🍁🍁🍁🍁🍁
*శ్రీవారి బ్రహ్మోత్సవాలు - 8*
*సూర్యప్రభ వాహనం:*
బ్రహ్మోత్సవాల్లో ఏడవరోజు ఉదయం సప్తగిరీశుడు ఒక్కరే - ఏడు గుర్రాలు పూన్చిన రథంపై, ఏడంతస్తుల కనకపు సింహాసనాన్ని అధిష్టించి, వజ్రకవచధారియై; బాలభానుడు తన ఉదయపు లేలేత కిరణాలతో నమస్కారాలు సమర్పిస్తుండగా మాడ వీధుల్లో ఊరేగుతూ *"సూర్య మండలం మధ్యనున్న నారాయణ మూర్తిని నేనే"* - అని భక్తులకు సందేశమిస్తారు.
*"ధ్యేయస్సదా సవిత్రృమండల మధ్యవర్తి నారాయణః"* అంటే, *"సూర్య మండలం మధ్యలో ఉన్న శ్రీమన్నారాయణుడు ఎల్లప్పుడూ ధ్యానింప దగినవాడు"* అని వేదశృతి. అందుకే హిందూ సాంప్రదాయంలో ప్రతిరోజూ ఉదయం సూర్యనమస్కారాలు, సూర్యోపాసన చేసే సంస్కృతి ఉంది. గాయత్రీ మంత్రంతో సూర్యనారాయణుణ్ణి ఆరాధిస్తాము. సూర్యుడు తేజోనిధి. నిత్యం కంటికి కనిపించే ప్రత్యక్ష దైవమైన సూర్యనారాయణుడు ప్రకృతికి, జీవులకు చైతన్యప్రదాత. వర్షాలు, వాటివల్ల కలిగే పాడి పంటలు, చంద్రుడు అతని షోడశకళల వల్ల వృద్ధిచెందే ఔషధులు; అన్నీ సూర్యప్రసాదితాలే. సూర్యుడు కర్మసాక్షి,
నేడు ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న మహమ్మారిని తట్టుకునే రోగనిరోధకశక్తి, లేలేత సూర్యకిరణాల ద్వారా లభించే "విటమిన్ డి" లో మెండుగా ఉంటుందని వైద్యులు, శాస్త్రవేత్తలు చెప్తున్నారు. మయూరాదులు, సాంబుడు వంటి భక్తులు సూర్యోపాసనచేతనే శారీరక అనారోగ్యం నుండి విముక్తులైనట్లు పురాణాల ద్వారా తెలుస్తోంది.
*"ఆరోగ్యం భాస్కరాదిచ్ఛేత్!!"*
శ్రీమహావిష్ణువుకు సూర్యుడు కుడికన్నుగా, చంద్రుడు ఎడమనేత్రంగా చెబుతారు. అందుకే విష్ణుమూర్తి దివారాత్రాలకు (పగలు, రేయి) అధిపతి.
రాజవంశాలలో సూర్యవంశం ప్రథమం. శ్రీమహావిష్ణువు పుత్రుడు బ్రహ్మతో మొదలైన సూర్యవంశంలో ముప్పయ్యెనిమిదవ తరానికి చెందినవాడు శ్రీరామచంద్రుడు. బ్రహ్మకు మరీచి, అతనికి కాశ్యపుడు, అతనికి సూర్యుడు జన్మించారు. రామ-రావణ సంగ్రామంలో శ్రీరామచంద్రుడు *"ఆదిత్యహృదయం"* పఠించి, తన పూర్వజుడు, వంశనామ కారకుడు అయిన సూర్యనారాయణుని ఆశీస్సులు పొంది, తద్వారా రావణసంహారం గావించాడు.
సూర్యుడు నమస్కార ప్రియుడు. మనకు అంతులేని ఫలాలు ప్రసాదించినా, ఏ ప్రతిఫలం ఆశించడు. మనం త్రికరణశుద్ధిగా చేసే నమస్కారానికే ఆయన సంతృప్తి చెందుతాడు. *"ఆరోగ్యం, కవిత్వం, విద్య, ఐశ్వర్యం, సంతానం - ఇవన్నీ సూర్యదేవుని అనుగ్రహం వల్ల సిద్ధిస్తాయి"* అని సూర్యశతకం తెలియజేస్తుంది. సూర్యోపాసన, చక్షూరోగ (కంటి సంబంధిత వ్యాధులు) నివృత్తి గావిస్తుందని యజుర్వేదంలోని చాక్షూషోపనిషత్తు విదిత పరుస్తుంది. చర్మరోగగ్రస్తులు సైతం సూర్యనారాయణుని పూజించి బాధా విముక్తులవుతారు.
ఇప్పుడు ఓసారి మలయప్పస్వామివారు అధిరోహించిన వాహనాన్ని దగ్గరనుంచి దర్శించుకుందాం. జపాకుసుమాలు ధరించిన స్వామి వాహనానికి, గరుత్మంతుని అన్నగారైన "అనూరుడు" సారథ్యం వహిస్తున్నాడు. రథాన్ని లాగుతున్న ఏడు గుర్రాలను ఏడు ఛందస్సులుగా పరిగణిస్తారు. *గాయత్రి, బృహతి, ఉష్ఠిక్, జగతి, త్రిష్టుప్, అనుష్టుప్, పంక్తి* అనేవి ఆ ఛందస్సుల పేర్లు. విష్ణుసహస్రనామంలో *"అనుష్టుప్ ఛందః"* అని పఠిస్తాం. అంటే "అనుష్టుప్ అనబడే ఛందస్సులో వ్రాయబడినది" అన్నమాట.
అనూరుడు అంటే "ఊరువులు (తొడలు) లేకుండా జన్మించినవాడు" అని అర్థం. సూర్యరథసారథి అయిన అనూరుడు; తన తమ్ముడూ, విష్ణుమూర్తి వాహనమైన గరుత్మంతుని వద్దకు వచ్చాడు.
ఆహా, ఏమి ఆ అపూర్వ సంగమము!
ఒకరేమో జగతి కాలచక్రాన్ని నిర్ధారించే సూర్యదేవుని రథానికి సారథి, మరొకరేమో జగద్రక్షకుడైన శ్రీమన్నారాయణుని ముల్లోకాలను విహరింపజేసే వాహనము!
ఇంతటి ధన్యులైన ఇద్దరు పుత్రరత్నాలను కన్న "వినతి" చేసుకున్న పూర్వజన్మల పుణ్యఫలం ఎంత గొప్పదో కదా!
సూర్యప్రభవాహనంపై శ్రీనివాసుని దర్శనం భక్తులకు పూర్ణ ఫలాన్ని ప్రసాదిస్తుంది. ఈ వాహనసేవ దర్శనం ద్వారా భక్తకోటికి ఆరోగ్యం, ఐశ్వర్యం సంపూర్ణంగా సిద్ధిస్తాయి.
*అదివో చూడరో అందరు మొక్కరో*
*ముదిగొనె బ్రహ్మము కోనేటి దరిని*
*రవిమండలమున రంజిల్లు తేజము*
*దివి చంద్రునిలో తేజము*
*భువి ననలంబున బొడమిన తేజము*
*వివిధంబులైన విశ్వతేజము*
అంటూ, ఆ శ్రీనివాసుడే సూర్యమండల మధ్యవర్తియగు శ్రీమన్నారాయణడని ధృవపరిచి, కీర్తించాడు, పదకవితా పితామహుడు అన్నమయ్య.
*స్వయం ప్రకాశా గోవిందా!*
*ప్రత్యక్షదేవా గోవిందా!!*
*దినకరతేజా గోవిందా
*చంద్రప్రభ వాహనం*
ఏడవనాటి రాత్రి వేంకటేశ్వరుడు ఒక్కరే, తెల్లని వెన్నెలతో కూడుకున్న చల్లని వాతావరణంలో, చంద్రప్రభ వాహనంపై తిరుమాడ వీధులలో ఊరేగుతూ దర్శనమిస్తారు. పగలు సూర్యప్రభ వాహనంపై ఊరేగిన విష్ణుదేవుడు; ఆనాటి రాత్రి నిశాకరుడై, అమృత కిరణాలు ప్రసరించే చంద్రప్రభ వాహనంపై ఊరేగుతారు. శ్రీకృష్ణుడు తన విభూతులను తెలుపుతూ, *"నక్షత్రాణా మహం శశి!"* అంటూ, తనను తాను చుక్కల్లో చంద్రునిగా అభివర్ణించుకున్నాడు.
"చంద్రుడు" అంటే అమృతానికి నిధి అని అర్థం. అమృతకిరణుడు, సుధాకిరణుడు, హిమకిరణుడు అయినటువంటి చంద్రప్రభవాహనంలో; ధవళ వస్త్రాలు, శ్వేతవర్ణపుష్పాలు ధరించి "ధన్వంతరి" అలంకారంలో అలరిస్తున్నారు మలయప్పస్వామి.
క్షీరసాగరమధనంలో కల్పవృక్షము, కామధేనువు, శ్రీమహాలక్ష్మిలతో పాటుగా; చేతిలో అమృతకలశంతో ధన్వంతరి ఉద్భవించారు. సాక్షాత్తూ శ్రీమహావిష్ణువు అవతారం అయిన ధన్వంతరిని ఆయుర్వేదవైద్యానికి మూలపురుషుడిగా వర్ణిస్తారు. ఆయనను పూజిస్తే ఆరోగ్యం వృద్ధి చెందుతుందని ప్రతీతి. దీపావళికి రెండు రోజులు ముందు వచ్చేటటువంటి, ధన్వంతరి జన్మతిథి అయిన ధనత్రయోదశిని ఉత్తరభారతదేశంలో "ధంతేరాస్" పండుగగా జరుపుకుంటారు. అదే తిథిలో బంగారానికి ప్రతిరూపమైన లక్ష్మీదేవి సైతం క్షీరసాగరమథనంలో ఉద్భవించడం వల్ల ఆరోజు బంగారం కొనడం, లక్ష్మీదేవిని పూజించడం అనే సాంప్రదాయాలు అమల్లోకి వచ్చాయి. ఉత్తరభారతదేశంలో ఇదు రోజులపాటు జరుపుకునే అతి పెద్ద పండుగ "దీపావళి"లో మొట్టమొదటి రోజు "ధనత్రయోదశి". ఆరోజును భారత ప్రభుత్వం " జాతీయ ఆయుర్వేద దినం" గా ప్రకటించింది.
ధన్వంతరి ఆయురారోగ్యాలకు అధిపతి అయినందున, ప్రస్తుత విపత్కర పరిస్థితుల దృష్ట్యా తిరుమల క్షేత్రంలో ప్రతిరోజూ ఉదయం యోగవాశిష్ఠం, తదుపరి ధన్వంతరి మహామంత్ర పారాయణం జరుపబడుతోంది. తిరుమల క్షేత్రం నుండి ఉదయం ఏడు గంటలకు శ్రీవేంకటేశ్వరా భక్తి ఛానల్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం గావించబడే ఈ స్తోత్రంపఠనంలో మనం కూడా శృతి కలిపి, కరోనా కట్టడికి ఉడుతాభక్తిగా మనవంతు కృషి చేద్దాం.
పురాణేతిహాసాల్లోకి వెళితే "కర్కటి" అనబడే బ్రహ్మరాక్షసి, ఘోరమైన తపస్సు గావించి బ్రహ్మ నుండో వరం పొందింది. ఆ వరం ప్రకారం, కర్కటి అత్యంత సూక్ష్మక్రిమిగా మానవశరీరాల్లోకి ప్రవేశించి, "విషూచికా" అనబడే విషజ్వరాన్ని వ్యాపింపజేసి, శరీరాంతర్భాగాల నన్నింటినీ ఛిద్రంగావించి, రోగగ్రస్త శరీరావశేషాలను సుష్టుగా భుజించి, తన క్షుద్బాధను తీర్చుకో గలుగుతుంది. మానవజాతి మొత్తాన్ని అప్రయత్నంగా, ఏకమొత్తంగా దిగమ్రింగాలని దాని పన్నాగం. సమస్తమానవాళికి మహమ్మారిలా దాపురించిన ఆ రక్కసి కోరల బారిన పడే మానవుల విపరీత లక్షణాలు, దాని నుండి తప్పించుకునే మార్గాంతరం, పఠించాల్సిన స్తోత్ర మంత్రాలను కూడా బ్రహ్మదేవుడే శెలవిచ్చారు. ఆ "విషూచికా" అనబడే విషజ్వరమే నేటి "కరోనా" అని విజ్ఞుల నమ్మకం. దాని కబంధహస్తాల నుండి మానవాళిని కాపాడడం కోసం, బ్రహ్మదేవుడు ఆనతిచ్చినట్లుగా,
*- ప్రాణాపాయకరస్య, కరోనా నామకస్య....."*
అనే సంకల్పంతో మొదలై, యోగవాశిష్ఠ పారాయణం జరుగుతుంది. తరువాత,
*"అచ్యుతానంద గోవింద విష్ణో నారాయణామృతః*
*రోగాన్మో నాశయాశేషాన్ ఆశు ధన్వంతరే హరే ||"*
అన్న శ్లోకంతో ప్రారంభమై, ధన్వంతరీ మహామంత్ర పారాయణం జరుగుతుంది. నిత్యం క్రమం తప్పకుండా ఈ మంత్రపారాయణం చేస్తే, ఉచ్ఛారణ శుద్ధి కావడంతో పాటుగా; ప్రాణాయమఫలం పొంది, ఊపిరితిత్తులు దృఢమై, శ్వాస సంబంధిత వ్యాధులనుండి రక్షింపబడతారని విజ్ఞుల ఉవాచ!
చంద్రునితో తెలుగువారికి విశేషానుబంధం ఉంది. ప్రతి మాతృమూర్తి తన పిల్లలకు *"చందమామరావే"* అనే పాటతో చల్లనయ్యకు ఆప్యాయంగా మేనమామ వరుస కలుపుతూ, గోరుముద్దలు తినిపిస్తుంది. ప్రేయసీ-ప్రియులకు వెన్నెల రాత్రి విహారాలంటే ఎంతో ఇష్టం. అందమైన ముఖాన్ని చంద్రబింబం తో పోలుస్తారు. తెలుగు సాహిత్యంలో పున్నమి వెన్నెల మీద రాయబడినంత కవిత్వం, బహుశా మరే ఇతర ఇతివృత్తం పైనా వెలువడలేదంటే అతిశయోక్తి కాదు.
*"చంద్రమా మనసో జాతః "* అంటే, చంద్రుడు భగవంతుని మనస్సు నుండి ఉద్భవించినట్లుగా పురుషసూక్తం చెబుతుంది. *"పుష్టామి చౌషధీః సర్వాః సోమో భూత్వా రసాత్మకః"* అని పురుషోత్తమ ప్రాప్తియోగంలో ప్రకటించబడింది. అంటే *"చంద్రకిరణ స్పర్శతోనే ఔషధ మొక్క వృద్ధి చెందుతుంది"* అని అర్థం. ఔషధాలు లేకపోతే మానవుని మనుగడ ప్రశ్నార్థక మవుతుంది గనుక, ఓషధీశుడైన చంద్రుడే మనకు జీవనాధారం!
పురాణాలలో చంద్రుని ప్రస్తావన విస్తృతంగా లభిస్తుంది. చంద్రుడు కూడా క్షీరసాగరమథనం లోనే ఉద్భవించాడు. చంద్రుడు శివునికి శిరోభూషణం. హాలాహల సేవనంతో విపరీతమైన ఉష్ణతాపానికి గురైన గరళకంఠుడు, చల్లనైన చంద్రుణ్ణి శిరస్సున ధరించి తాపోపశమనం పొందుతాడు. శైవ సంప్రదాయానికి మూలమైన శివునికి శిరోభూషణంగా భాసిల్లే చంద్రుడు ప్రఖ్యాత వైష్ణవ క్షేత్రమైన తిరుమలలో శ్రీవారికి చంద్రప్రభవాహనంగా ఉండటం అత్యంత విశేషం! శివకేశవుల కెంతమాత్రం తారతమ్యం లేదనటానికి మరో ప్రబల నిదర్శనం!
చంద్రోదయం కాగానే కలువలు వికసిస్తాయి. సాగరుడు ఉప్పొంగి చంద్రకాంతమణులను స్రవింపజేస్తాడు. *"యత ప్రహ్లాదయాత్ చంద్రః"* అంటే చంద్రుని వల్ల సంతోషం కలుగుతుంది. అదేవిధంగా, చంద్రప్రభ వాహనంపై స్వామిని చూడగానే భక్త్యావేశాలు ఉప్పొంగి, పారవశ్యంతో భక్తుల నేత్రాలు వికసిస్తాయి. *"సూర్యుని తీక్ష్మత్వం, చంద్రుని కోమలత్వం రెండూ తన స్వరూపమే"* అని శ్రీనివాసుడు ఏడవరోజు జరిగే సూర్యప్రభ మరియు చంద్రప్రభ వాహనాల ద్వారా వెల్లడిస్తున్నారు.
ఈ వాహన సందర్శనం ఆధ్యాత్మిక, అధిభౌతిక, అధిదైవికమనీ; అందువల్ల త్రివిధ తాపాలు నివారింప బడతాయని ప్రతీతి. చంద్రునిలాంటి చల్లనైన మనస్సు కలిగి, చల్లని వెన్నెల వంటి ప్రశాంతతను తన చుట్టూ ఉన్నవారికి పంచి పెట్టాలని ఈ వాహనం సందేశిస్తుంది. "
చంద్రుని శోభను అన్నమయ్య ఈ విధంగా వర్ణించాడు -
*చందమామ రావో జాబిల్లి రావో*
*కుందనపు పైడికోర వెన్నపాలు తేవో ||*
*నగుమోము చక్కనయ్యకు నలుగు పుట్టించిన తండ్రికి నిగములందుండే అప్పకు మా నీలవర్ణునికి*
*జగమెల్ల ఏలిన స్వామికి చక్కని ఇందిర మగనికి ముగురికి మొదలైన ఘనునికి మాముద్దులమురారిబాలునికి*
[ రేపటి భాగంలో... *శ్రీవారి బ్రహ్మోత్సవాలలో - వాహనోత్సవ క్రమం* విశేషాలు మరిన్ని తెలుసుకుందాం]
*శ్రీనివాసుని శ్రీచరణాలను సేవిద్దాం, సకల శుభాలనూ పొందుదాం*
*ఓం నమో వేంకటేశాయ* 🙏🍁🙏
No comments :