*శ్రీవారి బ్రహ్మోత్సవాలు - 9*
👉 *రథోత్సవం:*
బ్రహ్మోత్సవాలయందు గరుడవాహనం తర్వాత అత్యంత వైభవంగా జరిగే *"రథోత్సవం"* లో, భక్తులు తేరు (రథం) యొక్క పగ్గాలను పట్టిలాగుతూ, ఉత్సవంలో ప్రత్యక్షంగా పాల్గొనటం వల్ల ఇది అత్యంత జనాకర్షకమైన వాహనోత్సవంగా ప్రసిద్ధిగాంచింది. తక్కిన వాహనసేవ లన్నింటిలో భక్తులు కేవలం చూసి తరించగలరే గానీ, ప్రత్యక్షంగా పాలు పంచుకొనే అవకాశం లేదు.
బ్రహ్మోత్సవాలలో ఎనిమిదవరోజు ఉదయం ఉదయభానుని కిరణకాంతులలో, వివిధ వర్ణాల పరిమళ పుష్పాలతో అలంకృతమై మేరుపర్వత చందంగా ఉన్న రథంపై, శ్రీదేవి భూదేవి సమేతులైన మలయప్పస్వామివారు మాడవీధుల్లో విహరిస్తారు. ఈ రోజు శ్రీవారి వాహనం అశ్వసమానమైన వేగంతో దౌడు తీస్తుంది. స్వయంగా పాల్గొనే అవకాశం రావడంతో, భక్తులు రెట్టించిన ఉత్సాహంతో కర్పూర నీరాజనాలు సమర్పిస్తూ, కోలాటనృత్యాలతో దిక్కులు పిక్కటిల్లేలా గోవిందనామ సంకీర్తనలు ఆలపిస్తూ; తమ అచంచలమైన భక్తిని, ఆధ్యాత్మిక ఆనందాన్ని వ్యక్తం చేస్తారు.
అనాదిగా వస్తున్న ఆచారం ప్రకారం దేవాలయ సిబ్బంది వారిస్తున్నప్పటికీ, నడుస్తున్న రథంపై భక్తులు ఉప్పు, మిరియాలు జల్లటం ఈ ఉత్సవంలో మరో ప్రత్యేకత.
పురాణేతిహాసాలలో రథాలకు ఎనలేని ప్రాధాన్యం ఉంది. ప్రాచీనకాలంలో కాల్బలం, అశ్వబలం, గజబలంతో పాటుగా రథబలానికి కూడా చతురంగబలాల్లో సముచితమైన స్థానం ఉండేది. అనాదికాలం నుండి యుద్ధవిద్యల్లో రథసంచాలనం కూడా ఒకటి. కేవలం యుద్ధాలకే కాకుండా వేటకు, విహారానికి, వ్యాహ్యాళికి కూడా రథాలను విరివిగా ఉపయోగించేవారు. రథాలకు, వాటి సారథులకు, గుర్రాలకు చిత్రవిచిత్రమైన పేర్లుండేవి. ఉదాహరణకు సూర్యుని రథం పేరు *"సప్త".* అలాగే, కృష్ణుని రథసారథి పేరు *"దారుకుడు".* *శైబ్యము, సుగ్రీవము, మేఘపుష్పము, వలాహకము* అనేవి కృష్ణుని యొక్క నాల్గు గుర్రాలపేర్లు.
రథాలకు యుద్ధాలకు అవినాభావ సంబంధం ఉంది. యుద్ధవిన్యాసాలలో, యోధుల యొక్క శక్తి సామర్థ్యాలను బట్టి వారిని - *రథి, అతిరథి, మహారథి, అతిమహారథి, మహామహారథిగా* వర్గీకరించేవారు. "రథి" అంటే, రథారూఢుడై ఏకకాలంలో ఐదువేల మంది యోధులతో యుద్ధం చేయగల సమర్థుడు. "మహమహారథి" అత్యధికంగా, 20 కోట్ల 73 లక్షల 60 వేల మందితో ఒకేసారి యుద్ధం చేయగలిగినవాడు.
ఉదాహరణకు ఉపపాండవులు, శకుని మొదలైనవారు "రథి" కోవలోనికి వస్తే; బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు, దుర్గాదేవి, గణపతి, సుబ్రహ్మణ్యేశ్వరుడు "మహామహారథులు".
దేవాలయాల ఉత్సవ వేడుకలలో కూడా రథాలకు చెప్పుకోదగ్గ పాత్ర ఉంది. దాదాపు అన్ని ప్రాచీన ఆలయాలలోనూ, ఈనాడు కూడా రథాన్ని, రథమండపాన్ని మనం చూస్తాం. ఆగమశాస్త్రానుసారం వైదికకర్మలు జరిగే ప్రతి ఆలయంలోనూ, రథోత్సవం నేడూ ఓ తప్పనిసరి వేడుక. జగద్విదితమైన, అత్యంత వైభవోపేతంగా జరిగే పూరీ జగన్నాథుని రథయాత్ర గురించి ప్రత్యేక పరిచయం అక్కరలేదు.
*"రథస్థం కేశవం దృష్ట్వా పునర్జన్మ న విద్యతే'*
రథంలో వేంచేసి ఉన్న విష్ణుదేవుని దర్శనం పునర్జజన్మరాహిత్యాన్ని కలిగిస్తుందనే విశ్వాసంతో భక్తులు రథోత్సవంలో ఉత్సాహంగా పాల్గొంటారు.
స్వతహాగా యోధానయోధుడు, భక్తజన పరిపాలకుడు, మృగయావినోదుడు (వేట యందు ఆసక్తి గలవాడు), విహారప్రియుడు ఐనటువంటి స్వామివారికి, రథంతో సహజంగానే ఎంతో అనుబంధం ఉంది. నేడు *"రథికుడు"* అయిన స్వామివారు, కృష్ణావతారంలో అర్జునునికి *"రథసారథి".* ఈనాటి రథోత్సవం ద్వారా ఆ అనుబంధాన్ని శ్రీవారు లోకాలకు చాటి చెప్తున్నారు.
రథోత్సవానికి ఓ విశిష్టమైన ఆధ్యాత్మిక పరమార్థం ఉంది. కఠోపనిషత్తులో ఆత్మకు, శరీరానికి ఉండే సంబంధం రథసారూప్యతతో వివరించడం జరిగింది.
*"బుద్ధి" అనే సారథి సంచాలనంలో "మనస్సును" పగ్గాలుగా చేసుకుని, "ఇంద్రియాలు" అనబడే గుర్రాల సాయంతో చరిస్తున్న "శరీరమనే" రథాన్ని, "ఆత్మ" అనే రథికుడు అధిరోహిస్తాడు.* ఈ రకంగా శరీరాన్ని రథంతో పోల్చడం వల్ల, స్థూల-సూక్ష్మశరీరాలు వేరని, ఆత్మ ఆ రెండింటికీ భిన్నమనే ఆధ్యాత్మిక విచక్షణాజ్ఞానం కలుగుతుంది.
రథోత్సవాన్ని వర్ణిస్తూ, అన్నమయ్య, సకలజీవులలో అంతర్యామిగా ఉన్న పరమాత్మ తన రథాన్ని తానే సంచాలనం చేస్తున్నాడని పేర్కొన్నాడు.
*దేవదేవుడెక్కెనదె దివ్య రథము*
*మా వంటి వారికెల్ల మనోరథము*
*మిన్ను నేలా నొక్కటైన మేటి తేరు*
*కన్నులపండువైన శ్రీకాంతుని తేరు*
*అశ్వవాహనోత్సవం*
*గక్కున నయిదవనాడు గరుడునిమీదను*
*యెక్కెను ఆరవనాడు యేనుగుమీద*
*చొక్కమై యేడవనాడు సూర్యప్రభలోను*
*యిక్కున దేరును గుర్ర మెనిమిదోనాడు*
బ్రహ్మోత్సవాలలో ఎనిమిదవరోజు రాత్రి మలయప్పస్వామివారు ఒంటరిగా, కలిపురుషుని వేషధారణలో, శిరస్త్రాణభూషితుడై, నడుముకు కత్తి డాలు ధరించి, ఒక చేతియందు చర్నాకోల, మరో చేతితో గుర్రపు పగ్గాలు చేబూని, యుద్ధానికి సిద్ధంగా ఉన్న వీరాధివీరుని వలె, అశ్వవాహనంపై రాచఠీవి ఉట్టిపడేలా ఊరేగుతారు.
అశ్వానికి చారిత్రక, పౌరాణిక, ఆధ్యాత్మిక, సమకాలీన ప్రాశస్త్యం విశేషంగా ఉంది. వేగానికి ప్రతీక అయిన అశ్వం చతురంగబలాలలో ప్రధానమైనది. యుద్ధాలలో సైనికులు గుర్రాలనెక్కి యుద్ధం చేస్తుండగా, దళాధిపతులు, రారాజులు తమతమ హోదాలను బట్టి అశ్వాలు పూన్చిన రథాలపై నుండి సమరం సాగించేవారు. విశ్వాసానికి మారుపేరైన అశ్వరాజాలు తమ యజమానులను కాపాడటం కోసం, తమ ప్రాణాలను పణంగా పెట్టిన ఉదంతాలు చరిత్రలో కోకొల్లలుగా ఉన్నాయి.
పురాణేతిహాసాల ననుసరించి శ్రీహరి శ్రీనివాసునిగా భూలోకంలోని వేంకటాచలంచేరి పద్మావతిదేవిని పరిణయమాడటం కోసం వేట నెపంతో, ఖడ్గధారియై, అశ్వంమీద నారాయణవనానికేతెంచారు. క్షీరసాగరమథనంలో పుట్టిన ఉచ్ఛైశ్రవము అనే అశ్వరాజ్యాన్ని ఇంద్రుడు తన వాహనంగా స్వీకరించాడు. శ్రీమహావిష్ణువు యొక్క జ్ఞానావతారాలలో మొదటిది "హయగ్రీవుని" అవతారం. హయగ్రీవుడంటే, "గుర్రం ముఖం కలిగిన దైవం" అని అర్థం.
హయగ్రీవునికి గుర్రం ముఖం ఉండటం వెనుక ఓ ఆసక్తికరమైన కథ ఉంది.
ఒకానొకప్పుడు పదివేల ఏండ్లపాటు నిర్విరామంగా రాక్షసులతో యుద్ధం చేసి అలసిపోయిన శ్రీమహావిష్ణువు అల్లెత్రాడుతో (వింటినారితో) ఇరుకొనలూ బిగించి కట్టబడిన "శాబ్ధం" అనబడే ధనుస్సు యొక్క ఒక కొనను నేలపై నుంచి, మరొక కొనపై గెడ్డాన్ని ఆన్చి, నుల్చొని ఉండే నిద్రపోతాడు ( *"...శాఙ్గధన్వా గదాధరః"* అన్న 107వ విష్ణుసహస్రనామ శ్లోకాన్ని స్మరణకు తెచ్చుకోండి). ఆయనను నిద్రనుండి మేల్కొలపటానికి దేవతలు భయపడుతుంటే బ్రహ్మదేవుని ఆజ్ఞమేరకు ఓ *"వమ్రి"* (చెదపురుగు), వింటినారిని కొరికి శ్రీహరికి నిద్రాభంగం కావించే ప్రయత్నం చేస్తుంది. కానీ, దురదృష్టవశాత్తూ వింటినారి తెగడంతో, ధనుస్సు యొక్క కోపు అతివేగంగా వెళ్ళి విష్ణువు యొక్క తలను ఛేదించగా, ఆ శిరస్సు వెళ్ళి ముల్లోకాలకు ఆవల పడుతుంది. ఈ హఠాత్సంఘటనకు నివ్వెరబోయిన దేవతలు, లక్ష్మీదేవి యానతి ననుసరించి, ఓ అశ్వరాజాన్ని వధించి దాని శిరస్సును తీసుకుని వస్తారు. దేవశిల్పి గుర్రం తలను విగతజీవియైన విష్ణుమూర్తి మొండానికి అతికించగా, బ్రహ్మదేవుడు తిరిగి ప్రాణం పోస్తాడు. ఇదంతా, లోకకళ్యాణార్థం, పూర్వపు యుగాల శాపాలు-వరాల ననుసరించి జరుగుతుంది.
సమస్త విద్యలకు అధిదేవత అయినటువంటి హయగ్రీవుని ఆలయం, ఉత్తరమాడవీధి చివరిభాగంలో, స్వామిపుష్కరిణి యొక్క ఈశాన్యదిక్కుకు ఎదురుగా స్థితమై ఉంది.
బ్రహ్మోత్సవాలలో మొట్టమొదటిదైన "పెద్దశేషవాహనం" కుండలినీ యోగానికి ప్రతీక అయితే, చిట్టచివరిదైన "అశ్వవాహనం" ఓంకారానికి సంకేతం.
అసమాన శక్తికి, శారీరకదృఢత్వానికి కూడా అశ్వం పేర్గాంచింది.
ఆధునికయుగంలో యంత్రశక్తిని "హార్స్ పవర్" లేదా "అశ్వికశక్తి" తో గణించటం మనందరికీ విదితమే!
దాదాపు నూరు సంవత్సరాల పూర్వం వరకూ, బ్రహ్మోత్సవాలకై ఆహ్వానం పలకడం లోనూ అశ్వరాజాల పాత్ర ఎంతగానో ఉండేది. ఉత్సవ ప్రారంభానికి దాదాపు రెండు నెలల ముందుగానే బ్రహ్మోత్సవ చిహ్నమైన ధ్వజాన్ని చేబూని, 24 అశ్వికదళాలు మేళతాళాలు మ్రోగించుకుంటూ, ఉత్సవాలకై అట్టహాసంగా సమస్త జనులకూ ఆహ్వానం పలుకుతూ అన్ని దిక్కులలో బయలుదేరేవి. వారి తిరుగుప్రయాణంలో ఉత్సవాలకు విచ్చేసే భక్తుజనులందరూ, వారివారి వాహనాలలో అశ్వికదళాల ననుసరిస్తూ, వారి రక్షణలో తిరుమల క్షేత్రాన్ని చేరుకునేవారు. రాలేని భక్తులు వారి వారి కానుకలను అశ్వదళం ద్వారా శ్రీవారికి పంపేవారు.
విష్ణుమూర్తి యొక్క దశావతారాలలో చిట్టచివరిది "కల్కి" అవతారం. కలియుగాంతంలో కల్కిభగవానుడు ఖడ్గం చేబూని, అశ్వవాహనం ఎక్కి, దుష్టసంహారం గావించి ధర్మాన్ని పునరుద్ధరించుతాడని పురాణాలు చెబుతున్నాయి.
శ్రీకృష్ణదేవరాయలు తన "ఆముక్తమాల్యద" గ్రంథంలో కల్కి అవతారం గురించి విశదంగా వర్ణించాడు.
అశ్వం వేగానికి ప్రతీక అయితే, మనస్సు దాని కంటే వేగవంతమైనది. హరిని తలంచినంతనే జ్ఞానచక్షువులు వైకుంఠాన్ని దర్శిస్తాయి. ఇంద్రియాలను ఆలవాలంగా చేసుకొని మనస్సు అత్యంత వేగంతో పరిభ్రమిస్తుంది. అందుకే "మనోవేగము" అన్న నానుడి వాడుకలోకి వచ్చింది. అశ్వారూఢుడై ఊరేగుతున్న స్వామి నిరంతర సాధనతో ఇంద్రియాలపై విజయం సాధించి, దాని ద్వారా మనస్సు యొక్క వేగాన్ని నియంత్రించి పరమాత్మపై లగ్నం చేయాలని ఉపదేశిస్తున్నారు. యుగాంతంలో తాను జరుపబోయే దుష్టశిక్షణ కార్యక్రమానికి నాందీ ప్రస్తావన కూడా ఇప్పుడే పలుకుతున్నారు.
*"కలి" అనే శబ్దానికి పుణ్యం అని అర్థం. కృతయుగంలో ఒక సంవత్సరం పాటు చేసేటటువంటి తపస్సు, త్రేతాయుగంలో చేసినటువంటి యజ్ఞాలు, ద్వాపరయుగంలో కావించినటువంటి అర్చనలు, వీటి ద్వారా ఎంత ఫలితం వస్తుందో, అంతే ఫలితం కలియుగంలో ఒక్కరోజు, ఒక్కగంట నిశ్చలమైన మనస్సుతో భగవధ్యానం చేస్తే వస్తుందట!*
అందుకే కలియుగం అంత గొప్పది. ఈ యుగంలో జన్మించిన మనం పరమాత్మను సేవించుకుంటూ, కలిపురుషుని రక్షణలో, జన్మను సార్థకం చేసుకోవాలి. ధర్మానికి ఎప్పుడు హాని కలుగుతుందో, నిజమైన ధార్మికులు ఎప్పుడైతే కష్టాల కడలిలో కొట్టుమిట్టాడుతారో, అప్పుడు దుష్ట శిక్షణకు కల్కిభగవానుడు అవతరిస్తాడని అశ్వ వాహనం ద్వారా తెలుప బడుతోంది.
*నీవు తురగముమీద నేర్పు మెరయ*
*వేవేలు రూపములు వెదచల్లి తపుడు*
*పదిలముగ నిరువంక పసిడి పింజల యంప*
*పొదల తరకసములొరవులు నెరపగా*
*గదయు శంఖము చక్రము ధనుఃఖడ్గములు*
*పదివేలు సూర్యబింబము లైనవపుడు*
("తురగము " అంటే అశ్వము)
*పల్లకి మరియు తిరుచ్చి ఉత్సవాలు*
బ్రహ్మోత్సవాల్లో తొమ్మిదవ మరియు చివరిరోజు తెల్లవారు ఝామున మూడుగంటల నుంచి ఆరుగంటల వరకు, చక్రస్నానానికి ముందుగా దేవాలయంలో పల్లకి ఉత్సవం మరియు తిరుచ్చి ఉత్సవం జరుగుతాయి.
[ రేపటి భాగంలో... *శ్రీవారి బ్రహ్మోత్సవాలలో - వాహనోత్సవ క్రమం* విశేషాలు మరిన్ని తెలుసుకుందాం]
*ఓం నమోవేంకటేశాయ* 🙏🍁🙏
No comments :