*పద్మావతీ - శ్రీనివాసుల పరిణయం -2*
*వకుళమాత రాయబారం:*
అగస్త్యేశ్వరస్వామి ఆలయంలోని తీర్థప్రసాదాలతో అంతఃపురాని కేతెంచిన చెలికత్తెలు, తమతో పాటుగా వచ్చిన వకుళమాతను ధరణీదేవికి పరిచయం చేస్తారు. వకుళమాత రాజదంపతులకు నమస్కరిస్తూ, తనను శ్రీనివాసుని తల్లిగా పరిచయం చేసుకుని, పద్మావతి, శ్రీనివాసులు ఒకరినొకరు తొలిచూపులోనే ప్రేమించుకున్నారని, కారణజన్ములైన వారిరువురికి వివాహం జరిపించాలని ప్రార్థిస్తుంది. ఎరుకలసాని ద్వారా అప్పటికే ఈ విషయాలన్నింటినీ విన్న ఆకాశరాజు దంపతులు, శ్రీనివాసుణ్ణి తమ అల్లునిగా పొందటం తమ జన్మజన్మల సుకృతంగా భావించి, పద్మావతినిచ్చి వివాహం చేయడానికి మనస్ఫూర్తిగా అంగీకరించి, త్వరలో ముహూర్తం నిశ్చయించి వివాహం జరిపిస్తామని వకుళమాతకు మాట ఇస్తారు. తన కార్యం సఫలం కావడంతో సంతృప్తి చెందిన వకుళాదేవి వేంకటాచలం చేరుకొని, శ్రీనివాసునికి శుభవార్తను చేరవేస్తుంది.
ఆనంద పరవశుడైన శ్రీనివాసుడు వకుళమాతను ఆప్యాయంగా, మాతృవాత్సల్యంతో ఆలింగనం చేసుకుంటాడు.
*వివాహాహ్వాన పనుల్లో ఆకాశరాజు*
పట్టరాని సంతోషంతో ఉద్విగ్నుడైన ఆకాశరాజు వెంటనే కార్యరంగంలోకి ఉరికి, తన పుత్రుడైన "వసుద" తో తమ గురువుగారైన దేవలోకవాసి "బృహస్పతి" కి కబురు పంపుతాడు. క్షీరసాగరమధనంలో లక్ష్మీదేవికి తమ్మునిగా పుట్టిన "చంద్రుడు", కలియుగంలో ఆకాశరాజు దంపతులకు, పద్మావతిదేవి అనుజునిగా జన్మిస్తాడు.
వసుద ద్వారా ఆ శుభవార్త తెలుసుకున్న బృహస్పతి, పెండ్లి కుమారుడెవరో తన దివ్యదృష్టితో తెలుసుకొని పరమానందభరితుడై, అంతటి శుభకార్యం తనచేతుల మీదగా సఫలం కాబోవడం తన భాగ్యంగా భావించి పొంగిపోతాడు. కానీ, వెంటనే తన స్థాయిని గుర్తెరిగి భగవంతుని కళ్యాణం జరిపించగల సామర్థ్యం తనకు లేదని, తిరుచానూరుకు దగ్గరలోనున్న సరోవరంలో నివసిస్తున్న "శుకాచార్యులు" దానికి సమర్థుడని వసుదతో విన్నవించుకుంటాడు.
అంతట ఆకాశరాజు, తన తమ్ముడైన తొండమానునితో శుకాచార్యునికి వర్తమానం పంపుతాడు. ఆకాశరాజు విజ్ఞప్తిని విన్న వెంటనే సంతోషంతో ఉబ్బితబ్బిబ్బెన శుకాచార్యులవారు, తొండమానునితో నారాయణవనం చేరుకుంటారు. తన దివ్యదృష్టితో పూర్వాపరాలన్నింటిని తెలుసుకున్న శుక్రాచార్యుడు, సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే శ్రీనివాసునిగా భూలోకంలో అవతరించాడని ఆకాశరాజుకు విశద పరిచి, వకుళాదేవి ద్వారా శ్రీనివాసుని జన్మనక్షత్రం, తల్లిదండ్రుల వివరాలు తెలుసుకుంటారు. ఇరువురి జాతకాలు పరిశీలించిన శుకాచార్యుడు - *వైశాఖమాసం, శుక్లదశమి, శుక్రవారం నాటి ఉత్తరఫల్గుణి నక్షత్రం* అత్యంత శ్రేష్ఠమైన లగ్నంగా నిశ్చయించి – ఆ శుభఘడియలో పద్మావతి-శ్రీనివాసుల వివాహం జరగాలని వివాహ శుభలేఖను వ్రాయిస్తారు.
ఆకాశరాజు కోరికపై శుకాచార్యుడు శుభలేఖను స్వయంగా శ్రీనివాసునికి అందజేస్తాడు. ఆ శుభవార్త నిన్న శ్రీనివాసుడు అమితానందంతో శుభలేఖను శిరస్సుపై నుంచుకొని, శుకాచార్యుణ్ణి ఆలింగనం చేసుకుంటాడు. ఆకాశరాజు లేఖకు ప్రత్యుత్తరం రాసి, వివాహానికి లాంఛనప్రాయంగా తమ ఆమోదాన్ని తెలుపుతాడు.
*పెండ్లి సంరంభంలో శ్రీనివాసుడు*
వివాహానికి ఆమోదం తెలిపిన కొద్ది సేపట్లోనే, కలియుగంలో మానవసహజమైన చిత్తచాంచల్యంతో శ్రీనివాసుని మనసు మారిపోతుంది. ఆయన వకుళాదేవిని పిలిచి తనకు ఈ వివాహం ససేమిరా వద్దంటాడు. నివ్వెరబోయిన వకుళాదేవి, పూర్వజన్మలో శ్రీకృష్ణుడు ఎనిమిది వివాహాలు చేసుకున్నప్పటికీ తల్లి అయిన యశోదకు ఒక్క వివాహం కూడా చూసే భాగ్యం కలుగలేదని, ఆ అదృష్టం ఈ జన్మలోనైనా కలగాలని గంపెడాశతో ఎదురు చూస్తున్నానని, ఎన్నో ప్రయాసలకోర్చి ఆకాశరాజు దంపతులను వివాహానికి ఒప్పించానని, తన ఆశలను వమ్ముచేయవద్దని పదేపదే ప్రాధేయ పడుతుంది.
అందుకు సమాధానమిస్తూ, శ్రీనివాసుడు, ఆకాశరాజు అపరిమితమైన ఐశ్వర్యం కలవాడని; ఎందరో బంధుమిత్రులు, పరివారం, మందీమార్బలం కలవాడని; తాను మాత్రం ఎవరూ లేని నిరుపేదనని; కయ్యానికైనా వియ్యానికైనా సమఉజ్జీ ఉండాలి కదా అంటూ తన మనసులోని సంకోచాన్ని వెల్లడిస్తాడు. అందుకు వకుళాదేవి, శ్రీనివాసుడు సకల లోకాలకు సార్వభౌముడని, ఆకాశరాజు పేరుకే రాజని, సాధనసంపత్తులలో ఆ రాజు శ్రీనివాసునికి ఎంతమాత్రం సరితూగడని, శ్రీనివాసుడు ఆజ్ఞాపించినంతనే బ్రహ్మాది దేవతలు శిరసావహిస్తారని విన్నవించుకుంటుంది.
వకుళాదేవి వాక్కులతో అద్వితీయమైన తన వైకుంఠ వైభవాన్ని స్మరణలోకి తెచ్చుకున్న శ్రీనివాసుడు, వెంటనే కళ్యాణ ఏర్పాట్లకు సన్నద్ధుడవుతాడు. పెండ్లిపనులను బ్రహ్మాది దేవతలకు, తన సేవకులైన గరుత్మంతుడు, ఆదిశేషునికి పురమాయిస్తాడు. వార్త విన్న మరుక్షణం ముక్కోటి దేవతలు వెంటరాగా ఆఘమేఘాలపై బ్రహ్మదేవుడు భూలోకానికి బయలు దేరుతాడు.
యక్ష కిన్నెర కింపురుషులు, గంధర్వులు, బ్రహ్మర్షులు, అష్టదిక్పాలకులు, బ్రహ్మ మానసపుత్రులు అందరూ కలిసి శ్రీనివాసుని రూపంలో ఉన్న శ్రీమహావిష్ణువు కళ్యాణాన్ని సందర్శించడానికి ఉద్యుక్తులవుతారు. శ్రీనివాసుడు ఆహ్వానితులందరికి ఎదురేగి మార్గమధ్యంలోనే వారందరిని ఆప్యాయంగా పలకరిస్తాడు. వచ్చిన వారందరూ తనకు ఆప్తులు, అత్యంత సన్నిహితులు కావడంతో వారందరికీ చనువుతో, వారి వారి శక్తి సామర్థ్యాలకు తగ్గట్టుగా, పనులు పురమాయించడం ప్రారంభించాడు శ్రీనివాసుడు
ఇంద్రుడు, దేవతా శిల్పులైనట్టి మయుడు విశ్వకర్మలను పిలిచి వేంకటాచలక్షేత్రం మీద ఆహ్వానితులందరికి విడిదిగా, సకలసౌకర్యాలు కలిగిన ఓ పట్టణాన్ని నిర్మించ వలసిందిగా ఆదేశించాడు. ఎంతటి మహారాజైనా, మానవమాత్రుడే కాబట్టి ఆకాశరాజుకు సైతం ఇంతమందికి, వారివారి హోదాలకు తగ్గట్లుగా విడిది ఏర్పాటు చేయాలంటే సాధ్యమా !
ఆ విధంగా దూరదృష్టితో ఆలోచించిన శ్రీనివాసుడు, తనకు కాబోయే మామగారైన ఆకాశరాజు నగరం "నారాయణవనం" లో కూడా ఓ మహానగరాన్ని విశ్వకర్మచే నిర్మింపజేశాడు.
సకలదేవతలకు ఆదరపూర్వకంగా, తగు లాంఛనాలతో స్వాగతం పలికే కార్యక్రమాన్ని మృదుభాషియైన కుమారస్వామికి అప్పగించాడు.
వంటపని భారం అంతా అగ్నిదేవునికి అప్పజెప్పాడు.
ఆహూతులందరికీ స్నానపానాదులకు, జపతపాదులకు, సంధ్యావందనాలకు కావలసిన శుధోదకాన్ని సరఫరా చేసే బాధ్యతను వరుణుడు స్వీకరించాడు.
పౌరోహిత్య కార్యక్రమానికి వశిష్ఠుడు పెద్దదిక్కు.
ఆహ్వానితులందరు క్రమశిక్షణతో మెలిగేటట్లు చూసే బాధ్యత యమునికి అప్పగించబడింది. లక్షలాదిమంది భోజనం చేయడానికి కావలసిన విస్తరాకులను, ఆకుదొన్నెలను తయారు చేయించే బాధ్యత నవగ్రహాలది.
బ్రాహ్మణులకు భూరిగా దక్షిణ ఇప్పించే భారాన్ని ధనాధిపతి కుబేరుడు భుజాన వేసుకున్నాడు. ఘటనాఘటన సమర్థుడైన శ్రీనివాసుడు ఈ సమస్త కార్యాలను ఒంటిచేత్తో, అనాయాసంగా నిర్వర్తించగలడు. కేవలం తన బంధుజనులను సంతృప్తి పరచడానికి, వారిని కూడా ఈ పుణ్యకార్యంలో భాగస్వమ్యులుగా చేయడానికి, అందరికీ తలా ఒక బాధ్యత అప్పగించాడు.
అటు శ్రీనివాసుని తరపున, ఇటు ఆకాశరాజు తరపున పెండ్లి పనులు ముమ్మరంగా సాగుతున్నాయి.
*శ్రీమహాలక్ష్మీ ఆగమనం*
కానీ శ్రీనివాసుడు మాత్రం ఎందుచేతనో ఉదాసీనుడై ఉన్నాడు. ముఖారవిందంలో పెండ్లికళ కనపడడం లేదు. బ్రహ్మదేవుడు దానికి కారణం ప్రశ్నించగా, శ్రీనివాసుడు, వివాహానికి ఎందరు విచ్చేసినా, నా మహాలక్ష్మి లేని కొరత కనిపిస్తూనే ఉంది. ఆమె లేకుండా పెండ్లికళ రాదు" అని బదులిస్తాడు. అది చిక్కు సమస్యే!
ఎందుకంటే శ్రీమన్నారాయణుని పట్ల అలిగి భూలోకానికి చేరుకున్న శ్రీమహాలక్ష్మి, పెనిమిటి రెండవ వివాహానికి అంత తేలిగ్గా వస్తుందా? లక్ష్మీదేవిని తోడ్కొనిరావటానికి ఎవరిని పంపాలి?
ఇంత క్లిష్టతరమైన కార్యం సాధించటానికి ఎవరు అత్యంత సమర్థులు? అన్నీ సమస్యలే!
కొద్దిగా తర్జనభర్జన పడిన తర్వాత శ్రీనివాసుడు, "శ్రీమహాలక్ష్మి పద్మంలో ఉద్భవించింది. ఉదయిస్తున్న బాలభానుని చూస్తూనే పద్మం వికసిస్తుంది. పుట్టింటివారి పట్ల ఉండే సహజమైన మమకారంతో, సూర్యనారాయణుడంటే లక్ష్మీదేవికి మిక్కిలి అభిమానం. ఆమె సూర్యుని మాట కాదనదు. కాబట్టి సూర్యుణే లక్ష్మీదేవి చెంతకు రాయబారంగా పంపుదాం" అని నిర్ణయించాడు.
కానీ, ఇది పెద్దలతో వ్యవహారం, అందునా భార్యాభర్తల మధ్య పేచీ అవడంతో సూర్యుడు కొద్దిగా జంకుతాడు. శ్రీనివాసుడు సూర్యునికి ధైర్యం చెప్పి, విష్ణుమూర్తి అనారోగ్యం పాలయ్యాడని, బ్రహ్మ రుద్రాదుల సహాయంతో మాత్రమే లేచి నడవగలుగుతున్నాడని లక్ష్మీదేవితో చెప్పమంటాడు. "జగజ్జనని, సర్వజ్ఞురాలు అయిన లక్ష్మీదేవికి అసలు విషయం తెలియకుండా ఉంటుందా!" అంటూ సందేహాన్ని వెలిబుచ్చిన సూర్యునికి, శ్రీనివాసుడు "నా మాయతో ఆమె మోహవశురాలవుతుంది. నీ కార్యం నిర్విఘ్నంగా సాకారమవుతుంది. క్షేమంగా వెళ్లి రమ్మంటూ" బదులిస్తాడు.
సప్తాశ్వరథారూఢుడైన సూర్యనారాయణుడు హుటాహుటిన లక్ష్మీదేవి నివసిస్తున్న కరివీరపురం చేరుకుంటాడు. మొదట్లో కొద్దిగా అభ్యంతరం చెప్పినా, శ్రీనివాసుని అనారోగ్యం గురించి తెలియగానే ఆందోళన చెందిన లక్ష్మీదేవి, వెంటనే బయలుదేరి వేంకటాచలం విచ్చేస్తుంది.
చెంతకు చేరుకున్న శ్రీమహాలక్ష్మిని ఆప్యాయంగా పలకరించిన శ్రీనివాసుడు, త్రేతాయుగం నాటి వేదవతి ఈ కలియుగంలో పద్మావతిగా జన్మించిందని, ఆనాడు శ్రీమహాలక్ష్మి ఆనతిచ్చిన ప్రకారం ఈనాడు పద్మావతి రూపంలో ఉన్న వేదవతిని వివాహమాడదలచానని, కానీ లక్ష్మీదేవి సమక్షంలోనే ఈ పెళ్లి జరగాలని కోరుకుంటాడు. ఆప్యాయమైన శ్రీవారి పలకరింపుతో, త్రేతాయుగం నాటి తన కోరిక నిజం కాబోతుందన్న సంతోషంతో, లక్ష్మీదేవి ఆ వివాహానికి అంగీకరించి, పార్వతి, సరస్వతి మొదలైన ముత్తయిదువుల సహకారంతో శ్రీనివాసునికి మంగళద్రవ్యాలతో అభ్యంగనస్నానం కావించింది.
[ రేపటి భాగంలో... *పద్మావతీ - శ్రీనివాసుల పరిణయం* గురించి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం]
*శ్రీనివాసుని శ్రీచరణాలను సేవిద్దాం, సకల శుభాలనూ పొందుదాం*
No comments :