడు అరువుగా ఇచ్చిన ఆభరణాలను, నూతన వస్త్రాలను శోభాయమానంగా అలంకరించుకున్న శ్రీనివాసుడు, కుమారధార తీర్థానికేతెంచి, తమ కులదైవమైన శమీవృక్షానికి పూజాదికాలు గావిస్తాడు. ఆ వృక్షరాజం యొక్క శాఖను తెచ్చి ప్రక్కనే ఉన్న వరాహస్వామి ఆలయంలో ప్రతిష్ఠించి ఆ దైవాన్ని ఆరాధిస్తాడు. స్వయంగా తన వివాహానికి ఆహ్వానించిన శ్రీనివాసునితో, ఆదివరాహుడు "తాను వృద్ధాప్యం వల్ల పెండ్లికి రాలేనని, తన ఆశీర్వాదం శ్రీవారికి ఎన్నడూ తోడుగా ఉంటుందని" శెలవిస్తాడు.
అంతలో, శ్రీ నివాసునికి భోజనాల ప్రసక్తి గుర్తుకొస్తుంది. పనులైతే పురమాయించాడు గానీ, లక్షలాది మందికి షడ్రశోపేతమైన భోజనం ఏర్పాటు చేసే ఆర్థికస్తోమత, కొండకోనల్లో నివసించే తనకెక్కడిది? ఖర్చు కోసం చింతిస్తున్న శ్రీనివాసుణ్ణి పరమశివుడు ఓదార్చి, తన మధ్యవర్తిత్వంతో కుబేరస్వామి నుంచి కావలసిన ధనాన్ని అరువుగా, కలియుగాంతం వరకు వడ్డీ తీర్చే షరతుపై ఇప్పిస్తాడు.
చేతిలో రొక్షం సమకూరింది సరే! అంతమందికి వండివార్చాలంటే మాటలా? ఎన్నెన్ని ఏర్పాట్లు చేయాలి? ఎల్లవేళలా లోకకళ్యాణం కోసం పరితపించే స్వామి, తన కళ్యాణం గురించి ముందస్తు ప్రణాళికను సిద్ధం చేసుకోలేక పోయాడు!
అంత భారీగా వంటలు చేయడానికి తగ్గ పాత్రలు తనవద్ద లేవంటాడు, వంటపని బాధ్యత తీసుకున్న అగ్నిదేవుడు. వాస్తవానికి ఈ కార్యం అగ్నిదేవునికి సునాయాసం! ఆయన శ్రీవారి లీలలను చూచి తరించాలనుకున్నాడంతే!
పాత్రల అవసరం లేకుండా, వేంకటాచలం నందున్న తీర్థాలలోనే వంటలు వండమని శ్రీనివాసుడు సలహా ఇస్తాడు. స్వామివారి యానతి ప్రకారం, స్వామి పుష్కరిణిలో అన్నం వండబడింది. పాపనాశనం తీర్థంలో పప్పు, ఆకాశగంగ తీర్థంలో పులుసు, తుంబురతీర్థంలో చిత్రాన్నం, పాండవ తీర్థంలో తింత్రిణీరసం (చారు), మిగిలిన తీర్థాలన్నింటిలో రకరకాల పచ్చళ్ళు, ఇతర కమ్మనైన పిండి వంటలు తయారు చేయబడ్డాయి. సిద్ధాన్నాన్ని ముందుగా అహోబిల నరసింహస్వామికి నైవేద్యం చేసి, అతిథులందరూ భోజనానికి ఉపక్రమించారు. భోజనపంక్తులు శేషాచల పర్వతసానువుల్లో, వేంకటాచలం నుంచి శ్రీశైలం వరకు బారులు తీరాయి. అతిథులందరూ సంతృప్తిగా భోజనం చేసిన తర్వాత శ్రీనివాసుడు బ్రాహ్మణులకు, వేదాంతులకు, బ్రహ్మచారులకు శాస్త్రానుసారం తాంబూలం, దక్షిణ సమర్పించుకున్నాడు. తదనంతరం పెండ్లి పెద్దలైన బ్రహ్మ, శివుడు, లక్ష్మీదేవి, ఆదిశేషుడు, గరుడునితో కలిసి శ్రీనివాసుడు భోజనం ముగించేటప్పటికి సూర్యాస్తమయం అయింది.
*నారాయణవనానికి పయనం*
ఆ రాత్రి మయుడు, విశ్వకర్మచే వేంకటాచలంపై నిర్మించబడ్డ భవనాల్లోనే గడిపిన అతిథులందరూ, మరునాడు ఉదయం మంగళ వాయిద్యాలతో నారాయణవనం బయలుదేరారు. పెండ్లిబృందం మార్గమధ్యంలో ఉన్న పద్మసరోవరాన్ని సమీపిస్తున్న తరుణంలో, శుకాచార్యులవారు శ్రీనివాసునికి ఎదురేగి, బంధుమిత్ర సపరివార సమేతంగా తన ఆతిథ్యం స్వీకరించవలసిందిగా కోరతాడు. ఈ వివాహాన్ని ఖాయపరచడంలో శుకాచార్యుల పాత్రను స్మరణకు తెచ్చుకున్న శ్రీనివాసుడు, ఆతని ఆతిథ్యం స్వీకరించటానికి సమ్మతిస్తాడు. ఆప్యాయంగా ఆహ్వానించాడే గానీ, సర్వసంగపరిత్యాగి అయిన శుకచార్యుడు కోట్ల కొద్దీ ఉన్న అతిథిగణానికి కేవలం పులుసన్నం మాత్రమే వడ్డించగలుగుతాడు. సాక్షాత్తు శ్రీనివాసునికి, అమరులైన తమకు అంత సాధారణమైన భోజనం వడ్డించడం అవమానకరంగా భావించిన దేవతలందరూ, శుకాచారిని శపించచడానికి ఉద్యుక్తులవుతారు. ఇది గమనించిన శ్రీనివాసుడు ఒక్క "హుంకారం" తో అతిథులందరికీ చవులూరించే భోజనం చేసిన అనుభూతిని కలిగిస్తాడు. శపించడానికి సిద్ధ మవుతున్న దేవతలందరు, అత్యంత స్వల్ప వ్యవధిలో అంత కమ్మని భోజనం పెట్టిన శుకాచారిని ప్రశంసిస్తారు. ఆవిధంగా శ్రీ నివాసుడు తన భక్తుడైన శుకమహర్షిని గట్టెక్కించాడు. తన భక్తులను కష్టాలకడలి నుంచి కడతేర్చటం శ్రీనివాసునికి కొత్తేమీ కాదు కదా!
పద్మసరోవరం నుంచి నవమినాడు బయల్దేరిన శ్రీనివాసుడు సపరివార సమేతంగా నారాయణపురం చేరుకోగానే ఆకాశరాజు ఎదురేగి, భక్తిపూర్వకంగా అందరిని ఆహ్వానిస్తాడు. వారి వారి హోదాలకు తగ్గట్లుగా, విశ్వకర్మచే నిర్మించ బడిన హర్మ్యాలలో విడిది ఏర్పాటుచేసి విందుభోజనాలతో అతిథులందరినీ అలరింపజేస్తాడు.
*పద్మావతీ పరిణయ ఘట్టం*
ఆరోజు సాయంత్రం ఆకాశరాజు తన భార్య ధరణీదేవితో కలిసి, తమకు అల్లుడు కాబోతున్న శ్రీనివాసుడి పాదపద్మాలను స్వామిపుష్కరిణి నుండి తెప్పించిన పవిత్రజలంతో కడిగి, ఆ ఉదకాన్ని తమ శిరస్సుపై జల్లుకొని రాజ్యమంతటా సంప్రోక్షణ గావించాడు. తదుపరి రాజదంపతులు శ్రీనివాసునికి దివ్యపూజ గావించి, సుగంధద్రవ్యాలతో తాంబూలాన్ని సమర్పించారు. శ్రీనివాసుణ్ణి భద్రగజంపై నెక్కించి, మంగళవాద్యాలతో, వేదపారాయణంతో సాదరంగా రాజభవనానికి తోడ్కొని వెళ్ళారు. రత్నఖచిత సింహాసనంపై శ్రీనివాసుని ఆసీనుణ్ణి గావించారు.
అంతకుముందే పద్మావతీదేవి సర్వాలంకార భూషితురాలై, సుమంగళులైన స్త్రీల పర్యవేక్షణలో గౌరీపూజ గావించి వివాహానికి సిద్ధంగా ఉంది. లోకకళ్యాణార్థం జరుగబోతున్న వివాహ వేడుకలను ప్రత్యక్షంగా వీక్షించడానికి సకల చరాచర జగత్తులోని జీవులన్నీ తరలివచ్చాయి.
*కట్నకానుకలు*
వివాహసందర్భంలో అల్లుడికి ఆకాశరాజు కోటి స్వర్ణనాణాలను కానుకగా ఇచ్చాడు. అంతేకాకుండా విశేషమైన, అముల్యాభరణాలను కూడా శ్రీనివాసునికి కట్నం కింద సమర్పించుకున్నాడు. భవిష్యోత్తరపురాణంలో ఆ ఆభరణాల వర్ణన ఇలా ఉంది:
*నూరుతులాల బంగారు కిరీటం, నూరుతులాల నడుము పట్టీ, భుజకీర్తులు, నూపురములు, నాగభూషణం, ముత్యాల కంఠాభరణాలు, ముత్యాలు-నవరత్నాలు పొదగబడిన హస్తకంకణాలు, పది అంగుళీయకాలు, వజ్రాలు పొదిగిన మొలత్రాడు, బంగారు పాదుకలు, భోజన నిమిత్తం బంగారుపళ్ళెరాలు, పానీయాలు సేవించడానికి వెండిచెంబులు, పట్టువస్త్రాలు.*
కలియుగవేంకటేశ్వరుని అంగరంగ వైభవం ఆనాడే మొదలైంది. పద్మావతీదేవి శ్రీనివాసుని నట్టింట కాలిడిన వేళా విశేషం – చేతిలో చిల్లిగవ్వలేని శ్రీనివాసుడు, ఆనాటినుండి ఈనాటివరకు అప్లైశ్వర్యాలతో తులతూగుతున్నాడు. -
*గోత్ర ప్రవర*
ఆకాశరాజు తరఫున పద్మావతిదేవి గోత్ర వివరాలను దేవగురువు బృహస్పతి ఈ విధంగా విశదపరిచాడు:
*"అత్రిమహర్షి గోత్రంలో జన్మించిన సుధీరచక్రవర్తి మునిమనుమరాలు, సుధర్ముని మనుమరాలు, ఆకాశరాజు కూతురు అయిన పద్మావతిని శ్రీనివాసునికి సంపూర్ణంగా, సంతోషంగా సమర్పిస్తున్నాం. ధర్మపత్నిగా స్వీకరించాల్సిందిగా ప్రార్థిస్తున్నాం",*
శ్రీనివాసుని తరఫున పురోహితుడైన వశిష్ఠులవారు, శ్రీనివాసుని గోత్ర వివరాలను ఈ విధంగా తెలియజెప్పారు:
*"యయాతిరాజు యొక్క మునిమనవడు, శూరసేనచక్రవర్తి యొక్క మనుమడు, వసుదేవుని పుత్రుడు, వశిష్ట గోత్రీకుడు అయిన శ్రీనివాసుడు, ఆకాశరాజు పుత్రిక అయిన పద్మావతిదేవిని స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాడు. అమితానంద పరవశులమై మేమీ కన్యారత్నాన్ని స్వీకరిస్తున్నాం."*
ఈనాడు కూడా తిరుమలక్షేత్రంలో శ్రీవేంకటేశ్వరునికి, తన పూర్వావతారమైన శ్రీకృష్ణుని గోత్రనామాలతోనే సంకల్పం చెప్పే సాంప్రదాయం ఉంది.
*మంగళసూత్ర ధారణ*
గోత్ర ప్రవరానంతరం కంకణధారణ, వేదపండితుల ఆశీర్వాదం మొదలైన వివాహతంతులన్నీ శాస్తోక్తంగా జరిగాయి. *వైశాఖ శుక్లపక్షం, దశమి, శుక్రవారం, పూర్వఫల్గుణి నక్షత్ర శుభముహూర్తంలో శ్రీనివాసుడు పద్మావతిదేవి మెడలో మంగళసూత్రధారణ గావిస్తుండగా, దేవలోకం నుంచి పుష్పవర్షం కురిసింది. దేవదుందుభులు మ్రోగించబడ్డాయి.*
ఈ విధంగా నాలుగు రోజుల వివాహకార్యక్రమం అత్యంత వైభవోపేతంగా, "నభూతోనభవిష్యతి" అన్న చందంగా జరిగిన తరువాత, అయిదవ రోజున ఆకాశరాజు - ధరణీదేవి దంపతులు పద్మావతిని శ్రీనివాసునికి లాంఛనప్రాయంగా అప్పగించారు.
*ఆకాశరాజు పంపిన సారె*
అప్పగింతల సందర్భంగా ఆకాశరాజు పద్మావతిదేవితో పాటుగా పంపిన "సారె" ఈ విధంగా ఉంది:
మూడు వందల మేకలు,
ఐదు వేల ఆవులు,
వందలకొద్దీ దాస దాసీజనం,
పట్టు పీతాంబరాలు,
రత్నఖచిత మంచంతో పాటుగా పట్టుపరుపులు, దిండ్లు,
మూడువందల పుట్ల పెసలు.
మహాభారం కలిగిన బెల్లం,
ఒకభారం చింతపండు,
భూరిమొత్తంలో మెంతులు
ఉప్పు, ఇంగువ, ఆవాలు,
వెయ్యి కడవల పాలు,
నూరు కుండల నిండా పెరుగు.
పదిహేనువందల చర్మపాత్రల నిండా నెయ్యి
రెండువందల కుండల నిండా చక్కెర
రెండువందల కుండలనిండా తేనె
గుమ్మడికాయలు,
అరటిగెలలు, మామిడిపండ్లు, ఉసిరికాయలు.
వీటన్నింటినీ క్షేమంగా వెంకటాచలం చేర్చటానికి వెయ్యి అశ్వాలు, వెయ్యి ఏనుగులు
తన గారాలపట్టిపై ఆకాశరాజుకు గల ఆప్యాయతానురాగాలకు అంతే లేదు.
వివాహానంతరం శ్రీమహాలక్ష్మి కొల్హాపూర్ కు తిరిగి వెళ్ళిపోయింది. నూతన వధూవరులైన పద్మావతి-శ్రీనివాసులు మూడు రోజులపాటు నారాయణవనం లోనే ఉండి, సర్వసౌఖ్యాలను అనుభవించారు. మూడు నిద్రల అనంతరం, లాంఛనప్రాయంగా అప్పగింతలు జరిగిన తర్వాత, ఆకాశరాజు ఇచ్చిన సారెతో నూతన వధూవరులు వేంకటాచలానికి బయలుదేరారు.
*అగస్త్యాశ్రమ సందర్శన*
పద్మావతీ శ్రీనివాసులు మార్గమధ్యలో సువర్ణముఖీ నదీ తీరాన ఉన్న అగస్త్యముని ఆశ్రమంలో ఆగి, వారిని, ఋషిపత్ని యైన లోపాముద్రను దర్శించుకున్నారు. భక్తిప్రపత్తులతో ఆతిథ్యం ఇచ్చిన అగస్త్యుడు శాస్త్రనియమానుసారం కొత్త దంపతులు ఆరునెలల వరకు తీర్థయాత్రలు, పుణ్యక్షేత్రాలు సందర్శించరాదని; అందుచేత ఆరుమాసాల పాటు తమ ఆతిథ్యం స్వీకరించి తదనంతరమే శ్రీవేంకటాచలానికి తిరిగి వెళ్లాలని అభ్యర్థించాడు. అగస్త్యుని ప్రార్థనను మన్నించిన శ్రీనివాసుడు ఆ ఆశ్రమంలోనే ఆరు నెలలు గడపటానికి నిశ్చయించుకున్నాడు.
*ఆనందనిలయ నిర్మాణం*
శ్రీనివాసుడు ఈలోగా ఆకాశరాజు తమ్ముడైన తొండమానుని పిలిచి, ఈ ఆరునెలల వ్యవధిలో వేంకటాచలంపై తాము నివసించడానికి ఓ అద్భుతమైన భవనాన్ని వాస్తు ప్రకారం నిర్మించి ఇమ్మని ఆదేశించాడు. ఆ భవనంలో తాము కలియుగాంతం వరకు నివసిస్తామని, తద్వారా తొండమానుని పేరు చిరస్థాయిగా నిలిచిపోతుందని కూడా శెలవిచ్చాడు. శ్రీవారి ఆనతిని శిరసావహించిన తొండమానుడు అత్యంత స్వల్పసమయంలో, తిరుమల క్షేత్రంలో స్వామిపుష్కరిణికి దక్షిణభాగాన, తూర్పు ముఖంగా, ఆదివరాహుడు శ్రీనివాసునికి ఆవాసనిమిత్తం ఇచ్చిన స్థలంలో, మూడు ప్రాకారాలు, ఏడు ప్రవేశ ద్వారాలు, బంగారు గోపురం, ధ్వజస్తంభ పరివేష్ఠితంగా ఓ అద్భుతమైన భవనాన్ని నిర్మింపజేశాడు. అదే ఈనాడు తిరుమలలో సర్వాంగ సుందరంగా, నిత్యకళ్యాణం పచ్చతోరణంగా శోభిల్లే *"ఆనందనిలయం"* అనబడే ముఖ్యాలయం. అందులోనే శ్రీవారు అర్చామూర్తి రూపంలో, దేవేరులిద్దరితో ఈ నాటికీ కొలువై ఉన్నారు.
భవననిర్మాణం పూర్తికాగానే, గృహప్రవేశం చేయవలసిందిగా శ్రీవేంకటేశ్వరునికి వర్తమానం అందింది.
*శ్రీనివాస మంగాపురం - ముక్కోటి*
శ్రీనివాసుడు పద్మావతి సమేతంగా శ్రీవరాహక్షేత్రానికి బయలుదేరుతూ, అగస్త్యుని ఆతిథ్యానికి సంతుష్టుడై, ఆరునెలల పాటు తాము నివసించిన ఆ ప్రదేశం తమ దంపతు లిరువురి పేరునా, *"శ్రీనివాస మంగాపురం"* గా ప్రసిద్ధిగాంచుతుందని, అందులో తాను *"కళ్యాణ వేంకటేశ్వరుని"* గా కొలువై ఉంటానని శెలవిస్తాడు.
మనందరికీ సుపరిచితమైన ఈ *"శ్రీనివాస మంగాపురం"* ఆలయం గురించి మరోసారి వివరంగా తెలుసుకుందాం.
అయితే, స్థానికుల కథనం ప్రకారం, పద్మావతీ శ్రీనివాసులు, ఆ ఆరునెలల్లో పగటిపూట అగస్త్యుని ఆశ్రమంలోను, రాత్రివేళల్లో శ్రీనివాసమంగాపురంలో ఉన్న మరో ఆశ్రమం లోనూ నివసించేవారట! తిరుపతికి సమీపంలో, సువర్ణముఖి నదీతీరాన, నేటి *"తొండవాడ"* గ్రామంలో, *"ముక్కోటి"* గా పిలువబడే దేవాలయమే పద్మావతీశ్రీనివాసులు కొలువున్న ఆశ్రమం. ఈ విషయం ఆ ఆలయ కుడ్యాలపై చిత్రించబడి ఉంది. ఈ ఆలయాన్ని నేడు కూడా మనం చూసి తరించవచ్చు.
*శుభమస్తు*
*పద్మావతి శ్రీనివాసుల పరిణయ ఘట్టం భక్తిశ్రద్ధలతో ఎవరు విన్నా, చదివినా, పారాయణం చేసినా; వారి వివాహమహోత్సవం ఎవరు జరిపించినా, శ్రీనివాసుని అనుగ్రహంతో వారింట సర్వశుభాలు కలుగుతాయని తరతరాల నమ్మిక.*
*శుభప్రదము, సర్వమంగళకరము అయిన "పద్మావతి పరిణయం" ఇక్కడితో ముగిసింది.*
*ఆకాశరాజు ఎవరు? తొండమానుని పూర్వజన్మ వృత్తాంతం ఏమిటి? త్రేతాయుగం నాటి వేదవతికి, కలియుగపు పద్మావతిదేవికి ఉన్న సంబంధం ఏమిటి? శ్రీనివాసమంగాపురం, ముక్కోటి ఆలయాల పూర్తి వివరాలు, వీటన్నింటినీ విపులంగా తెలుసుకుందాం.*
[ రేపటి భాగంలో... *విమానప్రదక్షిణం* ఇత్యాదుల గురించి తెలుసుకుందాం]
*శ్రీనివాసుని శ్రీచరణాలను సేవిద్దాం, సకల శుభాలనూ పొందుదాం*
ఓం నమో వేంకటేశాయ🙏
No comments :