•••┉┅━❀🕉️❀┉┅━•••
*శ్రీవారి సంవత్సర సేవలు - 1*
✍️ శ్రీమతి&శ్రీ పల్లపోతు వాణిశ్రీ-కృష్ణబాలాజీ
•••┉┅━❀🕉️❀┉┅━•••
*"వేంకటాద్రి సమస్థానం బ్రహ్మాండే నాస్తి కించన*
*వేంకటేశ నమో దేవో న భూతో న భవిష్యతి"*
♾┉┅━❀🕉️❀┉┅━♾
👉🏻 వెండివాకిలిని దాటి మనం ఇక మూడవ ప్రదక్షిణం, అంటే *"విమానప్రక్షిణమార్గం"* లోనికి చేరుకోవడమే తరువాయి.
👉🏻 అయితే, ఆ ప్రదక్షిణం చేసే ముందుగా కొన్ని శ్రీవారి ఉత్సవాల గురించి తెలుసుకుందాం.
👉🏻 *నిత్య, వార, మాస ఉత్సవ* విశేషాలను ముందుగానే చెప్పుకున్నాం కాబట్టి, కొన్ని *"సంవత్సరోత్సవాల"* గురించి కూడా రేపటి భాగంలో తెలుసుకుందాం.
♾┉┅━❀🕉️❀┉┅━♾
🙏 *శ్రీవారి సంవత్సర సేవలు* 🙏
👉🏻 ఉత్సవాలకు నెలవైన తిరుమల క్షేత్రంలో, ప్రతినిత్యం లెక్కకు మిక్కిలిగా ఉత్సవాలు జరుగుతూనే ఉంటాయి. వాటిలో దైనందిత, వార, మాస లేదా నక్షత్ర ఉత్సవాలన్నింటి గురించి ఇంతకుముందే చెప్పుకున్నాం. ఇప్పుడు కొన్ని ముఖ్యమైన సంవత్సరోత్సవాల గురించి తెలుసుకుందాం.
♾┉┅━❀🕉️❀┉┅━♾
🌈 *కోయిల్ ఆళ్వార్ తిరుమంజనోత్సవం* 🌈
👉🏻ఆ తిరుమల కొండపై ఉన్న ప్రతి చెట్టూ-పుట్టా, రాయీ-రప్పా, తీర్థాలూ, సమస్త జంతుజాలం, అన్నీ కారణజన్ములైన దేవతలు, సిద్ధిపొందిన మునిపుంగవులే. వైకుంఠవాసుడైన శ్రీమహావిష్ణువు కలియుగంలో ఆవిర్భవించటంతో ఆ దేవదేవునికి సపర్యలు చేయటం కోసం, లోక కళ్యాణార్థం శ్రీవారు చేపట్టే కార్యాలకు సహాయ సహకారాలు అందించటం కోసం స్వర్గవాసులందరు వివిధరూపాలు ధరించి తిరుమలక్షేత్రంలో కొలువై ఉన్నారు.
👉🏻 ఆ కారణంగా తిరుమలను ఎల్లప్పుడూ అత్యంత పవిత్రంగా, పరిశుభ్రంగా ఉంచటం అనూచానంగా వస్తున్న సాంప్రదాయం. ఆలయ పరిసరాలు, తిరుమల పట్టణమంతా పరిశుభ్రతకు మారుపేర్లు.
👉🏻 అలాగే, ఆలయాంతర్భాగాన్ని కూడా సతతం శుభ్రపరుస్తూ, పరిశుభ్రత ఉట్టిపడేలా తీర్చిదిద్దుతారు. అయితే, దైవసన్నిధిలో జరిగేది కనుక ఈ ప్రక్రియనంతా శాస్తోక్తంగా, భక్తిభావంతో, క్రమశిక్షణతో పూర్తిచేయాలి.
✅ *సంవత్సరంలో నాలుగు సార్లు, అనగా:*
★ *ఉగాది*
★ *ఆణివార ఆస్థానం* (ఇదివరకు ఆలయ వార్షికలెక్కల ముగింపు),
★ *బ్రహ్మోత్సవాలు*
★ *వైకుంఠ ఏకాదశి*
👉🏻 ఈ పండుగలకు ముందు వచ్చే మంగళవారాల్లో జరిగే ఈ *"శుద్ధికార్యక్రమాన్నే" , కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం"* గా పిలుస్తారు. శ్రీవారికి జరిగే ఆర్జిత సేవల్లో ఇదో ముఖ్యమైన సేవ!
👉🏻 ఈ *"కోయిల్"* అంటే ఆలయం. *"ఆళ్వార్"* అంటే విష్ణుభక్తుల్లో గొప్పవారు. *"తిరుమంజనం"* అంటే పవిత్రమైన శుద్ధికార్యక్రమం. ఆలయంలో జరిగేది కాబట్టి ఈ శుద్ధికార్యక్రమాన్నే *"అభిషేకం"* గా భావిస్తారు. వెరసి, ఈ పదానికి అర్థం - *"ఆలయంలో విష్ణుభక్తులు జరిపించే పవిత్రమైన అభిషేకం."*
👉🏻 ఈ ఉత్సవం జరిగే రోజుల్లో, దైనందిత సేవలైన సుప్రభాతం, తోమాలసేవ, అర్చనల తరువాత, గర్భాలయంలోని మూలమూర్తికి ఆసాంతం *"మలైగుడారం"* అనే వస్త్రాన్ని కప్పి, దుమ్మూ ధూళీ పడకుండా చూస్తారు. ఇదే గుడారంలో భోగశ్రీనివాసుణ్ణి కూడా ఉంచుతారు.
👉🏻 మిగతా ఉత్సవమూర్తులు, పరివారదేవతలు, శ్రీ వారికి నిత్యం అలంకరింపబడే సాలగ్రామాలను ఘంటామండపం లోకి; వెండి, బంగారు పాత్రల్ని బంగారుబావి వద్దకూ; స్వామివారి వెండి మంచం, వెండి ఆభరణాలను విమానప్రదక్షిణ మార్గంలోనికి భక్తి పూర్వకంగా తరలిస్తారు.
✡️ ఉత్సవమూర్తులు, సాలగ్రామాలను, అర్చకులు ఘంటామండపంలో తెరలు కట్టి అభిషేకిస్తారు.
✡️ బంగారుబావి వద్దకు తెచ్చిన వస్తువులన్నింటినీ చింతపండుతో శుభ్రపరుస్తారు.
✡️ అర్చకులు గర్భాలయాన్ని;
✡️ పరిచారకులు, ఏకాంగులు కులశేఖరపడి ముందున్న ప్రాంతాన్ని; ఆలయ ఉద్యోగులు మిగతా దేవలయం అంతటినీ, ఉపాలయాలనూ శుభ్రంచేసి శీకాయనీళ్ళతో కడుగుతారు.
✡️ అభిషేకం అందుకున్న ఉత్సవమూర్తులు, పరివారదేవతా మూర్తులకు పట్టువస్త్రాలు సమర్పిస్తారు.
✡️ రంగనాయక మండపంలోని వెండి, బంగారు వాహనాలకు మెరుగు పెడతారు.
✡️ నామంకోపు, గడ్డకర్పూరం, శ్రీచూర్ణం, గంధంపొడి, కుంకుమ ఖచిలిగడ్డ లను కలిపి లేహ్యంలా తయారుచేసిన *"పరిమళం"* అనబడే మిశ్రమాన్ని ముందురోజు రాత్రే గంగాళాల్లో సిద్ధంగా వుంచుకుంటారు.
✡️ గర్భాలయంలో స్వామివారి పైకప్పు భాగానికి కట్టే మఖమల్ వస్త్రాన్ని *"కురాళం"* అంటారు.
✡️ పరిమళాన్ని, కురాళాన్ని తీసుకుని జియ్యంగార్లు, ఆలయ ఉన్నతాధికారులు మంగళవాయిద్యాలతో, ధ్వజస్తంభానికి ప్రదక్షిణగా వచ్చి అర్చకులకు అందజేస్తారు.
✡️ అర్చకులు కురాళాన్ని యథాస్థానంలో (గర్భాలయపు ఉపరితల భాగంలో) అమర్చి, "పరిమళాన్ని గర్భాలయ మరియు ఇతర ముఖ్య ఉపాలయాల గోడలకు లేపనంలా పూస్తారు.
✡️ తరువాత నేలనంతా కడిగి, ఉత్సవమూర్తులను, పూజాసామగ్రిని వారివారి స్థానాలకు చేరుస్తారు.
✡️ అనంతరం బంగారువాకిళ్ళకు నూతన పరదాలు కట్టి, తెరవేసి, మూలమూర్తిని కప్పి ఉంచిన మలైగుడారాన్ని తొలగించి, రోజువారీ సేవాకార్యక్రమాలను యథావిధిగా కొనసాగిస్తారు.
👉🏻 ఈ సేవను మొట్టమొదటగా *"వంగపురం నారాయణశెట్టి"* అనే తిరుపతికి చెందిన వర్తకుడు, 1544వ సం. లో, తన ఖర్చుతో జరిపించాడు.
👉🏻 ఈ సేవాకార్యక్రమం నందు పరిమళద్రవ్యాలను అధిక మొత్తంలో ఉపయోగించటం వల్ల గవాక్షాలు లేని ఆనందనిలయంలో గాలి పరిశుభ్రంగా, సువాసనా భరితమై ఉండటమే కాకుండా, లోనికి క్రిమికీటకాదులు రాకుండా ఉంటాయి. ఈ సేవలో పాల్గొనే భక్తులు, వ్యక్తికి ₹300 చొప్పున చెల్లించాలి.
👉🏻 తిరుమలలో పరిశుభ్రత గురించి ముఖ్యంగా ఒక విషయం చెప్పుకోవాలి. *"అన్నం పరబ్రహ్మ స్వరూపం"* - అటువంటి టన్నుల కొద్దీ అన్నాన్ని ప్రతిదినం లక్షకు పైగా భక్తులకు వండి వడ్డించే, తిరుమలలోని వెంగమాంబ అన్నప్రసాదకేంద్రంలో; ఒక్క ఈగను కానీ, పదార్థాల్లో ఒక్క వెంట్రుకను గానీ ఎప్పుడైనా, ఎవరైనా చూశారా? అంకితభావంతో పనిచేసే వంటశాల సిబ్బంది అవిశ్రాంత కృషికి శ్రీనివాసుని సంపూర్ణ కటాక్షం తోడవటం వల్లనే ఇది సాధ్యం!
✅ *ఆత్మ, శరీర, పరిసరాల పరిశుభ్రతే పరమపద సోపానానికి తొలిమెట్టు.*
♾┉┅━❀🕉️❀┉┅━♾
🌈 *సాలకట్ల తెప్పోత్సవం* 🌈
👉🏻 వేసవికాలంలో తాపం తీర్చుకోవడానికి మనం చల్లని ప్రదేశాలను, ఈతకొలనులను సందర్శించినట్లే; ఆ వేంకటేశుడు కూడా సతుల సమేతంగా నౌకావిహారానికి వెళతాడు.
👉🏻 వేసవి ప్రారంభంలోని (ఫిబ్రవరి-మార్చి) పున్నమిరోజుల వెన్నెల కాంతుల్లో, స్వామిపుష్కరిణి యందలి చల్లటి నీళ్ళలో జరిగే ఈ ఉత్సవాల్ని *"సాలకట్ల తెప్పోత్సవాలు"* గా వ్యవహరిస్తారు.
👉🏻 ఏటా *ఫాల్గుణమాస శుక్లపక్ష ఏకాదశి* నాడు ప్రారంభమై, ఐదు రోజులపాటు రాత్రి 7 నుంచి 8 గం. ల మధ్య జరిగే ఈ ఆర్జితసేవలో పాల్గొనటం కోసం వ్యక్తికి ₹500 చొప్పున చెల్లించాలి.
👉🏻 తిరుమలలో అతి ప్రాచీనకాలం నుండి జరుగుతున్న తెప్పోత్సవాల్ని మరింత ఘనంగా నిర్వహించటానికి, 1468వ సం.లో, పుష్కరిణి మధ్యభాగం నందు *"నీరాళి మంటపాన్ని"* సాళువ నరశింహరాయలు నిర్మించాడు.
👉🏻 సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దిన పుష్కరిణిలో, విద్యుద్దీపాలంకార శోభితమైన తెప్ప యందు స్వామివారు విహరించే ఈ తెప్పోత్సవం ఇలా సాగుతుంది -
🙏 *మొదటి రోజు* —
సీతాలక్ష్మణ ఆంజనేయస్వామి సమేతంగా శ్రీరామచంద్రమూర్తి పుష్కరిణిలో మూడుసార్లు తిరిగి భక్తులకు కనువిందు చేస్తారు.
🙏 *రెండవరోజు* -
రుక్మిణీ సమేతంగా శ్రీకృష్ణుడు మూడు సార్లు విహరిస్తారు.
🙏 *మూడవరోజు* -
ఉభయ నాంచార సమేతులైన మలయప్పస్వామి వారు పుష్కరిణిని మూడు సార్లు చుట్టివస్తారు.
🙏 *నాల్గవరోజు* –
మలయప్పస్వామి వారు మరలా ఐదు సార్లు విహరిస్తారు.
🙏 *ఐదవరోజు* —
చివరిసారిగా, మలయప్పస్వామి వారు ఏడు మార్లు నౌకావిహారం చేస్తారు.
🎼 తాళ్ళపాక అన్నమయ్య ఈ తెప్పోత్సవ శోభను హిందోళరాగంలో ఇలా కీర్తించాడు -
*"దేవునికి దేవికిని తెప్పల కోనేటమ్మ*
*వేవేలు మొక్కులు లోకపావని నీకమ్మా!!"*
*"తెప్పగా మర్రాకు మీద తేలెడువాడు*
*ఎప్పుడు లోకములెల్ల నేలేటి వాడు!!"*
ఇంకా..... రేపటిభాగంలో....
[ ప్రణయకలహోత్సవం, జ్యేష్ఠాభిషేకం, పద్మావతీ పరిణయోత్సవాలు, పుష్పయాగం ఇత్యాదుల గురించి]
[ రేపటి భాగంలో... మరిన్ని *శ్రీవారి సంవత్సరోత్సవాల* గురించి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం]
•••┉┅━❀🕉️❀┉┅━•••
🙏 *శ్రీనివాసుని శ్రీచరణాలను సేవిద్దాం, సకల శుభాలనూ పొందుదాం* 🙏
*...తిరుమల సర్వస్వం..... సశేషం...*
•••┉┅━❀🕉️❀┉┅━•••
No comments :