♾️•••┉┅━❀🕉️❀┉┅━•••♾️
*శ్రీవారి బ్రహ్మోత్సవాలు - 5*
✍️ శ్రీమతి&శ్రీ పల్లపోతు వాణిశ్రీ-కృష్ణబాలాజీ
♾┉┅━❀🕉️❀┉┅━♾
🦅 *గరుడవాహన సేవ* 🦅
*కపిలాక్షం గరుత్మంతం సువర్ణసదృశప్రభమ్*
*దీర్ఘ బాహుం బృహత్ స్కంధం వందే నాగాంగభూషణం ||*
💫 తిరుమల బ్రహ్మోత్సవాలలో ఐదవనాటి రాత్రి జరిగే గరుడోత్సవం అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఈ ఉత్సవంలో మలయప్పస్వామివారు ఒక్కరే, వారికి అత్యంత ప్రీతిపాత్రమైన గరుడవాహనాన్ని అధిరోహించి మాడవీధుల్లో విహరిస్తారు.
💫 తిరుమల బ్రహ్మోత్సవాల్లో మిగతా వాహన సేవలన్నీ ఒక ఎత్తయితే, గరుడవాహనం ఒక్కటీ ఒక ఎత్తు. ఈ వాహనసేవను వీక్షించడానికై తిరుమల క్షేత్రానికి విచ్చేసిన అశేష భక్తజన సందోహాన్ని చూస్తుంటే ఒడలు పులకరించి పోతుంది.
*గరుడ గమన గోవిందా! గరుడ గమన గోవిందా!! గరుడ గమన గోవిందా!!!*
😊💫 బ్రహ్మోత్సవాలు జరిగే తొమ్మిది రోజులు గరుత్మంతుడు ఉత్సవాలను పర్యవేక్షిస్తూ, ఉత్సవ నిర్వాహకుడైన బ్రహ్మకు సహాయకుడిగా ఉంటాడు.
💫 గరుత్మంతుని ఇరు రెక్కలు కర్మ-భక్తికి సంకేతాలు. నాసిక-జ్ఞానానికి ప్రతిరూపం. ఇలా, కర్మ-భక్తి- జ్ఞాన సంయోగమైన వేదమే ఆ గరుత్మంతుని రూపంలో స్వామివారిని మోస్తున్నది. స్వామివారు వేదమయుడు, వేదరూపుడు, వేదవేదాంత వేద్యుడు. కనుక, వేదమే ఆయనను భరిస్తోందన్న మాట.
💫 *"ఓం పక్షిస్వాహా!"* అన్న గరుడపంచాక్షరి మంత్రంలో ఐదు అక్షరాలు ఉన్నాయి. కనుక *"పంచవర్ణరహస్యం"* గా పేర్కొనబడే ఈ గరుడోత్సవం, బ్రహ్మోత్సవాలలో ఐదవరోజు జరగటం శ్రీవారి సంకల్పమే కానీ, యాదృచ్ఛికం కాదు.
*"శ్రీశేషశైల గరుడాచల వేంకటాద్రి నారాయణాద్రి వృషభాద్రి వృషాద్రి ముఖ్యాం"* అంటూ, శ్రీవేంకటేశ్వర సుప్రభాతంలో కీర్తించబడే సప్తగిరులలో *'గరుడాచలం'* ఒకటి. అలిపిరి నుంచి తిరుమలకు వెళ్లే రోడ్డుమార్గంలో, వినాయకుని మందిరం సమీపాన, ఓ పర్వతసానువు "గరుడపక్షి" ఆకారంలో కనిపిస్తుంది. కొనదేలిన నాసిక, విశాలమైన నుదురు, రెక్కలు, చెవులు ఈ విధంగా, గరుత్మంతుడి శరీర భాగాలన్నీ ఆ పర్వతశిఖర పార్శ్వభాగాన గోచరిస్తాయి. *"శ్రీనివాసుడు గరుడాద్రిపై కొలువై ఉన్నాడు"* అని చెప్పటానికి ఇంకేం ఆధారం కావాలి?
*కృతే వృషాద్రిం వక్షంతి త్రేతాయాం గరుడాచలమ్ ద్వాపరే శేషాచలం చ వెంకటాద్రి కలౌ యుగే ||*
- అన్న సంస్కృత శ్లోకాన్ని బట్టి శేషాచలానికి, త్రేతాయుగంలో గరుడాద్రి అనే పేరు ప్రధానంగా ఉన్నట్లు తెలుస్తోంది. పౌరాణిక మూలాల్లోకి వెళితే, కృతయుగంలో శ్రీమహావిష్ణువు మరో అవతారమైన ఆదివరాహుని ఆదేశం మేరకు వైకుంఠం లోని క్రీడాచల పర్వతాన్ని తెచ్చి, సువర్ణముఖి నది ఉత్తరతీరాన నిలిపింది. 'గరుడుడే'. అందువల్లనే వేంకటాద్రిని గరుడాద్రిగా వ్యవహరిస్తారని మార్కండేయ పురాణం లోని ఈ శ్లోకం వివరిస్తుంది -
*వైకుంఠలోకాత్ గరుడేన విష్ణోః*
*క్రీడాచలో వెంకటనామధేయః* *ఆనీయ చ సర్ణముఖీ సమీపే* *సంస్థాపితో విష్ణునివాస హేతోః*
💫 గరుత్మంతుడు తన తల్లి వినతి యొక్క దాస్యాన్ని, క్లేశాన్ని పోగొట్టడం కోసం స్వర్గలోకానికి వెళ్లి అక్కడి వారందరినీ చాకచక్యంగా ఏమార్చి, అమృతభాండాన్ని చేజిక్కించు కుంటాడు. అమృత సేవనంతో జరామరణాలు ఉండవని తెలిసికూడా, స్వయంగా సేవిద్దామనే ప్రలోభానికి ఏమాత్రం లోను గాకుండా, తన తల్లి దాస్యవిముక్తే ఏకైక లక్ష్యంగా కార్యోన్ముఖుడవుతాడు. ఎంతో నిర్లిప్తంగా మాతృకార్యాన్ని నిర్వహించిన గరుత్మంతుని కార్యదీక్ష, త్యాగనిరతి, వినయశీలత, శారీరక దృఢత్వం వంటి మంగళకరమైన లక్షణాలకు ముగ్ధుడైన శ్రీ మహావిష్ణువు ఏదైనా వరం కోరుకోవలసిందిగా శెలవిస్తాడు. అప్పుడు గరుత్మంతుడు కోరుకున్న కోరిక పరమాద్భుతం. అమృతం సేవించక పోయినా జరామరణాలు లేకుండా, తానెంతటి బలవంతు డైనప్పటికీ పరమ వినయ విధేయతలతో విష్ణుమూర్తి సేవ చేసుకునే భాగ్యం కలగాలని కోరుకుంటాడు. గరుత్మంతుని నిస్వార్థ సేవాభావానికి అచ్చెరువొందిన వైకుంఠనాథుడు అతనికి రెండు వరాలిస్తాడు. వాటిననుసరించి గరుడుణ్ణి విష్ణుమూర్తి తన వాహనంగా స్వీకరించి, తన పతాకంపై ఎల్లప్పుడూ గరుడుని చిహ్నం ఉంచుకుంటాడు. *"తాను అత్యంత ప్రీతిపూర్వకంగా అధిరోహించే వాహనం గరుత్మంతుడే"* అని కూడా శ్రీహరి పలుమార్లు పెక్కు సందర్భాల్లో పేర్కొన్నాడు.
💫 శ్రీమహావిష్ణువు ఆదేశం మేరకు గరుత్మంతుడు శ్రీవారి సన్నిధిలో, సరిగ్గా బంగారువాకిలికి ఎదురుగా, నమస్కారముద్రలో నిలుచుని; భక్తులకు శ్రీవారి దర్శనమార్గాన్ని, విధానాన్ని సూచిస్తుంటాడు.
💫 శ్రీమహావిష్ణువు వరాలనొసగిన నాటినుండి వైనతేయుడు శ్రీమహావిష్ణువుకు దాసునిగా, ప్రియసఖుడిగా, విసనకర్రగా, చాందినిగా, ఆసనంగా, ఆవాసంగా, ధ్వజపటంగా అనేకానేక సేవలు అందిస్తున్నాడు.
*దాసో మిత్రం తాళ వృంతం వితానం*
*పీఠం వాసో వాహనం చ ధ్వజశ్చ*
*ఏవం భూత్వా అనేకథా సర్వథా సః*
*శ్రీ శం శ్రీమాన్ సేవతే వైనతేయః ||*
💫 గరుత్మంతుడు విష్ణువుకు ధ్వజపటం కూడా అవ్వటం చేత బ్రహ్మోత్సవాలు ధ్వజారోహణంతో ప్రారంభమై, ధ్వజావరోహణంతో ముగుస్తాయి.
🙏 ఇప్పుడు, గరుడుని అధిరోహించిన స్వామి వారిని అవలోకిద్దాం. 🙏
💫 స్వామివారు స్వర్ణ కిరీటం ధరించి శోభాయమానంగా దర్శనమిస్తుంటారు. ఆ కిరీటం మధ్య భాగంలో మిలమిలా మెరుస్తున్న పచ్చ, కిరీటానికి వ్రేలాడుతున్న ముత్యాలు, కిరీటానికి పొదిగినటువంటి రత్నాలు; కంఠసీమ యందు కేవలం గరుడోత్సవం నాడు తప్ప తక్కిన సర్వకాల సర్వావస్థల యందు మూలమూర్తికి మాత్రమే పరిమిత మయ్యుండే - శ్రీవెంకటేశ్వరసహస్రనామమాల, మకరకంఠి, లక్ష్మీహారాలు; ఉదరభాగాన మరో అందమైన పచ్చ, దివ్యంగా అలంకరింపబడిన పూలమాలలు ఇలా స్వామి నయనానందకరంగా, భక్తజన రంజకంగా అలరారుతుంటారు. గరుత్మంతుడు కొనదేలిన నాసికతో, పదునైన చేతి గోళ్ళతో, తిరునామాలతో ఓ ప్రక్క వైభవోపేతంగా, మరోపక్క అరివీర భయంకరంగా దర్శనమిస్తారు.
💫 ఒక్క గరుడసేవలో మాత్రమే శ్రీవారు ఈ ఆభరణాలన్నింటినీ ధరిస్తారు. గరుడసేవలో, ధ్రువమూర్తి అయిన శ్రీవెంకటేశ్వరస్వామికి - ఉత్సవమూర్తియైన మలయప్పస్వామికి వ్యత్యాసం లేదన్న విశ్వాసం కారణంగా, ఆనాడు మాత్రం మూలమూర్తికి అలంకరింప బడే ఆభరణాలన్నీ మలయప్ప స్వామి చెంత చేరుతాయి.
*గోదా సమర్పిత సుభాషిత పుష్పమాలాం*
*లక్ష్మీహార మణిభూషిత సహస్రనామ్నాం*
*మాలాం విధార్య గరుడోపరి సన్నివిష్టః*
*శ్రీవేంకటాద్రి నిలయో జయతి ప్రసన్నః ||*
💫 తమిళనాడు లోని శ్రీవిల్లిపుత్తూరు ఆలయంలో గోదాదేవికి అలంకరించి తొలగించిన పూమాలలను తిరుమలకు తెప్పించి స్వామివారి బ్రహ్మోత్సవాలలో ప్రధాన మైనటువంటి గరుడసేవ నాడు స్వామి వారికి అలంకరిస్తారు. శ్రీకృష్ణదేవరాయలు స్వామికి సమర్పించిన స్వర్ణాభరణాలు, మడిమాన్యాలు చాలా వరకు కనుమరుగై నప్పటికీ వారి హయాంలో ప్రవేశపెట్ట బడిన *ఆముక్తమాలల* సమర్పణ, అలంకరణ సాంప్రదాయాలు మాత్రం నేటికీ అవిచ్ఛిన్నంగా కొనసాగుతున్నాయి. *"ఆముక్తమాల"* లంటే, రాయల విరచిత *"ఆముక్తమాల్యద"* గ్రంథంలో పేర్కొన్నట్టి *"గోదాదేవి అలంకరించు కొని తీసివేసి శ్రీరంగనాథునికి ధరింప జేసిన పూమాలలు"* అని అర్థం.
💫 రాష్ట్ర ప్రభుత్వం తరఫున సమర్పించే నూతన పట్టు వస్త్రాలను కూడా గరుడసేవ నాడు స్వామివారికి అలంకరిస్తారు. అలాగే, గరుడోత్సవం నాడు చెన్నపట్టణం లోని హిందూధర్మార్థ సమితి వారు నూతన ఛత్రాలకు విశేషపూజలు గావించి, చెన్నై నుండి కాలినడకతో ఊరేగింపుగా తిరుమలకు తీసుకొని వచ్చి స్వామివారికి భక్తిశ్రద్ధలతో సమర్పిస్తారు. ఈ గొడుగులతో పాటుగా, శ్రీవారికి పూలంగి కపాయి, కొల్లాయి; వక్షస్థల లక్ష్మీదేవికి పావడాలు; తిరుచానూరు పద్మావతి అమ్మవారికి గొడుగులు, పసుపు, కుంకుమ, చందనం మొదలైన వాటిని *"శ్రీవారిసారి"* గా పేర్కొంటూ ఒక వెదురుబుట్టలో పెట్టి శాస్తోక్తంగా సమర్పిస్తారు.
💫 అంగరంగ వైభోగంగా సాగుతున్న గరుడోత్సవ వైభవాన్ని చూచి పులకించిన అన్నమాచార్యులు ఉత్సవశోభను ఈ విధంగా వర్ణించాడు -
*పల్లించి గరుడునిపై నీవుబ్బున నెక్క..*
*బంగారు గరుడునిపై నీవు వీధులేగ*
*చెంగట శ్రీవెంకటేశ్వర సిరులు మూగే*
*సంగతి నలమేల్మంగ సంతసాన విర్రవీగే*
*పొంగారు దేవదుందుభులు పై పై వాగె ||*
💫 గరుడోత్సవంలో, విష్ణుమూర్తి, గరుడుని మందారవర్ణపు చిగుళ్ల పొట్లాల వంటి రెండు అరచేతులపై ఎర్రతామరలవలె ఉన్న తన రెండు పాదాలను పెట్టి వైభవం ఒలకబోస్తూ దర్జాగా కూర్చుని ఉంటాడు.
💫 గరుడ వాహనారూఢుడైన విష్ణుదేవుని దర్శించి మైమరచిపోయిన పెరియాళ్వార్ (విష్ణుచిత్తుడు) *"పల్లాండు-పల్లాండు"* అంటూ మంగళాశాసనం చేశాడు. I
*"గరుడగమనా రారా! నన్ను కరుణనేలు కోరా!!'* అంటూ రామదాసు ప్రార్థించాడు.
💫 గరుడసేవ రోజున తిరుమల క్షేత్రం అంతా లక్షలాది భక్తులతో క్రిక్కిరిసి ఉంటుంది. కొండ నిండిపోవడంతో ఇక రావద్దంటూ తి.తి.దే. అధికారులు మొత్తుకుంటున్నా భక్తులు మెట్లమార్గాల ద్వారా, ఆర్టీసీ బస్సులు, సొంత వాహనాలపై తిరుమలకు పోటెత్తుతూనే ఉంటారు. ఎటు చూసినా అలౌకిక ఆధ్యాత్మికానుభూతికి లోనై హారతులిస్తూన్న భక్తులతో, తిరుమల జనసంద్రంగా గోచరిస్తుంది. గోవిందనామస్మరణతో సప్తగిరులు మార్ర్మోగి పోతాయి. తిరుమల పట్టణమే కాకుండా, దాదాపుగా చిత్తూరు జిల్లా అంతా పండుగ వాతావరణం ఉట్టిపడుతుంది.
💫 దేశవిదేశాల నుండి కళాకారుల బృందాలు తరలి వచ్చి తమ తమ కళాకృతుల్ని ముగ్ధమోహనంగా ప్రదర్శిస్తాయి. -
💫 దాదాపు రెండు లక్షల మంది పట్టే మాడ వీధుల్లోని ప్రేక్షక గ్యాలరీలన్నీ వాహనవీక్షణ కోసం ఎండనక, వాననక నిరీక్షిస్తున్న భక్తజనులతో పొంగి పొరలుతుంటాయి. ఆరోజు ఉదయం నుండీ, గంటల తరబడి భక్తులు శ్రీవారికై ఎదురుచూస్తూ, కళావిన్యాసాలను తిలకిస్తూ ఉంటారు. గరుడోత్సవం నాడు ఇంద్రుడు, వరుణుడు చిరుజల్లులతో స్వామివారిని తప్పక దర్శించు కుంటారని స్థానికుల నమ్మకం అందుచేత, తిరుపతి నుంచి తిరుమలకు వెళ్లే భక్తులందరూ తమతో పాటుగా చత్రాలు తీసుకెళ్తారు.
💫 *గరుడవాహనం, వాహనమండపం నుంచి బయలుదేరగానే కొన్ని గరుడ పక్షులు గగనతలం మీద విహరిస్తూ స్వామివారిని చూసి తరిస్తాయి.*
💫 గరుడోత్సవం నాడు ఆకాశంలో కలిగిన అలజడిని చూసి అన్నమయ్య ఇలా వర్ణించాడు
*ఇటు గరుడని నీవెక్కినను* *పటపట దిక్కులు బగ్గన బగిలె ||*
*ఎగసిన గరుడని ఏపున 'థా' యని*
*జిగిదొలక చెబుకు చేసినను*
*నిగమాంతంబులు నిగమసంఘములు*
*గగనము జగములు గడగడవడికె ||*
💫 గరుడవాహనం నాడు భోజన ఏర్పాట్లు, ప్రసాదాల తయారీ, భద్రతా సేవలు, క్యూల నియంత్రణ, వైద్య సదుపాయాలు, మొదలైనవన్నీ అత్యంత భారీ ఎత్తున, ఏవిధమైన లోటుపాట్లు లేకుండా చేపడతారు. మాడవీధుల్లో, తిరుమల పట్టణమంతా పెద్ద పెద్ద వెండి తెరలు ఏర్పాటు చేసి ఉత్సవ విశేషాలన్నింటినీ ప్రత్యక్ష ప్రసారం గావిస్తారు.
💫 గరుత్మంతుడు మాతృభక్తికి, విష్ణుభక్తికి, పరోపకార గుణానికి, నిష్కల్మషత్వానికి ప్రతీక. వైష్ణవసంప్రదాయంలో గరుడ వాహనాన్ని *"పెరియ తిరువడి"* వాహనంగా కీర్తిస్తారు. ఈ వాహన సేవ దర్శించినవారు, కాలసర్పదోషం నుంచి, సంతానలేమి నుంచి, ఆలస్యవివాహం నుంచి ముక్తులై, కష్టాలకడలి నుంచి గట్టెక్కుతారు.
💫 శ్రీస్వామివారు *"సర్వకాల సర్వావస్థలయందు మీ రక్షణకై శంఖు-చక్రాయుధాలను ధరించి, గరుడ వాహనారూఢుడనై, సదా సన్నద్ధునిగా ఉంటాను. నా శరణువేడి, నా పాదాలను ఆశ్రయించి, మీ రక్షణ భారం నాకు వదిలేయండి. తప్పక రక్షింపబడతారు"* అన్న హితాన్ని ఈ గరుడవాహన సేవ ద్వారా ఉపదేశిస్తారు.
🙏 *గరుడ వాహన దర్శనం సర్వపాపహరం, సకలసంపత్కరం, శ్రేయోదాయకం!*
[ రేపటి భాగంలో... *శ్రీవారి బ్రహ్మోత్సవాలలో - వాహనోత్సవ క్రమం* విశేషాలు మరిన్ని తెలుసుకుందాం]
♾️•••┉┅━❀🕉️❀┉┅━•••♾️
No comments :