*తిరుమల సర్వస్వం - 19*
•••┉┅━❀🕉️❀┉┅━•••
*తరిగొండ వెంగమాంబ - 2*
✍️ శ్రీమతి&శ్రీ పల్లపోతు వాణిశ్రీ-కృష్ణబాలాజీ
•••┉┅━❀🕉️❀┉┅━•••
*శ్రీవారికి తాత్కాలికంగా దూరమైన వెంగమాంబ... ఎందుకు!?!*
♾┉┅━❀🕉️❀┉┅━♾
🌈 *శ్రీవారికి తాత్కాలికంగా దూరమైన వెంగమాంబ* 🌈
👉🏻 వెంగమాంబ కైంకర్యాలు కొనసాగుతుండడం, ఆమె భక్తుల మన్ననలందుకోవడం మరో వర్గానికి చెందిన అర్చకులకు కంటగింపైంది. ఆమెను సూటిపోటీ మాటలతో, పరుష పదజాలంతో బాధించేవారు. విసిగి వేసారిన వెంగమాంబ పరిపరి విధాలుగా ఆలోచించి, మనసు రాయి చేసుకొని, శ్రీవారి సేవకు దూరమవుతున్నానన్న బాధను అతి కష్టం మీద దిగమ్రింగుకొంటూ, ఆలయానికి వెళ్ళడం విరమించుకొంది. స్వామివారి దర్శనభాగ్యం లేకుండా జీవించడం దుర్భరమైనప్పటికీ, అర్చకుల మనస్సు నొప్పించటం ఇష్టంలేని వెంగమాంబ నిత్యహారతికి స్వస్తి చెప్పి కొంతకాలం ఇంటికే పరిమితమైంది. శ్రీవారి ఆగ్రహం అతిశయించి ప్రధానార్చకుల ఉదంతం పునరావృతం కాకూడదని ఆమె ఉద్దేశ్యం. అటు, తమ పథకం పారి వెంగమాంబ ఆలయానికి దూరమవడంతో అర్చకులు మురిసిపోయారు. అది మూణ్ణాళ్ళ ముచ్చటే అని వారికి తెలియదు.
వెంగమాంబ ఆలయానికి రాకపోవడం ఆనందనిలయునికి ఆందోళన కల్గిస్తుంది. ఆమె సమర్పణభావంతో ఇచ్చే హారతి కోసం రోజుల తరబడి ఆర్తిగా నిరీక్షించేవాడు. ఆ భక్తవత్సలుడు ఆమె గొప్పదనాన్ని లోకానికి చాటిచెప్పి, ఆమె మనసు నొప్పించిన వారికి మరోసారి బుద్ధి చెప్పాలనుకున్నాడు. అంతే! శ్రీవారు మరో అద్భుతమైన పథకాన్ని రచించారు.
♾┉┅━❀🕉️❀┉┅━♾
🌈 *ఆగిన తేరు* 🌈
👉🏻 మరునాడు బ్రహ్మోత్సవాల్లో చివరి రోజు. శ్రీవారి తేరు దేదీప్యమానంగా వెలుగుతూ తిరుమల మాడవీధుల్లో విహరిస్తోంది. పురజనులనూ, భక్తసందోహాన్ని అనుగ్రహిస్తూ, తూర్పు, దక్షిణ, పశ్చిమ మాడవీధుల్లో నిరంతరాయంగా సాగిపోయింది. ఉత్తర మాడవీధిలో తేరు ముందుకు సాగుతూ, తరిగొండ వెంగమాంబ ఇంటి ముందు ఉన్నపళంగా ఆగిపోయింది. అర్చకులు, ఆలయాధికారులు, యాత్రికులు, తిరుమలవాసులు రథాన్ని కదల్చటానికి శతవిధాలుగా ప్రయత్నించారు. వృథా శ్రమ తప్ప, రథం ఆవగింజంతైనా కదల్లేదు. గంటలకొద్దీ కాలయాపన జరిగింది. ఈ ఆటంకాన్ని గమనించిన పెద్దలు, *"ఏ భక్తునికో కష్టం కలిగి, స్వామివారి మనసు నొచ్చుకోవడం వల్ల ఇలా జరిగి ఉండవచ్చు"* అని ఊహించుకున్నారు. వెంటనే అర్చకులకు వెంగమాంబ విషయం స్ఫురణకు వచ్చింది. ఆమెను దుర్భాషలాడడం, ఆమె ఆలయానికి దూరమవడం, ఆమె నిత్యం ఇచ్చే హారతి కొన్ని రోజులనుండి శ్రీవారికి అందకుండా పోవడం, ఇవన్నీ ఒక్కొక్కటిగా గుర్తుకు రావడంతో వారి అనుమానం దృఢమైంది. దానితో అర్చకులందరూ హుటాహుటిన వెంగమాంబ ఇంటికి వెళ్ళి, తమవల్ల జరిగిన అపరాధానికి క్షమార్పణ కోరి, స్వామివారికి తక్షణమే హారతినిచ్చి రథం కదిలేందుకు సహకరించ వలసిందిగా ప్రాథేయపడ్డారు. అర్చకుల ప్రార్థనలు విన్న వెంగమాంబ వెంటనే హారతి పళ్ళెంతో బయటకు వచ్చి, తిరుమలేశునికి నీరాజనం ఇచ్చి, నిరాటంకంగా ముందుకు సాగమని ప్రార్థించింది. తక్షణమే భక్తులందరూ ఆశ్చర్యానందాలతో మైమరచి వీక్షిస్తుండగా, రథం సునాయాసంగా ముందుకు కదిలింది.
♾┉┅━❀🕉️❀┉┅━♾
🌈 *ముత్యాలహారతి* 🌈
👉🏻 ఆనాటి నుండీ ఆలయ నిర్వాహకులు మరింత భక్తి ప్రపత్తులతో, ఆమె చేత స్వామివారికి కర్పూరహారతిని
ఇప్పించేవారు.
ప్రతిరోజూ చిట్టచివరగా వెంగమాంబ కర్పూరహారతి లేనిదే ఆలయం మూయకూడదనీ, ఆమె హారతి తరువాత మరే హారతీ ఇవ్వరాదని స్వామివారు అర్చకులకూ, అధికారులకూ స్వప్నంలో కనపడి ఆదేశించారు. ఆనాటి నుండి ప్రతిరోజూ ఏకాంతసేవ సమయంలో చిట్టచివరగా వెంగమాంబ గారి ముత్యాలహారతి అయిన తరువాతనే శ్రీవారి ఆలయం మూయబడుతున్నది. ఈ ముత్యాలహారతి గురించి మనం "ఏకాంతసేవ" లో ఇంతకు ముందే తెలుసుకున్నాం. తన తదనంతరం కూడా ముత్యాలహారతి నిరాఘాటంగా కొనసాగే నిమిత్తం, నిస్సంతు అయిన వెంగమాంబ తన చెల్లెలి కూతురైన మంగమ్మను దత్తత తీసుకుంది. నేటికీ ఈమె సంతతి వారే పవళింపు సేవలో ముత్యాలహారతి నిచ్చే సాంప్రదాయాన్నీ, రంగువల్లులు తీర్చిదిద్దటాన్ని కొనసాగిస్తున్నారు.
♾┉┅━❀🕉️❀┉┅━♾
🌈 *చిరిగిన శ్రీవారి వస్త్రం* 🌈
👉🏻 ఇలా కొంతకాలం గడిచాక, ఒకనాటి రాత్రి శ్రీవారు యథాప్రకారం ఏకాంతసేవ పూర్తయిన తరువాత, వెంగమాంబ ఇంటికి వెళ్ళి, ఊయలలో ఊగుతూ, ఆమె చెప్పే భాగవతం మైమరచి వింటున్నారు. ఆమె ఓ మంచి ఘట్టం చదువుతుండగా స్వామివారు తెల్లవారు ఝామున మూడు గంటలకు సుప్రభాత సేవ కోసం, ఉయ్యాల దిగి వెళ్ళిపోబోయారు. శ్రీవారి సామీప్యంలో మరికొంత సేపు ఉండాలన్న ఉబలాటంతో వెంగమాంబ స్వామివారి పంచె పట్టుకొని వారించబోగా, శ్రీవారు, "నీలాగే ఎందరో భక్తులు ఉన్నారు. వారందర్నీ అనుగ్రహించాలి కదా!!" అంటూ, అప్పటికే సుప్రభాతసేవకు కాలాతీత మవ్వడంతో, ఒక్క ఉదుటున లేచి విసవిసా ఆనందనిలయం లోనికి వెళ్ళిపోయారు. దాంతో, శ్రీవారి పంచె సగానికి చిరిగి, ఒక ముక్క వెంగమాంబ చేతిలో చిక్కుకు పోయింది.
👉🏻 సుప్రభాతానంతరం, అర్చకులు దర్శనానికెళితే, స్వామివారు సగం చిరిగిన పట్టుపంచెతో దర్శనమిచ్చారు. అర్చకులందరూ కొంచెం సేపు కంగారు పడినా, అంతలోనే తేరుకుని, అది దొంగతనం కాదనీ, ఎవరో భక్తుల ద్వారా ఇలా జరిగిందనీ, స్వామివారితో అంతటి సాన్నిహిత్యం కలిగింది వెంగమాంబే అయి ఉంటుందనీ నిర్ధారించుకున్నారు. అందరూ కలిసి వెంగమాంబ ఇంటికి వెళ్ళి ఆరా తీయగా అసలు విషయం బయట పడింది. ఆమె, పూజాగృహంలో అపురూపంగా భద్రపరిచిన పట్టుపంచె చిరిగిన భాగాన్ని కళ్ళకద్దుకుంటూ, అర్చకులకు అప్పగించింది.
👉🏻 మనం గత రెండు రోజులుగా చెప్పుకున్న అనేక మహిమాన్వితమైన సంఘటనల ద్వారా వెంగమాంబ పేరు సర్వ వ్యాపితమైంది. ఎందరెందరో సంస్థానాధీశులు, జమీందార్లు, భూస్వాములు, సామాన్యులు ఆమెకు భక్తులుగా, శిష్యులుగా మారి ఆమెకు లెక్కలేనన్ని మడి మాన్యాలను ఈనాములుగా సమర్పించారు.ఆ యావత్తు సంపదనూ ఆమె భక్తులకోసమే వెచ్చించేది. అన్నసత్రాల నిర్వహణ, చలివేంద్రాల ఏర్పాటు, బ్రహ్మోత్సవాల్లో యాత్రికులకు ప్రత్యేక సదుపాయాలు వంటివి విరివిగా చేపట్టేది. ఆకొన్నవారికి లేదనకుండా ఆమె చేసిన అన్నదాన స్ఫూర్తితోనే తి.తి.దే. వారు, నేడు ప్రపంచంలోనే 'నభూతోనభవిష్యతి' అన్న చందంగా, నిత్యాన్నదాన పథకాన్ని ఆమె పేరు మీద చేపడుతున్నారు. తూర్పు మాడవీధికి ఆనుకుని ఉన్న మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్న ప్రసాదకేంద్రం గురించి మనందరికీ సుపరిచితమే.
♾┉┅━❀🕉️❀┉┅━♾
🌈 *ధార్మిక కార్యక్రమాలు* 🌈
👉🏻 దాన కార్యక్రమాలతో పాటు, ధార్మిక కార్యక్రమాలు కూడా వెంగమాంబ వైభవోపేతంగా నిర్వహించేది. బాల్యంలో తన ఇష్టదైవమైన నృసింహస్వామి జయంత్యుత్సవాలను తిరుమలలో పదిరోజుల పాటు స్వయంగా జరిపించేది. అందువల్లే, నేటికీ తిరుమలలో జరిగే నృసింహోత్సవాల్లో ఉభయనాంచురులతో కూడిన మలయప్పస్వామి వారు వెంగమాంబ ఇంటికి వేంచేసి నివేదనలందుకుంటారు.
♾┉┅━❀🕉️❀┉┅━♾
🌈 *సాహిత్యసేవ* 🌈
👉🏻 ఆమె దాన-ధార్మిక కార్యకలాపాలలో పాల్గొంటూనే, అమోఘమైన సాహిత్య సాధన కూడా చేశారు. అమె రచించిన గ్రంథం ప్రతులు తయారు చేయడం కోసం, *"అష్టఘంటములు"* అనే పేరుతో ఎనిమిది మంది *"వ్రాయసకాండ్ర"* ను (అంటే, నేటి కాలంలో స్కెబ్స్ అన్నమాట) నియమించింది. వెంగమాంబ విరచిత గ్రంథ ప్రతులను అప్పటి వెంకటగిరి, శ్రీకాళహస్తి, కార్వేటినగర సంస్థానాధీశులు జ్ఞానసముపార్జనార్థం తెప్పించుకొనే వారు.
♾┉┅━❀🕉️❀┉┅━♾
🌈 *తుంబుర తీర్థానికి ప్రస్థానం* 🌈
👉🏻 అసమాన ప్రజ్ఞా ధురీణి, బహుముఖ ప్రజ్ఞాశాలిని అయిన ఆమెను దర్శిస్తే జన్మ ధన్యమౌతుందని భావించి తండోపతండాలుగా భక్తులు వెంగమాంబ వద్దకు వచ్చేవారు. ఇలా భక్తజనం క్రిక్కిరిసిపోవడం తన ఆధ్యాత్మిక సాధనకు ఆటంకమవుతోందని, దానికేదైనా మార్గాంతరం శెలవీయమని ఆ శ్రీనివాసుణ్ణి వేడుకొంది. తనలో ఐక్యం చేసుకొమ్మని కూడా ఆ పరంధాముణ్ణి ప్రార్థించింది. ఆ సమయమింకా ఆసన్నమవ్వలేదనీ, ఆమె మరికొన్నాళ్ళు ఇహలోకంలోనే ఉండాలని సూచించిన సప్తగిరీశుడు ఆమె ప్రశాంతంగా తపస్సు నాచరించుకోవడం కోసం ఆలయానికి పన్నెండు మైళ్ళ దూరంలో ఉన్న *తుంబురతీర్థం* అనే పవిత్రమైన, జన సందోహానికి దూరంగా ఉండే ప్రశాంతమైన ప్రదేశాన్ని సూచించాడు. అక్కడ ఉన్న ఓ పర్వతగుహను చూపుతూ, *"వెంగమాంబా! నీవు పగలంతా నిశ్చింతగా సాధన చేసుకొని, ఈ గుహలోని సొరంగ మార్గం ద్వారా, అన్యులకు కానరాకుండా, ఆనందనిలయం లోనికి వచ్చి నన్ను ఆరాధించుకో"* అంటూ ఆదేశించాడు. ఆ గుహను సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే, ప్రత్యేక ఉత్సవ సందర్భంగా అనుమతింపబడే తుంబురతీర్థ సమీపంలో నేటికీ మనం చూడవచ్చు. తుంబుర తీర్థ ప్రాశస్త్యం గురించి మరోసారి చెప్పుకుందాం.
♾┉┅━❀🕉️❀┉┅━♾
🌈 *మూర్ఛిల్లిన మహంతు* 🌈
👉🏻 ఆనాటి నుండీ, వెంగమాంబ, బంగారువాకిలి మూసిన తరువాత, తుంబుర తీర్థం నుండి బిలమార్గం ద్వారా వెళ్ళి ప్రతిరాత్రీ స్వామిని ఆరాధించేది. వాడిన పూలను సడలింపు చేసి, తాజాపూలతో పూజ చేసి, యథావిధిగా కర్పూరహారతి సమర్పించేది. ఇలా కొన్ని రోజులు గడచిన పిదప అర్చకులు, ప్రతిరోజూ తాము సమర్పించిన పూవులు ప్రక్కకు నెట్టబడి, తాజా పూలు స్వామి పాదాల చెంత ఉండటం గమనించారు. మూసివేసిన ద్వారాల నుండి బంగారు వాకిలి లోనికి ప్రవేశించడం మానవమాత్రుల వల్ల కాని పని. ఇదెలా సాధ్యం?
👉🏻 ఈ రహస్యాన్ని ఛేదించటానికి ఆప్పటి మహంతు బంగారువాకిలి మూయక ముందే గర్భాలయంలోకి ప్రవేశించి ఆగంతుకుని కోసం కాపు కాశాడు. సరిగ్గా అర్థరాత్రి సమయంలో శ్రీవారి పాదాలముందు ఒక బిలం ఏర్పడగా, అందులోనుండి దివ్యకాంతులు వెదజల్లుతూ, పూజాద్రవ్యాలతో పైకి వచ్చింది వెంగమాంబ!
👉🏻 కళ్ళు మిరిమిట్లు గొలిపే ఆ ప్రకాశాన్ని చూడలేక మహంతు మూర్ఛిల్లాడు. మరునాడు సుప్రభాత సేవానంతరం, తెప్పరిల్లిన మహంతు తాను రాత్రి చూసిన ఉదంతాన్నంతా పూసగుచ్చినట్టు విశదపరిచాడు. వెంగమాంబ తిరుమలలోనే ఉంటూ, ఆనందనిలయానికి రోజూ వచ్చి వెళుతుందని గ్రహించిన భక్తులు ఆమె కోసం వాగూ వంకా, చెట్టూ పుట్టా గాలించడం మొదలు పెట్టారు. కానీ ఆమె ఆచూకి తెలుసుకోవడం అంత సులభం కాలేదు.
♾┉┅━❀🕉️❀┉┅━♾
🌈 *కుష్టువ్యాధి నుండి ఉపశమనం పొందిన విప్రుడు* 🌈
👉🏻 ఇదిలా ఉండగా, తిరుమల క్షేత్రానికి భయంకర కుష్టువ్యాధితో బాధపడుతున్న ఓ విప్రుడు వచ్చాడు. వడలంతా పుండ్లతో, దుర్వాసన వెలువడడంతో కుటుంబ సభ్యులందరూ అతన్ని వెలివేశారు. దిక్కు తోచని స్థితిలో బ్రాహ్మణుడు శ్రీవారిని చివరిసారిగా దర్శించుకొని, వారి సన్నిధిలో ప్రాణాలు వదలాలని అత్యంత ప్రయాసకోర్చి తిరుమల క్షేత్రం చేరుకున్నాడు. కానీ అక్కడ కూడా ఆయన భక్తుల, ఆలయాధికారుల తిరస్కారానికి గురై; ఒకవైపు శరీరబాధ, మరొక వైపు ఆకలిబాధ తట్టుకోలేక పోయాడు. వాడవాడలా తిరుగుతూ, ఆత్మహత్య చేసుకోవాలనే దృఢసంకల్పంతో (అదృష్టవశాత్తూ) తుంబురతీర్థం చేరుకున్నాడు. అలవికాని బాధతో బిగ్గరగా రోదిస్తుంటే, అతని ఆక్రందన ఆ నిర్జనారణ్యంలో ప్రతిధ్వనించింది. ఆ ఆర్తనాదంతో ధ్యానభగ్నం కలిగిన వెంగమాంబ గుహలో నుండి బయటకు వచ్చి అతని దీనావస్థను గమనించింది. ఆ దీనుణ్ణి ఆదుకోవలసిందిగా ఆ ఆర్తత్రాణపరాయణుణ్ణి వేడుకొని, అతనికి తియ్యని ఫలాలను తింటానికి ఇచ్చింది. క్షుద్బాధ తీరిన ఆ విప్రునికి, శేషాచలవాసుని కృపతో అతని బాధ తీరుతుందని అభయమిచ్చింది. అయితే, తన ఉనికిని ఎవ్వరికీ తెలియపరచరాదనీ, నోరు జారితే తల వెయ్యి ప్రక్కలవుతుందని హెచ్చరించి పంపింది. వెంగమాంబ బాధోపశమన వాక్కులకు ఆనందాతిశయంతో కనులు మూసుకున్న ఆ విప్రుడు, కళ్ళు తెరిచేటప్పటికల్లా *"స్వామిపుష్కరిణి"* లో తేలాడు. నీటిలో నుంచి లేచిన అతడు, తన శరీరాన్ని తడిమి చూసుకుని ఆశ్చర్యానందాలతో ఉబ్బితబ్బిబ్బయ్యాడు. పుళ్ళు మటుమాయ మయ్యాయి, శారీరక బాధ శాంతించింది. వెంగమాంబనూ, శ్రీనివాసుణ్ణి పరిపరి విధాలా, మనసులోనే కీర్తించాడు. అయితే, ఆ బ్రాహ్మణుడు ఎక్కువకాలం ఆ రహస్యాన్ని దాచలేక పోయాడు.
♾┉┅━❀🕉️❀┉┅━♾
🌈 *విప్రుని మరణం* 🌈
👉🏻 ఆ విప్రుడు కుష్టువ్యాధి గ్రస్తునిగా ఉన్నప్పడు చూసిన కొందరు భక్తులు, అతని వ్యాధి అత్యంత శీఘ్రంగా నయమవ్వటంలోని రహస్యాన్ని బహిర్గత పరచమని ఒత్తిడి చేయసాగారు. అతనిని సిద్ధపురుషుడిగా ప్రశంసించసాగారు. వారి పొగడ్తలకు ఉబ్బిపోయిన బ్రాహ్మణుడు తనకు గలిగిన భాగ్యాన్ని అందరికీ చాటిచెప్పాలనే అత్యుత్సాహంతో, వెంగమాంబ ఆనతిని అతిక్రమించి, అసలు విషయం అందరికీ చెప్పేశాడు. మెచ్చుకోలు మాటలకు మానవుడు ఎంతటికైనా తెగిస్తాడు మరి.
👉🏻 మహా తపస్విని వెంగమాంబ శాపం ఊరికే పోతుందా? ఒక్క తృటిలో ఆ బాపని తల ముక్కచెక్కలై ప్రాణాలు వదిలాడు.
♾┉┅━❀🕉️❀┉┅━♾
🌈 *సమాధి నొందిన వెంగమాంబ* 🌈
👉🏻 విప్రుని అనాలోచిత ప్రవర్తనతో వెంగమాంబ ఉనికి బహిర్గతమైపోయింది. భక్తజనమందరూ తుంబురకోన బాట పట్టడంతో, అక్కడ కూడా వెంగమాంబకు ప్రశాంతత కరువైంది.
👉🏻 అలాంటి సమయంలో, ఒకనాటి రాత్రి ఆనందనిలయం చేరుకున్న వెంగమాంబ మరలా శ్రీవారితో మొర పెట్టుకుంది. అపరిమిత జన సంచారంతో తుంబురతీర్థం కూడా అలజడిగా ఉందనీ, తనను అక్కడ నుంచి కూడా తప్పించమని అనేక విధాలుగా ఆనందనిలయుణ్ణి వేడుకొంది. ఆమె మొరనాలకించిన శ్రీనివాసుడు వెంగమాంబతో, *"ఇక మీదట నిన్ను నానుంచి వేరుగా ఉంచటం భావ్యం కాదు. అందువల్ల నువ్వు తీవ్రమైన సమాధినిష్టలో ప్రవేశించు. ఆ సమాధి నుండే, ప్రతిరాత్రీ దివ్యతేజోరూపంతో ఆనందనిలయానికి వచ్చి నన్ను సేవించుకో"* అని ఆనతిచ్చారు.
👉🏻 పరమానందం చెందిన వెంగమాంబ, శ్రీవారి ఆజ్ఞననుసరించి, తుంబురకోనను విడిచి, తిరిగి తిరుమల వీధుల్లో ప్రవేశించి, తనకు అంతిమ కాలమాసన్నమైందనీ, శ్రీవేంకటేశ్వరుడు తనను పిలుస్తున్నాడనీ, అందువల్ల సమాధిలో ఉంటూ సిద్ధి పొందుతాననీ అందరికీ తెలియ పరచింది. ఆ ప్రకారమే, 1817 సం. లో, *సహస్రచంద్రదర్శనం* (వెయ్యి పున్నమిలు – అంటే సుమారుగా 83 సంవత్సరాలు జీవించిన వారు సహస్రచంద్రదర్శనం చేసినట్లు భావిస్తారు) చేసిన ఆ వృద్ధ తపస్విని, ఈశ్వరనామ సంవత్సరం, శ్రావణ శుద్ధ నవమి నాడు సమాధిలో ప్రవేశించింది. అనంతరం, ఆమె ఆజ్ఞానుసారం, ఆ సమాధిని సుగంధ ద్రవ్యాలతో మూసివేసి, ఆ ప్రదేశంలో తులసీ బృందావనాన్ని ఏర్పాటు చేశారు.
♾┉┅━❀🕉️❀┉┅━♾
🌈 *వెంగమాంబ బృందావనం* 🌈
👉🏻 వెంగమాంబ బృందావనాన్ని నేటికీ మనం తిరుమలలో దర్శించుకోవచ్చు. ఆదివరాహస్వామి కాటేజీల వెనుక ఉన్న చిన్న రోడ్డులో, వెంగమాంబ జూనియర్ కాలేజీ ఆవరణలో ఆమె బృందావనం ఉంది. ఆ బృందావనంపై తొలిసారిగా అరణ్యమార్గంలో తిరుమల చేరుకున్నప్పుడు దారిలో ఆమెను రక్షించిన *"సంతకాపు మొగిలిపెంట"* ఆంజనేయస్వామి వారి చిన్న విగ్రహం కూడా ప్రతిష్ఠించబడింది.
♾┉┅━❀🕉️❀┉┅━♾
🌈 *నేటి తరిగొండ గ్రామం* 🌈
👉🏻 తరిగొండ గ్రామం నందలి తి.తి.దే. ఆధ్వర్యంలోని దేవాలయంలో ఆమె చిన్నప్పుడు పూజించిన ఆంజనేయస్వామి మరియు నృసింహస్వామి మూర్తులనూ ఇప్పటికీ చూడవచ్చు. స్థానికుల కథనం ప్రకారం, ఆంజనేయుడి విగ్రహం వెనుకనున్న ఓ బిలమార్గం ద్వారా ఆమె తిరుమలకు చేరుకుంది. దేవాలయంలో రాతిపలకలతో కప్పబడి వున్న ఆ బిలద్వారాన్ని, దేవాలయానికి సమీపంలో దేవతార్చన నీటి కోసం ఆమె ఉపయోగించిన దిగుడుబావిని కూడా నేడు చూడవచ్చు.
♾┉┅━❀🕉️❀┉┅━♾
🌈 *గ్రంథరచన* 🌈
👉🏻 ఆమె వ్రాసిన *వేంకటాచలమహాత్మ్యం* అనే గ్రంథం పారాయణ చేస్తే, పెళ్ళి కానివారికి సత్వరమే వివాహమవుతుందని ప్రతీతి. తిరుమల చరిత్రకు సంబంధించి, ఇప్పటికీ ఆ గ్రంథమే అత్యంత ప్రామాణికంగా భావింపబడుతుంది. సుమారు రెండువేల పద్యాలతో అలరారే ఈ గ్రంథప్రతులను వ్రాయసకాండ్రతో తయారు చేయించుకోవడం కోసం తిరుమల యాత్రికులు రోజుల తరబడి వేచి ఉండే వారంటే, దాని ప్రాముఖ్యతను అర్థం చేసుకోవచ్చు. తరువాత అనేక గ్రంథాలు వెలువడినా, ఆ గ్రంథ ప్రాశస్త్యం అలాగే కొనసాగుతోంది.
👉🏻 ఆ సాహితీ సార్వభౌమురాలి కలం నుండి *అష్టాంగరాజయోగం,* *ముక్తికాంతావిలాసం,* *గోపికానాటకం,* *జలక్రీడావిలాసం,* *వాశిష్ఠ రామాయణం,* *రుక్మిణీ కళ్యాణం,* *శ్రీకృష్ణమంజరి* లాంటి గ్రంథాలు; అనేక నాటకాలు, ద్విపదలు, వేదాంతగ్రంథాలు, మరెన్నో వెలువడ్డాయి.
👉🏻 ఆ తెలుగింటి ఆడబడుచు గురించి మనకు తెలిసింది చాలా తక్కువ!
👉🏻 తరతరాలకూ తరగని తెలుగువారి పెన్నిధి తరిగొండ వెంగమాంబ, ప్రతి వేంకటేశ్వరుని భక్తునికీ ప్రాతఃస్మరణీయురాలు.
👉🏻 మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ జీవిత చరిత్రకు సంబంధించి తిరుమలలోనూ, తరిగొండలోనూ నేటికీ సజీవంగా ఉన్న ప్రతి జ్ఞాపికనూ దర్శించుకునే భాగ్యం కలగటం మా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాం.
👉🏻 స్వామివారి సపరిచర్యల్లోనూ, దాన-ధర్మ-సాహిత్య సాధనల్లోనూ అగ్రగామిగా వర్థిల్లిన ఆ ధన్యజీవి జీవితచరిత్ర సమాప్తం.
[ రేపటి భాగంలో... *శ్రీవారి ఆలయవైశిష్ట్యం* గురించి తెలుసుకుందాం]
•••┉┅━❀🕉️❀┉┅━•••
🙏 *శ్రీనివాసుని శ్రీచరణాలను సేవిద్దాం, సకల శుభాలనూ పొందుదాం* 🙏
*...తిరుమల సర్వస్వం..... సశేషం...*
♾️•••┉┅━❀🕉️❀┉┅━•••♾️
No comments :