*శ్రీవారి బ్రహ్మోత్సవాలు - 10*
👉 *చక్రస్నానం:*
తొమ్మిది రోజుల బ్రహ్మోత్సవాలలో జరిగినటువంటి అన్ని సేవలు సఫలమై లోకాలన్నీ క్షేమంగా ఉండటానికి, భక్తులు సుఖశాంతులతో వర్థిల్లడానికి, శ్రవణా నక్షత్రం నాడు *"చక్రస్నానం"* జరుగుతుంది. యజ్ఞాంతంలో క్రతుకర్త చేసే స్నానాన్ని *"అవభృథస్నానం"* అంటారు. బ్రహ్మోత్సవాలు ఓ మహాయజ్ఞమే కనుక, చివరి రోజున అవభృథస్నానం చేస్తారు. స్వామివారి సేవకుడు, పంచాయుధాల్లో ఒకరైన సుదర్శనచక్రం (లేదా చక్రత్తాళ్వార్) ఈ స్నానమాచరించటం వల్ల ఇది *"చక్రస్నానం"* అయ్యింది.
స్వామిపుష్కరిణికి వాయువ్య భాగంలో, తిరుమల క్షేత్రంలో మొట్టమొదటిదైన "ఆదివరాహస్వామి" ఆలయం కొలువై ఉంది. శ్రీదేవి భూదేవి సమేత మలయప్పస్వామి తొమ్మిదవరోజు ఉదయం ఈ ఆలయ ప్రాంగణం చేరుకుంటారు. వారితో పాటుగా, వేరే పల్లకిలో చక్రత్తాళ్వార్ (సుదర్శన చక్రం) కూడా వేంచేస్తారు. మొదటగా స్వామివారికి దేవేరులకు స్నానవస్త్రాలు ధరింపజేసి, ఆర్ఘ్య, పాద్య, ఆచమనాదులు జరిపి, శుధ్ధోదక స్నానం చేయిస్తారు. తదుపరి, ఆవుపాలు దాని తరువాత శుద్ధజలంతో అభిషేకం జరుగుతుంది. ఆ తరువాత వరుసగా – పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, పసుపుతో - అభిషేకం చేస్తారు. ఒక ద్రవ్యంతో అభిషేకం చేసిన తరువాత ప్రతిసారి, శుద్ధజలంతో విగ్రహశుద్ధి గావిస్తారు. తదనంతరం ధూప, దీప, కర్పూర నీరాజనాలు సమర్పించి; దేవతామూర్తులకు చందనసంస్కారం, తిలకధారణ గావించి; తులసిమాలలతో అలంకరిస్తారు. వరుసగా - కుంభహారతి, నక్షత్ర హారతి, సహస్రాభిషేకం - జరుపబడతాయి.
ఈ వైదికప్రక్రియ జరుగుతున్నంతసేపు... *శ్రీ సూక్తం, పురుషసూక్తం, భూసూక్తం పఠిస్తారు.* తరువాత స్వామివారి అభిషేకజలంతో అర్చకులు తమ శిరస్సును సంప్రోక్షించుకొని, ఆ జలాన్ని భక్తుల మీద జల్లుతారు.
తదనంతరం, చక్రత్తాళ్వార్ కు మాత్రమే స్వామి పుష్కరిణిలో *"చక్రస్నానం"* లేదా *"అవభృథస్నానం"* లేదా *"పవిత్రస్నానం"* జరుగుతుంది.
స్థూలంగా చెప్పాలంటే, ఉత్సవవైభోగం, యజమాని అయిన శ్రీవేంకటేశ్వరస్వామికి, అవభృథస్నానం సేవకుడైన చక్రత్తాళ్వార్ లేదా సుదర్శన చక్రానికి అన్నమాట.
ఆ దివ్యాయుధ స్పర్శవల్ల పవిత్రమైన పుష్కరిణీ జలాల్లో భక్తులు, అర్చకులు, ఆచార్యపురుషులు, జియ్యంగార్లు అందరూ స్నానంచేసి పవిత్రులవుతారు. తరువాత స్వామివారు, దేవేరులు, చక్రత్తాళ్వార్ ఊరేగింపుగా ఆలయంలోకి పునఃప్రవేశం చేసి, యథాస్థానాన్ని అలంకరిస్తారు. శ్రవణా నక్షత్రం నాడు సుదర్శనచక్రంతో పాటుగా స్వామిపుష్కరిణిలో స్నానం చేసినవారు పూర్వజన్మల పాపాలు తొలగించుకుని సుఖసంతోషాలతో వర్ధిల్లుతారు.
*శ్రవణంబునందు నా చక్రంబుతో గూడ*
*స్వామి పుష్కరిణిలో స్నానములను*
*సల్పువారలు పూర్వజన్మంబులను జేయు*
*పాపంబులను బాసి*
*భాగ్యవంతులై యిహపరములయందు సుఖింతురు*
*నా పల్కు నిజముగా నమ్ముడని*
స్వామిపుష్కరిణిలో ఉన్న మహత్తు ఏమిటంటే మూడు దివ్యమైన మార్గాలద్వారా అందులోకి జలం చేరుతూ ఉంటుంది:
*మొదటిది: భూస్పర్శ.*
పుష్కరిణిలో ఉన్న అనేక ఊటబావుల నుండి ఎల్లవేళలా జలం ఊరుతూ, పుష్కరిణి నిండుగా ఉంటుంది. అంటే, భూదేవి, పుష్కరిణిని నింపడానికి తనవంతు ప్రయత్నం నిర్విరామంగా చేస్తుందన్నమాట.
*రెండవది: ఇంద్రుని సమర్పణ.*
వర్షపుధారల ద్వారా వచ్చిన నీటితో పుష్కరిణి నిండుతుంది.
*మూడవది: విరజానది*
స్వర్గలోకం నుండి భువికి దిగివచ్చి స్వామిపాదాల క్రిందుగా ప్రవహిస్తూ పుష్కరిణిలో చేరుకుంటున్న *"విరజానది".*
*త్రిపథ జల సంగమమైనది కాబట్టే ఈ పుష్కరిణి పరమపవిత్రమైనదిగా విరాజిల్లుతోంది.*
ఈ పుష్కరిణి చుట్టూ దేవతలు కొలువై ఉంటారని భక్తుల విశ్వాసం. ప్రాచీనకాలంలో ఎందరో మహర్షులు పుష్కరిణి ఒడ్డున తపస్సు చేసి సిద్ధి పొందారు. సంస్కృతంలో *"నీరము"* అంటే నీరు లేదా జలము అని అర్థం. ఉదకం సాక్షాత్తు ఆ శ్రీహరి స్వరూపం కనుక, ఆ స్వామి "నారాయణుడు" అయ్యాడు.
ఈ సందర్భంలో తీర్థక్షేత్రాల గురించి కూడా కొద్దిగా చెప్పుకోవాలి:
పుష్కరిణిలు, నదులు, ఏ ఇతర సహజ జలసదుపాయం లేకుండా ఉన్నటువంటి దేవాలయాన్ని *క్షేత్రం* అంటారు.
దేవాలయం లేకుండా కేవలం సహజ జలసదుపాయం ఉంటే వాటిని *తీర్థం* అంటారు.
పుష్కరిణి లేదా నది మరియు ఆలయం - ఈ రెండూ కలిసి ఉంటే దాన్ని *తీర్థక్షేత్రం* అంటారు.
*తిరుమల అన్ని తీర్థ క్షేత్రాలకు తలమానికం.*
దేవాలయాల్లో కూడా వాటి ఆవిర్భావాన్ని బట్టి ఐదు రకాలున్నాయి:
'భగవంతుడే "స్వయంగా" అవతరిస్తే అవి *స్వయంవ్యక్త క్షేత్రాలు.*
దేవతలచే నిర్మింపబడినవి *దివ్యక్షేత్రాలు.*
పురాణ ప్రసిద్ధి గాంచినవి *పురాణ క్షేత్రాలు.*
మునిపుంగవుల ద్వారా ఏర్పాటు చేయబడినవి *సిద్ధ క్షేత్రాలు* లేదా *ఆర్షములు*
భక్తులు, రాజులచే నిర్మించబడినవి *మానుషక్షేత్రాలు*
భారతదేశంలో ఉన్న ఎనిమిది స్వయంవ్యక్త క్షేత్రాలలో తలమానికమైనది తిరుమల క్షేత్రం. *జీవితంలో ఎనిమిదిసార్లు తిరుమల క్షేత్రాన్ని దర్శించుకుంటే, మిగతా ఏడు స్వయంవ్యక్త క్షేత్రాల్లో ఉన్న శ్రీమన్నారాయణుణ్ణి దర్శించినంత ఫలం లభిస్తుంది.*
*తిరుమల క్షేత్రంలో, ఆదివరాహస్వామి ఆలయ ప్రాంగణం నందు విరాజిల్లుతున్న స్వామిపుష్కరిణిలో స్నానమాచరించటం ఎన్నో జన్మల సుకృతం. ఈ పుష్కరిణిలో సంవత్సరానికి నాలుగు సార్లు చక్రస్నానం జరుగుతుంది.*
భాద్రపదశుద్ధచతుర్దశి – అనంతపద్మనాభ వ్రతం నాడు.
ఇప్పుడు మనం చెప్పుకుంటున్న తొమ్మిది రోజులు జరిగే బ్రహ్మోత్సవాలలో చివరిరోజు
వైకుంఠ ద్వాదశి ఉదయం
రథసప్తమినాటి మధ్యాహ్నం
స్వామివారి పరివారదేవతలైన గరుత్మంతుడు, హనుమంతుడు, జయవిజయులు, సుదర్శనుడు మొదలగు వారిని దర్శిస్తే స్వామివారు పరమానందభరితుడవుతారు. అలాగే, బ్రహ్మోత్సవాల్లో ఆయన పరివార సదస్యుడైన సుదర్శనచక్రాన్ని సందర్శించుకొని వారితో బాటు చక్రస్నానం గావిస్తే స్వామివారు మరింత సంతృప్తి చెందుతారు.
*చక్రమా హరి చక్రమా వక్రమన దనుజుల వక్కలించవో ||*
*చుట్టి చుట్టి పాతాళము చొచ్చి హిరణ్యాక్షుని*
*చట్టలు చీరిన వో చక్రమా*
*పట్టిన శ్రీహరిచేత పాయక ఈ జగములు*
*ఒట్టుకొని కావగదవొ ఓ చక్రమా ||*
*అలంకార తిరుమంజనం*
ఇది వాహనోత్సవం కాదు.
శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో ఉత్సవ - ఊరేగింపు కార్యక్రమాలయందు స్వామివారికి ఏదైనా తెలియని శ్రమ కలిగితే దానిని పోగొట్టి, నూతనత్వాన్ని, కాంతిమత్వాన్ని ఆపాదింపచేయటమే *"స్నపనతిరుమంజన ఉత్సవం"* లేదా *"అలంకార తిరుమంజనం"* యొక్క లక్ష్యం. ఈ సాంప్రదాయం అనాదిగా వస్తోంది.
రంగనాయక మండపాన్ని శోభాయమానంగా అలంకరించి, మొదటగా ఉత్సవర్లను స్వర్ణపీఠంపై వేంచేపు చేస్తారు. తరువాత తీర్థం (కుంకుమపువ్వు, యాలకలు, జాపత్రి, లవంగాలు, పచ్చకర్పూరం కలిపిన జలం) తో తిరుమంజనం లేక అభిషేకం చేస్తారు. ఆ తరువాత పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, పసుపు, చందనంతో, ఒకదాని తరువాత ఒకటిగా, జియ్యంగార్లు శంఖనిధి-పద్మనిధి బంగారు పాత్రలలో అందిస్తుండగా, కంకణభట్టాచార్యులైన అర్చకులు, ఉత్సవర్లకు అభిషేకం చేస్తారు. చివరగా సహస్రధారపాత్రతో అభిషేకం గావిస్తారు.
ఒక్కో ద్రవ్యంతో అభిషేకం జరిగిన తర్వాత, ఉత్సవమూర్తులకు ఒక్కో రకం మొత్తం తొమ్మిది రకాల మాలలు, కిరీటాలు, జడలను - స్వామివారు, అమ్మవార్లకు అలంకరిస్తారు. వీటిని యాలకులు, ఎండుద్రాక్ష, వట్టివేళ్ళు, గులాబీ రేకులతో; వీటితో పాటుగా, కొన్నిసార్లు విలక్షణంగా శనగఫలాలు, చిక్కుడుకాయలు, చెర్రీ ఫలాలు, పొగడపూలు తులసీపత్రాలతో ఆకర్షణీయంగా తయారుచేస్తారు. ప్రత్యేకంగా తయారు చేయబడిన విసనకర్ర, అద్దం, ఛత్రం వీటిని కూడా అందుబాటులో ఉంచుతారు. పోయిన సంవత్సరం విసనకర్రను ముత్యాలతో, నెమలిపింఛాలతో తయారు చేశారు. అలాగే, అద్దాన్ని ముత్యాలు-తామరపువ్వుల గింజలతో, గొడుగును మంచిముత్యాలతో రూపొందించారు.
స్నపనతిరుమంజనం జరుగుతున్నంతసేపు, మధ్యమధ్యలో ఉత్సవమూర్తులకు నివేదనలు సమర్పిస్తారు. ఒక సంవత్సరం జరిగిన స్నపనతిరుమంజనంలో ఆస్ట్రేలియా, సింగపూర్ భక్తులు సమర్పించిన నారింజ, కివి; జపాన్, థాయిలాండ్, అమెరికాకు చెందిన ప్లమ్ ఫలాలు; న్యూజిలాండ్ నుంచి తెచ్చిన గోల్డెన్ యాపిల్ ఫలాలు; భారతదేశంలోని సుదూరప్రాంతాల నుంచి వచ్చిన స్ట్రాబెర్రీ, దానిమ్మ ఫలాలను నైవేద్యంగా సమర్పించారు.
స్నపనతిరుమంజన కార్యక్రమం జరుపబడే రంగనాయకమండపాన్ని థాయిలాండ్, ఇండోనేషియా దేశాల నుండి తెప్పించిన ఆర్కిడ్స్, గ్లాడియోలస్, ఓరియంటల్ తులిప్స్ తో కన్నుల పండువగా అలంకరించారు.
*ధ్వజావరోహణం*
బ్రహ్మోత్సవాల్లో తొమ్మిదవనాటి రాత్రి ఆలయంలోని వెండివాకిలి ముందు *"ధ్వజావరోహణం"* జరుగుతుంది.
శ్రీదేవి భూదేవి సమేత మలయప్పస్వామి బంగారుతిరుచ్చిలో సాయంత్రం ఏడు గంటలకు ధ్వజస్తంభం వద్దకు చేరుకుంటారు. రాత్రి తొమ్మిది గంటలకు పూజాదికాలు ముగించుకొని, వేదపారాయణం చేస్తుండగా, మంగళ వాద్యాలు, భేరీనినాదాలు మార్ర్మోగుతుండగా, ఉత్సవాలకు విచ్చేసినట్టి బ్రహ్మాదిదేవతలు, అష్టదిక్పాలకులకు వీడ్కోలు చెబుతూ, మరుసటి బ్రహ్మోత్సవాలకు ఇపుడే తొలి ఆహ్వానం పలుకుతూ, గరుడకేతనాన్ని ధ్వజస్తంభం మీద నుండి అవనతం చేస్తారు.
ఈ సందర్భంగా *గరుడధ్యానం, భేరీ పూజ, భేరీతాడనం, గరుడగద్యం, దిక్పాలకగద్యం, గరుడలగ్నాష్టకం, గరుడచూర్ణిక* – అనే ఏడు మంత్రాలను జపించి, బ్రహ్మాత్సవాలు ముగిసినట్లుగా అర్చకస్వాములు ప్రకటిస్తారు.
ఈ విధంగా గరుడకేతనాన్ని ఎగురవేస్తూ ముల్లోకవాసులను ఆహ్వానించడంతో ప్రారంభమైన బ్రహ్మోత్సవాలు, గరుడధ్వజాన్ని దించివేస్తూ అతిథులందరికీ వీడ్కోలు చెప్పడంతో పరిసమాప్తి అవుతాయి.
ఈ వీడ్కోలుపర్వాన్ని అన్నమయ్య అత్యంత సహజంగా, హృద్యంగా, ఆప్యాయంగా, అహూతులందరికీ పేరు పేరునా వీడ్కోలు చెబుతూ, ఈ విధంగా వర్ణించాడు:
No comments :