♾┉┅━❀🕉️❀┉┅━♾
*శ్రీవారి బ్రహ్మోత్సవాలు - 2*
✍️ శ్రీమతి&శ్రీ పల్లపోతు వాణిశ్రీ-కృష్ణబాలాజి
♾┉┅━❀🕉️❀┉┅━♾
🌈 *ఉత్సవాలు, ఊరేగింపులు ఎందుకు జరుగుతాయి?* 🌈
👉 అశౌచం, అంగవైకల్యం, అనారోగ్యం, వృద్ధాప్యం, సమయాభావం లేదా మరే ఇతర కారణాల చేతనైనా గుడిలోని దేవుణ్ణి దర్శించుకోలేని వారికోసం దైవమే స్వయంగా, ఉత్సవమూర్తుల రూపంలో, ఆలయం వెలుపలికేతెంచి భక్తులను అనుగ్రహించటం కోసం; ఆగమశాస్త్రానుసారం ఉత్సవాలు, ఊరేగింపులు ప్రవేశ పెట్టబడ్డాయి.
👉 దేవతలు, గంధర్వ, యక్ష, కిన్నెర, కింపురుషులూ, మానవులే కాకుండా అనేక వన్యమృగాలు, పక్షులు కూడా స్వామివారి సేవలో తరించాయి. అవి వేర్వేరు సమయాల్లో స్వామివారికి సమర్పించిన సేవలకు గుర్తుగా బ్రహ్మోత్సవాల్లో స్వామివారు జంతు మరియు ఖగ (పక్షి) వాహనాలపై ఊరేగుతారు.
♾┉┅━❀🕉️❀┉┅━♾
🌈 *తిథి - నక్షత్రాలు* 🌈
👉 సాధారణంగా, ప్రతి ఆలయంలో ఉత్సవాలను ప్రారంభ తిథికి అనుగుణంగా మొదలుపెడతారు. కానీ తిరుమలలో మాత్రం ముగింపు రోజును పరిగణనలోకి తీసుకుని ఉత్సవాలను ప్రారంభించే సాంప్రదాయం అనాదిగా ఉంది.
👉 *కన్యారాశిలో శ్రవణా నక్షత్రం నాడు "అవభృధము" లేదా "చక్రస్నానం" నిర్ణయించి, దానికి తొమ్మిది రోజుల ముందుగా బ్రహ్మోత్సవాలను ప్రారంభిస్తారు.*
👉 సాధారణ సంవత్సరాల్లో - అంటే అధికమాసం లేని సంవత్సరాల్లో ఈ బ్రహ్మోత్సవాలు ఆశ్వయుజ మాసమందు దసరా నవరాత్రుల్లో ఒక్కసారి మాత్రమే వస్తాయి. వీటిని *"సాలకట్ల బ్రహ్మోత్సవాలు"* అంటారు. ఉత్తరభారతీయ భాషల్లో "సాల్" అంటే సంవత్సరం, "కట్ల" లేదా "కట్టడి" అనే తెలుగు పదానికి "సాంప్రదాయం" అని అర్థం. మహంతుల కాలం నుండి ఈ పదం వాడుకలోనికి వచ్చింది.
👉 అదే అధికమాసం వచ్చిన సంవత్సరాల్లో బ్రహ్మోత్సవాలు రెండుసార్లు జరుగుతాయి. ఈ సంవత్సరాల్లో కన్యాశ్రవణం భాద్రపదమాసంలో వస్తుంది. ఈ మాసంలో జరిగే బ్రహ్మోత్సవాలను *"వార్షికబ్రహ్మోత్సవాలు"* అని పిలుస్తారు. ఇవి ముఖ్యమైనవి. ఆ సంవత్సరంలో రెండవసారి, ఆశ్వయుజమాసంలో జరిగే ఉత్సవాలను *"నవరాత్రి బ్రహ్మోత్సవాలు"* గా పిలుస్తారు.
★ ఈ సందర్భంలో, అధికమాసం గురించి కొద్దిగా చెప్పుకోవాలి.
👉 *తమిళులు ఎక్కువగా అనుసరించే, సంవత్సరానికి 365 రోజులు గల సౌరమానంలో అధికమాసాలు లేవు. కానీ, తెలుగువారు అధికంగా అనుసరించే చంద్రమానంలో సంవత్సరానికి 354 దినాలు. అంటే చాంద్రమాన సంవత్సరం, సౌరమాన సంవత్సరం కంటే 11 రోజులు తక్కువగా ఉండటంతో చంద్రమానంలో సూర్య సంక్రమణం లేని మాసం వస్తుంది. అదే అధికమాసం. సౌరమానం మరియు చంద్రమానాన్ని సమన్వయ పరచడం కోసం ఏర్పాటు చేయబడిన ఈ అధికమాసం ప్రతి మూడవ సంవత్సరంలో వస్తుంది. ఇలా సమన్వయించక పోతే, ఋతుచక్రం కొంత కాలానికి గతి తప్పుతుంది.*
👉 సాలకట్ల బ్రహ్మోత్సవాలు మరియు వార్షిక బ్రహ్మోత్సవాలు, *"అంకురార్పణ', 'ధ్వజారోహణం'* తో ప్రారంభమై *"ధ్వజావరోహణం"* తో ముగుస్తాయి. నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో ఇవి ఉండవు. ఇంకో ముఖ్యమైన తేడా ఏమిటంటే వార్షిక బ్రహ్మోత్సవాల్లో రథోత్సవానికి *"కొయ్యతేరు"* ను ఉపయోగిస్తారు. అదే, నవరాత్రి బ్రహోత్సవాల్లో కొయ్యతేరుకు బదులు మొదట్లో వెండి రధాన్ని, ప్రస్తుతం బంగారు రథాన్ని ఉపయోగిస్తున్నారు.
♾┉┅━❀🕉️❀┉┅━♾
🌈 *బ్రహ్మోత్సవాల పరమార్థం* 🌈
👉 బ్రహ్మోత్సవాల్లో మొదటి రోజు జరిగే అంకురార్పణ పర్వం నుండి తొమ్మిదవ రోజున జరిగే చక్రస్నానం వరకు జరిగే ప్రతి వేడుక, ప్రతి ఉత్సవం, స్వామివారు అధిరోహించే ప్రతి వాహనం సందేశాత్మకమే. వాహనాలపై విహరించే మలయప్పస్వామిని దర్శించుకుంటే అశ్వమేధయాగం చేసినంత ఫలితం వస్తుందని పురాణాల్లో చెప్పబడింది.
♾┉┅━❀🕉️❀┉┅━♾
🌈 *అంకురార్పణ ఘట్టం* 🌈
👉 ప్రతి ఏడాది బ్రహ్మోత్సవాల యందు అర్చకుల్లో ఒకరిని *"కంకణ భట్టాచార్యులు"* గా నియమిస్తారు. అంకురార్పణఘట్టం నుండి చక్రస్నానం వరకు వాహనసేవల్లో, యాగశాలలో, ఇతర పూజాదికాల్లో ఆయనే ప్రధానపాత్ర వహిస్తారు. ఆగమశాస్త్ర ప్రకారం ఉత్సవాలు పూర్తయ్యేంత వరకూ వీరు పొలిమేర దాటి వెళ్ళరాదు.
👉 వైఖానస ఆగమ సాంప్రదాయ క్రతువుల్లో తలపెట్టిన కార్యక్రమం విజయవంతం కావటంకోసం తొలిగా జరిపించే *"అంకురార్పణం"* లేదా *"బీజావాపనం"* అత్యంత ముఖ్యమైన ఘట్టం.
👉 ఈ ఘట్టం ఆరంభంలో, స్వామివారి సేనాధిపతి అయిన విష్వక్సేనుడు నాలుగు మాడ వీధుల్లో ఊరేగే సన్నివేశాన్ని అన్నమయ్య ఇలా వర్ణించాడు -
*"అది వచ్చె నిది వచ్చె నచ్యుత సేనాపతి*
*పది దిక్కులకు నిట్టె పార లో యసురులు".*
👉 తాత్పర్యమేమంటే, *"విష్ణుదేవుని యొక్క సేనాధిపతి అయిన విష్వక్సేనుని రాక దానవులందరికీ భయం కలిగించింది."* బ్రహ్మోత్సవాలు ప్రారంభం కావడానికి ముందురోజున, విష్వక్సేనులవారు పంచాయుధధారియై తన తిరుచ్చి వాహనంపై ఆలయం నుంచి ఊరేగింపుగా బయలుదేరి నాలుగు మాడ వీధుల్లో బ్రహ్మోత్సవ ఏర్పాట్లను పరిశీలిస్తారు. ఇందులో భాగంగా పడమర వీధి లోని నైఋతి మూలన ఉన్న వసంతమండపం లోకి విచ్చేస్తారు. ఆ తరువాత నిర్ణీత ప్రదేశంలో భూదేవి ఆకారాన్ని చిత్రించి, అందులోని లలాట, బాహు స్థన ప్రదేశాల నుండి మట్టిని తీసి ఆలయం లోనికి తీసుకు వస్తారు. దీన్నే *"మృత్సంగ్రహణం"* లేదా *"పుట్టమన్ను సేకరించటం"* అంటారు.
👉 ఆలయంలోని యాగశాలకు సమీపంలో అంకురార్పణ జరిగే ప్రదేశాన్ని ముందుగా ఆవుపేడతో శుద్ధిచేసి, తరువాత సేనాధిపతికి ఆ ప్రదేశంలో *"బ్రహ్మపీఠాన్ని"* ఏర్పాటు చేస్తారు. తదుపరి, అగ్ని ద్వారా – బ్రహ్మ, గరుడ, శేష, సుదర్శన, సోమ, శంత, ఇంద్ర, ఇసాన, జయ • దేవతలను ఆహ్వానిస్తారు.
https://whatsapp.com/channel/0029VaAqKJvBPzjfTHD3nC0V
👉 ముందుగా సేకరించి నటువంటి, మట్టితో నింపిన 9 పాళికల్లో శాలి, వ్రీహి, యువ, ముద్గ (పెసలు), మాష (మినుములు), ప్రియంగు (కొర్రలు) వంటి నవధాన్యాలను చల్లి, వరుణ మంత్రాన్ని పఠించి నీరు చిలకరిస్తారు. ఈ పాళికలను నూతన వస్త్రాలతో అలంకరించి పుణ్యాహవచనం చేస్తారు. ప్రతిరోజు ఈ పాళికల్లో నీరు పోస్తూ పచ్చగా మొలకలు వచ్చేలా చూస్తారు. అందుకే ఇది *"అంకురార్పణ కార్యక్రమం"* గా పిలువ బడుతుంది. ఈ కార్యక్రమానికి సోముడు లేదా చంద్రుడు అధిపతి. పాళికలలోని నవధాన్యాలు శుక్లపక్ష చంద్రునిలా దినదినాభివృద్ధి చెందాలని ప్రార్థిస్తారు. ఆ తరువాత సోమరాజమంత్రాన్ని, విష్ణుసూక్తాన్ని పఠిస్తారు. ఖగోళశాస్త్రనుసారం ఔషధాధిపతి చంద్రుడు కాబట్టి, రాత్రి సమయంలోనే విత్తనం నాటడం ఆనవాయితీగా వస్తోంది. ఇలా వేడుకగా, శాస్త్రయుక్తంగా సమకూరే అంకురార్పణ కార్యక్రమంతో స్వామివారి బ్రహ్మోత్సవ వేడుకలు మొదలవుతాయి.
♾┉┅━❀🕉️❀┉┅━♾
🌈 *ధ్వజారోహణం* 🌈
👉 బ్రహ్మోత్సవాల తొలిరోజు సాయం సమయాన జరిగే ఉత్సవం *"ధ్వజారోహణం".* ఇందులో భాగంగా శ్రీదేవి భూదేవి సమేత మలయప్పస్వామి వారికి ఏకాంతంగా తిరుమంజన ప్రక్రియ నిర్వహించి నైవేద్యం సమర్పిస్తారు. ఆ తరువాత స్వామి వారిని ధ్వజస్తంభం వద్దకు చేరుస్తారు.
👉 ఈలోగా ఆగమశాస్త్రానుసారం కంకణధారణ, అష్టదిక్కుల్లో అర్చకుల బలినివేదన, శాస్తోక్తంగా జరిపి ధ్వజపటాన్ని మాడవీధుల్లో ఊరేగిస్తూ ఆలయం వద్దకు తీసుకొస్తారు.
మలయప్పస్వామి వారి సమక్షంలో, వేదగానాల మధ్య మంగళవాద్యాలు మ్రోగుతుండగా అర్చకస్వాములు బంగారు ధ్వజస్తంభంపై గరుడధ్వజం లేదా ధ్వజపటం ఎగురవేస్తారు. స్వామివారి వాహనం గరుడుడు కాబట్టి, గరుడుని బొమ్మ చిత్రీకరించిన క్రొత్తవస్త్రమే ధ్వజపటం లేదా గరుడధ్వజం. కొడిత్రాడు సాయంతో దాన్ని ధ్వజస్తంభ శిఖరానికి చేరుస్తారు. గగనతలాన ఎగిరే ఈ గరుడ పతాకమే సకల దేవతలకు, అష్టదిక్పాలకులకు, భూత-ప్రేత-యక్ష-రాక్షసగంధర్వగణాలకు ఆహ్వానం పలుకుతుంది. ఈ ఆహ్వానం అందుకుని ఉత్సవాలకు విచ్చేసిన ఆహ్వానితులందరికీ, నైవేద్య రూపంలో బలిని సమర్పిస్తారు. ఈ సందర్భంగా, *"ముద్గాన్నం"* అనబడే పెసరపులగం నివేదించ బడుతుంది. దీన్ని స్వీకరిస్తే స్త్రీలు సంతానవతులవుతారని భక్తుల విశ్వాసం.
👉ప్రస్తుతం సాయంకాలాలలో జరుపబడే ధ్వజారోహణం నాడు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు బేడి ఆంజనేయస్వామి వారి సన్నిధి నుండి ఊరేగింపుగా వచ్చి శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారు. దాంతో బ్రహ్మోత్సవాలు ఆరంభమైనట్లే! ఆ రాత్రి నుండే స్వామివారు ప్రతిరోజు ఉదయం సాయంత్రం వేర్వేరు వాహనాలపై ఊరేగుతూ భక్తులను అనుగ్రహిస్తారు.
[ రేపటి భాగంలో... *శ్రీవారి బ్రహ్మోత్సవాలలో - వాహనోత్సవ క్రమం* విశేషాలు మరిన్ని తెలుసుకుందాం]
♾️•••┉┅━❀🕉️❀┉┅━•••♾️
🙏 *శ్రీనివాసుని శ్రీచరణాలను సేవిద్దాం, సకల శుభాలనూ పొందుదాం* 🙏
*తిరుమల సర్వస్వం సశేషం...*
♾️•••┉┅━❀🕉️❀┉┅━•••♾️
No comments :