♾️•••┉┅━❀🕉️❀┉┅━•••♾️
*శ్రీవారి బ్రహ్మోత్సవాలు - 3*
✍️ శ్రీమతి&శ్రీ పల్లపోతు వాణిశ్రీ-కృష్ణబాలాజీ
♾️•••┉┅━❀🕉️❀┉┅━•••♾️
*వాహనోత్సవ క్రమం:*
✅ *వాహనోత్సవక్రమం ఈ విధంగా ఉంటుంది:*
👉 *బ్రహ్మోత్సవాల ముందు రోజు – అంకురార్పణ ఘట్టం*
✳️ *మొదటి రోజు* సాయంత్రం *ధ్వజారోహణం,* వెనువెంటనే *పెద్దశేషవాహనం.*
✳️ *రెండవ రోజు* ఉదయం చిన్న *శేష వాహనం,* సాయంత్రం *హంసవాహనం*
✳️ *మూడవ రోజు* ఉదయం *సింహవాహనం,* సాయంత్రం *ముత్యపుపందిరి వాహనం*
✳️ *నాల్గవ రోజు* ఉదయం *కల్పవృక్ష వాహనం,* సాయంత్రం *సర్వభూపాల వాహనం*
✳️ *ఐదవ రోజు* ఉదయం *మోహినీ అవతారం,* సాయంత్రం *గరుడవాహనం*
✳️ *ఆరవ రోజు* ఉదయం *హనుమంత వాహనం,* సాయంత్రం *స్వర్ణరథం,* తదుపరి *గజవాహనం*
✳️ *ఏడవ రోజు* ఉదయం *సూర్యప్రభవాహనం,* సాయంత్రం *చంద్రప్రభవాహనం.*
✳️ *ఎనిమిదవ రోజు* ఉదయం *రథోత్సవం,* సాయంత్రం *అశ్వవాహనం.*
✳️ *తొమ్మిదవ రోజు* ఉదయం *పల్లకి ఉత్సవం,* మధ్యాహ్నం *తిరుచ్చి ఉత్సవం,* తదనంతరం 6 గంటలకు *చక్రస్నానం.*
👉 ఇలా మొత్తం పదిహేడు వాహనాలెక్కి ఊరేగుతుండడం వల్లనే స్వామివారు భక్త జనులకు ప్రీతిపాత్రుడయ్యాడట. అందుకే అన్నమయ్య - స్వామివారిని ఈ విధంగా కీర్తించాడు.
*"ఎట్టు నేరిచితివయ్య ఇన్ని వాహనములెక్క*
*గట్టిగా నిందుకే హరి కడు మెచ్చేమయ్యా ! "*
♾┉┅━❀🕉️❀┉┅━♾
🌈 *తండ్రిగారికి తనయుడు చేసే సేవ* 🌈
👉 బ్రహ్మోత్సవాల్లో ప్రతిరోజు ఉదయం, సాయంత్రం ఉత్సవ వాహనాల ముందుగా *"బ్రహ్మరథం"* వెళుతూ ఉంటుంది. ఎందుకంటే, శ్రీవారి బ్రహ్మోత్సవాలు బ్రహ్మదేవుని నేతృత్వంలో, ఆయన సమక్షంలో జరుగుతున్నాయని లోకాలకు తెలియపరచడం కోసం!
👉 శ్రీవారి వాహనానికి ముందు, శోభాయమానంగా అలంకరించిన ఓ చిన్న రథంలో, నిరాకార నిర్గుణ స్వరూపంలో బ్రహ్మదేవుడు వేంచేసి ఉత్సవాలకు ఆధ్వర్యం వహిస్తాడు. కానీ ఒక్క రథోత్సవం నాడు మాత్రం అదృశ్యంగా స్వామివారి రథం యొక్క పగ్గాలను స్వయంగా పట్టి లాగుతూ రథోత్సవంలో పాల్గొంటాడు. అందుకే ఆరోజు స్వామివారి వాహనం ముందు, బ్రహ్మదేవుడు వేంచేసి ఉండే చిన్న రథం ఉండదు.
👉 లోక కళ్యాణార్థమై ఈ ఉత్సవాలను ఏర్పాటు చేసిన బ్రహ్మను గుర్తుకు తెస్తూ, శ్రీవేంకటేశ్వర అష్టోత్తర శతనామావళిలో - *"ఓం బ్రహ్మకృతోత్సవాయ శ్రీవేంకటేశాయ నమః"* అనే నామం చేర్చబడింది. దీని అర్థం, *'బ్రహ్మచే ఏర్పాటు చేయబడిన మహోత్సవాలను స్వీకరించిన శ్రీవేంకటేశ్వరునికి ప్రణామం."*
👉 బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీవారు అధిరోహించే ప్రతి వాహనానికి జన్మజన్మల ఆధ్యాత్మిక చరిత్ర ఉంది. ప్రతి జన్మలోనూ వాటికి శ్రీవారితో విడదీయరాని అనుబంధం ఉంది. ఒక్కో వాహనం ఒక్కో సందేశాన్నిస్తుంది. ఆ పదిహేడు వాహనాల చరిత్ర, అవి మనకందించే సందేశాలు ఇప్పుడు వివరంగా చూద్దాం.
♾┉┅━❀🕉️❀┉┅━♾
🌈 *పెద్దశేష వాహనం* 🌈
👉 అన్నమయ్య, బ్రహ్మోత్సవాల్లో శేషవాహన శోభను ఈ విధంగా వర్ణించాడు:
*వీడుగదే శేషుడు శ్రీ వేంకటాద్రి శేషుడు*
*వేడుక గరుడునితో బెన్నుద్దెన శేషుడు ||*
*పట్టుపు వాహనమైన బంగారు శేషుడు*
*చుట్టు చుట్టుకొనిన మించుల శేషుడు*
*నట్టుకొన్న రెండువేల నాలుకల శేషుడు*
*నెట్టిన వారి బొగడ నెరుపరి శేషుడు ||*
👉 ధ్వజారోహణ జరిగిన రోజు, అంటే బ్రహ్మోత్సవాలలో మొదటి రోజు రాత్రివేళలో శ్రీదేవి భూదేవి సమేత మలయప్పస్వామి వారికి ఏడు పడగల బంగారు *"పెద్దశేషవాహనం"* పై ఉత్సవం జరుగుతుంది. కృతయుగంలో అనంతునిగా, త్రేతాయుగంలో లక్ష్మణునిగా, ద్వాపరంలో బలరామునిగా, కలియుగంలో భగవద్రామానుజాచార్యులుగా అవతరించి; శ్రీమన్నారాయణుడికి మిక్కిలి సన్నిహితునిగా ప్రసిద్ధికెక్కినవాడు ఆదిశేషుడు.
👉 శారీరక దృఢత్వం మరియు బుద్ధిబలం సమృద్ధిగా, సమపాళ్ళలో కలిగిన ఈ ఆదిశేషుడు, శ్రీ మహావిష్ణువుకు - సింహాసనంగా, శయ్యగా, పాదుకలుగా, వస్త్రంగా, ఛత్రంగా, ఆనుకునే దిండుగా - ఇలా సమస్తసేవలు ఎల్లవేళలా అందిస్తున్నాడు. ఆదిశేషుడు నాగజాతికి అధిపతి.
👉 ఆదిశేషునికి సంబంధించి ఓ ఆసక్తికరమైన కథ ఉంది. ఒకానొకప్పుడు, కశ్యప ప్రజాపతి భార్యలైన వినతి-కద్రువల మధ్య ఒక వివాదం ఏర్పడింది. ఇంద్రుని ఉచ్ఛైశ్రవం వాస్తవంగా స్వచ్ఛమైన శ్వేతవర్ణంతో ఏ విధమైన మచ్చలు లేకుండా ఉంటుంది. దాని తోకపై ఓ నల్లటి మచ్చ ఉందని, ఒకవేళ అది నిజమైతే వినతి తనకు దాస్యం చేయాలని, లేకుంటే తానే వినతికి దాస్యం చేస్తానని కద్రువ, వినతితో పందెం కాసింది. అయితే, ఉచ్ఛైశ్రవం మీద ఏ విధమైన మచ్చ లేదని తరువాత తెలుసుకున్న కద్రువ తన కుమారులైన నాగులను పిలచి, ఎవరైనా ఒక నాగు ఉచ్ఛైశ్రవం తోకకు చుట్టుకుని దాన్నే నల్లటి మచ్చగా భ్రమింపజేసి తనను పందెంలో గెలిపించాలని కోరింది. అటువంటి అనైతిక కార్యం సాకారం చేయడానికి ఎవ్వరూ ముందుకు రాలేదు.
తనయుల ధిక్కారంతో ఆగ్రహం చెందిన కద్రువ, వారందరూ తల్లి మాట వినని కారణంచేత జనమేజయుని సర్పయాగంలో మాడిమసైపోతారని శపించింది. నాగుల్లో ఒకడైన కర్కోటకుడనే వాడు మాత్రం శాపానికి భయపడి, తల్లి మాట ననుసరించి ఉచ్ఛైశ్రవం తోకను చుట్టుకొని ఆమెను పందెంలో గెలిపింపజేశాడు.
👉 మిగిలిన నాగుల్లో ఒకడైన ఆదిశేషుడు తన తల్లి, సోదరుడు చేసిన అనైతిక కార్యానికి విరక్తి చెంది బ్రహ్మను గూర్చి దీర్ఘతపస్సు చేశాడు. అతని ధర్మనిరతి, సత్యనిష్ఠకు సంతృప్తి చెందిన బ్రహ్మదేవుడు, ఆదిశేషునికి భూమిని ధరించే మహత్తర కార్యాన్ని అప్పగించాడు. ఆ ప్రకారం అపరిమిత బలసంపన్నుడైన ఆదిశేషుడు, తన పడగలపై భూభారాన్నంతటినీ నిరంతరం మోయసాగాడు. అత్యంత కష్టతరమైన ఆ కార్యాన్ని ఎంతో శ్రద్ధగా, త్యాగనిరతితో నిర్వహిస్తున్న ఆదిశేషుణ్ణి చూసి సంతోషించిన శ్రీమహావిష్ణువు అతన్ని తన శయ్యగా, సింహాసనంగా ఎంచుకున్నాడు. ఈ వాహనసేవను చూసి తరించిన భక్తులకు ఆదిశేషుని కున్నంత సహనం, త్యాగనిరతి, ధర్మనిష్ఠ, శ్రీనివాసుని ఎడల అచంచలమైన భక్తి కలుగుతాయని ప్రతీతి.
👉 ఉభయనాంచారులతో కూడిన మలయప్పస్వామిని పుష్పమాలాలంకృతుణ్ణి చేసి, వాహనమండపంలో ఉన్న ఆదిశేషునిపై అధిరోహింపజేసి, మాడవీధుల్లో జరిపించే ఊరేగింపును బ్రహ్మోత్సవాల్లో అత్యంత ప్రధానమైనదిగా పరిగణిస్తారు. మొదట్లో తొమ్మిదవ రోజు ఉదయం ఊరేగింపునకు ఉపయోగించే ఈ వాహనం, కారణాంతరాల వల్ల ఇప్పుడు మొదట్లోనే వినియోగించబడుతోంది.
👉 శేషవాహనం దాస్య భక్తికి నిదర్శనం. ఆ భక్తితో అంకితభావం పెంపొంది, పశుత్వం నశించి, క్రమంగా మానవత్వం, అందుండి దైవత్వం, దానిద్వారా పరమపదం సిద్ధిస్తాయని నమ్మిక.
👉 మామూలు రోజుల్లో ఈ వాహనాన్ని సంపంగి ప్రదక్షిణ మార్గంలోని రంగమండపంలో మనం దర్శించుకోవచ్చు.
♾┉┅━❀🕉️❀┉┅━♾
🌈 *చిన్నశేషవాహనం* 🌈
👉 రెండవరోజు ఉదయం మలయప్పస్వామి వారు ఒంటరిగా చిన్నశేషవాహనంపై, మురళీకృష్ణునిగా లేదా నవనీత గోపాలునిగా దర్శనమిస్తారు.
👉 మునుపటి రోజున స్వామివారు అధిరోహించిన *"పెద్దశేషవాహనం"* విష్ణుమూర్తి సింహాసనమైన ఆదిశేషుని ప్రతిరూపం కాగా; ఈరోజు ఉదయం శ్రీవారు ఊరేగే *"చిన్నశేషవాహనం"* క్షీరసాగరమథనంలో మంథరపర్వతానికి కవ్వపుత్రాడుగా వ్యవహరించిన *"వాసుకి"* యొక్క ప్రతిరూపం.
👉 ఆదిశేషుడు "నాగజాతి" కి రాజైతే, వాసుకి "సర్పజాతి" కి పాలకుడు. ఆదిశేషునికి నిత్య సాన్నిధ్య భాగ్యం కలిగించిన విష్ణువు సాగరమంథన కార్యానికి తోడ్పడ్డ వాసుకికి మాత్రం *"చిన్నశేషవాహనం"* గా మారి బ్రహ్మోత్సవాల్లో తన సేవచేసుకునే అదృష్టాన్ని కల్పించాడు.
👉 శేషుడు, వాసుకి, ఇద్దరూ చైతన్యశక్తికి సంకేతాలు. కావున ఈ రెండు వాహనాల దర్శనంతో, భక్తులలో ఆధ్యాత్మిక చైతన్యం వెల్లివిరుస్తుంది. యోగశాస్త్రంలో సర్పాన్ని కుండలినీ శక్తికి సంకేతంగా భావిస్తారు. కావున ఈ వాహనాన సేవలను దర్శించిన భక్తులకు కుండలినీ యోగఫలం సిద్ధించి, మానవుడు, మాధవునికి నిజమైన సేవకుడయ్యే అవకాశం లభిస్తుంది.
👉 తరిగొండ వెంగమాంబ ఈ రెండు వాహనాలను ఈ విధంగా వర్ణించింది:
*అలఘ శేషవాహనోత్సవంబును,*
*మరునాడుదయంబు నందు లఘుశేషవాహనోత్సవంబును*
♾┉┅━❀🕉️❀┉┅━♾
🌈 *హంసవాహనం* 🌈
*హంస వాహనముపైన హరి నేడు చూడరు*
*వీణాపాణియై వేయి రాగాలతో*
*అందరి గుండెలోను అమృతం కురియగా...*
👉 రెండవరోజు సాయంత్రం, శ్రీవారు వీణాపాణి, ధవళ వస్త్రధారి, చల్లని వెన్నెలలొలికించే తెల్లని పుష్పాలు ధరించిన చదువులతల్లి రూపంలో, బంగారు హంసవాహనారూఢుడై మాడవీధులలో విహరిస్తారు.
👉 పురాణాల ప్రకారం ఒకప్పుడు లోకాలన్నీ అజ్ఞానతిమిరంలో మునిగిపోయి ఉండగా; దేవతల కోర్కెపై, విష్ణువు హంసవాహనమెక్కి హయగ్రీవునిగా లోకాలకేతెంచి తిమిరాన్ని పారద్రోలుతాడు. అలాగే, బ్రహ్మోత్సవాలలో స్వామివారు హంసవాహన మెక్కి "అన్ని కళలకూ, సర్వవిజ్ఞానానికి కారణభూతుణ్ణి నేనే, అన్నీ నా ద్వారానే సిద్ధిస్తాయి!" అన్న సందేశమిస్తారు.
*జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిమ్*
*ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవ ముపాస్మహే*
- అన్న శ్లోకంతో మొదలయ్యే *"హయగ్రీవస్తోత్రం"* సారాంశమిదే.
👉 చదువులతల్లి సరస్వతి రూపంలో ఉన్న స్వామివారిని దర్శించుకుంటే, అజ్ఞానతిమిరం తొలగిపోకుండా ఉంటుందా? సృష్టికర్తయైనట్టి బ్రహ్మదేవుని వాహనమైన హంసకు, వేరెవ్వరికీ లేనటువంటి ఓ అద్భుతమైన విచక్షణాశక్తి ఉంది.
*గుంభనమున దుగ్ధజీవన విభాగ విధాన నిరూఢ నైపుణీ జనిత మహాయశో విభవసారము*
- అనగా, ఓ పాత్రలో క్షీరనీర మిశ్రమాన్ని ఉంచితే, హంస పాలను మాత్రం గ్రహించి, నీటిని త్యజిస్తుంది. అలాగే, సృష్టిలో విచక్షణాజ్ఞానం కలిగి ఉన్న ఏకైకజీవి మానవుడు, నిరంతర సాధన చేస్తూ, చరాచర విశ్వంలో సమ్మిళితమై ఉన్నటువంటి బ్రహ్మతత్వాన్ని ఆకళింపు చేసుకుని, ఐహిక వాంఛలన్నీ పరిత్యజించాలి. నిస్సారమైన ప్రాపంచిక పాశాలలో నిగూఢంగా నిక్షిప్తమై ఉన్న ఆత్మసాక్షాత్కారాన్ని ఆవిష్కరింప జేసుకోవాలి. హంసవాహనా రూఢుడైన శ్రీవారు అందించే సందేశ మిదే!
♾┉┅━❀🕉️❀┉┅━♾
🌈 *సింహవాహనం* 🌈
👉 బ్రహ్మోత్సవాల్లో మూడో రోజు ఉదయం మలయప్పస్వామి ఒక్కరే సింహవాహనంపై ఊరేగుతారు.
*"మృగాణాం చ మృగేంద్రో అహం"* అంటూ భాగవతంలో శ్రీకృష్ణ భగవానుడు తనను తాను *"మృగాల్లో సింహరాజుగా"* అభివర్ణించు కున్నాడు. అపరిమితమైన "సింహబల" మంత భక్తి గలవారిని స్వామి అనుగ్రహిస్తారనే సందేశం ఈ వాహనసేవ ద్వారా పంపబడుతుంది
👉 సింహానికీ – శ్రీవారికి అనేక సారూప్యాలు, అత్యంత సాన్నిహిత్యం ఉన్నాయి -
👉 శ్రీవారి నిలయమైన ఆనందనిలయ విమానంపై నలుదిక్కులా, సింహప్రతిమలు వేంచేసి ఉంటాయి.
👉 విష్ణుసహస్రనామ పారాయణంలో సింహనామం రెండు పర్యాయాలు వస్తుంది (శ్లోకాల సంఖ్య 22 మరియు 52).
👉 దశావతారాల్లో నృశింహావతారము నాలుగవది. అలాగే, బ్రహ్మోత్సవాల్లో కూడా సింహవాహనం నాల్గవది కావడం విశేషం.
👉 యోగశాస్త్రంలో సింహం సహనశక్తికీ, గమనశక్తికి ప్రతీకగా చెప్పబడుతుంది. సింహాన్ని చూసి ఇతర జంతువులు భయపడినట్లు, సింహవాహనాన్ని అధిష్ఠించిన శ్రీవారిని చూచి సమస్త మానవులు *"తప్పు చేసినచో భగవంతుని దండన తప్పదు"* అనే భయం కలిగి విచక్షణాజ్ఞానంతో వ్యవహరిస్తారు. *యోగా నరసింహస్వామి* గా సింహవాహనంపై ఊరేగుతున్న స్వామివారు దుష్టజనసంహార, భక్తజన సంరక్షణ సంకేతాలు జనియింప చేస్తారు.
👉 హిరణ్యకశిపుని చీల్చి చెండాడిన నరసింహావతారాన్ని ఆళ్వార్లు ఎంతో భక్తితో పూజించారు. ఈ సింహం ప్రహ్లాదుని ప్రార్థనకు పూర్వం అదృశ్యశక్తిగా రాక్షసభవన స్తంభంలో దాగి ఉంది. శ్రీహరి పరమభక్తుడైన ప్రహ్లాదుడు *"హరి ఎందెందు వెదకిన అందందే గలడు"* అంటూ తన తండ్రికి ధైర్యంగా సమాధాన మిచ్చాడు. ఆ బాలభక్తుని వాక్కు సాకారం చేయడం కోసం; సకల చరాచర సృష్టిలో నిక్షిప్తమై ఉన్నటువంటి శ్రీహరి స్తంభాన్ని చీల్చుకుని, నారసింహుని రూపంలో ప్రత్యక్షమై, దుష్టుడైన హిరణ్యకశిపుణ్ణి అంతమొందించాడు.
👉 కృతయుగంలో ఆ నాస్తికస్తంభాన్ని ఛేదించి వెలికి వచ్చి దుష్టసంహారం గావించినట్లు; ఈ కలియుగంలో నాస్తికత్వాన్ని పటాపంచలు చేసి మానవుల హృదయాలలో భక్తిభావాన్ని పెంపొందించి వారిని సన్మార్గంలో నడిపించడానికై స్వామివారు సింహవాహనంపై ఊరేగుతారు.
*జయజయ నృసింహ సర్వేశ* *భయహర వీర ప్రహ్లాద వరద!!* *మిహిర శశినయన మృగన రవేష*
*బహిరంతస్థల పరిపూర్ణ అహినాయక సింహాసన రాజిత*
*బహుళ గుణగణ ప్రహ్లాద వరద!!!*
👉 ప్రతి సంవత్సరం వాహనాలు స్థిరంగా ఉంటాయి గానీ, అందులోని మలయప్పస్వామి వేషధారణలో మాత్రం స్వల్ప మార్పులు ఉంటాయి. ఉదాహరణకు, ఒక సంవత్సరం నవనీత గోపాలుడయితే, మరో సంవత్సరం కాళీయమర్దనుడు అవుతాడు.
[ రేపటి భాగంలో... *శ్రీవారి బ్రహ్మోత్సవాలలో - వాహనోత్సవ క్రమం* విశేషాలు మరిన్ని తెలుసుకుందాం]
♾️•••┉┅━❀🕉️❀┉┅━•••♾️
🙏 *శ్రీనివాసుని శ్రీచరణాలను సేవిద్దాం, సకల శుభాలనూ పొందుదాం* 🙏
*తిరుమల సర్వస్వం సశేషం...*
♾️•••┉┅━❀🕉️❀┉┅━•••♾️
No comments :